యువత ఇలా అడుగుతోంది
నా బరువును గురించిన వర్రీని నేనెలా అధిగమించగలను?
“నా శాండ్విచ్కు మయొనయిస్ a రాసుకోవాలా వద్దాఅన్నది నాజీవితంలో పెద్ద వివాదాంశం. మయొనయిస్ గురించి నేను వర్రీ అవుతున్నప్పుడు నేను దేనిపైనైనా ఎలా అవధానం నిలుపగలను? మరి తుది నిర్ణయం? మయొనయిస్ వద్దు, ఎందుకంటే దాంట్లో చాలా ఎక్కువ కేలరీలు ఉన్నాయి. మళ్లీ అనురెక్సియా గెలుస్తుంది. నేను ఓడిపోతాను.”—జేమీ.
లక్షలాదిమంది యౌవనస్థులు అస్తవ్యస్తమైన ఆహారపుటలవాట్లతో బాధపడుతున్నారు.# చాలామంది మొదట తమకుతాముగా కడుపు మాడ్చుకోవాలనో (అనురెక్సియా) లేక మితిమీరి తిని తిన్నదాన్ని బలవంతాన కక్కేయాలనో (బులీమియా) అనుకోలేదు. బదులుగా, అనేకమంది కేవలం కొన్ని కిలోల బరువు తగ్గించుకోవాలనే చిన్న ఉద్దేశంతో ప్రారంభించారు. అయితే, వారు గ్రహించేలోపే, వారు కడుపు మాడ్చుకోవడం లేక మితిమీరి తినడం అనే అసాధారణ వలయంలో చిక్కుకుపోయారు. “నేను నా బరువును అదుపు చేసుకోవాలనే డైట్ ప్రారంభించింది, కాని ఇప్పుడు అదే నన్ను అదుపుచేస్తుందని” జేమీ చెప్తోంది.
మీరు తీసుకొనే ఆహారం గురించీ, మీ బరువు మీద అది చూపించే ప్రభావం గురించీ మీరు వర్రీ అవుతున్నట్లు మీరు కనుగొంటే, అప్పుడు మీరేమి చేయవచ్చు? మొదటిగా, అనేకమంది ఇతర యౌవనస్థులు అస్తవ్యస్తమైన ఆహారపుటలవాట్లతో పోరాడి విజయం సాధించారని గుర్తించండి! కాని ఎలా?
మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకోవడం
అస్తవ్యస్తమైన ఆహారపుటలవాట్లకు వ్యతిరేకంగా చేసే పోరాటంలో విజయం సాధించడానికి ప్రాముఖ్యమైన అడుగు మీ రూపాన్ని గురించిన వాస్తవాన్ని అంగీకరించడమే. “అస్తవ్యస్తమైన ఆహారపుటలవాట్లున్న చాలామంది ప్రజలు తమ గురించి తాము సరైన భావాలు కల్గివుండరు,” అని మారుతున్న శరీరాలు, మారుతున్న జీవితాలు అనే పుస్తకం చెప్తుంది. “వారు తమ శరీరాలను వాస్తవంగా చూడరు, తమను తాము ప్రాముఖ్యంగా తమ రూపాన్ని చాలా తీవ్రంగా విమర్శించుకుంటారు.”
నిజానికి, కొంతమంది యౌవనస్థులు తమ గురించి తాము ఏర్పరచుకునే భావాలను పూర్తిగా తమ భౌతిక రూపం ఆధారంగానే ఏర్పరచుకుంటారు; ఏ లోపమైనా పెద్ద విపత్తులా దృష్టించబడుతుంది. “నేను ఎంత లావున్నానంటే నేను దాన్ని ఎంత మాత్రం భరించలేను,” అని 17 సంవత్సరాల విక్కి చెప్తుంది. “నా నడుము ఎంత వెడల్పుగా ఉంటుందంటే నేను టక్చేసుకొనే వస్త్రాలు ఎప్పుడూ ధరించలేను.” పది కిలోల బరువు తగ్గినప్పటికీ విక్కి తృప్తిపడలేదు. ఆమె తినడానికి నిరాకరించేది, లేకపోతే బలవంతంగా తిని ఆ తర్వాత దాన్ని వాంతి చేసుకునేది.
మీరు ఎలా కనిపిస్తారనే దాని గురించి కొంతమేరకు శ్రద్ధ కల్గివుండడంలో కచ్చితంగా తప్పేమీ లేదు. ఈ విషయంలో, శారా, రాహేలు, యోసేపు, దావీదు, అబీగయీలు వంటివారితో సహా అనేకమంది స్త్రీ పురుషుల భౌతిక రూపాన్ని, ఆకారాన్ని గురించి బైబిలు అనుకూలంగా వ్యాఖ్యానించిందని తెలుసుకోవడం ఆసక్తికరమైన విషయం.b దావీదుకు ఉపచారం చేసిన అబీషగు ‘బహు చక్కనిది’ అని కూడా బైబిలు చెబుతుంది.—1 రాజులు 1:4.
నిజమైన అందాన్ని నిర్వచించడం
అయినప్పటికీ, బైబిలు ఒక వ్యక్తి యొక్క భౌతిక రూపానికీ, లేక శరీర ఆకారానికీ అధిక ప్రాధాన్యతను ఇవ్వటంలేదు. బదులుగా, అది ‘హృదయపు అంతరంగ స్వభావమును’ ప్రశంసిస్తుంది. (1 పేతురు 3:4) దేవుని దృష్టిలోనూ, మనుష్యుల దృష్టిలోనూ ఒకరిని ఆకర్షణీయమైనవారిగా లేక అసహ్యమైనవారిగా చేసేది నిజంగా ఆ వ్యక్తి అంతరంగ స్వభావమే.—సామెతలు 11:20, 22.
రాజైన దావీదు కుమారుడు అబ్షాలోము గురించి ఆలోచించండి. బైబిలు ఇలా చెప్తుంది: “ఇశ్రాయేలీయులందరిలో అబ్షాలోమంత సౌందర్యము గలవాడు ఒకడును లేడు; అరికాలు మొదలుకొని తలవరకు ఏ లోపమును అతనియందు లేకపోయెను.” (2 సమూయేలు 14:25) అయినప్పటికీ, ఈ యువకుడు వంచకుడు. యెహోవా నియమిత రాజు స్థానాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించడానికి గర్వం, ఉన్నతస్థితికి ఎదగాలన్న వాంఛ అతన్ని ప్రేరేపించాయి. అందుకే, బైబిలు అబ్షాలోము గురించి అనుకూలంగా మాట్లాడటం లేదు కాని అతన్ని విశ్వాసఘాతుకానికి పాల్పడిన సిగ్గులేని వ్యక్తిగా, తీవ్రమైన ద్వేషిగా చిత్రిస్తుంది.
ఒకవ్యక్తి నిజమైన అందం లేక సౌందర్యం భౌతిక రూపం మీద ఆధారపడి ఉండదు. మంచి కారణంతోనే బైబిలు ఇలా పేర్కొంటోంది: ‘జ్ఞానము సంపాదించుకొనుము; నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. అది నీ తలకు అందమైన మాలిక కట్టును. ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును.’—సామెతలు 4:7, 9.
అయితే, అస్తవ్యస్తమైన ఆహారపుటలవాట్లకు కారణం తమ రూపాన్ని గురించి అసంతృప్తిగా ఉండటం మాత్రమే కాదని అంగీకరించవలసిందే. “తాము తీసుకునే ఆహారం గురించి వర్రీ అవుతూ కడుపు మాడ్చుకోవడం, పేరాకలి రోగం, అతిగా తినడంవంటి అస్తవ్యస్తమైన ఆహారపుటలవాట్లను ఏర్పరచుకొనే ప్రజలకు సాధారణంగా ఆత్మాభిమానం తక్కువగా ఉంటుంది అంటే వారికి తమ గురించి తమకు ఉన్నతమైన అభిప్రాయం ఉండదు, అంతేగాక ఇతరులు కూడా తమను విలువైనవారిగా ఎంచడం లేదని వారు భావిస్తారు,” అని ఒక పుస్తకం చెప్తోంది.
తమ గురించి తాము న్యూనతా భావాలు కలిగివుండటానికి తోడ్పడగల కారణాలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకు, యుక్తవయస్సు రావడం, ముఖ్యంగా మీ స్నేహితులకన్నా మీరు ముందుగా యుక్తవయస్కులవ్వడం మీలో తీవ్రమైన అనిశ్చిత భావాలు కలిగేలా చేయవచ్చు. అంతేగాక, కొంతమంది యౌవనస్థులు ఎప్పుడూ అశాంతి నెలకొని ఉండే గృహాల్లో, బహుశ శారీరకంగా లేక లైంగికంగా దుర్వ్యవహారం జరిగే గృహాల్లో పెరిగి ఉండవచ్చు. కారణం ఏదైనప్పటికీ, సాధారణంగా కోలుకోవడంలో, అయోగ్యులమన్న భావాలను ఏవి కలిగిస్తున్నాయో వాటిని గుర్తించడం ఇమిడివుంటుంది. వ్యక్తిగా మీకున్న నిజమైన విలువను గుర్తించడమని దానర్థం. కచ్చితంగా, ప్రతీ ఒక్కరిలో కనీసం కొన్ని మెచ్చుకోదగిన లక్షణాలు ఉంటాయి. (1 కొరింథీయులు 12:14-18ను పోల్చండి.) నిజమే, మీలో మీరు వాటిని చూసుకోలేకపోవచ్చు, కాని పరిణతి చెందిన ఒక స్నేహితుడు ఈ విషయాలను మీకు చూపించవచ్చు.
కాని సహేతుకమైన ఆరోగ్య కారణాలను బట్టి మీరు నిజంగా బరువును తగ్గించుకోవలసి ఉంటే అప్పుడేమిటి? మనం ‘కోరికలు అదుపులో ఉంచుకునే వారమై’ ఉండాలని బైబిలు సిఫార్సు చేస్తోంది. (1 తిమోతి 3:11, LBI) అందుకే, మితిమీరి డైటింగ్ చేయకుండా ఉండటం లేక త్వరగా-బరువును-తగ్గించే పథకాలకు బలికాకుండా ఉండటం మంచిది. బహుశ, ఆరోగ్యవంతమైన డైట్ తీసుకొని సహేతుకమైన మోతాదులో వ్యాయామం చేయడం అదనపు బరువును తగ్గించుకోవడానికున్న మంచి మార్గం కావచ్చు. “ఇతర అనేక విషయాలలోలాగే, బరువును తగ్గించుకోవడానికి కూడా సరియైన మార్గం, సరికాని మార్గం ఉన్నాయి. అన్నం తినకుండా ఉండటం, తినమని సిఫార్సు చేయబడింది తప్ప మరేదీ తినకూడదని నిర్ణయించుకోవడం, డైట్ మాత్రలు వేసుకోవడం లేక బలవంతాన వాంతి చేసుకోవడం సరికాని మార్గాలు,” అని ఎఫ్డిఏ కన్స్యూమర్ పత్రిక తెలియజేస్తోంది.
ఒకరికి చెప్పుకోవడం యొక్క శక్తి
సంఘసేవకురాలైన నాన్సీ కొలొడ్నీ, అస్తవ్యస్తమైన ఆహారపుటలవాట్లు ఉండడాన్ని, “పటంగాని లేక దిక్సూచిగాని లేకుండా, బయటకు వెళ్ళే దారులు ఎక్కడ ఉన్నాయో తెలియకుండా, అవి ఎప్పుడు కనిపిస్తాయో అసలు కనిపిస్తాయో లేదో తెలియకుండా . . . ఒక క్లిష్టమైన వ్యూహంలోనికి ఒంటరిగా ప్రవేశించడంతో” పోలుస్తోంది. “దానిలో మీరు ఎంత ఎక్కువసేపు ఉండి దానినుంచి బయటపడాలని ప్రయత్నం చేస్తే, అంత ఎక్కువగా అది మిమ్మల్ని చికాకులోనూ, గందరగోళంలోనూ పడేస్తుంది” అని కూడా ఆమె చెప్తోంది. కడుపు మాడ్చుకోవడం లేక పేరాకలి రోగం ఉన్న లక్షణాలు ఉన్నట్లయితే, మీరు సహాయం తీసుకోవాలి. మీకై మీరు ఆ “క్లిష్టమైన వ్యూహం” నుంచి బయటపడలేరు. గనుక తల్లి/తండ్రికి లేక నమ్మకమైన వేరే పెద్దవారికి చెప్పండి. ఒక బైబిలు సామెత ఇలా చెప్తోంది: “నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును.”—సామెతలు 17:17.
యెహోవాసాక్షుల్లో అనేకులు అలాంటి నమ్మదగిన సహవాసాన్ని క్రైస్తవ సంఘంలోని పెద్దలలో కనుగొన్నారు. అయితే, పెద్దలు వైద్యులు కారు, వారు చేసే సహాయం వైద్య సహాయపు అవసరతకు ప్రత్యామ్నాయం కాదు. అయినా, క్రైస్తవ పైవిచారణకర్తలు “దరిద్రుల మొఱ్ఱ”ను అలక్ష్యం చేయరు, ఆధ్యాత్మికంగా ‘ఆ రోగిని స్వస్థపరచడానికి’ వారి సలహా, ప్రార్థనలు సహాయం చేయగలవు.—సామెతలు 21:13; యాకోబు 5:13-15.
ఎవరితోనైనా ముఖాముఖిగా చెప్పుకోవడం మీకు అనుకూలంగా అనిపించకపోతే, మీ తలంపులను పేపరు మీద వ్రాసి, జవాబును కోరండి. ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే విషయాన్ని ఎవరికైనా వెల్లడించుకోవడమే. నాన్సీ కొలొడ్నీ ఇలా వ్రాస్తోంది, “మీరు ఇక ఎంతమాత్రం ఒంటరిగా సాధించలేరన్న వాస్తవాన్ని అంగీకరించడం ద్వారా ఇప్పటినుంచి మరొకరు మీకు సహాయం చేసేందుకు అనుమతించడానికి మీరు ఒక ఒప్పందం చేసుకుంటున్నారన్నమాట.” ఆమె ఇంకా ఇలా చెప్తోంది, “ఈ చర్యల గురించి ఆలోచించడం, ఈ చర్యలను తీసుకోవడం మీకు కష్టమే కావచ్చు, కాని ఇవి ఆచరణాత్మకమైనవి, ఆ క్లిష్టమైన వ్యూహం నుంచి బయటపడటానికి మిమ్మల్ని సరియైన మార్గంలో పెట్టేవి.”
క్రైస్తవ యౌవనస్థులకు మరో శక్తివంతమైన సహాయం ఉంది అదే ప్రార్థన. దేవునికి ప్రార్థించడం మానసిక ఊతకర్ర కాదు. మిమ్మల్ని మీరు అర్థం చేసుకునే దానికన్నా మరింత శ్రేష్ఠంగా మిమ్మల్ని అర్థం చేసుకొనే సృష్టికర్తతో చేసే వాస్తవమైన, అతిప్రాముఖ్యమైన సంభాషణ! (1 యోహాను 3:19, 20) కాబట్టి, వ్యాధులన్నింటినీ తీసివేయడానికి యెహోవా నిర్ణయకాలం ఇది కాదుగానీ, మీరు తొట్రుపడకుండా ఉండేలా మన ప్రేమగల దేవుడు మీకు మార్గనిర్దేశాన్ని ఇవ్వగలడు. (కీర్తన 55:22) కీర్తన గ్రంథకర్తయైన దావీదు తన సొంత అనుభవం నుండి ఇలా వ్రాశాడు: “నేను యెహోవాయొద్ద విచారణచేయగా ఆయన నాకుత్తరమిచ్చెను నాకు కలిగిన భయములన్నిటిలోనుండి ఆయన నన్ను తప్పించెను. ఈ దీనుడు మొఱ్ఱపెట్టగా యెహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలోనుండి అతని రక్షించెను.”—కీర్తన 34:4, 6.
తప్పకుండా, మీ లోతైన భావాలను యెహోవా దేవునికి తెలియజేయండి. “ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి,” అని అపొస్తలుడైన పేతురు వ్రాశాడు. (1 పేతురు 5:7) యెహోవా కృపాతిశయం పట్ల మెప్పును పెంపొందింప చేసుకోవడానికి 34, 77, 86, 103, మరియు 139వ కీర్తనలను జాగ్రత్తగా ఎందుకు చదవకూడదు? ఈ కీర్తనలను ధ్యానించడం, యెహోవా విశ్వసించదగినవాడన్న, మీరు విజయం పొందాలని ఆశిస్తున్నాడన్న మీ దృఢవిశ్వాసాన్ని బలపరుస్తుంది. ఆయన వాక్యాన్ని చదవడం ద్వారా, ‘నేను చింతించి తల్లడిల్లిపోయినప్పుడల్లా, నీవు నన్ను ఆదరించి సంతోషింపజేస్తావు’ అని వ్రాసిన దావీదు భావించినట్లే మీరూ భావిస్తారు.—కీర్తన 94:19, WBTC.
సహనంతో ఉండండి—క్రమంగా కోలుకుంటారు
అస్తవ్యస్తమైన ఆహారపుటలవాట్ల విషయమై సహాయం తీసుకునే అనేకమంది ఒక్కరాత్రిలోనే కోలుకోరు. ప్రారంభంలో ఉదహరించబడిన జేమీ గురించి ఆలోచించండి. ఆమె సహాయం తీసుకోవడం ఆరంభించినప్పటికీ, ఒక చిన్న గిన్నెడు సిరియల్ను తినడం కూడా ఆమెకు కష్టంగా అనిపించేది. “ఇది నాకు మంచిది, బ్రతకడానికి నాకు ఆహారం అవసరం అని నాకు నేను చెప్పుకుంటూ ఉండేదాన్ని. నేను తింటున్న ప్రతీ చెంచా వెయ్యి కిలోల బరువుంటుందేమో అనిపించేది” అని ఆమె చెప్తోంది.
అయితే, ఒకసారి జేమీ చనిపోయేంత పరిస్థితి వచ్చింది, ఆహారం గురించి వర్రీ అవ్వడాన్ని జయించాలని ఆమె తీర్మానించుకుంది. ఆమె ఇలా చెప్పింది, “నేను చనిపోవాలనుకోవటం లేదు, నేను దీనితో పోరాడి విజయం పొందాలనుకుంటున్నాను. కడుపు మాడ్చుకోవడాన్ని నేను అధిగమిస్తాను. అది కష్టమైనదే అయినా నేను దానిని చేస్తాను.” మీరు కూడా చేయగలరు!
[అధస్సూచీలు]
a గుడ్డులోని పచ్చ సొన, కూరగాయల నూనె, వినిగర్ లేక నిమ్మకాయ రసం మొదలైనవి కలిపిచేసే ఒక వంటకం.మే 8, 1999 తేజరిల్లు! 13-15 పేజీలను చూడండి.
b ఆదికాండము 12:11; 29:17; 39:6; 1 సమూయేలు 17:42; 25:3 చూడండి.
[26వ పేజీలోని చిత్రం]
సమతూకమైన డైట్, సహేతుకమైన మోతాదులో వ్యాయామం మీ బరువును అదుపు చేసుకోవడానికి మీకు సహాయం చేయగలవు