కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g99 6/8 పేజీలు 4-9
  • పిల్లల శ్రమతో

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పిల్లల శ్రమతో
  • తేజరిల్లు!—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • సమస్యా పరిధి
  • బాల-శ్రామికత్వానికి కారణాలు
  • బాల-శ్రామికత్వం రకాలు
  • బుగ్గిపాలైన బాల్యం
  • పిల్లలకు బాల్యంనుండే శిక్షణనిచ్చుట
    నీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుము
  • మన పిల్లలనెవరు కాపాడతారు?
    తేజరిల్లు!—1999
  • పసితనంనుండే మీ పిల్లవానికి తర్ఫీదునివ్వండి
    కుటుంబ సంతోషానికిగల రహస్యము
  • సంక్షోభం ప్రపంచ వ్యాప్తంగా ఉంది
    తేజరిల్లు!—1999
మరిన్ని
తేజరిల్లు!—1999
g99 6/8 పేజీలు 4-9

పిల్లల శ్రమతో

“ఈనాడు ఉత్పాదక వ్యవస్థలో భాగంగావున్న పిల్లలు సమాజపు భవిష్యత్తుగా దృష్టించబడటానికి బదులు అమ్మకపు వస్తువుల్లా దృష్టించబడుతున్నారు.”—చైరా హాంగ్‌లాడరామ్‌, మానవ వనరుల సంస్థ డైరెక్టర్‌, థాయ్‌లాండ్‌.

ఈసారి మీరు మీ పాప కోసం ఒక బొమ్మను కొన్నప్పుడు, ఆగ్నేయ ఆసియాలోని చిన్న పిల్లలు ఆ బొమ్మను తయారుచేసి ఉండవచ్చని తెలుసుకోవడం మీకు ఆసక్తికరంగా అనిపించవచ్చు. ఈసారి మీ బాబు ఫుట్‌బాల్‌ను తన్నినప్పుడు, తన తల్లీ, నలుగురు అక్కలతో కలిసి రోజుకు 30 రూపాయలు సంపాదించే మూడేండ్ల పాప ఆ బాల్‌ను కుట్టి ఉండవచ్చన్న వాస్తవాన్ని గురించి ఆలోచించండి. ఈసారి మీరు ఒక తివాచీని కొన్నప్పుడు, దుర్భర పరిస్థితుల క్రింద రోజుల తరబడి గంటల కొద్దీ పనిచేసే ఒక ఆరేళ్ళ బాబు యొక్క చురుకైన వ్రేళ్ళు వాటిని నేసి ఉండవచ్చనేదాని గురించి యోచించండి.

బాల-శ్రామికత్వం ఎంత ప్రబలమై ఉంది? ఇది పిల్లలపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతుంది? ఈ పరిస్థితిని చక్కబరచడానికి ఏమి చేయవచ్చు?

సమస్యా పరిధి

అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఒ) ప్రకారం, వర్ధమాన దేశాల్లో పనిచేస్తున్న 5 నుండి 14 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లల సంఖ్య 25 కోట్లని అంచనా వేయబడింది.a వారిలో 61 శాతం మంది ఆసియాలో, 32 శాతం మంది ఆఫ్రికాలో, 7 శాతం మంది లాటిన్‌ అమెరికాలో ఉన్నట్లు విశ్వసించబడుతుంది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా బాల-శ్రామికత్వం ఉనికిలో ఉంది.

దక్షిణ యూరప్‌లో అధిక సంఖ్యలో పిల్లలు వేతనం ఇవ్వబడే పనులు చేస్తున్నారు, ప్రాముఖ్యంగా వ్యవసాయం, చిన్న దుకాణాల్లో పనిచేయడం వంటి ఆయా కాలాల్లో మాత్రమే ఉండే పనులను చేస్తున్నారు. ఇటీవల, కమ్యూనిజం నుండి పెట్టుబడిదారీ విధానానికి మారిన తర్వాత మధ్య, తూర్పు యూరప్‌లలో ఈ బాల-శ్రామికత్వం పెరిగిపోయింది. అమెరికాలో బాల కార్మికుల అధికారిక సంఖ్య 55 లక్షలు, కానీ చట్టవిరుద్ధంగా కార్ఖానాల్లోను, వ్యవసాయ కూలీలుగాను, సంచార కార్మికులుగాను పనిచేస్తున్న 12 ఏళ్ళ లోపు పిల్లలు అనేకమంది అందులో లెక్కించబడలేదు. ఈ లక్షలాదిమంది పిల్లలు శ్రామికశక్తిలో ఎలా భాగం అవుతున్నారు?

బాల-శ్రామికత్వానికి కారణాలు

పేదరికం. “పిల్లలను అపాయకరమైన, దుర్భరమైన శ్రామికత్వంలోకి నెట్టే అత్యంత బలమైన శక్తి పేదరికం,” అని ద స్టేట్‌ ఆఫ్‌ ద వరల్డ్స్‌ చిల్డ్రన్‌ 1997 చెప్తుంది. “పేద కుటుంబాల విషయంలోనైతే, వాళ్ళు ఆకలితో అలమటించడం లేదా కనీస అవసరాలు తీర్చుకోవడం అన్నది ఒక పిల్లవాడు సంపాదించే కొద్ది మొత్తం మీద లేదా తల్లిదండ్రులు పని చేయడానికి వీలయ్యేలా ఆ పిల్లవాడు ఇంట్లో చేసే సహాయం మీద ఆధారపడి ఉంటుంది.” బాల కార్మికుల తల్లిదండ్రులు తరచుగా నిరుద్యోగులై ఉంటారు లేదా సరియైన పని లేకుండా ఉంటారు. వారు క్రమమైన ఆదాయాన్ని ఎంతగానో కోరుకుంటారు. అయితే, వారికి బదులు వారి పిల్లలకే పని ఎందుకు ఇవ్వబడుతుంది? ఎందుకంటే పిల్లలకు తక్కువ వేతనం ఇవ్వవచ్చు. అంతేగాక, పిల్లలు చాలా విధేయతతోనూ, అనుకూలంగాను ఉంటారు, చాలామంది పిల్లలు తమకు చెప్పిన పనిని చేస్తారు, సాధారణంగా అధికారాన్ని ధిక్కరించరు. అలాగే, అణిచివేతకు వ్యతిరేకంగా పిల్లలు ఎక్కువగా పోరాడలేరు. అలాగే, వారు శారీరకంగా హింసించబడినప్పుడు కూడా ఎదురు తిరగరు.

విద్యా కొరత. పాఠశాలను విడిచిపెట్టి పనిలో చేరిన లక్షలాదిమంది పిల్లల్లో ఇండియాకు చెందిన 11 సంవత్సరాల సుధీర్‌ ఒకడు. ఆ అబ్బాయి ఎందుకలా పాఠశాలను విడిచిపెట్టి పనిలో చేరాడు? అందుకు అతని సమాధానం: “పాఠశాలలో టీచర్లు సరిగా చెప్పరు. అక్షరాలు నేర్పించమని మేము వాళ్ళను అడిగితే వాళ్ళు మమ్మల్ని కొడతారు. వాళ్ళు పాఠశాలలో నిద్రపోతారు. . . . మాకు ఏదైనా అర్థం కాకపోతే, వాళ్ళు చెప్పరు.” విచారకరంగా, పాఠశాల గురించి సుధీర్‌ చెప్పిన విషయాలు అక్షరాల వాస్తవమైనవి. వర్ధమాన దేశాల్లో, ప్రజల కోసం ప్రభుత్వం వెచ్చించే ధన సహాయంలో తగ్గింపు, ప్రాముఖ్యంగా విద్యారంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. 1994లో ప్రపంచంలోని అతిస్వల్పంగా అభివృద్ధి చెందిన 14 దేశాల్లో ఐక్యరాజ్య సమితి చేసిన సర్వే కొన్ని ఆసక్తికరమైన వాస్తవాలను వెల్లడి చేసింది. ఉదాహరణకు ఈ దేశాల్లోని సగం దేశాల్లో ఒకటవ తరగతి కోసమైన తరగతిగదుల్లో ప్రతి పది మంది విద్యార్థుల్లో కేవలం నలుగురికి మాత్రమే కూర్చోవడానికి బెంచీలు ఉన్నాయి. సగంమంది విద్యార్థులకు అచ్చు పుస్తకాలు లేవు, సగం తరగతి గదులకు బ్లాక్‌ బోర్డులు లేవు. అలాంటి పాఠశాలల్లో చేరిన అనేకమంది పిల్లలు వాటిని విడిచిపెట్టి పనుల్లోకి వెళ్ళడంలో ఆశ్చర్యం ఏమీ లేదు.

సాంప్రదాయక భావనలు. ఒక పని ఎంత ఎక్కువ అపాయకరమైనదీ, క్లిష్టమైనదీ అయితే ఆ పని అంత ఎక్కువగా అల్ప సంఖ్యాక వర్గం వారి కోసం, తక్కువ తరగతి వారి కోసం, ప్రతికూల పరిస్థితులు గల వారి కోసం, పేదవారి కోసం విడిచిపెట్టబడుతుంది. ఆసియాలోని ఒక దేశాన్ని గురించి చెబుతూ, “కొంతమంది ప్రజలు ఇతరులపై అధికారం చేస్తూ తమ మస్తిష్కాలతో పని చేసేందుకు పుడతారు, అయితే ఇతరులు అంటే అధిక శాతంమంది ప్రజలు తమ శరీరాలతో పని చేసేందుకు పుడతారు అన్న దృక్కోణం ఉంది” అని యూనిసెఫ్‌ పేర్కొన్నది. పశ్చిమ దేశాల్లోని ప్రజల దృక్పథాలు అన్నివేళలా అంత మెరుగ్గా ఏమీ లేవు. ప్రాబల్యం ఉన్న వర్గం తమ సొంత పిల్లలు అటువంటి అపాయకరమైన పనిని చేయడాన్ని ఇష్టపడక పోవచ్చు కానీ ఆయా జాతి, వర్గ లేదా ఆర్థికపరంగా అల్పులైన పిల్లలు అటువంటి పనిని చేస్తే వారు ఏమాత్రం చింతించరు. ఉదాహరణకు, ఉత్తర యూరప్‌లో బాల కార్మికులు సాధారణంగా టర్కీ లేదా ఆఫ్రికా దేశీయులై ఉంటారు; అలాగే అమెరికాలో ఆసియా లేదా లాటిన్‌-అమెరికా వారై ఉండవచ్చు. ఆధునిక సమాజం కొనుగోలు వస్తువులపై ఆసక్తిని చూపేవారితో నిండిపోవడం వల్ల బాల-శ్రామికత్వం పెరిగిపోతోంది. తక్కువ ధర గల వస్తువులకు గిరాకీ ఎక్కువ. ఇవి కోట్లాదిమంది అజ్ఞాత, దోచుకోబడుతున్న పిల్లల చేత తయారు చేయబడి ఉండవచ్చని చాలా తక్కువమంది మాత్రమే ఆలోచిస్తారు.

బాల-శ్రామికత్వం రకాలు

బాల-శ్రామికత్వం ఏఏ రూపాల్లో ఉంది? చాలా వరకు ఎక్కువ మంది బాల శ్రామికులు ఇండ్లలో పనిచేస్తున్నారు. ఇటువంటి శ్రామికులు “ప్రపంచం పూర్తిగా మరచిపోయిన పిల్లలుగా” పిలువబడుతున్నారు. ఇండ్లలో చేసే పని అపాయకరమైనదిగా ఉండనక్కరలేదు, కానీ అది తరచూ అలాగే ఉంటోంది. ఇండ్లలో పనిచేసే పిల్లలకు వేతనం చాలా తక్కువగా ఇవ్వబడుతుంది, లేదా అసలు వేతనమే ఇవ్వబడదు. ఈ పిల్లల పనికి సంబంధించిన షరతులు పూర్తిగా వారి యజమానుల ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటాయి. వీరికి ప్రేమ, విద్య, వినోదం, సామాజిక కార్యకలాపాల వంటివి ఉండవు. వీరు శారీరక, లైంగిక దుర్వినియోగానికి కూడా తరచుగా గురయ్యే అవకాశం ఉంది.

ఇతర పిల్లలు నిర్బంధపు, కట్టుబానిసలుగా ఉన్నారు. దక్షిణ ఆసియాలోనూ అలాగే ఇతర దేశాల్లోనూ తరచుగా తల్లిదండ్రులు కొద్దిమొత్తంలోని అప్పులకు బదులుగా కేవలం ఎనిమిది లేదా తొమ్మిది సంవత్సరాల వయస్సు గల తమ పిల్లలను కర్మాగార యజమానులకు లేదా ఏజెంట్‌లకు అప్పగిస్తారు. ఈ పిల్లలు జీవితాంతం చేసే సేవ కనీసం ఆ అప్పును తగ్గించడానికి కూడా సరిపోదు.

పిల్లల వాణిజ్య సంబంధ లైంగిక దుర్వినియోగం విషయం ఏమిటి? ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ సంవత్సరం కనీసం పదిలక్షల మంది అమ్మాయిలు లైంగిక వ్యాపారానికి ప్రలోభ పెట్టబడుతున్నారని అంచనా వేయబడుతుంది. అబ్బాయిలు కూడా తరచూ లైంగికంగా దోచుకోబడుతున్నారు. ఇటువంటి దుర్వినియోగం వల్ల జరిగే శారీరకమైన, భావోద్వేగపరమైన హాని దీన్ని బాల-శ్రామికత్వం రకాల్లో అత్యంత అపాయకరమైనదిగా చేస్తుంది, ఇక హెచ్‌.ఐ.వి సోకడం గురించైతే చెప్పనే అవసరం లేదు. “సమాజంలో దేశదిమ్మరులకు ఉన్న స్థానమే మాకూ ఉంది. మమ్మల్ని తెలుసుకోవాలని కానీ, మాతో కలిసి కనిపించాలని కానీ ఎవ్వరూ ఇష్టపడరు” అని సెనెగల్‌లో వేశ్యగా ఉన్న 15 సంవత్సరాల అమ్మాయి చెబుతుంది.b

బాల కార్మికుల్లో అధిక శాతం పారిశ్రామిక, చెట్ల పెంపకం పనుల్లో దుర్వినియోగం చేయబడుతున్నారు. పెద్దవారికే చాలా ప్రమాదకరమైనవిగా పరిగణింపబడగల గని పనుల్లో ఇటువంటి పిల్లలు శ్రమిస్తున్నారు. అనేకమంది పిల్లలు క్షయ, శ్వాసకోశ వ్యాధి, ఉబ్బసం వంటి వాటితో బాధపడుతున్నారు. చెట్ల పెంపకంలో బాల కార్మికులు క్రిమిసంహారక మందులకు, పాము కాట్లకు, కీటకాల కాట్లకు గురవుతారు. కొందరు పెద్ద పెద్ద కత్తులతో చెరకు గడలను కోస్తున్న సమయంలో వికలాంగులయ్యారు. కోట్లాదిమంది ఇతర పిల్లలు వీధులను తమ పని స్థలాలుగా చేసుకున్నారు. ఉదాహరణకు, వృత్తిపరంగా కాగితాలను ఏరుకునే పదేళ్ళ షిరీన్‌ను తీసుకోండి. ఆమె ఎప్పుడూ పాఠశాలకు వెళ్ళలేదు కానీ, జీవనానికి సంబంధించిన అర్థశాస్త్రంలో ఆరితేరింది. ఆమె 12 నుండి 20 రూపాయల విలువ చేసే చెత్త కాగితాలను, ప్లాస్టిక్‌ సంచులను అమ్మితేనే, ఆమె భోజనం చేయగలదు. ఒకవేళ తక్కువ అమ్మితే, ఆమె పస్తులుండాలి. వీధిపిల్లలు, సాధారణంగా ఇంట్లో దుర్వినియోగానికి గురికావడం చేతనో, నిర్లక్ష్యం చేయబడటం చేతనో ఇంట్లో నుండి పారిపోతారు, కానీ వీధుల్లో మరింత ఎక్కువగా దుర్వినియోగానికి, అత్యాచారానికి గురై బాధను అనుభవిస్తారు. “దుష్టుల చేతుల్లో పడకూడదని ప్రతీరోజు నేను ప్రార్థిస్తాను” అని ఆసియాలోని ఒక నగరంలో రోడ్డుమీద తినుబండారాలు అమ్ముకునే పదేళ్ళ జోజీ అనే అమ్మాయి చెప్తుంది.

బుగ్గిపాలైన బాల్యం

ఇలాంటి రకాలైన బాల-శ్రామికత్వం ఫలితంగా కోట్లాదిమంది పిల్లలు గంభీరమైన అపాయాలకు గురవుతున్నారు. ఈ అపాయాలకు మూలం వారు చేస్తున్న పని యొక్క నైజం లేదా వారు పని చేస్తున్న దుర్భరమైన పరిస్థితులై ఉండవచ్చు. వృత్తిపరంగా అత్యంత గంభీరమైన ప్రమాదాలకు పెద్దవారి కంటే కూడా పిల్లలు, ఇతర యౌవనులు ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే, పిల్లలకు పెద్దలకు మధ్య శరీర నిర్మాణంలో తేడా ఉంది. విపరీతమైన, అధికమైన పని వల్ల వారి వెన్నెముక లేక వృక్కగోణి సులభంగా పాడవుతాయి. ప్రమాదకరమైన రసాయన పదార్థాలకు లేదా కాంతి వికిరణానికి గురైనప్పుడు కూడా పెద్దవారి కంటే పిల్లలే ఎక్కువగా బాధను అనుభవిస్తారు. అదనంగా, శ్రమతో కూడిన, విసుగును పుట్టించే పనిని అనేక గంటలపాటు చేయడానికి అనువుగా పిల్లల శరీరం రూపించబడలేదు, కానీ చాలా తరచుగా వారికి అటువంటి పనే ఇవ్వబడుతుంది. సాధారణంగా వాళ్లకు ప్రమాదాల గురించి తెలిసి ఉండదు, అంతేగాక తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కూడా వాళ్లకు అంతగా తెలియదు.

ఈ బాధితుల మానసిక, భావోద్వేగ, మేథా సంబంధమైన పెరుగుదలలపై బాల-శ్రామికత్వం యొక్క ప్రభావాలు కూడా చాలా తీవ్రమైనవై ఉంటాయి. అటువంటి పిల్లలకు ప్రేమ కొరవడుతుంది. దెబ్బలు, అవమానాలు, తిండిపెట్టకుండా శిక్షించడం, లైంగిక దుర్వినియోగం సర్వసాధారణమైనవి. ఒక అధ్యయనం ప్రకారం, దాదాపు 25 కోట్లమంది బాల కార్మికుల్లో సగం మంది పాఠశాలను వదిలి పెట్టారు. ఇంకా, అనేక గంటలు పనిచేసే పిల్లల నేర్చుకోగల సామర్థ్యం బలహీనమైపోగలదని కూడా గమనించడం జరిగింది.

దీనంతటి భావం ఏమిటి? చాలామంది బాల శ్రామికులు జీవితాంతం పేదరికం, దుర్దశ, అనారోగ్యం, నిరక్షరాస్యత, సామాజిక క్రమరాహిత్యాలకు గురిచేయబడుతున్నారు. లేదా విలేఖరి రాబిన్‌ రైట్‌ చెబుతున్నట్లుగా, “వైజ్ఞానికపరంగానూ, సాంకేతికపరంగానూ ఎంతో అభివృద్ధి సాధించిన ఈ ప్రపంచం 20వ శతాబ్దాంతంలో, సాధారణ జీవితానికి సంబంధించి కొద్దిపాటి ఆశ కూడా లేని, ఇక 21వ శతాబ్దంలోకి ప్రపంచాన్ని ఎంతమాత్రం నడిపించలేని కోట్లాది మంది పిల్లలను ఉత్పత్తి చేస్తోంది.” ఈ గంభీరమైన ఆలోచనలు ఈ ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి: పిల్లలతో ఎలా వ్యవహరించాలి? బాల-శ్రామికత్వ సమస్యకు కనుచూపు మేరలో ఏదైనా పరిష్కారం ఉందా?

[అధస్సూచీలు]

a సాధారణంగా, 15 సంవత్సరాల వయస్సుకల్లా తప్పనిసరి పాఠశాల విద్యను ముగించగలిగే పక్షాన, పిల్లలు పనిచేయడానికి అనుమతించేందుకు కనీస వయస్సు 15 సంవత్సరాలని అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రతిపాదించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది పిల్లలు పనిచేస్తున్నారనేది నిర్ధారించడానికి ఇదే చాలా విస్తృతంగా ఉపయోగించబడుతున్న కొలమానం.

b అదనపు సమాచారం కోసం తేజరిల్లు! మే 8, 1997, పేజీలు 11-15 చూడండి.

[5వ పేజీలోని బాక్సు]

బాల-శ్రామికత్వం అంటే ఏమిటి?

అనేకమంది పిల్లలు అన్ని సమాజాల్లోనూ ఏదో ఒక రీతిలో పని చేస్తున్నారు. సమాజాన్ని బట్టి, కాలాన్ని బట్టి వారు చేసే పనులు మారుతుంటాయి. పిల్లలు చేసే పని అన్నది వారి విద్యలో ఆవశ్యకమైన భాగం కావచ్చు, తల్లిదండ్రుల నుండి పిల్లలు ప్రధానమైన కౌశలాలను నేర్చుకోవడానికి అది ఒక మార్గం కావచ్చు. కొన్ని దేశాల్లో పిల్లలు తరచుగా కార్ఖానాల్లో పనిచేస్తూ, ఇతర చిన్న చిన్న పనులు చేస్తూ అటు తర్వాత క్రమేణా జీవితంలో పూర్తికాలం పనిచేసేవారవుతారు. ఇతర దేశాల్లో యౌవనస్థులు తమ వ్యక్తిగత ఖర్చుల కోసం డబ్బు సంపాదించుకునేందుకు వారంలో కొన్ని గంటల పాటు పనిచేస్తారు. ఇటువంటి పని “ప్రయోజనకరమైనదనీ, అది పిల్లల విద్య, వినోదం, విశ్రాంతి వంటి వాటికి అడ్డురాకుండా వారు శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, నైతికంగా లేదా సామాజికంగా అభివృద్ధి చెందడానికి దోహదపడేదనీ లేక సహాయకరమైనదనీ” అంతర్జాతీయ పిల్లల నిధి నొక్కి తెలియజేస్తుంది.

మరొక వైపున, పిల్లలు తక్కువ వేతనానికి అనేక గంటల పాటు, తరచూ ఆరోగ్యానికి హాని కలిగించే పరిస్థితుల క్రింద పనిచేయడాన్ని బాల-శ్రామికత్వం సూచిస్తుంది. ఇటువంటి పని “స్పష్టంగా నాశనకరమైనది, వారిని దోచుకోవడం వంటిది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే పిల్లలు వేశ్యలుగా మారడం అంగీకరించదగినదేనని బహిరంగంగా ఎవరూ వాదించరు. ‘కట్టుబానిసత్వం’ గురించి కూడా అదే చెప్పవచ్చు, తల్లిదండ్రులు లేదా తాతముత్తాతలు తాము చేసిన అప్పును తీర్చడానికి తమ పిల్లల్ని బానిసలుగా అప్పగించడాన్ని సూచించేందుకు ఈ పదం ఎక్కువగా ఉపయోగించబడుతుంది. అనారోగ్యం కలిగించే ఘోరమైన, ప్రమాదకరమైన పరిస్థితులకు పేరుపొందిన కర్మాగారాల విషయంలో కూడా ఇది వాస్తవమై ఉంది.  . . అపాయకరమైన పనిని పిల్లలెవరూ భరించలేరు” అని ద స్టేట్‌ ఆఫ్‌ ద వరల్డ్స్‌ చిల్డ్రన్‌ 1997 వాఖ్యానిస్తుంది.

[8, 9వ పేజీలోని బాక్సు/చిత్రం]

“చేయవలసినది ఇంకా చాలా ఉంది”

బాల-శ్రామికత్వంలోని ఘోరమైన రకాలను నిర్మూలించడానికి కృషి చేయడంలో అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఒ) ముందుంది. ఈ అంతర్జాతీయ కార్మిక సంస్థ 15 కంటే తక్కువ వయస్సు గల పిల్లల శ్రామికత్వాన్ని నిషేధించేలా ఒక చట్టాన్ని తయారు చేయమని ప్రభుత్వాలను ప్రోత్సహిస్తుంది. 12 ఏండ్ల లోపు వయస్సు గల బాల కార్మికులను నిషేధించడానికీ, ఈ దుర్వినియోగం యొక్క అత్యంత ప్రమాదకరమైన రూపాలను నిర్మూలించడానికీ ఒక క్రొత్త ఒప్పందాన్ని చేసుకోమని కూడా ఇది ప్రోత్సహిస్తుంది. అటువంటి ప్రయత్నాల విజయాన్ని గురించి మరింత తెలుసుకోవడానికి, అమెరికా కార్మిక విభాగంలో అంతర్జాతీయ బాలల కార్మిక కార్యక్రమానికి డైరెక్టర్‌గా ఉన్న సోనియా రోజెన్‌తో తేజరిల్లు! మాట్లాడింది. ఈమె వివిధ అంతర్జాతీయ కార్మిక సంస్థ కార్యక్రమాలతో సన్నిహితంగా పనిచేసింది. ఆమెతో జరిగిన చర్చలోని కొంత భాగం ఇక్కడ ఇవ్వబడింది.

ప్ర.: బాల-శ్రామికత్వాన్ని నిర్మూలించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం ఏది?

జ.: మా దగ్గర ఇదే సరియైన సమాధానం అంటూ ఏదీ లేదు. అయితే అంతర్జాతీయ స్థాయిలో, మేము చర్చించిన సమస్యలు కీలకమైన సమస్యలు, అంటే విశ్వవ్యాప్తంగా ప్రాథమిక విద్యను వీలైనంత వరకూ తప్పని సరిగానూ, ఉచితంగానూ అందజేయాలనే దానితో పాటు చట్టాన్ని తగినంతగా అమలుచేయాలన్నదే. ఖచ్చితంగా, తల్లిదండ్రులకు తగిన ఉద్యోగాలు ఉండటం కూడా ప్రాముఖ్యమే.

ప్ర.: బాల-శ్రామికత్వాన్ని నిర్మూలించడంలో ఇప్పటి వరకు సాధించిన ప్రగతితో మీరు సంతృప్తి చెందారా?

జ.: నేనెన్నటికీ సంతృప్తి చెందను. ఒక్క పిల్లవాడు కూడా దుర్భరమైన పరిస్థితుల్లో పని చేయకూడదని మేము అంటాము. అంతర్జాతీయ కార్మిక సంస్థ కార్యక్రమాల ద్వారా మేము గొప్ప ప్రగతిని సాధించాము. కానీ చేయవలసినది ఇంకా చాలా ఉంది.

ప్ర.: బాల-శ్రామికత్వాన్ని నిర్మూలించాలనే ప్రయత్నాలకు అంతర్జాతీయంగా ప్రజలు ఎలా ప్రతిస్పందిస్తున్నారు?

జ.: ఈ ప్రశ్నకు ఎలా సమాధానమివ్వాలో నాకు తోచడం లేదు. బాల-శ్రామికత్వం అన్నది చర్య తీసుకోవలసిన సమస్య అన్న విషయంలో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక నిర్దిష్ట స్థాయిలో ఏకాభిప్రాయం ఉంది. ఈ సమయంలో నిజానికి ప్రశ్నలు ఇవని నేను అనుకుంటున్నాను: దీనితో ఎలా వ్యవహరించాలి, ఎంత త్వరగా వ్యవహరించాలి? బాల-శ్రామికత్వంలోని నిర్దిష్టమైన రకాలతో వ్యవహరించడంలో ఉపయోగించదగ్గ శ్రేష్ఠమైన ఉపకరణాలు ఏవి? ఇదే మన నిజమైన సవాలని నేననుకుంటున్నాను.

ప్ర.: బాల కార్మికులు భవిష్యత్తులో ఏమి అపేక్షించవచ్చు?

జ.: బాల-శ్రామికత్వం యొక్క ఈ ఘోరమైన రకాలపై ఒక క్రొత్త ఒప్పందాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రపంచంలోని దేశాలన్నీ ఈ సంవత్సరం జెనీవాలో తిరిగి సమావేశమౌతున్నాయి. అన్ని దేశాలు, కార్మిక సంఘాలు, ఉద్యోగ సంస్థలు నిజంగా దాని నుండి ఎంతో ఆశించవచ్చు. అది బాల-శ్రామికత్వం యొక్క అత్యంత ఘోరమైన రకాలను నిర్మూలించడమే లక్ష్యంగా ఒక క్రొత్త విధానాన్ని ఏర్పాటు చేస్తుందని ఆశించబడుతోంది.

అందరూ సోనియా రోజెన్‌కు ఉన్నటువంటి ఆశాభావాన్నే కలిగివుండరు. సేవ్‌ ద చిల్డ్రన్‌ ప్రెసిడెంట్‌ అయిన చార్లెస్‌ మకోర్మక్‌ భిన్నమైన అభిప్రాయాలను కలిగి ఉన్నారు. “రాజకీయ అభిలాష, విషయాన్ని గురించి ప్రజలకు తెలిసి ఉండటం సమస్యను పరిష్కరించలేవు” అని ఆయన అంటున్నారు. ఎందుకు? అంతర్జాతీయ బాలల నిధి ఇలా వ్యాఖ్యానిస్తోంది: “బాల-శ్రామికత్వం అనేది తరచుగా ఒక సంక్లిష్టమైన సమస్య. అనేకమంది యజమానులు, స్వప్రయోజన సముదాయాలు, మార్కెట్‌ ధరలన్నీ పోటీ లేకుండా ఉండాలని ప్రతిపాదించే ఆర్థికశాస్త్ర నిపుణులు, కొంతమంది పిల్లల కులం లేదా వర్గం వారికి కొన్ని హక్కులను లేకుండా చేస్తున్నాయని విశ్వసించే సాంప్రదాయక వేత్తలతో సహా బలమైన శక్తులు దీనికి మద్దతునిస్తున్నాయి.”

[చిత్రం]

సోనియా రోజెన్‌

[5వ పేజీలోని చిత్రాలు]

గనుల్లోనూ, పత్తి మిల్లుల్లోనూ శ్రమించడం బాల-శ్రామికత్వపు విషాద చరిత్రలో ఒక భాగం

[క్రెడిట్‌ లైను]

U.S. National Archives photos

[7వ పేజీలోని చిత్రం]

ఆసియాలో చెత్త ఏరడం

[7వ పేజీలోని చిత్రం]

పొయ్యిలోకి కట్టెలు ఏరడం కోసం శ్రమించడం

[క్రెడిట్‌ లైను]

UN PHOTO 148046/J. P. Laffont-SYGMA

[7వ పేజీలోని చిత్రం]

కర్మాగారంలో పని చేయడం

[క్రెడిట్‌ లైను]

CORBIS/Dean Conger

[8వ పేజీలోని చిత్రం]

వీధుల్లో అమ్ముకునే పిల్లలు రోజుకి 2 రూపాయల 40 పైసల కోసం పనిచేస్తారు

[క్రెడిట్‌ లైను]

UN PHOTO 148027/Jean Pierre Laffont

[8వ పేజీలోని చిత్రం]

వడ్రంగం పని దుకాణంలో

[క్రెడిట్‌ లైను]

UN PHOTO 148079/J. P. Laffont-SYGMA

[9వ పేజీలోని చిత్రం]

జీవనోపాధి కోసం పోరాటం

[క్రెడిట్‌ లైను]

UN PHOTO 148048/J. P. Laffont-SYGMA

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి