సాటిలేని పశ్చిమాఫ్రికా పెన్నీ
సియెర్రా లియోన్‌లోని తేజరిల్లు! విలేఖరి
దీనికి సాదృశ్యమైన నాణెమును ఎప్పుడైనా చూశారా? ఇది కిసీ పెన్నీ. ఈ నాణాల్లో కొన్ని ఫ్రీటౌన్‌లో ఉన్న సియెర్రా లియోన్ నేషనల్ మ్యూజియమ్‌లో కనిపిస్తాయి. “జిజ్ఞాసకలిగించే ఆకృతిలో ఉండే ఈ నాణానికి జన్మస్థానాలు సియెర్రా లియోన్ మరియు లైబీరియా. 1945 వరకూ కూడా ఈ రాష్ట్రాల్లో ఇది చలామణిలో ఉండేది. ఇది తలకూ (చివర గుండ్రంగా ఉంటుంది) కాళ్ళకూ (మొనదేలిన చివర్లు ఉంటాయి) చిహ్నంగా ఉంటుంది కనుక, మానవాతీత శక్తి ఉన్న నాణెమని దాని గురించి చెప్పుకునేవాళ్ళు. ఒక తెగనాయకుడు చనిపోతే, అనేక పెన్నీలను పగుల గొట్టి అతని సమాధిలోకి వీటిని కుక్కేవారు. ఒక పశ్చిమ ఆఫ్రికా షిల్లింగ్‌కు 50 కిసీలు అనేది నమోదుచేయబడిన దాని చివరి మారకపు ధర” అని ఈ మ్యూజియమ్లోవున్న ఇన్ఫర్మేషన్ కార్డు చెబుతుంది.
బేజల్ డేవిడ్సన్ వ్రాసిన ద ఆఫ్రికన్ స్లేవ్ ట్రేడ్ అనే పుస్తకం ప్రకారం, చాలా కాలం క్రితం బానిసలను “ఇనప ముక్కల”తో కొనుక్కునేవారు. ఆ ఇనప ముక్కలేనా ఈ కిసీ పెన్నీలు? అవును అని కొందరు నిపుణులు చెబుతున్నారు. కానీ ఇతరులు ఏకీభవించడం లేదు. అయినా, బానిసలను కొనుక్కోవడానికి ఈ నాణెములను ఉపయోగించకపోయి ఉండవచ్చు గానీ, భార్యలను కొనుక్కోవడానికి ఉపయోగించేవారనడంలో మాత్రం సందేహం లేదు.
పైన సూచించినట్లు, ఈ నాణెములను కొన్నిసార్లు మతాచారాల్లో కూడా ఉపయోగించారు. ముఖ్యంగా ఆత్మ అమర్త్యం అనే లేఖనరహిత విశ్వాసం సంబంధంగా ఉపయోగించేవారు. ఒక వ్యక్తి చనిపోయినప్పడు, అతడ్ని అతడి స్వగ్రామంలోనే సమాధి చేయడం సముచితమని తలంచబడేది. అయితే, దూరప్రాంతంలో మరణిస్తే, మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడం అన్నివేళలా వీలయ్యేది కాదు. కిసీ పెన్నీ ద్వారా ఆత్మను తీసుకువెళ్ళడమే అందుకు పరిష్కారమార్గం.
చనిపోయిన వ్యక్తి యొక్క బంధువు ఆ మరణించిన ఊరికి వెళ్ళి, మాంత్రికుడి దగ్గర నుండి ఒక పెన్నీని తీసుకొచ్చేవాడు. ఆ మాంత్రికుడు కొన్ని మంత్రోచ్ఛరణల ద్వారా చనిపోయిన వ్యక్తి ఆత్మను దానికి జోడిస్తాడని ఊహించబడుతుంది. ఆ తర్వాత, ఆ ఆత్మను (ఆ పెన్నీ) ఇంటికి తీసుకువచ్చి, పూర్వీకుల సమాధి స్థలంలో సమాధి చేయడం ఆ బంధువు పని.
ఆ బంధువు ఆ పెన్నీకి శుభ్రమైన బట్టను చుట్టి, తన ప్రయాణాన్ని మొదలుపెడతాడు. ఆ ప్రయాణాన్ని మౌనవ్రతం పాటిస్తూ పూర్తిచేయాలి. మార్గమధ్యంలో ఆయన ఎవరితోనైనా మాట్లాడితే, ఆత్మ పెన్నీని వదిలిపెట్టి, వ్యక్తి మరణించిన చోటికి తిరిగివెళ్ళిపోతుందని నమ్ముతారు. ఆ బంధువు దానిని తిరిగి తీసుకురావడానికి ఆ ఊరికి తిరిగి వెళ్ళవలసి ఉంటుంది—నిస్సందేహంగా, మాంత్రికుడికి మరోసారి డబ్బు చెల్లించిన తర్వాత మాత్రమే ఆ పని జరుగుతుంది!
ఆ ప్రయాణంలో మాట్లాడవలసిన అవసరం ఏర్పడితే మాట్లాడవచ్చు, కానీ మాట్లాడే ముందు ఆ బంధువు ఆ పెన్నీని జాగ్రత్తగా క్రిందికి దించాలి. కానీ నేల మీద ఉంచకూడదు. ఆ పెన్నీని తీసుకున్నాక, మళ్ళీ మౌనవ్రతం పాటించాలి.
13 నుండి 14 అంగుళాల పొడవు ఉండే కిసీ పెన్నీలు జేబులోగానీ పర్సులోగానీ పట్టవు. కానీ, వాటి ఆకృతి ఆ కాలంవాళ్ళకు తగ్గట్లు ఉండేది, వాళ్ళు వాటిని మోపులుగా కట్టి తలమీద మోసుకుని వెళ్ళేవాళ్లు. ధనవంతులు ఈ పెన్నీలను తమ అటకలమీద పెట్టేవారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే, నీటి ఆవిరి ఈ పెన్నీలపైన ఘనీభవించి, ఆ తర్వాత నీటిబిందువులుగా మారి గదిలో నీటిచుక్కలుగా కారుతూ ఉంటుంది. మీరు కూర్చున్న ఇంట్లో “నీటిచుక్కలు” ఎంత ఎక్కువ పడుతున్నాయన్నది, ఆ ఇంటాయన ఎంత ధనవంతుడనే దానికి చక్కని సూచన.