సమాధానకర్తలా, యుద్ధకర్తలా?
“క్రైస్తవుడు యుద్ధ సంబంధ కార్యాల్లో పాల్గొనకూడదు” అనేమాట తొలిక్రైస్తవులు యుద్ధాన్ని ఎలా దృష్టించేవారో సంక్షిప్త రూపంలో చెబుతుంది అని వాల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ (డబ్ల్యు.సి.సి.) ప్రచురించే ఇక్కోస్ అనే పత్రికలో టోకో మరియు మాలూసీ మపూల్‌వానా అంటున్నారు. “క్రైస్తవ చర్చీ, రాజకీయవేత్తల గుంపులతో మైత్రిని కలుపుకున్న తర్వాతే, యుద్ధం అత్యవసరమైనదని అంగీకరించడానికి” చర్చి ఇష్టపడనారంభించింది అని కూడా ఈ పత్రిక ప్రకాశకులు అంటున్నారు. దాని ఫలితం? అనేక కాలాలుగా క్రైస్తవమత సామ్రాజ్యం యుద్ధానికి చాలా మద్దతునిచ్చాయి గనుక, “రెండవ ప్రపంచ యుద్ధానికి తాము బాధ్యులమన్న లిఖితపూర్వక ఒప్పుకోలు”ను ఆధికారికంగా విడుదల చేయవలసిన అవసరముందని జపాన్‌లోని యునైటెడ్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ రెండవ ప్రపంచయుద్ధం తర్వాత భావించింది.
నేడు, ఆ యుద్ధం జరిగిన 50 సంవత్సరాల తర్వాత యుద్ధాలు చేయడంలో క్రైస్తవమత సామ్రాజ్యానికున్న పేరు ఏ మాత్రం మారలేదు. “మనం క్రైస్తవులముగా, యుద్ధం అవసరమనే తర్కానికి లేదు అని గట్టిగా నమ్మకంగా చెప్పామా, క్రీస్తు ప్రేమకు అవును అని చెప్పామా అని ప్రశ్నించుకుంటే, మనం తప్పు ఒప్పుకోవలసినవి ఇప్పటికీ చాలా ఉన్నాయి . . . అని స్పష్టమౌతుంది” అని చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్‌లో పనిచేస్తున్న డా. రాజర్ విల్యమ్‌సన్ ఒప్పుకుంటున్నారు. “వివాదాలను పరిష్కరించే ఒక పద్ధతిగా యుద్ధాన్ని దృష్టించడం మన ప్రభువైన యేసుక్రీస్తు బోధకూ, ఆయన చూపించిన మాదిరికీ విరుద్ధమైనది” అని 1948లో డబ్ల్యు.సి.సి. ఉద్ఘాటించినప్పటికీ, క్రైస్తవమత సామ్రాజ్యంలోని చర్చీలు తరచూ “సంకుచిత మనస్సుకూ, సహనశీలం లేకుండా పోయేందుకూ, మానవ స్వాతంత్ర్యానికి నిర్బంధాలను పెట్టేందుకూ, పోరాటాలను ఉద్ధృతం చేసేందుకూ” దోహదపడ్డాయి అని విల్యమ్‌సన్ పేర్కొంటున్నారు. “మతం . . . తరచూ పోరాటాలకు అంతం తెచ్చేబదులు వాటిని ఉద్ధృతం చేసేందుకే తోడ్పడుతుంది” అనే అభిప్రాయానికి ఆయన రావడంలో ఆశ్చర్యం లేదు.
మునుపటి యూగోస్లేవియాను విభజించిన యుద్ధం దానికి చక్కని ఉదాహరణ. సంవత్సరాలుగా, అన్యాయాలూ, క్రూర కృత్యాలూ జరుగుతున్నప్పటికీ, ఆ దేశంలో జరుగుతున్న సంఘర్షణల విషయమై ఏకగ్రీవంగా ఒక దృఢ నిర్ణయానికి రావడం చర్చీలకు చాలా కష్టంగా ఉంది. ఎందుకని? తమ మధ్య క్రైస్తవ బంధం ఉందని చెప్పుకుంటున్నప్పటికీ, తమ దేశపు రాజకీయవేత్తలు ఎలా భిన్న దృక్పథాలను కలిగి ఉన్నారో సెర్బియన్ మరియు క్రొయేషియన్ పాదిరీలు కూడా అలాగే భిన్నదృక్పథం కలిగి ఉన్నారని డా. విల్యమ్‌సన్ పేర్కొంటున్నారు. ఈ దేశాల్లోనైనా, మరే దేశాల్లోనైనా సరే క్రైస్తవమత సామ్రాజ్యంలోని మతనాయకులు క్యాథలిక్కులైనా, ఆర్థడాక్స్‌లైనా, లేదా ప్రొటెస్టెంట్లైనా సరే సమాధానకర్తలుగా గాక, “పక్షపాతం చూపే మతగురువులుగా” ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు డబ్ల్యు.సి.సి.లో సభ్యులైన 300 కన్నా ఎక్కువ చర్చీలు ఉన్నప్పటికీ, “నిజానికి సమాధానాన్ని నెలకొల్పే మాదిరికరమైన చర్చీలను కనుగొనడం చాలా కష్టం” అని డా. విల్యమ్‌సన్ ఒప్పుకుంటున్నారు.
నిజమే అలాంటి చర్చీలను కనుగొనడం కష్టమే. కానీ సమాధానపడడాన్ని గురించి కేవలం మాట్లాడడం మాత్రమే చేసే డబ్ల్యు.సి.సి. సభ్యులైన చర్చీల్లా కాక, మునుపు విభిన్న మతాలకు చెందిన సభ్యులు సమాధానపడడంలోనూ, నిజమైన క్రైస్తవులుగా మారేందుకు వారికి సహాయపడడంలోనూ ఇప్పటికే సఫలీకృతమైన ఒక మతం ఉంది. 233 దేశాల్లో, 58 లక్షల కన్నా ఎక్కువ మంది యెహోవాసాక్షులు దేవుడి మీద తమకున్న ప్రేమ వల్ల, “అందరితో సమాధానమును . . . కలిగి యుండ”వలెనన్న తమ కోరికవల్ల పురికొల్పబడినవారై, దేశాలు చేస్తున్న యుద్ధాల్లో—ఆసియా, ఉత్తర ఐర్లాండ్, మధ్య ప్రాచ్యం, మునుపటి యుగోస్లేవియా, రువాండాల్లో, లేదా లాటిన్ అమెరికాలో జరిగే పోరాటాల్లో అయినా సరే—పాల్గొనడానికి నిరాకరిస్తారు. (హెబ్రీయులు 12:14; మత్తయి 22:36-38) దానికి భిన్నంగా, వాళ్ళు ‘తమ ఖడ్గములను నాగటి నక్కులుగా సాగగొట్టుకోవడం’ ద్వారా, ‘యుద్ధముచేయ నేర్చుకొనడం మానివేయడం’ ద్వారా బైబిలు ప్రవచనాన్ని నెరవేర్చుతున్నారు.—మీకా 4:3.
[31వ పేజీలోని చిత్రాలు]
ఆఫ్రికాలోని కొందరు యెహోవాసాక్షులు తమ తటస్థ దృక్పథాన్నిబట్టి తీవ్రమైన దెబ్బలను తినడమో లేక శరణార్థులుగా వెళ్ళిపోవలసి రావడమో జరిగింది