మా పాఠకుల నుండి
మనం మన వాతావరణాన్ని మారుస్తున్నామా? నాకు 17 ఏండ్లు. నేను నా డిప్లోమా పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నాను. మా పరీక్షలో భూగోళశాస్త్రం కూడా ఉంది. “మనం మన వాతావరణాన్ని మారుస్తున్నామా?” (జూన్ 8, 1998) అనే శీర్షికల పరంపర, పరీక్షలకు సిద్ధపడడంలో నాకు చాలా తోడ్పడింది. పరీక్షలు అయిపోయిన తర్వాత, వాతావరణానికి సంబంధించిన ఈ సమాచారాన్ని ఎక్కడ కనుగొన్నావు అని నా స్నేహితులు నన్ను అడిగారు. వాళ్ళలో సగం మంది దీని కాపీలు కావాలని అడిగారు.
ఏ. జీ., స్విట్జర్‌ల్యాండ్
ఈ తేజరిల్లు! సంచికలో హరితగృహపు ప్రభావాన్ని గురించిన విశ్లేషణను చూసినప్పుడు నాకు ఆనంద ఆశ్చర్యాలు కలిగాయి. నేను నిబద్ధతగల పర్యావరణశాస్త్రజ్ఞుడను, క్రైస్తవుడను. యెహోవాసాక్షుల గురించి పత్రికల్లో అన్నిసార్లు మంచి అభిప్రాయం రాదు. కానీ మీ పత్రికలో ప్రచురించిన విషయాలు ఆలోచించదగినవే. పర్యావరణమూ, విశ్వాసమూ క్షీణదశలో ఉన్నాయి. చివరకు, దేవుడి సృష్టిపై ఆసక్తి చూపించే మతవిశ్వాసులున్నారన్నమాట!
ఎమ్. సి., ఫ్రాన్స్
నాకు 14 ఏండ్లు. ఈ శీర్షికలను బట్టి మీకు కృతజ్ఞతలు తెలపాలని అనుకున్నాను. నేను వాతావరణాన్ని గురించి ఎప్పుడూ ఇంతగా ఆలోచించలేదు. కానీ ఇప్పుడు మొదటిసారిగా, మనం మన గ్రహం విషయమై ఏమి చేస్తున్నామనే దాని గురించి గంభీరంగా ఆలోచించాను. చాలా మంది ప్రజలు మేల్కొనేలా ఈ శీర్షికలు బలవంతపెట్టి తీరాల్సిందే. మన పర్యావరణాన్ని నాశనం చేయాలని ఎవరూ కోరుకోరు కదా? దేవుడిచ్చిన బహుమానాన్ని మనం ఊరికే వృథాచేయకూడదు.
ఎస్. క్యూ., జర్మనీ
మత సంబంధ పత్రికగా ప్రజలు ఎంచుతున్న పత్రికలో వాతావరణాన్ని గురించి చదివినప్పుడు నాకు మంచిగా అనిపించింది. ప్రజల విషయంలో—ఆధ్యాత్మికంగానే కాక, శారీరకంగా కూడా—తేజరిల్లు! ఎంత శ్రద్ధ తీసుకుంటుంది అన్నది అది చూపిస్తుంది. మనం వాతావరణాన్ని తేలికగా తీసుకున్నప్పటికీ, అది మనపై నిజంగానే ప్రభావం చూపిస్తుంది.
ఎమ్. ఎఫ్. ఎమ్., జర్మనీ
అభిమాన మోడల్ జూన్ 8, 1998 తేజరిల్లు!లో “యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . . నా అభిమాన మోడల్ ఎవరై ఉండాలి” అనే శీర్షికను చదివాక, ఇలాంటి శీర్షికలు నా జీవితాన్ని ఎంత ఐశ్వర్యవంతమైనదిగా మార్చాయో ఒకసారి ఆలోచించుకున్నాను. మా కుటుంబం విచ్ఛిన్నమైన తర్వాత, సహజంగానే, నేను తోటివయస్కులైన స్నేహితురాండ్రకు చేరువయ్యాను. కానీ అటు తర్వాత, నా జీవితంపై అత్యంత నిర్మాణాత్మక ప్రభావాన్ని చూపినవారి గురించి గంభీరంగా ఆలోచించడం మొదలుపెట్టాను. పౌలు, తిమోతి, లేదా రూతు, నయోమి వంటి అనుబంధాల కోసం వెదకనారంభించాను. 50 ఏండ్ల ఒక సహోదరి నా సన్నిహిత స్నేహితురాలు. ఆనందం, ప్రేమ, సానుభూతి, దయ, ఔదార్యం వంటివాటిని ఆమె నాకు నేర్పారు. మేము కలిసి పరిచర్య చేస్తాం—మేము ఇప్పుడు ఒకే ఇంట్లో ఒకే గదిలో ఉంటున్నాం. మేము పూర్తికాల పరిచర్య మొదలుపెట్టాం. మీరు సరైన నడిపింపునూ, నిర్దేశాన్నీ ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు.
సి. ఎఫ్., అమెరికా
ఫైబ్రోమ్యాల్‌జియా “ఫైబ్రోమ్యాల్‌జియా అర్థం చేసుకుని భరించండి” అని శీర్షికకు చాలా కృతజ్ఞతలు. (జూలై 8, 1998) నేను ఆరు సంవత్సరాలుగా, ఫైబ్రోమ్యాల్‌జియాతో బాధపడుతున్నాను. ఈ శీర్షిక విశదంగా ఖచ్చితంగా వివరించింది. అలాగే బాక్స్‌లో ఇవ్వబడిన లేఖనాలు నన్ను చాలా ప్రోత్సహించాయి.
ఎన్. ఎమ్., అమెరికా
ఈ శీర్షిక చాలా మందిలో ప్రతిస్పందనను కలిగించింది. భవిష్యత్ సంచికలో మరెక్కువ వ్యాఖ్యానాలను ప్రచురించాలని ఆశిస్తున్నాం.—ఎడిటర్.