విమానాలు ఎంత సురక్షితమైనవి?
ప్రపంచ రోడ్ల మీద ఒక సంవత్సరంలో దాదాపు ఐదు లక్షలమంది చనిపోతున్నారు. దానికి భిన్నంగా, 1996లో విమానయాన దుర్ఘటనల్లో 1,945 మంది ప్రాణాలు కోల్పోయారు. 1997లో ఆ సంఖ్య 1,226కు తగ్గిపోయింది. బోయింగ్‌ను తయారుచేసే కంపెనీ గణాంక వివరాల ప్రకారం, “ప్రతి పది లక్షల విమానయానాల్లో వాణిజ్య జెట్‌లు 2 రెట్ల కంటే తక్కువసార్లు కూలిపోతాయి.”
అయినప్పటికీ, ప్రతి విమానయాన ప్రమాదానికి ఎంతో ప్రాచుర్యం లభిస్తుంది, అయితే రోడ్ల మీద జరిగే వాహన ప్రమాదాలను మామూలు విషయంగా తీసుకోవడం జరుగుతుంది. అమెరికాలో విమాన ప్రయాణాల కన్నా బస్సు ప్రయాణాలు కేవలం కొంచెం ఎక్కువ సురక్షితమైనవిగా పరిగణింపబడుతున్నాయి.
సాధారణంగా, కారుకంటే విమానం ఎందుకు సురక్షితమైనది? ఒక సుస్పష్టమైన కారణమేమిటంటే, రోడ్డు మీది వాహనాల్లా విమానాలు మరీ దగ్గరగా ప్రయాణించవు. మరో కారణమేమిటంటే, విమానాల్లో పనిచేసే ఉద్యోగుల్లో ఎక్కువమంది సుశిక్షితులు. వారు తమ బాధ్యతలను నిర్వర్తించడంలో ఎంతో నిష్ణాతులై ఉంటారు. బోయింగ్ 747 కెప్టెన్ సాధారణంగా తన 50వ పడిలో ఉంటాడు, విమానాలను నడిపించడంలో అతనికి దాదాపు 30 ఏళ్ల అనుభవం ఉంటుంది. సిబ్బందిలోని సభ్యులందరికీ భద్రత ప్రాథమికమైన అంశం. ఎందుకంటే, వారి జీవితాలు కూడా ప్రమాదానికి గురికాగలవు.
కాక్‌పిట్‌లో భద్రత
ప్రయాణికుల విమానాల్లోని కాక్‌పిట్ లోపలి భాగాన్ని మీరు చూస్తే, అక్కడ ప్రాథమికమైన పరికరాలు, నియంత్రణా యంత్రభాగాలు అన్నీ రెండు సెట్లుగా ఉంటాయి—ఎడమవైపున ఉండే సెట్ కెప్టెన్ కోసం, కుడివైపున ఉండే మరో సెట్ సహపైలట్ కోసం.a అలా, ది ఎయిర్ ట్రావెలర్స్ హాండ్‌బుక్ ప్రకారం, “పైలట్లలో ఒకరు స్పృహ తప్పడం వంటి అనూహ్యమైనది సంభవించినా, విమానాన్ని సురక్షితంగా తీసుకు వెళ్లడానికి అవసరమైన నియంత్రణా యంత్రభాగాలన్నీ మరో పైలట్ వద్ద కూడా ఉంటాయి. విమానం ప్రయాణిస్తుండగా, ప్రతి పైలట్ మరో పైలట్ ఉపకరణాలను అదుపు చేస్తూ, రెండు సెట్లూ ఒకే సూచనలను ఇచ్చేలా వాటిని నియంత్రించ గల్గుతాడు.”
కాక్‌పిట్ మీద మరో భద్రతాంశం ఏమిటంటే, ముందు జాగ్రత్త చర్యగా, కెప్టెన్ ఇంకా సహపైలట్ ఇద్దరూ వేరు వేరు ఆహార పదార్థాలను భుజిస్తారు. ఎందుకలా? ఒకవేళ ఆహారం గనుక విషమయం అయిపోతే, అది కేవలం ఒకరి మీదే ప్రభావం చూపిస్తుంది.
ఫ్లాప్‌లు, లాండింగ్ గేర్, బ్రేక్‌లు వంటి కదిలే భాగాలను కచ్చితంగా నియంత్రించగలిగేలా, “ఒకవేళ ఒకటి పాడైపోయినా మరొకటి ఉపయోగించగలిగేలా సాధారణంగా విమానాల్లో రెండు లేక అంతకంటే ఎక్కువ హైడ్రాలిక్ వ్యవస్థలు ఉంటాయి.” అనేక ఆధునిక విమానాల్లో రెండు లేక మూడు వ్యవస్థలను పెట్టడం ఒక తప్పనిసరి భద్రతా ప్రమాణం.
మీరేమి చేయవచ్చు?
ప్రయాణీకులందరూ తీసుకోగల సుళువైన ముందు జాగ్రత్త చర్యలు కొన్ని ఇలా ఉన్నాయి: ఎమర్జెన్సీ పరిస్థితుల కోసం ఇవ్వబడిన సూచనల కార్డును చదవండి, ప్రతి విమాన ప్రయాణానికి ముందు భద్రతా చర్యల గురించి విమాన అటెండెంట్లు వివరించేటప్పుడు వినండి. మీరు మీ సీట్లో కూర్చునేటప్పుడు, మీకు సమీపంలోని ద్వారం ఎక్కడ ఉందో చూసుకోండి. ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితి ఏర్పడితే, విమాన అటెండెంట్‌లు ఇచ్చే సూచనలను పాటించండి. ఒకవేళ ఏదైనా కష్ట పరిస్థితి ఏర్పడితే దాన్ని ఎలా ఎదుర్కోవాలనేదానిలో వాళ్లంతా సుశిక్షితులు. సూచనలు ఇవ్వబడినప్పుడు, ప్రయాణీకులు త్వర త్వరగా చర్యలు తీసుకుని, తమ వస్తుసంపదల గురించి చింతించకుండా ఉండడం ప్రాముఖ్యం. వస్తుసంపదల కన్నా ప్రాణం చాలా ప్రాముఖ్యమైనది.
ఆధునిక విమానాలు సాధారణంగా వాతావరణ పరిధికి పైగానే ప్రయాణిస్తాయి కాబట్టి, చాలావరకు విమానాల్లో దూరప్రయాణాలు సాఫీగానే సాగుతాయి. ఫలితంగా, చాలా తక్కువమంది ప్రజలు మాత్రమే విమాన అస్వస్థతకు గురౌతారు. ఏదైనా విపత్తు సంభవించనైయుంటే, ముందు జాగ్రత్త చర్యగా సేఫ్టీ బెల్టులు పెట్టుకోమని కెప్టెన్ సాధారణంగా ప్రయాణీకులకు సలహా ఇస్తాడు.
విమాన ప్రయాణం సురక్షితమైనదేనా? అవునన్నదే సమాధానం. కాని చాలామంది ప్రయాణీకులు అవసరమైన మార్పును తట్టుకోలేరు. అదేమిటి? ప్రయాణీకులు విమానం ముందు భాగంవైపుకు కాకుండా వెనక భాగంవైపుకు తిరిగి కూర్చోవాలన్నదే! దాని వల్ల ప్రయోజనమేమిటి? హఠాత్తుగా వేగం తగ్గినప్పుడు, అలా వెనక భాగం వైపుకు తిరిగి కూర్చోవడం వల్ల సీటు వెనుకభాగం ఎక్కువ సపోర్ట్‌ను ఇస్తుంది, లేకపోతే కేవలం కడుపుకే ఉండే సీట్ బెల్ట్ ఎక్కువ భద్రతను చేకూర్చదు. అందుకే కార్లలోని సీటు బెల్టులు వీటికంటే సురక్షితమైనవి ఎందుకంటే, కార్లలోనైతే సీట్ బెల్ట్‌లు గుండె భాగానికి కూడా ఉంటాయి. ఏదేమైనప్పటికీ ప్రజలు, తాము ఎక్కడి నుండి వచ్చామనే దానికంటే ఎక్కడికి వెళ్తున్నామనే దాన్ని చూడడానికే ఎక్కువగా ఇష్టపడతారు!
విమాన ప్రయాణమంటే భయమా?
అమెరికా జనాభాలోని ప్రతి 6 గురు పెద్దవారిలో ఒకరికి విమాన ప్రయాణమంటే భయమని అంచనా వేయబడింది. కొంతమందికి అది భయం కంటే ఎక్కువే—అది ఒక వ్యాధిలా మారిన భయం, ఆందోళనకరమైన ప్రతిస్పందనలకు దారితీసే అనుచితమైన భయం. ఏది సహాయపడగలదు?
ప్రయాణీకులు విమాన ప్రయాణాలకు సంబంధించిన విషయాల గురించి తెలుసుకుని ఉండడం ఆందోళనను అణచుకోవడానికి ఎంతగానో దోహదపడగలదు. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15,000 విమానాలు దాదాపు 10,000 విమానాశ్రయాల నుండి 120 కోట్ల కంటే ఎక్కువమంది ప్రజలను దుర్ఘటనలుగానీ ప్రమాదాలుగానీ ఎక్కువ సంభవించకుండా సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరవేస్తూ తమ సేవలను అందజేస్తున్నాయి. “లండన్‌కు చెందిన లాయిడ్ [జీవితభీమా కంపెనీ] చెప్పేదాని ప్రకారం, కారులో ప్రయాణించడం కంటే విమానంలో ప్రయాణించడం 25 రెట్లు సురక్షితమైనది.”
విమానప్రయాణం గురించి మీరు భయపడుతుంటే, విమానయానాల గురించి, విమానాల గురించి, పైలట్ల తర్ఫీదు గురించి పుస్తకాలు చదవండి. పైలట్లు అనుసరించవలసిన ఉన్నతమైన శిక్షణ ప్రమాణాల గురించి, విమానం నడపడానికి ముందు వారు నిద్రపోయే గంటల విషయంలోనూ, మత్తుపానీయాలను సేవించడం విషయంలోనూ పాటించే కచ్చితమైన నియమాల గురించి, వారిపై జరిపే రాన్‌డమ్ డ్రగ్ పరీక్షలను గురించి చదవండి. అత్యవసర పరిస్థితుల్లో పైలట్లు ఎలా ప్రతిస్పందిస్తారనేది పరీక్షించడానికి ఫ్లయిట్ సిములేటర్‌లో సంవత్సరానికి రెండుసార్లు చేయబడే పరీక్షలు కూడా ఉంటాయి. ఈ సిములేషన్‌లు ఎంత సజీవమైనవిగా ఉంటాయంటే, కొంతమంది పైలట్లు సిములేటర్‌లో నుండి బయటికి వచ్చేసరికి “వణికిపోతూ, చెమటతో తడిసిపోయి ఉంటారు.” ఎవరైనా పైలట్ సిములేటర్ పరీక్షలో విఫలమౌతే, అతడు వాణిజ్య విమానాలను నడిపేందుకు తనకున్న లైసెన్సును కోల్పోవలసి వస్తుంది.
ఈ ప్రమాణాలు, వాహనాలను నడిపే వారిపై విధించబడే వాటికన్నా ఎంతో ఉన్నతమైనవి. కాబట్టి, మీరు విమానాల గురించీ, పైలట్ల గురించీ ఎంతగా తెలుసుకుంటే మీ నమ్మకం అంతగా పెరుగుతుంది.
విమానాశ్రయాన్ని సందర్శించడం కూడా సహాయకరంగా ఉండగలదు. ప్రయాణీకుల కోసం ఉండే పద్ధతులను గమనించండి, ప్రజలు ఎలా ప్రతిస్పందిస్తారో చూడండి. చాలామంది ప్రజలు, బస్సులో నుండి దిగిపోయినట్లే విమానంలో నుండి దిగిపోతారని మీరు గమనిస్తారు. విమాన ప్రయాణం వారికి సర్వసాధారణమైన విషయం. విమానాలు పైకి ఎగరడాన్ని, క్రిందికి దిగడాన్ని చూడండి. విమాన ప్రయాణాన్ని సాధ్యం చేసే, సురక్షితం చేసే ఏరోడైనమిక్ వైజ్ఞానిక సూత్రాలను అర్థం చేసుకుని, గుణగ్రహించండి.
చివరికి మీరు మొదటిసారి విమాన ప్రయాణం చేసేటప్పుడు, ఇది మీకు మొదటిసారనీ, మీకు కొద్దిగా భయంగా ఉంటుందనీ విమాన అటెండెంట్‌కు చెప్పండి. మీరు విశ్రాంతిగా ఉండడానికీ, వ్యవస్థీకృత విధానమందు మీ నమ్మకం పెరగడానికీ ఎలా సహాయం చేయాలో ఈ నిష్ణాతులైన అటెండెంట్లకు తెలుసు. విశ్రాంతిగా ఉండడానికి ప్రయత్నించండి. విమానంలో ఇక నడవవచ్చునని కెప్టెన్ చెప్పినప్పుడు లేచి కాబిన్‌లో అటూ ఇటూ నడవండి. మీరు విమాన ప్రయాణం చేయడాన్ని గురించిన మీ భయాన్ని అధిగమించే స్థితికి చేరుకుంటారు.
[అధస్సూచీలు]
a చాలా విమాన ప్రయాణాల్లో విమానం నేలమీద ఆగి ఉన్నప్పుడు మీరు కాక్‌పిట్‌లోకి వెళ్లి చూడాలనుకుంటే కెప్టెన్ అందుకు అనుమతిస్తాడు. మీరు అడిగే ప్రశ్నలకు కూడా అతడు సమాధానమిస్తాడు.
[11వ పేజీలోని చిత్రం]
“లండన్‌లోని లాయిడ్ [జీవితభీమా కంపెనీ] ప్రకారం, కారులో ప్రయాణించడం కంటే విమానంలో ప్రయాణించడం 25 రెట్లు సురక్షితమైనది”
[12వ పేజీలోని చిత్రాలు]
విశ్రాంతిగా ఉండడాన్ని నేర్చుకోవడం విమాన ప్రయాణాన్ని ఆహ్లాదకరమైనదిగా చేయగలదు
[10వ పేజీలోని చిత్రసౌజన్యం]
Photograph courtesy of Boeing Aircraft Company