కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g99 3/8 పేజీలు 20-22
  • ఇతరుల గురించి మాట్లాడుకుంటే ఏమిటంత హాని?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఇతరుల గురించి మాట్లాడుకుంటే ఏమిటంత హాని?
  • తేజరిల్లు!—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మనమెందుకు అలా చేస్తామంటే
  • హానికరమైన విధంగా ఇతరుల గురించి మాట్లాడడంలో లోటుపాట్లు
  • దురుద్దేశంతోకూడిన మాటలకు ఆనకట్టవేయడం
  • ఇతరుల గురించి మాట్లాడడంలో మరో పార్శ్వం—వినడం
  • వృధాప్రసంగం—దానికెందుకంత ఆకర్షణ?
    తేజరిల్లు!—1992
  • వృధాప్రసంగం—నీకును ఇతరులకును హాని కలుగకుండ తప్పించుకునేదెలా
    తేజరిల్లు!—1992
  • ఎవరైనా నా గురించి పుకార్లు చెప్తుంటే నేనేమి చేయాలి?
    యువత అడిగే ప్రశ్నలు
  • వృధాప్రసంగము యొక్క శక్తి
    తేజరిల్లు!—1992
మరిన్ని
తేజరిల్లు!—1999
g99 3/8 పేజీలు 20-22

యువత ఇలా అడుగుతోంది . . .

ఇతరుల గురించి మాట్లాడుకుంటే ఏమిటంత హాని?

“నేను హైస్కూల్లో ఉన్నప్పుడు అది ఒక మహామారి అన్నట్లుగా ప్రబలి ఉంది. మా దగ్గర మత్తుమందులు గానీ, తుపాకులు గానీ లేవు, పోట్లాటలూ లేవు—అస్తమానం ఇతరుల గురించి మాట్లాడుకోవడం మాత్రం జరిగేది. అదే పెద్ద సమస్య.”—16 ఏండ్ల మిషేల్‌.a

అది చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని కొందరు అంటారు. మరి కొందరు అది వినాశనకరం అని అంటారు. పత్రికల్లోనూ, దినపత్రికల్లోనూ, టెలివిజన్‌ కార్యక్రమాల్లోను అది ఎడతెగక కనిపిస్తుంటుంది. అది అనేక సంభాషణలను ఆసక్తికరంగా చేస్తుంది. ఏమిటది? అది, ప్రజల గురించి, వాళ్ళ విషయాల గురించి, మరో మాటలో చెబితే ఇతరుల గురించి చెప్పుకోవడం.

“మీరీ విషయం విన్నారా?” అనే మాటకన్నా మరేమాటా మన శ్రద్ధను అంతత్వరగా ఆకట్టుకోలేకపోవచ్చు. ఆ మాట తర్వాత చెప్పేది వాస్తవమైనా లేక కల్పితమైనా—లేదా బహుశా రెండూ అయినా కావచ్చు. ఏది ఏమైనప్పటికీ, ఇతరుల గురించిన మాటల్లో దిగాలన్న ప్రలోభం చాలా బలంగా ఉండవచ్చు. “ఇతర వ్యక్తుల విషయాల్లో ఆసక్తి చూపించకుండా ఉండడం చాలా కష్టం” అని 17 ఏండ్ల లోరీ అంటుంది. “రసవత్తరమైనదేదైనా దొరికితే, మీరూ మీ స్నేహితులూ ఒకరికొకరు చెప్పుకోవలసిందేనన్న ఒప్పందాన్ని చేయకనే చేసుకుని ఉంటారు.”

మనమెందుకు అలా చేస్తామంటే

ఇతరుల గురించి చెప్పుకోవడం ఎందుకు అంత ఆసక్తిని రేకెత్తించేదిగా ఉంటుంది? ఒక కారణమేమిటంటే, మానవులు సంఘజీవులు. మరో విధంగా చెబితే, ప్రజలు ప్రజల విషయాల్లో ఆసక్తి కలిగి ఉంటారు. అలాంటప్పుడు, మన సంభాషణ త్వరలోనే లేక కొంచెం సేపటి తర్వాత అయినా, స్నేహితుల, పరిచయస్థుల జీవితాల్లో ఇటీవల జరిగిన సంఘటనలకు మారడం సహజమే.

ఇది చెడు విషయమా? ఎల్లప్పుడూ అలా అనేమీ కాదు. తరచూ, మామూలు సంభాషణల నుండి ఎవరు పెళ్ళి చేసుకోబోతున్నారు, ఎవరికి పిల్లాడు పుట్టాడు, ఎవరికి ఆరోగ్యం బాగోలేదు వంటి ఉపయోగకరమైన సమాచారం లభిస్తుంది. మొదటి శతాబ్దపు క్రైస్తవులు కూడా తమ తోటి విశ్వాసుల జీవితాల్లో జరుగుతున్న సంఘటనలను గురించి చర్చించుకునేవారు. (ఎఫెసీయులు 6:21, 22; కొలొస్సయులు 4:8, 9) నిజంగానే, స్నేహితుల గురించీ, పరిచయస్థులను గురించి మామూలుగా మాట్లాడుకోవడం, విషయాలను అరమరికలు లేకుండా తెలుపుకోవడంలోనూ ఆరోగ్యకరమైన సంబంధాలను కాపాడుకోవడంలోనూ భాగం మాత్రమే.

హానికరమైన విధంగా ఇతరుల గురించి మాట్లాడడంలో లోటుపాట్లు

ఇతరుల జీవితాల గురించిన చర్చకు ప్రేరేపించేది కొన్నిసార్లు, వాళ్ళ గురించిన చింత కాకుండా మరేదో అయివుంటుంది. ఉదాహరణకు, 18 ఏండ్ల డీయడ్ర “ప్రజలు తోటివారి మెప్పు పొందడానికి ఇతరుల గురించి మాట్లాడతారు. తమకు అప్పుడే చెప్పిన విషయానికన్నా మిన్నయైన సమాచారాన్ని తెలిసి ఉండడంవల్ల గొప్పగా చెలామణి అయి పోవచ్చని అనుకుంటారు” అని చెబుతుంది. ఇతరులను ఆకట్టుకోవాలనే కోరిక, ఇతరులు గురించి మాట్లాడే వ్యక్తి వాస్తవాలను వక్రీకరించి చెప్పడానికి కూడా పురికొల్పవచ్చు. “మీకు కథ తెలిస్తే, దానికి మసాలా కలిపే అవకాశం మీకుంటుంది. అది క్యాన్వాస్‌లా పనిచేయగలదు. స్పష్టమైన వివరాలేమీ లేకుండా మీకిష్టం వచ్చినట్లు దాన్ని మలుచుకోవచ్చు” అని 17 ఏండ్ల రేచల్‌ అంటుంది.

కొన్నిసార్లు, ప్రతీకారం తీర్చుకోవడానికి అబద్ధపు మాటలను ఉపయోగించడం జరుగుతుంది. “నేను ఒకసారి నా స్నేహితురాలి గురించి అబద్ధ ప్రచారం చేశాను. నాకు విరోధంగా ఆమె ఏదో చెప్పినందుకే నేనలా చేశాను” అని 12 ఏండ్ల ఏమీ చెబుతోంది. దాని ఫలితం ఏమిటి? “ఆహా, నిజంగా ఆమెకు తగిన శాస్తి చేశాను అని మొదట్లో అనుకునేదాన్ని.” అయినప్పటికీ, “చివరికి అది నా అదుపు తప్పిపోయింది. నేను అప్పుడు మాట్లాడకుండా ఉంటే కలిగే బాధ కన్నా ఎక్కువ బాధను ఇప్పుడు పడుతున్నాను” అని ఏమీ వివరిస్తుంది.

ఒక మానసికారోగ్య నిపుణురాలు చెబుతున్నట్లు, ఇతరుల గురించి మాట్లాడడం, “నిజంగానే, త్వరగా ఆర్పివేయలేని మంటలా” ఎలా మారుతుందో గ్రహించడం సులభం. (పోల్చండి యాకోబు 3:5, 6.) ఇలా సంభవించినప్పుడు, దాని ఫలితాలు చాలా వినాశనకరంగా ఉండవచ్చు. ఉదాహరణకు, రహస్యంగా దాచవలసిన విషయం అందరికీ తెలిసిపోయిందనుకోండి, అప్పుడేమిటి? ఇతరుల గురించి చెప్పింది అబద్ధమైతే, దానిని ప్రచారం చేయడం ద్వారా ఆ వ్యక్తికున్న మంచి పేరును మీరు పాడుచేస్తే అప్పుడేమిటి? “నా స్నేహితుల్లో ఒకరు నా గురించి నేను మత్తుమందులను వాడుతున్నాననే వదంతిని ప్రచారం చేశాడు. అది అబద్ధం. అది నాకు చాలా బాధ కలిగించింది” అని 12 ఏండ్ల బిల్‌ చెబుతున్నాడు.

దురుద్దేశంతోకూడిన మాటలకు ఆనకట్టవేయడం

“జీవమరణములు నాలుక వశము” అని బైబిలు మంచి కారణంతోనే చెబుతుంది. (సామెతలు 18:21) అవును, మన మాటలు నిర్మాణానికి ఉపయోగించే పరికరాల్లా గానీ, లేక నాశనానికి ఉపయోగించే ఉపకరణాల్లా గానీ ఉండవచ్చు. నేడు చాలా మంది తమ నాలుకను వినాశనానికే ఉపయోగిస్తారన్నది విచారకరమైన విషయం. “కత్తికి పదును పెట్టునట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు. యథార్థవంతులను కొట్టవలెనని చాటైన స్థలములలో చేదుమాటలను బాణములుగా సంధించుదురు” అని కీర్తన రచయిత వర్ణించిన కొందరివలె ఉన్నారు వాళ్ళు.—కీర్తన 64:2-4.

దేవుడ్ని ప్రీతిపరచాలని కోరుకునేవాళ్ళు, అబద్ధపు రిపోర్టులను ప్రచారం చేయకూడదు. ఎందుకంటే, “అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు” అని బైబిలు చెబుతుంది. (సామెతలు 12:22) నిజం కాదని మీకు తెలిసిన విషయాన్ని గురించి కావాలని పుకారు సృష్టించినా, ప్రచారం చేసినా అది అబద్ధమే. క్రైస్తవులు “అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను” అని బైబిలు చెబుతుంది.—ఎఫెసీయులు 4:25.

కనుక, మరోవ్యక్తి గురించి ఏదైనా చెప్పే ముందు, ‘నిజంగానే నాకు వాస్తవాలు తెలుసా? నేను ఏ వ్యక్తి గురించి మాట్లాడుతున్నానో ఆ వ్యక్తి మీదున్న గౌరవం వింటున్న వ్యక్తికి తగ్గిపోయేలా చేస్తాయా నా మాటలు? అలాగైతే నేనలా మాట్లాడ్డంలో నా ఉద్దేశం ఏమిటి?’ అని మీకై మీరు ప్రశ్నించుకోండి. ఒక విషయం గుర్తుంచుకోండి: ఒక విషయం నిజం అయినా సరే దాన్ని ప్రచారం చేయడం సమర్థనీయం కాదు—ముఖ్యంగా ఆ సమాచారం ఒకరి మంచి పేరుకు భంగం కలిగించేదైతే.

‘నేను ఇతరుల గురించి మాట్లాడడం నా మంచిపేరును ఎలా బాధిస్తుంది?’ అన్నది స్వయంగా ప్రశ్నించుకోవలసిన ప్రశ్న. అవును మీరు ఇతరుల గురించి మాట్లాడడం ద్వారా మీ గురించి మీరు ఒక విషయం తెలియజేస్తున్నారన్నమాట. ఉదాహరణకు, “మీరు ఇతరుల గురించి మాట్లాడడానికి ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నట్లయితే, మీకు మీ సొంత జీవితం అంత ఆసక్తికరంగా లేదన్నమాట” అని క్రిస్టన్‌ చెబుతుంది. ఇతరుల ముచ్చట్లు చెప్పుకు తిరిగే వ్యక్తిగా తనకున్న పేరు తన అతిసన్నిహితురాలి నమ్మకాన్ని హరించివేసిందని లీసా గ్రహించింది. “నేను నమ్మదగిన వ్యక్తినేనా కాదా అని ఆమె సంశయించే వరకూ వచ్చింది. అది నిజంగా గంభీరమైన విషయం—ఆమె నన్ను నమ్మగలదని నేను రుజువు చేయవలసి వచ్చింది” అని ఆమె చెబుతుంది.

మీరు ఇతరుల ఊసు ఎత్తేవారిగా పేరుగాంచినట్లయితే, హాని కలిగించే వ్యక్తిగా ప్రజలు మిమ్మల్ని దృష్టించవచ్చు. వాళ్ళు ఇక ఎన్నడూ మీ సహవాసాన్ని ఇష్టపడకపోవచ్చు. “కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయటపెట్టును. కావున వదరుబోతుల జోలికి పోకుము” అని ఒక బైబిలు సామెత చెబుతుంది. (సామెతలు 20:19) మీరు ఒక్క మాట కూడా మాట్లాడకపోయినా ఇతరుల గురించిన ఊసు ఎత్తడంలో మీరు తోడ్పడగలరన్న విషయం మీకు తెలుసా?

ఇతరుల గురించి మాట్లాడడంలో మరో పార్శ్వం—వినడం

ఇతరుల గురించిన సంభాషణకు కనీసం ఇద్దరు వ్యక్తులు—మాట్లాడే వ్యక్తి, వినే వ్యక్తి—అవసరం. వినేవ్యక్తి, మాట్లాడేవ్యక్తి కన్నా తక్కువ నిందార్హుడుగా అనిపించినప్పటికీ, ఈ విషయంలో బైబిలు మాత్రం భిన్నమైన దృక్కోణాన్ని తెలియజేస్తుంది. “చెడునడవడి గలవాడు దోషపు మాటలు వినును నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును” అని సామెతలు 17:4లో చదువుతాం. కనుక ఇతరులను గురించిన మాటలను వినేవ్యక్తి బరువైన బాధ్యతనే వహిస్తున్నాడు. “కొన్ని విధాలుగా చూస్తే, ఇతరుల గురించి మాట్లాడడం కన్నా వినడమే మరింత చెడ్డది” అని స్టీఫన్‌ ఎమ్‌. వైలన్‌ అనే రచయిత అంటున్నారు. అది ఎందుకని? “ప్రేక్షకుడిలా ఆతురతగా వింటూ ఉండడం ద్వారా, మీరు మాట్లాడే వ్యక్తి అలాగే చెప్పుకుపోయేందుకు ప్రోత్సహిస్తున్నారన్నమాట” అని ఆయన అంటున్నారు.

మీ చెవులకు ఇతరుల గురించిన హానికరమైన మాటలు వినిపించినప్పుడు మీరు ఏమి చేయాలి? స్వయంగా నీతిమంతులు అని చూపించుకున్నట్లుగా గాక, ‘మనం వేరే ఏమన్నా మాట్లాడుకుందాం,’ అనో ‘ఈ విషయం గురించి మాట్లాడుకోవడం నాకు ఏదో అసౌకర్యంగా అనిపిస్తుంది. ఆమె తన గురించి సమర్థించుకోవాలన్నా ఇక్కడ లేదు కదా’ అనో అనవచ్చు.

మీరు వాళ్ళ సంభాషణల్లో కలవడానికి నిరాకరిస్తున్నందుకు ప్రజలు మీ నుండి దూరంగా ఉంటే అప్పటి మాటేమిటి? ఒక రకంగా అది మీకు రక్షణగా పనిచేస్తుంది. ఎలా? ఒక వ్యక్తి ఇతరుల గురించి మీతో మాట్లాడుతున్నాడంటే, అతడే మీ గురించి ఇతరులతో మాట్లాడవచ్చని గుర్తుంచుకోండి. కనుక, తమ మాటలతో ఇతరుల పేరుకు భంగం కలిగించని పెద్దవాళ్ళతోనైనా, చిన్నవాళ్ళతోనైనా సన్నిహిత సంబంధాలను పెట్టుకోవడం ద్వారా ఎన్నో బాధలను మీరు తప్పించుకోవచ్చు. “ఇతరుల గురించిన మాటల్లో దిగకపోవడం వల్ల మీరు ఎంత బాధపడవలసి వచ్చినా, మిమ్మల్ని మీరు బాధాకరమైన పరిస్థితిలోకి ఈడ్చుకునే పరిస్థితిని మీరు నివారించుకోగల్గారే తప్ప మరేమీ నష్టపోలేదని మీరు చూడగల్గుతారు. మీరు నమ్మదగిన వ్యక్తిగా మంచి పేరును సంపాదించుకుంటారు గనుక, చివరికి మీరు మంచి స్థానంలో ఉంటారు” అని వైలన్‌ అంటున్నారు.

అన్నింటికంటే ముఖ్యంగా, మీరు దేవుడి ముందు మంచి పేరు సంపాదించుకుంటారు. మనం ఇతరులతో ఏ విధంగా మాట్లాడుతాం అనే విషయాన్ని ఆయన పట్టించుకుంటాడు. అందుకే, “మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటనుగూర్చియు విమర్శదినమున లెక్క చెప్పవలసియుండును. నీ మాటలనుబట్టి నీతిమంతుడవని తీర్పునొందుదువు, నీ మాటలనుబట్టియే అపరాధివని తీర్పునొందుదువు” అని యేసుక్రీస్తు హెచ్చరించాడు.—మత్తయి 12:36, 37.

“పరులజోలికి పోక, మీ సొంతకార్యములను జరుపుకొనుట యందు . . . ఆశకలిగి యుండవలె”నని అపొస్తలుడైన పౌలు ఇచ్చిన ఉద్బోధను అనుసరించడం బుద్ధిపూర్వకమైన పని. (1 థెస్సలొనీకయులు 4:10-12) మీరు ఆ విధంగా చేయడం, మీరు ఇతరులతో సత్సంబంధాలను కొనసాగించేందుకు అలాగే, దేవుడి ఎదుట మంచి స్థానాన్ని సంపాదించేందుకూ మీకు సహాయపడుతుంది.

[అధస్సూచీలు]

a ఈ శీర్షికలోని కొన్ని పేర్లు మార్చబడ్డాయి.

[22వ పేజీలోని బాక్సు]

ప్రపంచమంతటిలో ఇతరుల గురించి అత్యధికంగా మాట్లాడే యంత్రం

లేటెస్ట్‌ వార్త విన్నారా? ఎలక్ట్రానిక్‌ మెయిల్‌ను, అంటే ఇ-మెయిల్‌ను కనిపెట్టడంతో, ఇతరుల గురించిన కబుర్లు హై టెక్నాలజీలోకి కూడా రంగప్రవేశం చేశాయి. వాస్తవానికి, సేత్‌ గాడన్‌ అనే రచయిత ఇ-మెయిల్‌ని “ప్రపంచమంతటిలో, ఇతరుల గురించి అత్యధికంగా మాట్లాడే యంత్రం” అని పిలిచాడు. దానివల్ల కలిగే ప్రయోజనాలను ఒకవైపు నుండి అంగీకరిస్తూనే, మరో వైపు, “ఎవరైనా ఒకరు ఒక వాస్తవాన్ని గానీ, లేక తప్పుడు వార్తను గానీ అందించడం మొదలుపెట్టవచ్చు, త్వరలోనే వేలాది మంది ఆ వార్తను రహస్యమన్నట్లుగా అందుకుంటారు” అని హెచ్చరిస్తున్నాడు.

ఇ-మెయిల్‌ చాలా మంది ప్రేక్షకులను చేరుకోగలదు—చాలా త్వరగా చేరుకోగలదు. “కావలసిన, ప్రాముఖ్యమైన సమాచారాన్ని అతి వేగంగా వ్రాసి, టెలిఫోన్‌ అంత త్వరగా చేరవేసే మొట్టమొదటి కమ్యూనికేషన్‌ పద్ధతి ఇది” అని గాడన్‌ అంటున్నాడు. కనుక జ్ఞానాన్ని ఉపయోగిస్తూ, ఇ-మెయిల్‌ను పంపేటప్పుడు, మీ సందేశం యొక్క లక్ష్యం స్పష్టంగా ఉండేలా చూసుకోండి. ఏది ఏమైనా, రూఢిగా తెలియని విషయాలను స్నేహితులకు తెలియజేయకండి.

[21వ పేజీలోని చిత్రాలు]

ఇతరుల గురించి మీతో మాట్లాడే వ్యక్తే . . . మీ గురించి ఇతరులతో మాట్లాడవచ్చు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి