బానిసత్వపు జుగుప్సాకరమైన గతాన్ని దర్శించడం
ఆఫ్రికా దేశంలోని సెనెగల్ తీరానికవతల డాకార్ సమీపాన ఉంది ఈల్ డ గోరే దీవి. 312 సంవత్సరాలపాటు, అంటే 1848 వరకు, ఈ దీవి బానిసల వ్యాపారకేంద్రంగా వర్ధిల్లింది. కేవలం 1763 నుండి 1775 వరకు, 1,03,000 కన్నా ఎక్కువ మంది బానిసలను గోరే నుండి నాన్టేస్ పోర్ట్ ద్వారా అమ్మివేయడం జరిగిందని ఫ్రెంచ్ పోర్ట్ అయిన నాన్టేస్లో దొరికిన ప్రాచీన పత్రాలు చూపిస్తున్నాయి.
నేడు రోజుకు సరాసరి 200 మంది సందర్శకులు స్లేవ్ హౌస్ మ్యూజియమ్ అయిన మేసన్ డస్ యేజక్లావ్స్ను సందర్శిస్తారు. నిస్సహాయులైన బానిసలు అనుభవించిన కొన్ని భయంకరమైన విషయాలను టూర్ గైడ్ అయిన యోసఫ్ డ్యయ వివరించి చెప్పారు: “మా పూర్వీకులను తీసుకువెళ్ళారు. వాళ్ళ కుటుంబ సభ్యులు వేరుచేయబడ్డారు, వాళ్ళ ఒంటిపై ఎద్దులకు వేసినట్లుగా ఇనుప ముద్రలను కాల్చి గుర్తులు వేసేవారు.” కుటుంబాలకు కుటుంబాలనే సంకెళ్ళతో చేరవేసేవారు. “అమ్మను అమెరికాకైతే, నాన్నను బ్రెజిల్‌కు, పిల్లలను ఆన్టిలీస్కు అలా పంపించేవారు” అని గైడ్ చెప్పాడు.
“మగవాళ్ల బరువు చూసిన తర్వాత వాళ్ళ వయస్సూ, వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలను బట్టి వెలకట్టబడేది. కొన్ని ప్రత్యేక తెగలవారికి వారి శారీరక దారుఢ్యాన్ని బట్టి, లేదా వాళ్ళు చేయగల పనులనుబట్టి వాళ్ళకు వెలకట్టబడేది. ఉదాహరణకు, యెరూబాలనే తీసుకుంటే, ‘స్టాలియన్’ గుర్రాలకు మల్లే వాళ్ళకు వెలకట్టబడేది.”
తక్కువ బరువుగల బానిసలను వేలం వేసే ముందు బాతులకు మల్లే బొద్దుగా కనిపించేందుకు వాళ్ళకు ఒళ్ళు వచ్చేలా చేసేవారు. బానిస వ్యాపారులు తమ లైంగిక కోరికల కోసం ప్రతి రాత్రి ఉపయోగించుకునేందుకు బానిసలైన యువతులను ఎంపిక చేసుకునేవారు. తిరగబడినవారిని మెడకు ఉరివేసే బదులు, రొమ్ముదగ్గర వ్రేలాడదీసేవారు. ఆ విధంగా వాళ్ళు నానాయాతనలను చాలాసేపు భరించవలసి వచ్చేది.
1992లో పోప్ జాన్ పాల్ II గోరేనీ సందర్శించారు. “ఆయన బానిసల వ్యాపారం జరిగినందుకు విచారాన్ని వ్యక్తం చేశారు. ఆఫ్రికావాళ్ళ బానిసత్వాన్ని జీవితంలో మామూలు భాగంగా అంగీకరించిన క్యాథలిక్ మిషనరీలతోసహా దానిలో భాగం వహించినవాళ్ళందరి కోసం ఆయన క్షమాపణ కోరాడు” అని ద న్యూయార్క్ టైమ్స్ నివేదించింది.
అయినప్పటికీ, జరిగిన విషయాన్ని అంగీకరించేందుకు అందరూ సిద్ధంగా లేరు. రెండున్నర సంవత్సరాల క్రితం, నాన్టేస్ రికార్డులు వెలుగులోకి రాకముందు, గోరేలో ప్రతి సంవత్సరం కేవలం 200 నుండి 500 మంది బానిసలను మాత్రమే అమ్మడం జరిగేదని ఒక ఫ్రెంచ్ జెస్యూట్ నొక్కిచెప్పాడు. ఇప్పటి వరకు, “లోకం ఈ ఘోరకృత్యాలతో ఏకీభవించలేకపోయింది” అని మిస్టర్ డ్యయ అభిప్రాయపడుతున్నారు.
[23వ పేజీలోని చిత్రసౌజన్యం]
Gianni Dagli Orti/Corbis
Yann Arthus-Bertrand/Corbis
Reproduced from DESPOTISM —A Pictorial History of Tyranny