దేవుని సంకల్పం ఏమిటి?
సర్వశక్తి గల, ప్రేమ గల దేవుడు ఉన్నాడని నమ్మని అనేకమంది ప్రజలు ఇలా అడుగుతారు: దేవుడే ఉంటే, చరిత్రంతటిలో ఇంతటి బాధను, దుష్టత్వాన్ని ఆయన ఎందుకు అనుమతించాడు? మన చుట్టూ ఉన్న ఈ దుఃఖమయ పరిస్థితిని ఆయనెందుకు ఆనుమతిస్తున్నాడు? భూమి మీది అనేక దేశాల్లో యుద్ధం, నేరం, అన్యాయం, పేదరికం, విపరీతంగా పెరిగిపోతున్న ఇతర దుఃఖమయ పరిస్థితులకు దేవుడు ముగింపును ఎందుకు తీసుకురావడం లేదు?
దేవుడు విశ్వాన్ని సృష్టించి, భూగ్రహంపై మానవులను ఉంచి, ఆయన వారిని తమ స్వంత కార్యకలాపాలకు విడిచిపెట్టేశాడని కొందరు అభిప్రాయపడతారు. ఈ అభిప్రాయం ప్రకారం చూస్తే, ప్రజల దురాశ వల్ల లేదా పనులను సరిగా నిర్వహించలేక పోవడం వల్ల వారు తెచ్చుకొనే కష్టాలకు, బాధలకు దేవుడు ఎంత మాత్రం నిందార్హుడు కాడు.
అయితే, మరి కొంతమంది ఇటువంటి సిద్ధాంతాన్ని నిరాకరిస్తారు. ఉదాహరణకు భౌతికశాస్త్ర ప్రొఫెసర్ అయిన కాన్యర్స్ హెరింగ్ దేవుడున్నాడని నమ్ముతూ ఇలా అన్నాడు: “దేవుడు ఎంతో కాలం క్రితం, స్ప్రింగు చుట్టిపెట్టివున్న గడియారాన్ని పోలిన ఒక గొప్ప వ్యవస్థను గమనంలో ఉంచి, మానవజాతి సమస్యలతో సతమతమవుతుంటే ఒక ప్రేక్షకుడిలా చూస్తూ కూర్చున్నాడని అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే, స్ప్రింగు చుట్టిపెట్టివున్న ఒక గడియారంలాంటి నమూనా వలె విశ్వం ఉంటుందని చెప్పే ఎటువంటి వివరణలు కూడా అవే ఖచ్చితమైనవని, చిట్టచివరివని నమ్మడానికి నా వైజ్ఞానిక అనుభవం ఏ విధమైన కారణాన్ని ఇవ్వకపోవడమే. మన వైజ్ఞానిక సిద్ధాంతాలు . . . మరింత అభివృద్ధి చెందుతూనే ఉంటాయి, అయినా, అవి ఎల్లప్పుడూ అపరిపూర్ణమని తేలతాయని నేను భావిస్తున్నాను. అయితే, ఈ అభివృద్ధిని సాధ్యపర్చే ఒక జీవశక్తిపై నమ్మకముంచడం జ్ఞానయుక్తమని నేను భావిస్తున్నాను.”
దేవునికి ఒక సంకల్పం ఉంది
దేవుని ఆదిసంకల్పం ఈ భూగ్రహమంతా నీతిమంతులు, పరిపూర్ణులైన మానవులతో నిండాలన్నదే. ప్రవక్తయైన యెషయా ఇలా వ్రాశాడు: “ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు; ఆయన భూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిరపరచెను నిరాకారముగానుండునట్లు ఆయన దాని సృజింప లేదు నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను.”—యెషయా 45:18.
మానవులందరినీ ఒకేసారి సృష్టించి భూమిని నింపడానికి బదులుగా, దేవుడు సంతానోత్పత్తి ద్వారా ఈ భూమి నింపబడాలని సంకల్పించాడు. ఆదాము, హవ్వలు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు అది ఆయన ఆదిసంకల్పాన్ని వ్యర్థం చేయలేదు గానీ, మానవజాతి మరియు భూమి విషయంలో తన సంకల్పాన్ని నెరవేర్చేందుకు కొన్ని సర్దుబాట్లు చేయవలసిన అవసరాన్ని ఏర్పరిచింది.
ఇందుమూలంగా ఇప్పటికి 6,000 సంవత్సరాలపైగా కాలాన్ని, మానవజాతి తాను లేకుండా తమ సొంత మార్గనిర్దేశకంలో తమను తాము నడిపించుకొనేలా దేవుడు అనుమతించాడు. మన ఆది తల్లిదండ్రులు తమ సొంత స్వేచ్ఛాచిత్తంతో ఎన్నుకున్నది అదే. (ఆదికాండము 3:17-19; ద్వితీయోపదేశకాండము 32:4, 5) దేవుని నడిపింపు నుండి స్వాతంత్ర్యాన్ని అనుమతించడం, అటుతర్వాత దేవునికి బదులుగా మానవుడు పరిపాలించడం అనేవి, మానవుడు తన సొంత మార్గాలను అనుసరించడంలోని, తన తోటి మానవులను విజయవంతంగా పరిపాలించడంలోని అసమర్థతను వెల్లడిచేయనై ఉన్నాయి.
ఈ పరిణామం యెహోవాకు ముందుగానే తెలుసు. అందుకే దాన్ని వ్రాసేలా ఆయన తన బైబిలు రచయితలను ప్రేరేపించాడు. ఉదాహరణకు ప్రవక్తయైన యిర్మీయా ఇలా వ్రాశాడు: “యెహోవా, తమ మార్గమునేర్పరచుకొనుట నరులవశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును.”—యిర్మీయా 10:23.
మానవులు తమ తోటి మానవులపై అధికారం చెలాయించడం వల్ల సంభవించే గొప్ప విపత్తులను గూర్చి జ్ఞానియైన సొలొమోను వ్యాఖ్యానించాడు, శతాబ్దాలుగా జరుగుతున్నదదే. ఆయనిలా అన్నాడు: “సూర్యుని క్రిందజరుగు ప్రతి పనినిగూర్చి నేను మనస్సిచ్చి యోచన చేయుచుండగా ఇదంతయు నాకు తెలిసెను. మరియు ఒకడు మరియొకనిపైన అధికారియై తనకు హాని తెచ్చుకొనుట కలదు.”—ప్రసంగి 8:9.
అయితే, దేవుడు “మానవజాతి సమస్యలతో సతమతమవుతుంటే ఒక ప్రేక్షకుడిలా చూస్తూ కూర్చున్నాడని” అనడం వాస్తవం కాదు. అత్యధిక శాతం మానవజాతి జీవితాలలో ప్రత్యక్షంగా జోక్యం చేసుకోకుండా గడుస్తున్న వేలాది సంవత్సరాలను అనుమతించడానికి సర్వశక్తిగల దేవునికి తగిన కారణం ఉంది.
ఒక శ్రేష్టమైన సంకల్పం నెరవేరింది
సగటున 100 కంటే తక్కువ సంవత్సరాలుగల మన జీవితకాలంతో పోల్చి చూస్తే గడిచిన 6,000 సంవత్సరాల మానవచరిత్ర చాలా ఎక్కువకాలంగా మనకు అన్పించవచ్చు. కానీ, దేవుని కాలపట్టిక ప్రకారం, కాలగమనాన్ని గూర్చిన ఆయన దృక్కోణం ప్రకారం, ఈ వేల సంవత్సరాలు ఆరు రోజులుగానే ఉన్నాయి—అంటే, వారం కంటే తక్కువే ! అపొస్తలుడైన పేతురు ఇలా వివరించాడు: “ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యసంవత్సరములవలెను, వెయ్యసంవత్సరములు ఒక దినమువలెను ఉన్నవి.”—2 పేతురు 3:8.
దేవుని పక్షంగా నిర్లక్ష్యం, జాప్యం ఉందనేటటువంటి నిందలను ఖండిస్తూ పేతురు ఇలా జత చేశాడు: “కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యచ్ఛయంపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల దీర్ఘశాంతముగలవాడై యున్నాడు.”—2 పేతురు 3:9.
కాబట్టి, నియమించబడిన సంవత్సరాలు ముగింపుకు వచ్చినప్పుడు సృష్టికర్త మన సుందరమైన గ్రహంపై జరుగుతున్న నిర్వహణా లోపానికి ముగింపును తీసుకువస్తాడు. ఆ అంతం వచ్చే సమయానికల్లా, పరిపాలించడంలోనూ యుద్ధం, హింస, పేదరికం, అస్వస్థత, మరితర బాధలకు ముగింపును తీసుకురావడంలోనూ, మానవుడు తన అసమర్థతను చూపించుకునేంత సమయాన్ని ఆయన అనుమతించి ఉంటాడు. ఆయన మానవులకు ఆరంభంలో సూచించిన దానిని అంటే, వారు సఫలీకృతులవ్వాలంటే వారు దైవిక నడిపింపును తప్పనిసరిగా అనుసరించాలని సూచించిన దానిని దేవుడు ఇంతవరకు సమయాన్ని అనుమతించడం వల్ల కలిగిన వాస్తవిక అనుభవం ధృవీకరిస్తుంది.—ఆదికాండము2:15-17.
బైబిలు ప్రవచన నెరవేర్పుకు అనుగుణంగా, ఇప్పుడు మనం ఈ భక్తిహీన విధానపు “అంత్యదినము”ల చివరి భాగంలో జీవిస్తున్నాము. (2 తిమోతి 3:1-5, 13; మత్తయి 24:3-14) దేవుని జోక్యం లేకుండా జరుగుతున్న మానవ నిర్వహణ విషయంలోను అలాగే దుష్టత్వం, బాధల విషయాల్లోను ఆయన సహనానికి ముగింపు సమీపిస్తుంది. (దానియేలు 2:44) మనమెన్నడూ కనీవినీ ఎరుగని గొప్ప శ్రమలు ఈ ప్రపంచం మీదికి రాబోతున్నాయి. అది అర్మగిద్దోను అని పిలువబడిన “సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధము”తో ముగుస్తుంది. (ప్రకటన 16:14, 16) దేవుని నడిపింపు క్రింద ఉన్న ఈ యుద్ధం దేవుని చేతిపనియైన భూమిని నాశనం చేయదు గానీ, “భూమిని నశింపజేయువారిని నశింపజే[స్తుంది].”—ప్రకటన 11:18.
వెయ్యేండ్ల దేవుని రాజ్యం
అర్మగిద్దోను జరిగిన తర్వాత తప్పించబడిన లక్షలాదిమంది ప్రజలు భూమి మీద ఉంటారు. (ప్రకటన 7:9-14) అప్పుడు సామెతలు 2:21, 22 లోని ఈ ప్రవచనం నెరవేరుతుంది: “యథార్థవంతులు దేశమందు నివసించుదురు లోపములేనివారు దానిలో నిలిచియుందురు. భక్తిహీనులు దేశములో నుండకుండ నిర్మూలమగుదురు. విశ్వాసఘాతకులు దానిలోనుండి పెరికివేయబడుదురు.”
దేవుని సంకల్పం ప్రకారం, నీతియుక్తమైన అర్మగిద్దోను యుద్ధం తర్వాత వెయ్యేండ్లు అనే ఒక ప్రత్యేక కాలం ఉంటుంది. (ప్రకటన 20:1-3) వెయ్యేండ్ల పరిపాలనలో దేవుని పరలోక రాజ్యానికి రాజుగా దేవుని కుమారుడైన క్రీస్తుయేసు నియమించబడతాడు. (మత్తయి 6:10) భూమి అంతటి పైనా జరుపబడే ఆనందభరిత రాజ్య పరిపాలనా కాలంలో కోటానుకోట్ల మంది మరణ నిద్ర నుండి పునరుత్థానం చెంది అర్మగిద్దోను నుండి తప్పించబడిన లక్షలాదిమందితో కలుస్తారు. (అపొస్తలుల కార్యములు 24:15) వాళ్ళందరూ పరిపూర్ణతకు తిరిగి తీసుకురాబడతారు, తర్వాత—క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనా కాలం చివరిలో—చివరిగా, భూమి అంతా ఆదాము హవ్వల సంతానమైన పరిపూర్ణ స్త్రీ, పురుషులతో నింపబడుతుంది. దేవుని సంకల్పం మహిమాన్వితంగాను, విజయవంతంగాను నెరవేరుతుంది.
అవును, దేవుని సంకల్పం ఏమిటంటే, ‘వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేసి, మరణము లేకుండా, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక లేకుండా’ చేయడం. ‘మొదటి సంగతులు గతించిపోయెను, అప్పుడు సింహాసనాసీనుడైయున్నవాడు—ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను.’ (ప్రకటన 21:4, 5) వైఫల్యం చెందకుండా, ఆ సంకల్పం సమీప భవిష్యత్తులో నెరవేరబోతోంది.—యెషయా 14:24, 27.
[5వ పేజీలోని చిత్రం]
దేవుని నూతనలోకంలో ప్రజలు నిరంతరము సంతోషంగా ఉంటారు.