దేవుడు ఉనికిలో ఉన్నాడా?—కొందరు శాస్త్రవేత్తల సమాధానం
మస్సాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని భౌతికశాస్త్ర ప్రొఫెసర్ అయిన ఊల్రిక్ జె. బెకర్ దేవుని ఉనికిని గూర్చి వ్యాఖ్యానిస్తూ ఇలా అన్నాడు: “ఒక సృష్టికర్త లేకుండా నేనెలా ఉనికిలోకి రాగలిగాను? దేవుడు లేడని నన్ను ఒప్పింపజేసే సమాధానాన్ని నేనెప్పుడూ పొందలేదు.”
ఇది ఆయన వైజ్ఞానిక దృక్కోణానికి విరుద్ధమైనదా? ఆలోచనను రేకెత్తించే ప్రొఫెసర్ సమాధానమేమిటంటే, “గడియారంలోని ఒక చక్రం ఎలా తిరుగుతుందో మీరు కనుగొన్నప్పుడు—గడియారంలోని మిగిలిన చక్రాలు ఎలా తిరుగుతాయో మీరు ఊహించగలరు, అయితే, ఆ ఊహకు శాస్త్రవిజ్ఞానం అని పేరు పెట్టరు. కాబట్టి, అందులోని స్ప్రింగును అక్కడ ఎవరు చుట్టిపెట్టారన్న ప్రశ్న కోసం లోతుగా వెళ్ళనవసరం లేదు.”
కొందరి అభిప్రాయానికి విరుద్ధంగా, అనేకమంది శాస్త్రవేత్తలు దేవుడు ఉన్నాడన్న విషయాన్ని—ఈ విశ్వం, మానవుడి సృష్టి వెనుక ఒక గొప్ప మేధాశక్తి గల వ్యక్తి ఉన్నాడన్న విషయాన్ని త్రోసిపుచ్చరు.
ఈ అంశం మీద మరొక రెండు ఉదాహరణలను పరిశీలిద్దాం. ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలోని గణితశాస్త్ర ప్రొఫెసర్ అయిన జాన్ ఇ. ఫోర్నెస్ను దేవుని ఉనికిని గూర్చి ఆయన అభిప్రాయాన్ని అడిగినప్పుడు ఆయనిలా సమాధానమిచ్చాడు: “దేవుడున్నాడని, ఈ విశ్వంలోని మూలక కణాలనుండి, జీవం గల వాటి నుండి, గేలక్సీల సమూహాల వరకు, ఉన్న వాటినన్నిటినీ ఆయనే నిర్మించాడని నేను నమ్ముతాను.”
యేల్ విశ్వవిద్యాలయంలోని భౌతికశాస్త్ర ప్రొఫెసర్ అయిన హెన్రీ మోర్గెనావ్ ప్రకృతి నియమాలన్నీ దేవునిచే సృష్టించబడ్డాయని విశ్వసిస్తున్నట్లు చెప్తూ, ఆయనిలా జతచేశాడు: “శూన్యంలో నుండి దేవుడు ఈ విశ్వాన్ని సృష్టించి, ఈ విశ్వంతో పాటు కాలాన్ని కూడా ఉనికిలోకి తీసుకువచ్చాడు.” ఇంకా, ద మిస్టరీ ఆఫ్ లైఫ్స్ ఆరిజిన్ అనే పుస్తకంలో ముగ్గురు శాస్త్రవేత్తలు జీవ ఆవిర్భావానికి సహేతుకమైన సమాధానం దేవుడే అని వివరించారని ఆయన అన్నాడు. ఈ అభిప్రాయానికి మద్దతునిస్తూ ఖగోళశాస్త్రవేత్త అయిన ఫ్రెడ్ హోయిల్, మొట్టమొదటి కణం దానంతటదే ఉనికిలోకి వచ్చిందని నమ్మడం, చెత్తలో చిందరవందరగా ఉన్న 747 విమానపు భాగాలు సుడిగాలి వచ్చినప్పుడు ఆ భాగాలన్నీ ఒకదానితో ఒకటి అతుక్కుపోయి ఒక 747 విమానం తయారయ్యిందని నమ్మడంలా ఉందని అన్నాడు.
వీరి సమాధానాలకు బైబిలు రచయితయైన పౌలు మాటలను జతపరచగలం: “[దేవుని] అదృశ్యలక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై యున్నారు.”—రోమీయులు 1:20.
అవును, దేవుడు నిజంగానే ఉనికిలో ఉన్నాడు! అయితే, ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న దుఃఖమయ పరిస్థితిని అనుమతిస్తున్నందుకు ఆయనకు గల కారణం ఏమిటి? భూమిని గూర్చి ఆయన సంకల్పం ఏమిటి? సత్యదేవుడెవరో మనం ఖచ్చితంగా తెలుసుకోగలమా?
[3వ పేజీలోని చిత్రం]
“గడియారంలోని ఒక చక్రం ఎలా తిరుగుతుందో మీరు కనుగొన్నప్పుడు—గడియారంలోని మిగిలిన చక్రాలు ఎలా తిరుగుతాయో మీరు ఊహించగలరు, . . . కాబట్టి, అందులోని స్ప్రింగును అక్కడ ఎవరు చుట్టిపెట్టారన్న ప్రశ్న కోసం లోతుగా వెళ్ళనవసరం లేదు”