యువత ఇలా అడుగుతోంది . . .
నేను దూరంగా ఉన్నప్పటికీ నాకోర్ట్షిప్ను ఎలా కొనసాగించగలను?
“నేనప్పుడే యెహోవాసాక్షుల అంతర్జాతీయ సమావేశానికి హాజరౌతున్న ప్రతినిధుల గుంపుతోపాటు వాళ్లుంటున్న హోటల్‌కు వెళ్లివస్తున్నాను. నేను ఇంటికి వెళ్లిపోబోతుండగా మరో గుంపు నాకు ప్రక్కగా వెళ్తుంది. వాళ్లతో నేను మాట్లాడడానికని ఆగాను, అప్పుడు ఓడెట్‌ను చూశాను. అదే వారంలో మా దార్లు మళ్లీ కలిశాయి. మేము ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుకోవాలని నిర్ణయించుకున్నాము, లేఖలతో రెండు సంవత్సరాలు ఒకర్నొకరం తెలుసుకున్న తర్వాత మేము కోర్ట్‌షిప్ ప్రారంభించాము.”—టోనీ.
ప్రపంచం చాలా చిన్నదైపోయింది. ఇటీవలి దశాబ్దాల్లో విమాన ప్రయాణం ఖర్చు తగ్గడం, భూగోళం అంతా అల్లుకుని ఉన్న టెలిఫోన్ నెట్వర్క్, తపాలా వేగాన్ని అందుకోవడం, ఇంకా ఇంటర్నెట్ వంటి కారణాల మూలంగా ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కాయి. వందల చివరికి వేల కిలోమీటర్ల దూరాన ఉన్నప్పటికీ, కోర్ట్షిప్ను కొనసాగిద్దామన్న తలంపు ఆకర్షణీయంగా అన్పించవచ్చు—ప్రాముఖ్యంగా తనుంటున్న ప్రాంతపు వ్యక్తితో వివాహం చేసుకునే అవకాశాలు తక్కువగా ఉన్నప్పుడు ఈ తలంపు బాగున్నట్టు అన్పించవచ్చు.
దూరంగా ఉంటూనే కోర్ట్‌షిప్ కొనసాగించడం కొన్ని జంటలకు ఆశీర్వాదంగానే పరిణమించింది. “మేము 16 సంవత్సరాలుగా ఆనందప్రదమైన వివాహాన్ని అనుభవిస్తున్నాము” అని టోనీ అంటున్నాడు. దూరంగా ఉంటూనే కోర్ట్షిప్ను కొనసాగించడం మూలంగా శారీరక ఆకర్షణ అనే అంధులను చేసే శక్తికి దూరంగా ఉండి ఒకర్నొకరు తెలుసుకునే ప్రయోజనాన్ని కలుగజేస్తుందని కూడా కొంతమంది వాదిస్తారు. అయితే దానికున్న ప్రయోజనాల మాట ఎలాగున్నా దూరంగా ఉంటూనే కోర్ట్షిప్ను కొనసాగించడంలో దానికైన కొన్ని సవాళ్లు ఉన్నాయి.
ఒకర్నొకరు తెలుసుకోవడం
మీరు వివాహం చేసుకోవాలని అనుకుంటున్న వ్యక్తిని గురించి సాధ్యమైనంత ఎక్కువగా తెలుసుకోవడం మంచిది. అయితే, ఫ్రాంక్ అనే ఒక భర్త తన స్వంత అనుభవం నుండి “అసలు వ్యక్తిని, అంటే ‘హృదయపు అంతరంగ స్వభావము’ను తెలుసుకోవడం సులభం కాదు” అని అంటున్నాడు. (1 పేతురు 3:4) దూరంగా ఉంటూనే డేటింగ్ చేసిన డగ్ అనే మరో క్రైస్తవుడు ఈ విషయాన్ని అంగీకరిస్తున్నాడు: “సింహావలోకనం చేసుకుంటే, మేం ఒకర్నొకరం అంత బాగా తెలుసుకోలేదని నాకు అవగతమౌతుంది.”
వందల కిలోమీటర్ల అవతల లేదా వేల కిలోమీటర్ల దూరాన ఉన్న ఒక వ్యక్తిని గురించి తెలుసుకోవడం నిజంగా సాధ్యమేనా? సాధ్యమే, కానీ దానికి అసాధారణమైన ప్రయత్నం అవసరం అవుతుంది. “మా దగ్గర ఫోన్ చేయడానికి డబ్బులు లేకపోయాయి, అందుకని మేము వారానికి ఒకసారి ఉత్తరాలు వ్రాసుకున్నాము” అంటున్నాడు డగ్. అయితే, జోవాన్ ఫ్రాంక్‌లు ఉత్తరాలు వ్రాసుకోవడం అంతగా సరిపోయినట్లు లేదని అనుకున్నారు. “మేం మొదట్లో ఉత్తరాలు వ్రాసుకున్నాము, తర్వాత ఫోన్లు చేసుకోవడం ప్రయత్నించి చూశాము” అంటుంది జోవాన్. “అప్పుడు ఫ్రాంక్ నాకో చిన్న టేప్‌రికార్డరు పంపించాడు. మేము ప్రతివారం ఒక్కొక్క క్యాసెట్టు రికార్డు చేసుకుని పంపుకునేవాళ్లం.”
నిజాయితీ, ఏకైక పద్ధతి
మీరు కమ్యూనికేషన్‌కి ఉపయోగించే పద్ధతి ఏదైనప్పటికీ నిజాయితీగా ఉండడం ప్రాముఖ్యం. “మీరు అబద్ధమాడితే, అది తర్వాత వెలుగులోనికి వస్తుంది. మీ బంధాన్ని దెబ్బతీస్తుంది” అని ఎస్తర్ అనే ఒక క్రైస్తవ భార్య చెబుతుంది. “ఒకరిపట్ల ఒకరు నిజాయితీగా ఉండండి. మీతో మీరు కూడా నిజాయితీగా ఉండండి. మీరిద్దరూ ఏదైనా విషయంపై ఏకాభిప్రాయానికి రాకపోతే దాన్ని అలాగే వదిలేయకండి. దాని గురించి చర్చించండి” అని ఆమె అంటుంది. అపొస్తలుడైన పౌలు మంచి సలహా ఇస్తున్నాడు: “ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను.”—ఎఫెసీయులు 4:25; పోల్చండి హెబ్రీయులు 13:18.
మీరు తప్పకుండా చర్చించవలసిన కొన్ని విషయాలు ఏవి? కోర్ట్‌షిప్ చేస్తున్న జంటలన్నీ తమ లక్ష్యాలూ, పిల్లలూ, ఆర్థిక విషయాలూ, ఆరోగ్యమూ వంటి విషయాలన్నింటి గురించీ చర్చించుకోవల్సిన అవసరం ఉంది. అయితే, మరింత అవధానం అవసరమయ్యే విషయాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, మీరిద్దరూ వివాహమాడితే మీలో ఒకరు—లేదా ఇద్దరూ—తమ ప్రాంతాన్ని విడవాల్సి వస్తుంది. మీరు అలా చేయడానికి మానసికంగా, భావోద్వేగపరంగా సుముఖంగా ఉన్నారా, అది సాధ్యమౌతుందా? సుముఖంగా ఉన్నారనీ సాధ్యమౌతుందనీ మీరెలా చెప్పగలరు? మీరు ఇంతకు మునుపు ఎక్కడికన్నా కదిలివెళ్లారా, లేదా చాలా కాలంపాటు మీ కుటుంబం నుండి దూరంగా ఉన్నారా? జోవాన్‌కి కాబోయే భర్త తామిద్దరూ ఈ పత్రికను ప్రచురించే వాచ్ టవర్ సొసైటీ హెడ్‌క్వార్టర్స్‌లో స్వచ్ఛంద సేవకులుగా పనిచేయాలని ఇచ్ఛయించాడు. “నీవు ఒక చిన్న గదిలో నాతో జీవించగలవా, చిన్న మొత్తంతో సరిపెట్టుకోగలవా?” అని తనను అడిగినట్లు గుర్తుతెచ్చుకుంటుంది జోవాన్. “మేము ఈ విషయమై దాపరికం లేకుండా మాట్లాడుకోవల్సి వచ్చింది.”
వేరే దేశంలో ఉండే వ్యక్తితో కోర్ట్‌షిప్ చేస్తున్నట్లైతే, మరో సంస్కృతికి అలవాటు పడ్డానికి ఇష్టపడుతున్నారా? “మీరు ఇప్పటికే ప్రతిదినం ఒకరి సంస్కృతిని మరొకరు ఆనందంగా అనుభవించగల్గుతున్నారా?” అని అడుగుతున్నాడు ఫ్రాంక్. “మీ సంబంధం తొలిదశల్లో ఉన్నప్పుడే ఈ పెద్ద పెద్ద అంశాల గురించి చర్చించుకోండి. మీరెంత త్వరగా వీటి గురించి తెలుసుకుంటే అంత మంచిది—మీరు భావోద్వేగ పరంగా లేదా ఆర్థికంగా చాలా ఎక్కువగా పెట్టుబడి పెట్టేయకముందే తెలుసుకోవడం శ్రేయస్కరం.” అవును, ఏదో కొద్దిరోజుల పాటు టూరిస్టుగా వేరే సంస్కృతితో గడపడం వేరు, ఆ సంస్కృతిలో అనుదినమూ జీవించడం వేరు. మీరు మరో భాష నేర్చుకోవల్సి వస్తుందా? జీవన పరిస్థితుల్లో గొప్ప మార్పులకు మీరు సర్దుకుపోగలరా? మరో రకంగా చూస్తే, మీరు కేవలం ఆ వ్యక్తితో కన్నా ఎక్కువగా ఆ సంస్కృతితో ప్రేమలో పడ్డారా? మరో సంస్కృతిపట్ల అటువంటి ఆకర్షణ కాలగమనంలో బహుశ కొట్టుకుపోవచ్చు. కానీ వివాహం ఇద్దరు వ్యక్తుల్ని శాశ్వతంగా జతపరుస్తుంది.—మత్తయి 19:6.
టోనీ మనకు ఇలా వివరిస్తున్నాడు: “వేరే ఏదో దేశానికి చెందిన నాకు తెల్సిన ఒక అమ్మాయి కరీబియన్‌కు చెందిన ఒక అబ్బాయిని వివాహం చేసుకుంది. కానీ అక్కడి ద్వీపంలోని జీవితం కష్టంగా ఉన్నట్లు భావించింది. అక్కడ ఎప్పుడూ ఎండలు తీవ్రంగా ఉండేవి, ఆమె అస్వస్థురాలయ్యేది. ఆహారం కూడా వేరుగా ఉంది, ఆమెకు తన కుటుంబ సభ్యులు అస్తమానం గుర్తుకు వచ్చేవారు. అందుకని వారిద్దరూ ఆమె స్వదేశంలో జీవిద్దామని నిర్ణయించుకున్నారు. కానీ ఆయనకు అక్కడి జీవనశైలి చాలా మెటీరియలిస్టిక్‌గా ఉన్నట్లు అన్పించింది, తనకు తన కుటుంబ సభ్యులతో ఇరుగు పొరుగువారితో తాను ఇంతకు ముందు అనుభవించే సాన్నిహిత్యాన్ని కోల్పోయాడు. ఇప్పుడు వారిద్దరూ వేరుపడ్డారు; ఆయన తన స్వదేశంలోను ఆమె తన స్వదేశంలోను జీవిస్తున్నారు. వారిద్దరి పిల్లలు తమ తల్లిదండ్రుల ప్రేమా అవధానాలను కోల్పోతున్నారు.”
దూరంగా ఉన్న ఒక వ్యక్తిని వివాహం చేసుకోవడం బహుశ వేరే సంస్కృతికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకోవడం ఇతర సవాళ్లను కూడా ముందుంచుతుంది. ప్రయాణ ఖర్చులకూ ఉత్తరప్రత్యుత్తరాలకూ ఫోన్లకూ అయ్యే అదనపు ఖర్చును భరించడానికి సిద్ధంగా ఉన్నారా? లిడియా ఇలా జ్ఞాపకం చేసుకుంటుంది: “మేమిద్దరం చేసుకునే ఫోన్ కాల్స్‌కు ఖర్చు ఎక్కువైపోతుంది గనుక మనం పెళ్లి చేసుకోవల్సిందేనని ఫిల్ అప్పుడప్పుడూ జోక్ చేస్తుండేవాడు, కానీ ఇప్పుడు నేను మా అమ్మకు చేసే ఫోన్ కాల్స్‌కు డబ్బులు చెల్లించాల్సి వస్తుంది !” పిల్లలు పుడితే అప్పుడేమిటి? కొంతమంది పిల్లలు తమ స్వంత బంధువులు ఎవరో అంతగా తెలియకుండానే పెరుగుతారు, భాషలు వేరైవుండడం మూలంగా వారితో ఫోన్లో మాట్లాడడం కూడా సాధ్యపడదు! ఇంతగా చెప్పడంలో ఉద్దేశం, ఇటువంటి సమస్యల్ని అధిగమించడం సాధ్యం కాదని కాదు. కానీ ఎవరైనా అటువంటి వివాహంలోకి ప్రవేశించే ముందుగా తగులుబడిని చూసుకోవాలి.—లూకా 14:28 పోల్చండి.
ఆమె (లేక అతడు) నిజంగా ఎలాంటి వ్యక్తి?
మీరు కోర్ట్‌షిప్ చేస్తున్న స్నేహితుడు లేదా స్నేహితురాలు నిజంగా దాపరికం లేకుండా, నిజాయితీగాను ఉంటున్నదీ లేనిదీ మీకు ఎలా తెలుస్తుంది? “ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును” అంటుంది మత్తయి 7:17. కాబట్టి ఆయన క్రియలు ఏమిటి? ఆయన చెప్తున్నమాటల్ని ఆయన చేతలు బలపరుస్తున్నాయా? తాను భవిష్యత్తు కోసం కల్గివున్న లక్ష్యాలని చెప్పుకుంటున్నవాటిని ఆయన గతం మద్దతుపరుస్తుందా? “మేము ఒకరినొకరం తెల్సుకోవడానికైన ప్రయత్నంలో అన్నింటికన్నా ముందు మా ఆధ్యాత్మిక లక్ష్యాలను గురించి తెలుసుకున్నాము” అని ఎస్తర్ వివరిస్తుంది, “ఆయన గత ఎనిమిది సంవత్సరాలుగా పూర్తికాల సువార్త సేవకునిగా చేస్తున్నాడు. ఇది తానలాగే కొనసాగాలనుకుంటున్నాడని ఆయన అన్నప్పుడు ఆయన నిజాయితీగానే చెబుతున్నాడన్న నమ్మకాన్ని నాకు ఇచ్చింది.”
కానీ మీరు కోర్ట్‌షిప్ చేస్తున్న వ్యక్తి ఏదైనా విషయంలో తప్పించుకుంటున్నట్లు మాట్లాడుతున్నాడని మీకు అన్పించిందనుకోండి. అంతా బాగానే జరుగుతుందిలే అని అనుకుంటూ ఆ విషయాన్ని అక్కడితో వదిలేయకండి. కూపీ లాగండి ! ప్రశ్నించండి—ఎందుకు? ఒక సామెత ఇలా అంటుంది: “నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ల వంటిది. వివేకముగలవాడు దానిని పైకి చేదుకొనును.” (సామెతలు 20:5) “జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును. వివేకియైనవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును” అని హెచ్చరిస్తోంది మరో సామెత.—సామెతలు 14:15.
ముఖాముఖి
ఎంతైనా ఒక వ్యక్తిని గురించి మీరు ఉత్తరాల ద్వారా గానీ ఫోనులో గానీ తెల్సుకునేది చాలా తక్కువే. ఆసక్తికరమైన సంగతి ఒకటుంది, అపొస్తలుడైన యోహాను తన క్రైస్తవ సహోదరులకు కొన్ని ఉత్తరాలను వ్రాశాడు. ఈ ఉత్తరాలన్నీ తనకూ వారికీ మధ్యనున్న ఆప్యాయతానుబంధాన్ని బలపర్చినప్పటికీ యోహాను ఇలా అన్నాడు: “అనేక సంగతులు మీకు వ్రాయవలసియుండియు సిరాతోను కాగితముతోను వ్రాయ మనస్సులేక మీ సంతోషము పరిపూర్ణమవునట్లు మిమ్మును కలిసికొని ముఖాముఖిగా మాటలాడ నిరీక్షించుచున్నాను.” (2 యోహాను 12) అదే విధంగా, ఒక వ్యక్తితో ముఖాముఖిగా సమయాన్ని వెచ్చించడానికి మించింది ఏదీ లేదు. మీ ఇద్దర్లో ఒకరు తాత్కాలికంగా నివాసాన్ని మార్చి ఇద్దరూ మరింత దగ్గరగా ఉండడం కుదరవచ్చు. ఇలా ఇల్లు మారే వ్యక్తి తాను భవిష్యత్తులో ఉండబోయే క్రొత్త ఇంటి వాతావరణమూ జీవన పరిస్థితులూ అనుభవంలోనికి వచ్చే అవకాశం ఉంది.
మీరిద్దరూ కల్సి ఉండే సమయాన్ని సరిగ్గా ఎలా ఉపయోగించగలరు? ఒకరి గుణాలను మరొకరికి బయల్పర్చే పనుల్ని చేయండి. దేవుని వాక్యాన్ని కల్సి పఠించండి. సంఘ కూటాల్లోనూ, పరిచర్యలోనూ పాల్గొంటుండగా ఒకరినొకరు గమనించండి. శుభ్రం చేయడం, సామాన్లు తేవడం వంటి ఇంటి పనుల్ని కల్సి చేయండి. పనుల్తో బిజీగా ఉంటూ ఆ ఒత్తిడిలో అవతలి వ్యక్తి ఎలా ప్రవర్తిస్తుందో/స్తాడో చూడడం చాలా విషయాలు వెల్లడిచేస్తుంది.a
కాబోయే అత్తామామలతో కూడా సమయాన్ని గడపాలి. వారితో చక్కని సంబంధాన్ని ఏర్పర్చుకోవడానికి ప్రయత్నించండి. ఎంతైనా మీరిద్దరూ వివాహం చేసుకుంటే వారు మీ కుటుంబ సభ్యులే అవుతారు. వారిని మీరు ఎరుగుదురా? మీరు వారితో పొసుగుతారా? జోవాన్ ఇలా సలహా ఇస్తుంది: “సాధ్యమైతే రెండు కుటుంబాల వారూ కలవడం మంచిది.” టోనీ దానికి ఇంకా ఇలా జోడిస్తున్నాడు: “మీ స్నేహితుడు/స్నేహితురాలు తన స్వంత కుటుంబ సభ్యులతో ప్రవర్తించే విధానంలోనే మీతో ప్రవర్తిస్తారు.”
ముఖాముఖిగానైనా లేదా ఫోనులోనో ఉత్తరాలద్వారానో కోర్ట్‌షిప్ చేస్తున్నప్పుడు మీ నిర్ణయాల్లో తొందరపాటును చూపించకండి. (సామెతలు 21:5) మీ ఇద్దరి వివాహం ఏమాత్రం పనిచేయదని మీకు స్పష్టంగా కనబడుతున్నట్లైతే మీ ఈ కోర్ట్షిప్ను ఆపేసే విషయాన్ని చర్చించుకోవడం జ్ఞానయుక్తం. మరోవైపు చూస్తే, బహుశ మీ ఇద్దరూ దాపరికం లేకుండా నిజాయితీగా మాట్లాడుకోవడానికి మరింత సమయం కావల్సి రావడమే అసలు విషయం కావచ్చు.
దూరంగా ఉంటూ కోర్ట్‌షిప్ కొనసాగించడం కష్టంగానే ఉండవచ్చు, కానీ దాని మూలంగా ప్రతిఫలాలు కూడా దక్కుతాయి. ఏదేమైనా, ఇది చాలా గంభీరమైన వ్యవహారం. తగినంత సమయాన్ని వెచ్చించండి. ఒకర్నొకరు తెలుసుకోండి. అటు తర్వాత, మీరు వివాహం చేసుకోవాలనే నిర్ణయించుకుంటే మీరు కోర్ట్షిప్లో గడిపిన సమయాన్ని అమూల్యంగా ఎంచుతారు, దాన్నిబట్టి విచారించరు.
[అధస్సూచీలు]
a కోర్ట్షిప్కు సంబంధించి మరింత సమాచారం కోసం, వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించిన యువత అడిగే ప్రశ్నలు—ఆచరణయోగ్యమైన జవాబులు (ఆంగ్లం) పేజీలు 255-60 చూడండి.
[25వ పేజీలోని చిత్రం]
లక్ష్యాలు, పిల్లలు, ఆర్థిక విషయాలు వంటివాటి గురించి మీ సంబంధం తొలిదశల్లోనే తప్పకుండా చర్చించుకోండి