ఏడుగురు కొడుకుల్ని పెంచడంలోని సవాళ్లు, ఆశీర్వాదాలు
బెర్ట్, మార్గరెట్ డిక్మాన్ చెప్పినది
నేను 1927లో అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్రంలో, ఒమెహా నగరమందు పుట్టాను. దక్షిణ డకోటా రాష్ట్రంలో పెరిగాను. గొప్ప ఆర్థికమాంద్యం విలయతాండవం చేస్తున్న క్లిష్టమైన సంవత్సరాల్లో (1929-42) గడిచిన బాల్యం నా స్మృతి పథంలో ఇంకా కదలాడుతుంది. మా అమ్మ సూప్‌ను తయారుచేసేది, దాన్ని ఆమె ఆకలి మంటలను తీర్చే సూప్ అని పిలిచేది. కళాయిలో కాస్త నూనెవేసి, దాంట్లో నీళ్లుపోసి మరగబెట్టేది. అప్పుడు మేం దాంట్లో బ్రెడ్డును ముంచుకు తినేవాళ్లం. ఆ కాలంలో అనేక కుటుంబాలకు రోజులు గడవడం ఎంతో కష్టంగా ఉండేది.
మా కుటుంబ సభ్యులు మతాభిమానులుకారు. స్థానిక ప్రొటెస్టెంట్ మతాల్లో వేషధారణ అధికంగా ఉండడం వాళ్లు గమనించారు. నా విషయంలోనైతే, రెండవ ప్రపంచ మహాసంగ్రామ కాలమందు సైన్యంలో గడిపిన రెండేళ్లూ నా ఆలోచనా సరళిని ప్రభావితం చేశాయి. అప్పుడే నాలో మత్తుపానీయాలపట్లా, జూదంపట్లా మక్కువ పెరిగింది.
ఆర్మీలో నుండి సెలవులపై వచ్చినప్పుడు, స్థానిక డాన్స్ హాల్‌కి వెళ్లాను. అక్కడ జర్మన్ యుక్రెనియన్ అమ్మాయైన మార్గరెట్ ష్లాట్ను కలుసుకున్నాను. మేం ప్రేమలో పడ్డాం. మూడు నెలలపాటు కోర్టింగ్ చేసుకున్న తర్వాత, మేం 1946లో పెళ్లి చేసుకున్నాం. ఎనిమిదేళ్ల మా కాపురంలో మాకు ఏడుగురు కొడుకులు పుట్టారు. తల్లిదండ్రులుగా ఉండడమంటే ఎలా ఉంటుందో మేం క్లిష్టమైన రీతిలో నేర్చుకున్నాం.
1951లో, సామిల్లులో తీవ్రమైన ప్రమాదానికి గురయ్యాను, దాదాపుగా నా ఎడమ చెయ్యి మోచేతివరకూ విరిగిపోయింది. చర్మాన్నీ, ఎముకల్నీ గ్రాఫ్టింగ్ చేయించుకోవడం కోసం నేను రెండేళ్లపాటు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. ఈలోగా, మా ఐదుగురు అబ్బాయిల్నీ పెంచే బాధ్యత మార్గరెట్పై పడింది. స్నేహితుల సహాయంతోనూ, ఇరుగు పొరుగువాళ్ల సాయంతోనూ ఆ క్లిష్టకాలంలో ఆమె నెట్టుకొచ్చింది. నేను హాస్పిటల్లో ఉండగా, జీవిత సంకల్పాన్ని గురించి ఆలోచించడానికి నాకు ఎంతో టైముండేది. బైబిల్ని చదవడానికి ప్రయత్నించేవాడ్ని కానీ, దాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోయేవాడ్ని.
నేను హాస్పిటల్లో నుండి బయటకు వచ్చిన తర్వాత కొంతకాలానికి, మేం వాషింగ్టన్ రాష్ట్రంలోని ఆపర్చ్యునిటీ పట్టణానికి తరలి వెళ్లాం. అక్కడ మా బావమరిదితో కలిసి నేను భవన నిర్మాణ వ్యాపారాన్ని చేపట్టాను. ఇప్పుడు మార్గరెట్ తనవైపు నుండి కథను చెబుతుంది.
నాకు చేతినిండా పని ఉండేది!
నేను పల్లెసీమలో పెరిగాను. అక్కడ మేం కాయ ధాన్యాల్ని పండించేవాళ్లం, చిన్నపాటి పశువుల మందను పెంచేవాళ్లం. పళ్లనూ, కూరగాయల్నీ డబ్బాల్లో పేక్ చేసేవాళ్లం. కష్టపడి పనిచేసే గుణం నాది. అది భవిష్యత్తులో రాబోయే అనేక సవాళ్లను ఎదుర్కోడానికి నాకు తర్ఫీదునిచ్చింది. కనీసం తినడానికి మాకు ఆహారం ఎప్పుడూ ఉండేది గనుక ఆర్థికమాంద్య కాలంలో అనేకమందికన్నా మెరుగ్గానే మేం బ్రతగ్గలిగాం.
మా అమ్మానాన్నలకు మత సంబంధమైన విషయాలంటేనే తీరిక ఉండేది కాదు. అయినా నేను అప్పుడప్పుడూ సన్డే స్కూలుకు వెళ్లేదాన్ని. నా 19వ ఏటలో బర్ట్, నేనూ పెళ్లి చేసుకున్నాం. మేం చర్చికి వెళ్లలేదు. మా అమ్మానాన్నల ఇంట్లోని ముందుగదిలో సంఘ పాదిరి ఆధ్వర్యంలో మా పెళ్లి జరిగింది. కొన్నేళ్లలోనే ఏడుగురు మగ పిల్లలకు తల్లినయ్యాను—రిచర్డ్, డాన్, డగ్, గారీ, మైకేల్, కెన్, చివరగా 1954లో స్కాట్ పుట్టాడు. వాళ్లను సంభాళించడమంటే అంత తేలికయ్యేది కాదు!
మేం ఆపర్చ్యునిటీ పట్టణానికి తరలి వెళ్లిన తర్వాత, బైబిలు గురించి మాట్లాడేందుకు ఒక స్త్రీ మా ఇంటిని సందర్శించింది. నన్ను నిజంగా కలవరపర్చిన నరకాగ్ని సిద్ధాంతాన్ని ఆమె నమ్ముతుందా అని ఆమెను అడిగాను. నరకాగ్ని బైబిలు బోధకాదనీ, అమర్త్యమైన ఆత్మ బోధ కూడా బైబిల్లో లేదనీ ఆమె వివరించింది. దాంతో నాకు ఊరట కల్గింది ! చచ్చిపోతానేమోననే భయంతోనూ, బెదురుతోనూ నేను బ్రదికాను. నరకాగ్నిని ప్రేమగల దేవునితో పొందిక చేయలేకపోయాను. అలాంటి అబద్ధాల్ని నా పిల్లలకు ఎన్నడూ బోధించకూడదని నిశ్చయించుకున్నాను.
1955లో, “దేవుడు సత్యవంతుడై ఉండునుగాక” (ఆంగ్లం) అనే పుస్తకం సహాయంతో నేను బైబిల్ని పఠించడం మొదలుపెట్టాను.a అనుకున్నట్టుగానే, పెంతెకొస్తు బోధకుడు అకస్మాత్తుగా నాపై ఎక్కడలేని శ్రద్ధనూ కురిపించి, యెహోవాసాక్షుల నుండి నన్ను కాపాడాలని ప్రయత్నించాడు! అతడొక పెద్ద పొరపాటు చేశాడు—నరకాగ్ని గురించి నాకు బోధించడానికి ప్రయత్నించాడు! సాక్షులతో పఠించడం మానేసేలా నన్ను బుజ్జగించడానికి ప్రయత్నించేందుకు పెంతెకొస్తు సంఘస్థులైన ముగ్గురు స్త్రీలను కూడా పంపించాడు.
క్రమేణా, బెర్ట్ ముందు గదిలో నుండి మేం చేసుకునే బైబిలు పఠనాన్ని వినేవారు. తర్వాత, క్రైస్తవ గ్రీకు లేఖనాల నూతన లోక అనువాదమును (ఆంగ్లం) చదవడం మొదలుపెట్టారు, విషయాలను కొద్ది కొద్దిగా అర్థంచేసుకోవడం ప్రారంభించారు. ఆయన షిఫ్ట్ డ్యూటీలు చేసి, అర్థరాత్రికి తిరిగి వచ్చేవారు. ఆయన ఇంటికి వచ్చేటప్పటికి నేను మంచి నిద్రలో ఉండేదాన్ని. ఒకనాటి రాత్రి క్రింద ఏం జరుగుతుందోనని దొంగచాటుగా వెళ్లి చూశాను, నా పుస్తకాల్ని ఆయన రహస్యంగా చదవడం చూశాను! ఆయన విషయాల్ని పరిశీలిస్తున్నారనే తృప్తితో నేను నిశ్శబ్దంగా వెనక్కి వచ్చి పడుకున్నాను. చివరకు, ఆయన కూడా బైబిలు స్టడీ తీసుకున్నారు. 1956లో మేం బాప్తిస్మం తీసుకున్న సాక్షులం అయ్యాం.
ఎనిమిదేళ్ల కాలంలో ఏడుగురు కొడుకులు పుట్టడంతో, వాళ్లకు అవసరమైన అనుదిన ఆహార అవసరాలను తీర్చడం, కావాల్సిన దుస్తులను సమకూర్చడం, ఇంటిని శుభ్రంగా ఉంచడం సవాలుతో కూడిన పనే. పిల్లలు ఇంట్లో తమ పనుల్ని తాము చేసుకోవడం నేర్చుకున్నారు. నాకు గిన్నెల్ని తోమే ఆటోమేటిక్ మిషన్ ఒకటి కాదు—ఏడు ఉన్నాయి అని తరచూ అనేదాన్ని. అవసరమైన ఈ దైనందిన పనుల్లో వంతులవారీగా ప్రతీ ఒక్కరూ భాగంవహించేవాళ్లు. బెర్ట్ ఎంతో సహాయంచేసేవారు అనుకోండి. ఆయన క్రమశిక్షణనూ, ఇంట్లో నియమాలనూ పాటించడంలో ఎప్పుడూ ఒకేరీతిగా ఉన్నా, పరస్పర సంభాషణకు మార్గాల్ని తెరచి ఉంచేవారు కూడా. పిల్లలు వాళ్ల నాన్నగార్ని గౌరవించేవారు, కానీ భయపడేవారు కాదు. లైంగిక విషయాలను గురించి మా అబ్బాయిలకు బోధించే బాధ్యతను ఆయన ఎన్నడూ అలక్ష్యం చేయలేదు. దాని విషయంలో వాళ్లు ఆయన్ని మక్కువతో గుర్తు చేసుకుంటారు.
మా పెద్దబ్బాయి రిచర్డ్, 1966లో న్యూయార్క్ రాష్ట్రంలో ఉన్న బ్రూక్లిన్ నగరంలోని వాచ్ టవర్ సొసైటీ ప్రధానకార్యాలయంలో స్వచ్ఛంద సేవకునిగా పనిచేసేందుకు వెళ్లాడు. మా పెద్దబ్బాయి ఇంటిని విడిచి వెళ్లిపోవడం, నాకు విషమ పరీక్షగా తయారయ్యింది. ప్రతీరోజూ భోజనాల బల్ల దగ్గర ఖాళీగా వెక్కిరిస్తున్నట్టు కన్పించే ఆ కుర్చీ, నా హృదయాన్ని కలచివేసేది. కానీ వాడు చక్కని అనుభవాన్నీ, తర్ఫీదునీ పొందుతున్నందుకు నాకు సంతోషంగా ఉంది.
ఇక మా కథను బెర్ట్ కొనసాగిస్తారు.
బైబిలు సూత్రాలకు అనుగుణంగా మా అబ్బాయిల్ని పెంచడం
వాషింగ్టన్ రాష్ట్రంలోని స్పోకెన్ నగరంలో జరిగిన ఒక సమావేశంలో మార్గరెట్, నేనూ బాప్తిస్మం తీసుకున్నాం. బైబిలు సూత్రాల ప్రకారంగా మా పిల్లల్ని పెంచే సవాలు ఇప్పుడు మా ఎదుట ఉంది. దాన్ని మీరు సనాతన పద్ధతి అని పిలవవచ్చు. అబద్ధాలాడడంగానీ, ద్వంద్వ ప్రమాణాలను అనుసరించడంగానీ నేను సహించను, ఆ విషయం మా పిల్లలకు తెలుసు. శ్రేష్ఠమైనదాన్ని పొందడానికి యెహోవా అర్హుడు అని మేం వాళ్లకు బోధించాం.
అయినా, మా మధ్య సన్నిహిత సంబంధం ఉంది గనుక ఏ విషయమైనా నాతో నిస్సంకోచంగా చెప్పుకోవచ్చునని వాళ్లకు తెలుసు, మేం కలిసిమెలసి ఎన్నో పనుల్ని చేసేవాళ్లం. ఒక కుటుంబంగా, మేం కలిసి బీచ్‌కు వెళ్లడం, కొండప్రాంతాల్లో పిక్నిక్ పార్టీలను చేసుకోవడం, బంతి ఆటల్ని ఆడుకోవడం వంటి ఆనందకరమైన సందర్భాలను ఏర్పాటుచేసుకునేవాళ్లం. మాకు పశువులూ, తోటా ఉండేవి, ఏ పనిలోనైనా పిల్లలు మాతో సహకరించేవారు. ఆ విధంగా వాళ్లు పనిచేయడం, ఆటలాడుకోవడం నేర్చుకున్నారు. మేం మా కార్యకలాపాల్లో సమతూకాన్ని పాటించడానికి ప్రయత్నించేవాళ్లం.
దైవపరిపాలనా సాహసం
ఆధ్యాత్మికంగా చూస్తే, రాజ్యమందిరంలో జరిగే క్రైస్తవ కూటాలకు మేమంతా కలిసి వెళ్లేవాళ్లం, కుటుంబ బైబిలు పఠనాన్ని క్రమంగా జరుపుకునేవాళ్లం. 1957లో వాషింగ్టన్ రాష్ట్రంలోని సీటల్ నగరంలో యెహోవాసాక్షుల జిల్లా సమావేశానికి హాజరయ్యాం. సమావేశ కార్యక్రమంలో, దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి సాక్షుల అవసరత ఎక్కువగా ఉన్న చోట సేవచేసేలా తరలి వెళ్లాలని కుటుంబాలకు పిలుపు ఇవ్వబడింది. అదొక మంచి ఆలోచనలా ఉందని మేం అనుకున్నాం, మేమలా తరలి వెళ్లడానికి ప్లాన్ వేసుకోవడం మొదలెట్టాం. మేం మొదట 1958లో మిస్సోరీకీ, ఆ తర్వాత 1959లో మిసిసిపికీ వెళ్లాం.
1958లో మేం మా మొదటి దైవపరిపాలనా సాహసాన్ని చేపట్టాం. నేనొక కేంపింగ్ ట్రేలర్ని నిర్మించాను, దాన్ని మూడు సీట్లూ, ఆరు సిలెండర్లూ ఉన్న 1947నాటి పాత డిసొటొ కారుకి తగిలించి నడిపించేవాళ్లం. ఆ సంవత్సరం ఒక అంతర్జాతీయ సమావేశానికి హాజరయ్యేందుకు మేం తొమ్మిదిమందిమీ ఆ కారులో న్యూయార్కుకు వెళ్లాం. పశ్చిమ తీరాన స్పోకెన్ నుండి న్యూయార్కు వరకూ అంటే 4,200 కిలోమీటర్లకన్నా ఎక్కువ దూరంచేసే మా ప్రయాణ మార్గంపై అక్కడక్కడా విడిదిచేస్తూ, మేం అనేక వారాలపాటు రోడ్డుపైనే గడిపాం ! మా అబ్బాయిలు ప్రయాణాన్ని నాణ్యమైన సమయంగానూ, గొప్ప సరదాగానూ ఎంతో ఆనందంగా గుర్తుచేసుకుంటారు.
కేకు నుండి క్రమశిక్షణను నేర్చుకోవడం
సమావేశంలో మేం పరదైసును కోల్పోవడం నుండి పరదైసును తిరిగి పొందడం వరకు (ఆంగ్లం) అనే పుస్తకాల్ని తీసుకొన్నాం.b వారం వారం జరుపుకునే మా కుటుంబ బైబిలు పఠనానికి బైబిలుతోపాటుగా ఆ పుస్తకం ప్రాథమిక పాఠ్యపుస్తకమైంది. మా అబ్బాయిలందరూ చాలా చిన్న వయస్సులోనే చదవడం నేర్చుకున్నారు. పిల్లలు స్కూలు నుండి వచ్చిన తర్వాత వాళ్లు చెప్పేవాటిని మార్గరెట్ వింటూ, బైబిలు చదువుతూ వాళ్లతో కొంత సమయాన్ని గడిపేది. టీవీని వాళ్ల మనస్సులపై పెత్తనం చెలాయించడానికి మేం అనుమతించేవాళ్లం కాదు.
మా కుటుంబంలో క్రమశిక్షణా ఒకరిపట్ల మరొకరికి గౌరవం ఉన్నాయి. ఒక సందర్భంలో మార్గరెట్ పెద్ద కేకును తయారుచేసింది—అందులో ఆమెది అందెవేసిన చెయ్యి. ఆనాటి భోజనంలో కేరెట్లు కూడా ఉన్నాయి. కూరగాయల్ని కనీసం రుచి చూడమని ఎల్లప్పుడూ మేం పిల్లల్ని ప్రోత్సహించేవాళ్లం. మా నాలుగో అబ్బాయి డగ్కి కేరెట్లంటే ఇష్టముండేదికాదు. కేరెట్లను తింటేనేగానీ వాడికి కేకులో చిన్న ముక్కకూడా దొరకదని చెప్పడం జరిగింది. అయినా వాడు తన భోజనాన్ని ముగించడానికి మొరాయించాడు. “నువ్వు కేరెట్లను తినకపోతే నీ కేకును కుక్కకు పడేస్తాను” అని మార్గరెట్ చెప్పింది. వాడి రుచికరమైన కేకును మా కుక్క బ్లాకీ తినడాన్ని చూసేంతవరకూ డగ్ ఆమె చెప్పినదాన్ని నమ్మి ఉంటాడని నేను అనుకోను! ఆ అనుభవం నుండి వాడొక గుణపాఠాన్ని నేర్చుకున్నాడు, అలాగే మిగిలిన మా అబ్బాయిలూ నేర్చుకున్నారు. తల్లిదండ్రులుగా, మేం చెప్పింది చేసేవాళ్లం.
జీవితం సరదాగా సాగింది
“మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును” అని మత్తయి 6:33లో ఉన్న యేసు మాటలు మార్గరెట్నూ, నన్నూ నడిపించాయి. ఒక కుటుంబంగా, రాజ్య ఆసక్తుల్ని మేం మొదటిగా ఉంచడానికే ప్రయత్నించాం. ప్రకటించడానికి కలిసి వెళ్లడమంటే మాకెంతో ఆనందంగా ఉండేది. మా అబ్బాయిలు ఒకళ్ల తర్వాత ఒకరు ఇంటింటి సేవలో నాతో కలిసి పనిచేసేవాళ్లు. ప్రతీ ఒక్కరికీ వాళ్ల వాళ్ల సొంత పుస్తకాల బేగ్, బైబిలూ, బైబిలు సాహిత్యాలు ఉండేవి. వాళ్లు సాధించిన ఏ కొద్దిపాటి పురోభివృద్ధినైనా సరే, మేం మెచ్చుకునేవాళ్లం. మార్గరెట్ తరచుగా వాళ్లను ఆప్యాయంగా హత్తుకునేది. నిజం చెప్పాలంటే, వాళ్లమీద మాకున్న ప్రేమను ఎల్లప్పుడూ చూపించేవాళ్లం. పిల్లలకోసం మేం ఎల్లప్పుడూ తీరిక చేసుకునేవాళ్లం—జీవితం సరదాగా సాగింది!
మా పిల్లలు పెద్దవాళ్లౌతుండగా, ప్రజల్ని కూటాలకు తీసుకురావడం, రాజ్యమందిరం తలుపుల్ని తెరవడం, ఇతర పనుల్లో సహాయపడడం వంటి బాధ్యతలు వారికి ఉండేవి. తమ ఆరాధనా స్థలంగా రాజ్యమందిరం పట్ల మెప్పుదలను చూపించడం వాళ్లు నేర్చుకున్నారు, సంతోషంగా రాజ్యమందిర నిర్వహణా పనుల్ని చేసేవాళ్లు.
క్రైస్తవ కూటాల్లో వ్యాఖ్యానాలు చేయమని మేం వారిని ప్రోత్సహించేవాళ్లం. వాళ్లు దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో క్లుప్తమైన విద్యార్థి ప్రసంగాల్ని ఇచ్చేవాళ్లు, క్రమేణా వాళ్లు ప్రసంగీకులుగా తయారయ్యారు. మా ఐదో అబ్బాయి మైకేల్ బహిరంగంగా మాట్లాడడం అంటే అంత సుముఖతను ఎప్పుడూ చూపించలేదు, ప్లాట్‌ఫామ్‌పై ఇబ్బంది పడేవాడు. తన ప్రసంగాల్ని ముగించలేకపోయేవాడు గనుక వాడు ప్రసంగాల మధ్యలో ఏం చేయాలో పాలుపోక ఏడ్చేసేవాడు. క్రమేణా, దాన్ని అతడు అధిగమించాడు. వివాహితునిగా ఇప్పుడు అతడు, ప్రయాణ పైవిచారణకర్తగా సేవచేస్తున్నాడు. వేర్వేరు సంఘాల్ని సందర్శిస్తూ, వారంలో అనేకసార్లు ప్రసంగాల్ని ఇస్తున్నాడు. ఎంత మార్పోగదా!
క్రమశిక్షణను పిల్లలెలా దృష్టించారు
సనాతన పద్ధతిలో పెంచబడడం గురించి అతని అభిప్రాయాల్ని తెలుసుకోవడానికి తేజరిల్లు! మైకేల్‌ను కలుసుకుంది. మేం మా డాడీని “దయగల క్రమశిక్షణకర్తగా దృష్టించాం. టీనేజర్‌గా ఉన్నప్పుడు, నేను రేడియో స్టేషన్లో పనిచేయడానికి వెళ్లేవాడ్ని. పూర్తికాల పయినీరు పరిచర్యలో నేను కూడా పాల్గొనగల్గేలా నాకు ఒక కారు కావాలని అనుకున్నాను. మా స్టేషన్ మేనేజర్ అప్పట్లో యువతను ఉర్రూతలూగించిన టాపునుమార్చే అవకాశమున్న, రెండు డోర్లున్న ఫోర్డ్ మస్టాన్గ్ స్పోర్ట్ కారును అమ్మజూపాడు. పరిచర్యకు నాతోపాటు ప్రజల్ని తీసుకెళ్లడానికి ఆ కారు అంత అనువైనదికాదని నాకు తెలిసినా, నేను అదే కావాలని ఎంతగానో కోరుకున్నాను. కొద్దిగా తటపటాయిస్తూ నేను మా డాడీ దగ్గరకు వెళ్లాను. ఆ కారుని గురించి మా డాడీకి చెప్పినప్పుడు, ‘దాన్ని గురించి మాట్లాడదాం’ అని ఆయన అన్నారు. దానర్థం ఏంటో నాకు తెలుసు! ఆయన నాతో సహేతుకంగా తర్కించారు, మరింత అనువైన కారువల్ల వచ్చే ఉపయోగాల్ని గురించి నాకు వివరించారు. అందుకని, నేను నాలుగు డోర్లున్న సెడాన్కారుని కొనుక్కున్నాను, నా ప్రకటనా నియామకంలో 1,60,000 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరం దానిపై ప్రయాణంచేసిన తర్వాత, ఇప్పుడు ‘మా డాడీ చెప్పిందే రైట్’ అనే చెప్పగలను.
“మేం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు, వాషింగ్టన్ నుండి మిస్సోరీ, అక్కడనుండి మిసిసిపి వెళ్లడం, ఒక ఉత్తేజకరమైన అనుభవం. మేం ఎంతో ఆనందించాం. 2.5 × 11 మీటర్లు ఉన్న ట్రేలర్‌లో సంవత్సరంపాటు మేం తొమ్మిదిమందిమీ నివసించినప్పటికీ, అదంతా ఎంతో సరదాగా ఉండేది, సంస్థీకరించబడినవారిగా, క్రిక్కిరిసిపోయిన స్థలంలో సహితం, ఒకరితో మరొకరం కలిసిమెలిసి ఉండడాన్ని మాకు అది బోధించింది. నిజమే, మేం ఎక్కువగా బయట ఆడుకోడానికి ఇష్టపడేవాళ్లం.
“నేను గుర్తుచేసుకొని, ఆనందించే మరొక విషయం ఏమిటంటే, మాతో మా డాడీ దినవచనాన్ని నిర్వహించే విధానమే. న్యూయార్కు రాష్ట్రంలోని దక్షిణ లాన్షింగ్ నగరంలో ఉన్న కింగ్డమ్ ఫామ్‌లో పెద్దలకోసం నిర్వహించబడిన ఒక స్కూలుకు 1966లో మా డాడీ హాజరయ్యారు, ప్రతీ దినం దినవచనంపై వ్యాఖ్యానాల్ని ఇచ్చేందుకు బేతేలు కుటుంబం రీసెర్చిచేయడం ఆయన చూశారు. మా కుటుంబ అనుదిన కార్యక్రమంలో అదే పద్ధతిని ఆయన ప్రవేశపెట్టారు. ప్రతీరోజూ ఉదయంపూట మేం రీసెర్చిచేసిన దానిపై వ్యాఖ్యానించేలా మా ఏడుగురు అన్నదమ్ములకు అసైన్మెంటు ఇచ్చేవారు. కొన్నిసార్లు మేం సణుక్కున్నా, ఎలా రీసెర్చి చేసి, వ్యాఖ్యానించాలో ఆ ఏర్పాటు మాకు నేర్పించింది. అలాంటి అలవాట్లు జీవితాంతం నిలిచి ఉంటాయి.
“మా కోసం మా అమ్మానాన్నలు చేసిన త్యాగాలు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. మా ఇద్దరు అన్నయ్యలు రిచర్డ్, డాన్లు మా కుటుంబం కోసం డబ్బును సంపాదించగలిగే సమయంలో, వాచ్ టవర్ సొసైటీ ప్రపంచ ప్రధానకార్యాలయంలో స్వచ్ఛంద సేవకులుగా సేవచేసేందుకు న్యూయార్కు రాష్ట్రంలోని బ్రూక్లిన్కు వెళ్లమని వాళ్లను మా అమ్మానాన్నలు ప్రోత్సహించారు. మాలో నలుగురు ప్రధానకార్యాలయాన్ని చూడ్డానికి న్యూయార్కుకి వెళ్లగల్గేలా మా తల్లిదండ్రులు డబ్బును కూడబెట్టారు కూడా. అది నన్నెంతగానో ప్రభావితుడ్ని చేసింది. అది, యెహోవా సంస్థపట్ల మాకున్న మెప్పుదలను అధికం చేసింది.
“ఇక మా కథను డాడీ చెబుతారు.”
మాకు ఆటంకాలు ఎదురయ్యాయి
ఇతర కుటుంబాల్లానే, మాకూ సమస్యలూ, ఆటంకాలూ ఉన్నాయి. మా పిల్లలకు పెళ్లీడు వచ్చేసరికి, వాళ్లు ఆకర్షితులైన మొట్టమొదటి అమ్మాయినే పెళ్లిచేసుకోవడానికి తొందరపడే విషయంలో వాళ్లకు సలహా ఇవ్వాల్సి వచ్చింది. వాళ్లు కోర్టింగ్ చేసుకునేటప్పుడు ఎవరో ఒకరి పర్యవేక్షణల క్రింద ఉండేలా కూడా మేం నిశ్చయపర్చుకున్నాం. జీవిత భాగస్వామిని ఎంపికచేసుకోవడానికి ముందు జీవితంలో వారికి కొంత అనుభవం రావాలని మేం కోరుకున్నాం. కొన్నిసార్లు ఏడ్పులూ, తాత్కాలికంగా హృదయాలు గాయపర్చబడడం జరిగినా, చివరకు వాళ్లు బైబిలు సలహాలలో ఉన్న—విశేషంగా ‘ప్రభువునందు’ పెండ్లిచేసుకొనమని ఇవ్వబడిన బైబిలు సలహాలో ఉన్న జ్ఞానాన్ని గుర్తించారు. వారు చూపించిన జ్ఞానాన్నిబట్టి మేం వాళ్లని మెచ్చుకున్నాం.—1 కొరింథీయులు 7:39.
మా చివరబ్బాయి స్కాట్ మేం దుఃఖపడ్డానికి కారణమయ్యాడు. పనిచేసే స్థలంలో చెడు సహవాసాలు పట్టాడు. చివరకు, సంఘం నుండి బహిష్కరించబడ్డాడు. అది మా అందరికీ ఒక పెద్ద దెబ్బ, కానీ మేం పెద్దలు తీసుకున్న న్యాయ నిర్ణయాన్ని గౌరవించాం. యెహోవా సేవచేయడమే శ్రేష్ఠమైన జీవిత మార్గమని స్కాట్ ఎంతో క్లిష్టమైన అనుభవం ద్వారా నేర్చుకున్నాడు.
అతడు మరలా సంఘంలోనికి తిరిగి వస్తాడన్న ఆశను మేం ఎన్నడూ కోల్పోలేదు. సంతోషదాయకంగా, ఐదేళ్ల తర్వాత అతడు సంఘంలోనికి తిరిగి చేర్చుకోబడ్డాడు. వెనక్కి తిరిగిచూసుకొని అతడు ఇలా చెబుతున్నాడు, “నేను బహిష్కరించబడినప్పుడు కుటుంబ సహవాసం పరిమితమే అయినా, నా కుటుంబం నన్నెప్పుడూ ప్రేమిస్తుందన్న విషయం నాకు సహాయపడింది.” స్కాట్ పురోభివృద్ధిచెందాడు. గత ఎనిమిదేళ్ల నుండి అతడు ఒక పెద్దగా సేవ చేస్తున్నాడు.
మరొక కష్టం ఏమిటంటే మా మనవళ్లలో ఒకడు తన 20వ పడిలో 1998లో బహిష్కరించబడ్డాడు. కానీ యెహోవా నుండి వచ్చే క్రమశిక్షణ, అనుకూలమైన మార్పుల్ని తీసుకురాగలదనే ఓదార్పు మాకుంది.
మా జీవితాల్లో ఒక పెద్ద మార్పు
చివరగా, 1978నాటికి మా అబ్బాయిలందరూ ఇంటిని వదలి వెళ్లిపోయారు. సంవత్సరాలు గడుస్తుండగా, నేను హీటింగ్లోనూ, వెంటిలేషన్లోనూ, ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్‌లోనూ అనుభవాన్ని గడించాను. 1980లో, నేనూ మార్గరెట్ తొమ్మిదినెలలపాటు బ్రూక్లిన్‌లోని వాచ్ టవర్ ప్రధానకార్యాలయంలో సేవచేసేందుకు మమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తే ఒక ఆహ్వానాన్ని పొందాం. పద్దెనిమిది సంవత్సరాలు గడిచినా, మేమింకా ఇక్కడే ఉన్నాం!
మేం ఎన్నో ఆశీర్వాదాలను పొందాం. బైబిలు నియమాల ప్రకారంగా సనాతన పద్ధతిలో మా పిల్లల్ని పెంచడం అన్నివేళలా అంత సులభంకాలేదు, కానీ అది మా విషయంలో చక్కని ఫలితాల్ని తెచ్చింది. ప్రస్తుతం మా కుటుంబ పరిస్థితి ఎలా ఉందంటే, మా అబ్బాయిల్లో ఐదుగురు సంఘ పెద్దలుగానూ, ఒకరు ప్రయాణ పైవిచారణకర్తగానూ సేవ చేస్తున్నారు. మాకు 20మంది మనుమలూ, మనుమరాండ్రూ, 4గురు మునిమనుమలూ, మనుమరాండ్రూ ఉన్నారు—వారిలో చాలామంది సత్యంలో ఉండి దేవునిపట్ల నమ్మకంగా ఉన్నారు.
కీర్తనల గ్రంథకర్త చెప్పిన ఈ మాటల్లో ఉన్న సత్యసంధతను మేం చూశాం: “కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన యచ్చు బహుమానమే. యౌవనకాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములవంటివారు.”—కీర్తన 127:3, 4.
[అధస్సూచీలు]
a 1946లో వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించినది; ఇప్పుడు లభ్యంకావడం లేదు.
b వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించినది.
[20-21వ పేజీలోని చిత్రాలు]
1996లో మా 50వ వివాహ వార్షికోత్సవమందు మా కొడుకులూ, కోడళ్లతో (కుడివైపు), మనుమలతోనూ మనుమరాండ్రతోనూ (కుడివైపు పేజీలో)