స్వాతంత్ర్యాలను సంరక్షించడం—ఎలా?
ఇండోనేషియాలోని రన్‌గస్‌డెన్‌గ్‌క్లాక్ అనే చిన్న పట్టణంలో, మత సముదాయాలు సంవత్సరాల తరబడి సమాధానంగా కలిసి జీవించాయి. అయితే, అప్పటి వరకూ అక్కడి వాళ్ళలో ఉన్న సహిష్ణుత (సహనశీలం) 1997 జనవరి 30న అంతర్ధానమైపోయింది. ఒక మత సంబంధ పండుగ రోజు ఉదయం మూడు గంటలకు ఇంక కొంచెం సమయముందనగా, ఒక విశ్వాసి ఢంకా మ్రోగించడం మొదలుపెట్టడంతో హింస చెలరేగింది. ఢంకా మ్రోగిన శబ్దానికి ప్రతిస్పందిస్తూ, మరో మతానికి చెందిన ఒక వ్యక్తి తన పొరుగువాడ్ని అవమానకరంగా తిట్టనారంభించాడు. దాంతో రెండు పక్షాలవారు అరుచుకోవడం రాళ్ళు రువ్వుకోవడం మొదలెట్టారు. తెల్లవారింది, ఆ పోరులో ఇతరులు కూడా చేరేసరికి, అల్లకల్లోల పరిస్థితి ఉద్ధృతమయ్యింది. ఆ రోజు ముగిసేసరికి రెండు బౌద్ధమత ఆలయాలూ, క్రైస్తవమత సామ్రాజ్యానికి చెందిన నాలుగు చర్చీలు నాశనమై పోయాయి. ఈ సంఘటనను ద ఇంటర్నేషనల్ హెరాల్డ్ ట్రైబ్యూన్ అనే వార్తాపత్రిక “అసహిష్ణుతా జ్వాల మత సంబంధ అల్లకల్లోలానికి చిచ్చుపెట్టింది” అనే శీర్షిక క్రింద నివేదించింది.
అనేక దేశాల్లో, తమ హక్కులు చట్టం చేత భద్రం చేయబడిన అల్పసంఖ్యాక మతాలవారు తరచూ అసహిష్ణుతకు బలవుతున్నారు. చట్టం చేత స్వాతంత్ర్యానికి హామీ ఇచ్చినంత మాత్రాన అసహిష్ణుతను కూకటి వేళ్ళతో సహా పెకిలించడం జరగదు. వాస్తవం ఏమిటంటే, అసహిష్ణుతను కనిపించకుండా కప్పిపుచ్చినంత మాత్రాన అది అస్తిత్వంలో లేదని కాదు. భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో, పరిస్థితులు మారి, ఒకవేళ అకారణంగా దురభిప్రాయాలు కలిగే వాతావరణం ఏర్పడితే, అంతవరకూ కనిపించకుండా కప్పిపుచ్చబడిన అసహిష్ణుత అప్పుడు రంగప్రవేశం చేయగలదు. ప్రజలను నేరుగా హింసించకపోయినప్పటికీ, వాళ్ళు శత్రుభావానికి గురికావచ్చు. లేదా వాళ్ళు తమ తలంపులను అణచివేసుకోవలసి రావచ్చు. దీనిని ఎలా నివారించవచ్చు?
అసహిష్ణుతా వేళ్ళను పెకిలించడం
మనం భిన్నమైనదానిని లేదా అసాధారణమైన దానిని, ముఖ్యంగా మన సొంత అభిప్రాయాలకు భిన్నమైనదానిని నిరాకరించడానికి లేదా సందేహించడానికి మ్రొగ్గు చూపుతామన్నది స్వాభావికం. దానర్థం సహిష్ణుత సాధ్యంకాదనా? ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఇన్‌టోలరన్స్ ఆన్డ్ డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ రిలిజియన్ ఆర్ బిలీఫ్ అనే యు.ఎన్. ప్రచురణ, “మతం విషయమైన, విశ్వాసం విషయమైన అసహిష్ణుతా మరియు వివక్షలకు మూలకారణాల” పట్టికలో అజ్ఞానాన్నీ అవగాహనలేమినీ చేరుస్తుంది. అయినప్పటికీ, అసహిష్ణుతకు మూలకారణమైన అజ్ఞానానికి వ్యతిరేకంగా పోరాడవచ్చు. ఎలా? సమతుల్యతగల విద్యాభ్యాసం ద్వారా. “వివక్షతోనూ, అసహిష్ణుతతోనూ పోరాడేందుకు ముఖ్య మాధ్యమం విద్యాభ్యాసమే కావచ్చు” అని యు.ఎన్. కమిషన్ ఆన్ హ్యూమన్ రైట్స్ చేసిన నివేదిక చెబుతుంది.
విద్యాభ్యాసపు లక్ష్యం ఏమై ఉండాలి? మతసంబంధ సంస్థీకృత కార్యకలాపాలను నిరాకరించడాన్ని ప్రోత్సహించే బదులు, “సహిష్ణుత కోసమైన విద్యాభ్యాసం భయానికీ, ఇతరులను మినహాయించడానికీ దారితీసే ప్రభావాలను ఎదుర్కోవడాన్ని లక్ష్యంగా చేయాలి, స్వతంత్రంగా ఒక నిర్ధారణకు వచ్చేందుకూ, విశ్లేషణాత్మకంగా ఆలోచించేందుకూ, నైతికంగా తర్కించుకునేందుకూ సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు యువతీయువకులకు సహాయపడాలి” అని యునెస్కో కొరియర్ అనే పత్రిక సూచిస్తుంది.
స్పష్టంగా, ‘విశ్లేషణాత్మక ఆలోచనాసరళినీ, నైతిక తర్కాన్నీ’ పెంపొందించడంలో మాధ్యమాలు ప్రాముఖ్యమైన పాత్రను నిర్వహించగలవు. అనేక అంతర్జాతీయ సంస్థలు ప్రజల అభిప్రాయాలకు ఒక రూపం ఇవ్వడంలోనూ, పరస్పర అవగాహనను ప్రోత్సహించడంలోను మాధ్యమాలకు ఉన్న శక్తిని గుర్తిస్తాయి. అయితే, కొన్ని మాధ్యమాలు చేస్తున్నట్లు మాధ్యమాలన్నీ అసహిష్ణుతను ప్రోత్సహించక సహిష్ణుతకు ప్రోత్సాహమివ్వాలంటే, బాధ్యతాయుతమైన, స్వతంత్రమైన జర్నలిజం అవసరం. అప్పుడప్పుడు పత్రికా విలేఖరులు ప్రజామోదం పొందిన అభిప్రాయాలకు వ్యతిరేకంగా వ్రాయడం తప్పనిసరవ్వవచ్చు. వాళ్ళు వాస్తవికమైన విశ్లేషణను, నిష్పక్షపాతంగా గమనించిన విషయాలను తప్పనిసరిగా వ్రాయాలి. కానీ అలా వ్రాసినంత మాత్రాన సరిపోతుందా?
అసహిష్ణుతకు వ్యతిరేకంగా పోరాడగల మేలైన మార్గం
సహిష్ణుత చూపించాలంటే దానర్థం అందరికీ ఒకేలాంటి తలంపులు ఉండాలనేమీ కాదు. ప్రజలు ఒకరితో నొకరు ఏకీభవించకపోవచ్చు. కొందరు సదరు వ్యక్తి నమ్మకాలు చాలా తప్పని చాలా గట్టిగా భావించవచ్చు. వాళ్ళు తమ అసమ్మతులను గురించి బహిరంగంగా మాట్లాడవచ్చు కూడా. అయినప్పటికీ, వాళ్ళు ఇతరులలో నిర్హేతుకమైన దురభిప్రాయాలను కలిగించాలని ప్రయత్నించనంత వరకు, అబద్ధాలను ప్రచారం చేయనంత వరకు అది అసహిష్ణుత కాదు. అయితే, ఒక గుంపు వేధించబడినప్పుడు, ప్రత్యేకమైన చట్టాలకు వారిని ఎరగా చేసినప్పడు, వారిని సమూహంలో అధమ స్థానానికి త్రోసివేసినప్పుడు, వాళ్ళను నిషేధించినప్పుడు, లేదా మరో విధంగా వాళ్ళు తమ నమ్మకాలను అనుసరించకుండా ఆటంకాలు పెట్టినప్పుడు అసహిష్ణుత కనిపిస్తుంది. మితిమీరిన అసహిష్ణుతను చూపించినప్పుడు, కొందరు చంపడమూ, ఇతరులు తమ నమ్మకాల విషయమై చనిపోవలసి రావడమూ జరుగుతుంది.
అసహిష్ణుతకు వ్యతిరేకంగా మనమెలా పోరాడవచ్చు? అపొస్తలుడైన పౌలు తన కాలంనాటి మత నాయకుల అసహిష్ణుతను బయటపెట్టినట్టే, దానిని బహిరంగంగా బయటపెట్టవచ్చు. (అపొస్తలుల కార్యములు 24:10-13) అయితే, అసహిష్ణుతకు వ్యతిరేకంగా పోరాడే అవకాశమేమైనా ఉంటే, అందుకు మేలైన మార్గం, ఒక మార్పు తేవడానికి చొరవతీసుకుని ప్రయత్నించడమే—సహిష్ణుతను వృద్ధి చేసేందుకు ప్రయత్నించడమే. అంటే ప్రజలు ఇతరులను బాగా అర్థం చేసుకోగలిగేలా విద్యాభ్యాసమివ్వడమే. “మతం లేదా నమ్మకం విషయమైన అసహిష్ణుత మరియు వివక్షల అన్ని రూపాల ఆవిర్భాలకు మూలం మానవ మెదడే కనుక, చర్యలను మానవ మనస్సులవైపే మొదట కేంద్రీకరించవలసి ఉంది” అని అసహిష్ణుతను తొలగించడంపై యు.ఎన్. వ్రాసిన ముందు పేర్కొనబడిన నివేదిక చెబుతుంది. అలాంటి విద్యాభ్యాసం వ్యక్తులు తమ సొంత నమ్మకాలను పరిశీలించుకునేందుకు కూడా నడిపించవచ్చు.
ఐక్యరాజ్య సమితి విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ డైరెక్టర్ జనరల్ అయిన ఫేడేరీకో మాయోర్ “సహిష్ణుత అనేది దృఢనిశ్చయంగల వ్యక్తి యొక్క మంచిలక్షణం” అని వ్రాశారు. రేఫోర్మ్ అనే పత్రికలో వ్రాస్తూ, “నిజమైన సహిష్ణుత అనేది దృఢనిశ్చయంపై ఆధారపడి ఉంటుంది” అని డొమినికన్ ప్రీస్ట్ అయిన క్లోడ్ జెఫ్రే అన్నాడు. తన సొంత నమ్మకాల విషయమై సంతృప్తుడైన వ్యక్తికి ఇతరుల నమ్మకాల చేత బెదిరించబడినటువంటి అనుభూతి కలిగే అవకాశమే లేదు.
సహిష్ణుతను వృద్ధిచేసేందుకు అమోఘమైన మార్గం భిన్నమైన నమ్మకాలుగల ఇతరులతో మాట్లాడడమేనని యెహోవాసాక్షులు కనుగొన్నారు. “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును” అని యేసు చెప్పిన ప్రవచనాన్ని యెహోవాసాక్షులు గంభీరంగా తీసుకుంటారు, వారు తాము చేసే బహిరంగ సువార్త పరిచర్యనుబట్టి పేరుగాంచారు. (మత్తయి 24:14) ఈ పనిలో, అనేక మతాలకు చెందిన ప్రజలూ—అలాగే నాస్తికులూ—తమ నమ్మకాలను గురించి వివరిస్తుండగా వినే అవకాశం వాళ్ళకు ఉంది. అలాగే, సాక్షులు తమ నమ్మకాలను గురించి వినాలని ఆశించేవారికి వివరించేందుకు సిద్ధంగా ఉంటారు. ఆ విధంగా వాళ్ళు జ్ఞానంలోనూ, అవగాహనలోను అభివృద్ధికి దోహదపడతారు. అలాంటి జ్ఞానమూ, అవగాహనా సహిష్ణుత వృద్ధి చెందడాన్ని సులభతరం చేస్తాయి.
సహిష్ణుతా, ఇంకా అంతకన్నా ఎక్కువా
అనేకులకు మంచి ఉద్దేశాలే ఉన్నప్పటికీ, కొందరు పరస్పర అవగాహనతో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, మత సంబంధ అసహిష్ణుత స్పష్టంగా నేటికీ సమస్యగానే ఉంది. నిజమైన మార్పు రావాలంటే, ఇంకా ఎక్కువగా ఏదో అవసరం. “ఆధునిక సమాజం భావోద్వేగ ఆధ్యాత్మిక శూన్యతను తరచూ అనుభవిస్తుంది. స్వాతంత్ర్యానికి బెదిరింపుగా ఉండేవారి నుండి చట్టం సంరక్షణనివ్వగలదు. మతస్వాతంత్ర్యం అన్యాయమైన వివక్షకు తావివ్వకుండా చట్టం క్రింద అందరికీ సమానత్వాన్ని హామీ చేయాలి” అని అంటూ ఫ్రెంచ్ వార్తాపత్రికయైన ల మొండ్ డ డేబా ఈ సమస్యను నొక్కి చెప్పింది.
“పరస్పర అవగాహనా, గౌరవాలనూ ప్రవర్తన విషయంలో సార్వత్రిక ప్రమాణాలుగా చేయాలనే లక్ష్యాన్ని చేరుకోవడానికి మనం చాలా దూరం వెళ్ళవలసి ఉంటుంది” అని డెమోక్రసీ ఆన్డ్ టోలరన్స్ అనే పుస్తకం ఒప్పుకుంటుంది. ఇప్పుడు, ఫ్రాన్స్‌తో సహా అనేక దేశాల్లో, మత స్వాతంత్ర్యం బెదిరింపుకు గురౌతున్నప్పటికీ, త్వరలోనే అసహిష్ణుత అనేది గతించిన విషయంగా మారుతుందని బైబిలు వాగ్దానం చేస్తోంది. నిజమైన ప్రపంచవ్యాప్త సౌభ్రాతృత్వంలో, లేదా సహోదరత్వంలో మానవజాతి ఐక్యమౌతుంది. అక్కడ ఇతరుల మీద గౌరవమనేది ప్రబలి ఉంటుంది. మానవులు ఇంకెన్నడూ అజ్ఞానం చేత బాధించబడరు. ఎందుకంటే, దేవుడి రాజ్యం ప్రజలకు యెహోవా మార్గాలను బోధించి, ఆ విధంగా, తమ మేధాసంబంధమైన, భావోద్వేగ సంబంధమైన, ఆధ్యాత్మికమైన అవసరాలను తృప్తిపరుస్తుంది. (యెషయా 11:9; 30:21; 54:13) నిజమైన సమానత్వమూ, స్వాతంత్ర్యమూ భూమ్యంతటా వ్యాపిస్తాయి. (2 కొరింథీయులు 3:17) మానవజాతి కొరకైన దేవుడి ఉద్దేశాన్ని గూర్చిన ఖచ్చితమైన జ్ఞానాన్ని సంపాదించడం ద్వారా, మీరు అజ్ఞానాన్ని, అసహిష్ణుతను ఎదిరించవచ్చు.
[11వ పేజీలోని బాక్సు/చిత్రం]
మతం బెదిరించబడింది
ఇటీవలి సంవత్సరాల్లో, ఫ్రాన్స్‌లోని అధికారులు ఇతర మతాలకు ఇచ్చేటువంటి సౌకర్యాలను ఇవ్వకుండా యెహోవాసాక్షులను అణచివేయాలని ప్రయత్నించారు. ఇటీవల, సాక్షుల మతసంబంధ క్రియాశీలతలకు మద్దతుగా అందిన విరాళాలపై చాలా ఎక్కువ పన్ను విధించబడింది. ఫ్రెంచ్ అధికారులు అన్యాయంగా, 5 కోట్ల డాలర్ల పన్ను భారాన్ని (పన్ను, జరిమానా) విధించారు. స్పష్టంగా అది ఫ్రాన్స్‌లో ఉన్న 2,00,000 మంది గల ఈ క్రైస్తవుల గుంపును, తదనుభూతిగలవారిని అశక్తంగా చేయాలన్న లక్ష్యంతోనే అలా చేశారు. మతసంబంధంగా నిర్హేతుకమైన దురభిప్రాయంతోకూడిన తగని చర్య ఇది. ఇది స్వాతంత్ర్యం, సహోదరత్వం, సమానత్వం అనే సూత్రాలకన్నింటికీ విరుద్ధంగా ఉంది.
[10వ పేజీలోని చిత్రం]
అసహిష్ణుత తరచూ హింసకు దారి తీస్తుంది
[12వ పేజీలోని చిత్రాలు]
యెహోవాసాక్షుల కార్యక్రమాలు మతసంబంధమైనవైనప్పటికీ కొందరు ఫ్రెంచ్ అధికారులు అవి మతసంబంధమైనవి కావంటున్నారు!