బాధ్యతలు లేని హక్కులా?
“ప్రపంచంలో స్వాతంత్ర్యానికీ, న్యాయానికీ శాంతికీ పునాది మానవ కుటుంబంలోని సభ్యులందరి స్వతఃసిద్ధమైన హుందాతనాన్నీ, అందరికీ సమానంగా ఉండేటువంటి, వాళ్ళనుండి తీసివేయలేనటువంటి హక్కులనూ గుర్తించడమే” అని యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఉపోద్ఘాతం పేర్కొంది. 1998 డిసెంబర్ నాటికి యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్‌కు 50వ సంవత్సరం వస్తుంది. అయితే, ఇటీవల, పైవిధంగా ఉద్ఘాటించడమే కాక, మానవ బాధ్యతలను గురించిన సార్వత్రిక ఉద్ఘాటనను ఐక్యరాజ్యాలు ఆమోదించాలని అన్ని ఖండాలకూ ప్రాతినిధ్యం వహించిన 24 మంది మాజీ ప్రెసిడెంట్లూ, ప్రైమ్ మినిస్టర్లూ సూచించారు. అలాంటి ప్రాజెక్ట్ అవసరముందని అనేకులు ఎందుకు అనుకుంటారు?
“హక్కులూ, బాధ్యతలూ అతుక్కుని పుట్టిన కవల పిల్లల్లాంటివి. విచారకరంగా, యాభై సంవత్సరాల తర్వాత, ఈ వాస్తవం మరువబడింది, లేదా సముచితమైనది కాదన్నట్లుగా తలంచబడుతుంది. చాలా మంది తమ హక్కులను గురించి అడుగుతారే గానీ, దాని వల్ల వచ్చే బాధ్యతను వహించవలసిన అవసరం ఉందని మాత్రం గ్రహించరు” అని యూరోపియన్ కమిషన్ ఫొర్ హ్యూమన్ రైట్స్ సభ్యుడైన ప్రొఫెసర్ జాన్ క్లోడ్ స్వాయే వివరిస్తున్నారు. కర్తవ్యాలను నిర్లక్ష్యం చేయడం జరుగుతుందని అనేకులు గమనించారు. “నేడు లోకంలో దురాశ, స్వార్థం, సామాజిక స్ఫూర్తిని కోల్పోవడం వంటి ప్రభావాలు రాజ్యమేలుతున్నట్లు కనిపిస్తుంది. . . . వాటితో వ్యవహరించే, వాటిని అదుపులో ఉంచే ఏదో రకమైన ఐక్యతా దర్శనం కలగాలన్న వాంఛ, అందుకోసమైన గుర్తింపు పొందిన ఆదర్శాలు కావాలన్న వాంఛ ముఖ్యంగా యువకుల మధ్య విస్తృతంగా కనిపిస్తుంది. భూగోళవ్యాప్తంగా వర్తించే నీతిశాస్త్రం అవసరం ఉందనేదానిపై పెద్ద చర్చ జరిగిందంటే ఏదో లోపించింది అని ఒప్పుకున్నట్లే అర్థం” అని పారిస్ దినపత్రికయైన ఇంటర్నేషనల్ హెరాల్డ్ ట్రైబ్యూన్ పేర్కొంటోంది. కనుక, లోపించిన దానిని భర్తీ చేసేందుకు మానవ బాధ్యతలు ఏమిటని నిర్ణయించేందుకు రాజకీయవేత్తలూ, వేదాంతులూ, తత్త్వవేత్తలూ చర్చలు జరుపుతూ ఉన్నారు. ఇలాంటి చర్చను “సార్వత్రిక నీతిశాస్త్ర ప్రాజెక్ట్” అని ఐక్యరాజ్య సమితి విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ పిలిచింది. అయితే, వాళ్ళు కొన్ని ఇబ్బందులను ఎదుర్కున్నారు.
మానవ హక్కుల్లో వేటిని సంరక్షించాలన్నది నిర్ణయించడం సాపేక్షికంగా సులభమే అయినప్పటికీ, అన్నిచోట్లా అంగీకరించవలసిన మానవ బాధ్యతలు ఏవో నిర్వచించడం ఎల్లప్పుడూ అంత సులభం కాదు. అయితే, ప్రతిపాదించబడిన డిక్లరేషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్‌లోని కొన్ని విలువల ప్రేరణ కాలాతీతమైన సార్వత్రికమైన స్వర్ణ నియమం నుండే వచ్చింది. దాదాపు రెండువేల సంవత్సరాల క్రితం, “మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి” అని యేసు ఇచ్చిన నియమమే ఆ స్వర్ణ నియమం.—మత్తయి 7:12.
మానవ హక్కులను సంరక్షించే చట్టాల వెనుకనున్న ప్రేరణ తరచూ బైబిలే. అది వ్యక్తిగత బాధ్యత అనే తలంపును నొక్కి చెబుతుంది. “మేలైనదిచేయనెరిగియు ఆలాగు చేయనివానికి పాపము కలుగును” అని శిష్యుడైన యాకోబు స్పష్టం చేశాడు. (యాకోబు 4:17) ఇతరులకు మంచి చేయగల మార్గాల కోసం యేసు చూసినట్లే, నిజ క్రైస్తవులు కూడా తమ తోటివారికి మంచి చేయడానికి ప్రయత్నించాలి. తమ హక్కులను వినియోగించుకోవడంతో తృప్తిపడక, హక్కులతోపాటు బాధ్యతలు వస్తాయనీ, మనలో ప్రతి ఒక్కరూ తను తీసుకునే చర్యలకు దేవుడి ముందు బాధ్యులేననీ వాళ్ళు గ్రహిస్తారు.