మతస్వాతంత్ర్యం—వరమా శాపమా?
మతస్వాతంత్ర్య ఉద్భవానికి క్రైస్తవ మత సామ్రాజ్యం ప్రసవవేదనను అనుభవించవలసి వచ్చింది. పిడివాదానికీ, నిర్హేతుకమైన దురభిప్రాయాలకు, అసహిష్ణుతకూ (అంటే సహనశీలం లేకపోవడం) వ్యతిరేకమైన పోరాటం అది. అది రక్తసిక్తమైన మత పోరాటాల్లో అనేక వేల మంది ప్రాణాలను బలిగొంది. ఈ వేదనకరమైన చరిత్ర మనకేమి బోధిస్తుంది?
“క్రైస్తవ చరిత్రలో హింస అనేది దీర్ఘకాలంగా ఉంటున్న వాస్తవం” అని పేగన్స్ ఆన్డ్ క్రిస్టియన్స్ అనే పుస్తకంలో రాబన్ లేన్ ఫాక్స్ వ్రాశాడు. తొలి క్రైస్తవులను ఒక మతభేదమని పిలవడం జరిగింది. వాళ్ళు ప్రజా భద్రతకు బెదిరింపుగా ఉన్నారని వారిపై ఆరోపించబడింది. (అపొస్తలుల కార్యములు 16:20, 21; 24:5, 14; 28:22) దాని ఫలితంగా కొందరు హింసలను అనుభవించారు. కొందరు రోమన్ ఏరీనాల్లో క్రూర మృగాల చేత చంపబడ్డారు. అలాంటి భయంకరమైన హింసలు జరుగుతుండగా, వేదాంతియైన టెర్టూలియన్‌లాంటి కొందరు మతస్వాతంత్ర్యం కోసం వాదించారు. సా.శ. 212లో, “అది ప్రాథమిక మానవహక్కు, అది సహజసిద్ధమైన ఆధిక్యత, ప్రతి ఒక్కరూ తన నమ్మకాల అనుసారంగానే ఆరాధన చేయాలి” అని ఆయన వ్రాశారు.
సా.శ. 313లో కాన్‌స్టంటైన్ మిలాన్ రాజశాసనం క్రింద రోమా ప్రపంచంలో క్రైస్తవులను హింసించడం ఆగిపోయింది. అది క్రైస్తవులకూ, అన్యమతస్థులకు ఒకేలా మతస్వాతంత్ర్యాన్ని ప్రసాదించింది. రోమా సామ్రాజ్యంలో “క్రైస్తవత్వాన్ని” చట్టబద్ధం చేయడం క్రైస్తవులపై హింసాప్రవాహానికి ఆనకట్ట వేసింది. అయినప్పటికీ, సా.శ. 340లో, క్రైస్తవుడనని చెప్పుకున్న ఒక రచయిత అన్యమతస్థులను హింసించాలని పిలుపునిచ్చాడు. చివరకు, సా.శ. 392లో కాన్‌స్టంటినోపుల్ రాజశాసనం ద్వారా, చక్రవర్తియైన థియోడోసియస్ I తన సామ్రాజ్యంలోని అన్యమతాలను నిషేధించాడు. దాంతో, మతస్వాతంత్ర్యానికి అకాల మరణం ప్రాప్తించింది. రోమన్ “క్రైస్తవత్వం” జాతీయ మతంగా ఉన్నప్పుడు, చర్చీ, మరియు ప్రభుత్వమూ హింసా ఉద్యమాన్ని చేపట్టాయి. అది శతాబ్దాల పాటు కొనసాగింది. అది 11 నుండి 13 శతాబ్దాల వరకు రక్తసిక్తమైన క్రూసేడ్లతో, 12వ శతాబ్దంలో ప్రారంభమైన ఇన్‌క్విజిషన్‌లు భయానకమైన క్రూరకృత్యాలకు దారితీయడంతో తారాస్థాయికి చేరుకుంది. సంస్థాపిత మతాచారాలను, మతసిద్ధాంతపు గుత్తాధికారాన్ని ప్రశ్నించేందుకు సాహసించేవారెవరైనా సరే వాళ్ళను మతవిభేదముగా ముద్రవేసి, మంత్రగాళ్ళను వెంటాడి పట్టుకుని చంపే పంథాలో వాళ్ళను పట్టుకుని చంపేవారు. వాళ్ళు అలాంటి చర్యతీసుకోవడానికి గల కారణమేమిటి?
మతసంబంధ ఐక్యమే రాష్ట్రానికి అత్యంత గట్టి పునాదిని వేసింది గనుక మత సంబంధ వ్యత్యాసాలు ఉంటే అవి పౌర భద్రతకు బెదిరింపుగా ఉంటాయి అనే నెపంతో మతసంబంధ అసహిష్ణుత మినహాయించబడేది. ఇంగ్లండ్‌లో, 1602లో ఎలిజబెత్ రాణి మంత్రుల్లో ఒకాయన ఇలా వాదించాడు: “రాష్ట్రం రెండు మతాలను అనుమతిస్తే, అది ఎన్నడూ సురక్షితంగా ఉండదు.” వాస్తవానికి, మతసంబంధంగా భిన్నాభిప్రాయాలు గలవారు రాష్ట్రానికి గానీ, సంస్థాపిత మతానికిగానీ నిజంగానే ఒక బెదిరింపుగా ఉన్నారా అని కనుగొనడం కన్నా, వాళ్ళను నిషేధించడమే చాలా సులభంగా ఉండేది. “లౌకిక అధికారులుగానీ, చర్చి సంబంధ అధికారులు గానీ మతవిభేదముగల అపాయకారులకూ, అపాయకారులు కానివారికీ మధ్య పెద్ద వ్యత్యాసాన్ని చూడలేదు” అని క్యాథలిక్ ఎన్‌సైక్లోపీడియా పేర్కొంటోంది. అయినప్పటికీ, మార్పు త్వరలోనే రానుండింది.
పురిటి నొప్పులతో సహిష్ణుత పుట్టుక
యూరోప్‌లో మార్పుకు ప్రేరకం, ప్రొటెస్టెంటిజమ్ రేపిన అల్లకల్లోలమే. ప్రొటెస్టెంటిజమ్ అనేది అంతరించకుండా నిలదొక్కుకోగలిగిన ఒక మతవిభేదపు ఉద్యమం. ఆశ్చర్యకరమైన వేగంతో, ప్రొటెస్టెంట్ పునర్జీవనం యూరోప్ అంతటినీ కూడా మత ఆధారంగా విభజించి, మనస్సాక్షి స్వాతంత్ర్యం అనే తలంపును తీసుకువచ్చింది. ఉదాహరణకు, ప్రఖ్యాతి గాంచిన సంస్కరణకర్తయైన మార్టిన్ లూథర్ తన అభిప్రాయాలను 1521లో సమర్థించుకుంటూ, “నా మనస్సాక్షి దేవుడి వాక్యానికి కట్టుబడి ఉంటుంది” అన్నాడు. విభజన యూరోప్‌నంతటినీ తుడిచిపెట్టిన క్రూరమైన మతసంబంధ యుద్ధాల పరంపరగా, థర్టీ ఇయర్స్ వార్ (1618-48) రాజుకునేలా కూడా చేసింది.
అయితే, యుద్ధం జరుగుతుండగా, అనేకులు ఘర్షణ అనేది పురోగమన పథం కాదని గ్రహించారు. అలా ఫ్రాన్స్‌లోని ఎడిక్ట్ ఆఫ్ నాన్‌టేస్ (1598) వంటి రాజశాసనాలు యుద్ధ పీడిత యూరోప్‌లో శాంతిని స్థాపించేందుకు విఫల యత్నం చేశాయి. ఈ శాసనాల మూలంగానే, సహిష్ణుత (సహనశీలం) అనే ఆధునికదిన తలంపు కాలక్రమేణ పరిణమించింది. మొదట్లో, “సహిష్ణుత” అనేది ప్రతికూల సూచనలను ఇచ్చేది. “నిర్దిష్ట పరిస్థితుల్లో, మనం మతవిభేదాలను సహించవలసి ఉంటే, నిస్సంశయంగా అది కీడే అయ్యుంటుంది—నిజానికి, చాలా గంభీరమైన కీడే అయ్యుంటుంది—అయినా అది యుద్ధమంత ఘోరమైనది మాత్రం కాదు” అని ప్రసిద్ధ మానవతావాది అయిన ఎరాస్‌మస్ 1530లో వ్రాశాడు. ఇలా ప్రతికూల భావాన్ని తీసుకోవడం వల్ల, 1561లోని ఫ్రెంచ్ దేశస్థుడైన పోల్ డ ఫ్వా లాగే కొందరు “సహిష్ణుత” గురించి మాట్లాడే బదులు, “మతస్వాతంత్ర్యం” గురించి మాట్లాడడానికే ఇష్టపడేవారు.
అయితే, సమయం గడుస్తున్న కొద్దీ, రెండు కీడులలో తక్కువ కీడైనదిగా కాకుండా, స్వాతంత్ర్యాల సంరక్షకుడుగా సహిష్ణుత రంగప్రవేశం చేసింది. అది బలహీనతను ఒప్పుకునేదిగా కాక, స్వాతంత్ర్యానికి హామీ ఇచ్చేదిగానే దృష్టించబడింది. ఎప్పుడైతే, వివిధ మతాల్లో పాల్గొనడమూ, విభిన్నంగా ఆలోచించే హక్కూ ఆధునిక సమాజానికి ఆధారాలని భావించబడిందో, అప్పుడే మతఛాందసం తగ్గుముఖం పట్టడం తప్పనిసరైంది.
18వ శతాబ్దపు అంతంలో, సహిష్ణుతను స్వాతంత్ర్యంతోనూ, సమానత్వంతోను ముడిపెట్టడం జరిగింది. ఫ్రాన్స్‌లో ప్రఖ్యాతిగాంచిన డిక్లరేషన్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ మ్యాన్ ఆన్డ్ ఆఫ్ ద సిటిజన్ (1789), లేదా అమెరికాలో బిల్ ఆఫ్ రైట్స్ (1791) లాంటి చట్టాల మరియు ఉద్ఘాటనల రూపంలో ఇది వ్యక్తీకరించబడింది. 19వ శతాబ్దం మొదలుకొని, ఈ డాక్యుమెంట్‌లు స్వతంత్రంగా ఆలోచించడంపై ప్రభావం చూపించనారంభించగా, సహిష్ణుతా, దానితోపాటు స్వాతంత్ర్యమూ ఇక మీదట శాపంగా కాక, వరంగా దృష్టించబడ్డాయి.
సాపేక్షిక స్వాతంత్ర్యం
స్వాతంత్ర్యం అమూల్యమైనదే అయినా, అది సాపేక్షికంగా మాత్రమే ఉంది. అందరికీ గొప్ప స్వాతంత్ర్యం అనే పేరట ప్రభుత్వం కొందరి స్వేచ్ఛకు పరిమితులు ఉంచుతూ చట్టాలను అమలు చేస్తుంది. అనేక యూరోప్ దేశాల్లో ప్రస్తుతం వాగ్వివాదంగా మారిన మతసంబంధ వివాదాల్లో కొన్ని: ప్రభుత్వ శాసనం వ్యక్తిగత జీవితంలో ఎంత మేరకు వర్తించాలి? అది ఎంత ఫలవంతంగా ఉంటుంది? అది స్వాతంత్ర్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది?
ప్రజా స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛలపై గల వివాదాలను మాధ్యమాలు నొక్కి తెలిపాయి. మనుష్యుల తలంపును పూర్తిగా మర్చేశాయనీ, డబ్బు దోచుకున్నాయనీ, పిల్లలపై అత్యాచారం చేశాయనీ, ఇతర పెద్ద నేరాలకు పుట్టినిల్లుగా మారాయనీ కొన్ని మత సమూహాలవైపుకు వేలెత్తి చూపడం జరుగుతుంది. తరచూ అలాంటి రుజువులేమీ లేకుండానే అలా జరుగుతుంది. సమాచార మాధ్యమాలు అల్ప సంఖ్యాక మత సమూహాలపై క్రొత్త కథలను అల్లి అంతటా ప్రచారం చేశాయి. “మతతెగ” “మతభేదము” వంటి అవమానకరమైన లేబల్‌లు ఇప్పుడు వాడుక మాటల్లో భాగమై పోయాయి. ప్రజా అభిప్రాయాల ఒత్తిడితో, ప్రభుత్వాలు అపాయకరమైన తెగలు అని పిలువబడుతున్నవేవో తెలిపే లిస్ట్‌ను తయారుచేశాయి కూడా.
ఫ్రాన్స్ తన సహిష్ణుత విషయమై, మతానికీ, రాష్ట్రానికీ మధ్య ఉన్న భేదాన్ని చూపే తన సాంప్రదాయం విషయమై చాలా గర్విస్తుంది. ఇది “స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం”ల దేశం అని తన గురించి తాను గర్వంగా చెప్పుకుంటుంది. అయినప్పటికీ, ఫ్రీడమ్ ఆఫ్ రిలిజియన్—ఎ వాల్డ్ రిపోర్ట్ అనే పుస్తకం ప్రకారం, ఆ దేశంలో “క్రొత్త మతోద్యమాలను నిరాకరించడాన్ని ప్రోద్బలపరిచేందుకు పాఠశాలలో ఒక విద్యాభ్యాస ప్రచారం” చేయాలని సిఫారసు చేయబడింది. అయినప్పటికీ, చాలా మంది ప్రజలు ఈ విధంగా చర్య తీసుకోవడం మతస్వాతంత్ర్యానికి ఒక బెదిరింపుగా ఉంటుందని అనుకుంటారు. అదెలా?
మతస్వాతంత్ర్యానికి బెదిరింపులు
చట్టానికి గౌరవం చూపించే, విధేయతను చూపించే మత గుంపులన్నింటితోను రాష్ట్రం సమానమైన విధంగా వ్యవహరించినప్పుడే నిజమైన మతస్వాతంత్ర్యం మనుగడ సాగిస్తుంది. మత సముదాయాల్లో ఏదైనా ఒక సముదాయాన్ని గురించి అది ఒక మతం కాదని ప్రభుత్వమే ఇష్టానుసారంగా నిర్ణయించడమూ, తద్వారా ఆ ప్రభుత్వం ఇతర మతాలకు అనుమతించే అనుకూల పరిస్థితులను ఆ సముదాయానికి అనుమతించకపోవడమూ జరిగినప్పుడు మతస్వాతంత్ర్యం ఉనికిలో లేకుండా పోతుంది. “ప్రభుత్వం డ్రైవర్లకు లైసెన్స్ ఎలా ఇస్తుందో, అలా, మతాలకు సర్టిఫికెట్ ఇచ్చే హక్కు ఉన్నదని చెప్పుకున్నప్పుడు మతస్వాతంత్ర్యం అనే ఉన్నతమైన తలంపు విలువలేనిదిగా ధ్వనిస్తుంది” అని 1997లో టైమ్స్ పత్రిక పేర్కొంది. అలా చేయడం “తెలిసో తెలియకో ఏకపక్ష ప్రభుత్వంగా మారేలా నడిపిస్తుంది” అని ఈ మధ్యే ఒక ఫ్రెంచ్ అప్పీల్ కోర్ట్ ఉద్ఘాటించింది.
మాధ్యమాలపై ఒక గుంపుకు గుత్తాధిపత్యం ఉన్నప్పుడు కూడా ప్రాథమిక స్వాతంత్ర్యాలకు బెదిరింపు ఎదురౌతుంది. దురదృష్టవశాత్తూ, అనేక దేశాల్లో ఎక్కువగా ఇదే జరుగుతుంది. ఉదాహరణకు, మతసంబంధంగా ఏది సరైనది అని నిర్వచించేందుకు, మతతెగలకు వ్యతిరేకమైన సంస్థలు తమంతట తాము ప్రాసిక్యూటర్‌లుగా, జడ్జీలుగా, జ్యూరీలుగా రూపొంది, పక్షపాతంతో కూడిన తమ దృక్కోణాలను మాధ్యమాల ద్వారా ప్రజల మీద రుద్దడానికి ప్రయత్నించాయి. అయితే, ఫ్రెంచ్ వార్తాపత్రికయైన ల మొండ్ చెప్పినట్లు, ఆ విధంగా చేయడంలో, ఈ సంస్థలు “తాము తొలగించాలనుకుంటున్న మతతెగవాదాన్నే” కొన్నిసార్లు ప్రదర్శిస్తున్నాయి, “‘మాంత్రికుల కోసం గాలించే’టువంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి.” ఆ పత్రిక “అల్పసంఖ్యాక మత గుంపులు చెడ్డవనే అపవాదం . . . అత్యవసరమైన స్వాతంత్ర్యానికి బెదిరింపుగా ఉండదా?” అని అడిగింది. జైట్స్‌రిఫ్ట్ ఫూర్ రేలీగ్యోన్‌స్యూకోలోజీ (మతసంబంధ మనశ్శాస్త్ర పత్రిక)లో పేర్కొనబడిన మార్టిన్ క్రీల్, “మతతెగల సంఖ్య పెరగడం కన్నా తెగలవారిని దుర్మంత్రవాదులని ముద్రవేసి పీడించడమే ఎక్కువ చింతకు కారణమౌతుంది. సరళంగా చెబితే: చట్టాన్ని అతిక్రమించని పౌరులను ప్రశాంతంగా ఉండనీయాలి. మతమూ, ఆదర్శవాదమూ స్వతంత్రంగా ఉండాలి, అది జర్మనీలో కూడా అలాగే ఉండాలి” అని పేర్కొన్నాడు. మనం ఒక ఉదాహరణ పరిశీలిద్దాం.
“అత్యంత నమ్మకస్థులైన పౌరులు”—“అపాయకారులు” అని ముద్రవేయబడ్డారు
స్పెయిన్‌లోని ప్రసిద్ధ ABC వార్తాపత్రికలో పేర్కొనబడిన క్యాథలిక్ అధికారుల అభిప్రాయంలో, ఏ మత గుంపు “మతవిభేదాలన్నింటిలో అత్యంత అపాయకరమైనది”? ABC వార్తాపత్రిక యెహోవాసాక్షుల గురించి మాట్లాడుతుందని తెలుసుకున్నప్పుడు మీరు ఆశ్చర్యపడవచ్చు. వాళ్ళకు వ్యతిరేకంగా ఆరోపించబడిన విషయాలు నిష్పక్షపాతమైనవా, వాస్తవికమైన ఆధారంగలవా? ఇతర మూలాల నుండి తీయబడిన క్రింది ఉద్ఘాటనలను గమనించండి:
“యెహోవాసాక్షులు పన్నులను సత్యసంధంగా చెల్లించాలనీ, యుద్ధాల్లోగానీ, యుద్ధ సన్నాహాల్లోగానీ పాల్గొనకూడదనీ, దొంగతనం చేయకూడదనీ, మొత్తం మీద, ఇతరులు అవలంభిస్తే, పౌర సహజీవన ప్రమాణంలో అభివృద్ధికి నడిపించేటటువంటి జీవన విధానాన్ని అవలంభించమని ప్రజలకు బోధిస్తారు.”—సర్జియో ఆల్బెసెనో, టాలెంటో, నవంబర్-డిసెంబర్ 1996.
“నిర్దిష్ట సందర్భాల్లో ప్రచారం చేయబడిన తప్పుడు అభిప్రాయాలకు భిన్నంగా, [యెహోవాసాక్షులు] రాష్ట్ర సంస్థాపనలకు ఏ మాత్రం చిన్న ప్రమాదాన్ని కూడా తీసుకువస్తున్నట్లు నాకు అనిపించదు. వాళ్ళు శాంతి కాముకులైన, మనస్సాక్షిగల, అధికారులంటే గౌరవంగల పౌరులు.”—ఒక బెల్జియన్ పార్లమెంటరీ డెప్యూటి.
“ఫెడరల్ రిపబ్లిక్‌లో అందరికన్నా నిజాయితీగల ప్రజలు యెహోవాసాక్షులేనని గుర్తించవచ్చు.”—జర్మన్ వార్తాపత్రికయైన జిండల్‌ఫింగర్ సైటుంగ్.
“మీరు [యెహోవాసాక్షులను] మాదిరి పౌరుల్లా ఎంచవచ్చు. వాళ్ళు పన్నులను శ్రద్ధగా చెల్లిస్తారు, రోగులకు పరిచర్య చేస్తారు, నిరక్షరాస్యతను తొలగించేందుకు శ్రమిస్తారు.”—అమెరికా వార్తాపత్రికయైన శాన్ ఫ్రాన్సిస్కో ఎగ్జామినర్.
“యెహోవాసాక్షులు ఇతర మతవిభాగాలవారికన్నా కూడా వివాహ బంధాలను పటిష్ఠంగా ఉంచడంలో చాలా గొప్ప సాఫల్యాన్ని అనుభవిస్తారు.”—అమెరికన్ ఎత్నోలజిస్ట్.
“ఆఫ్రికా దేశాల్లో అత్యంత నీతిమంతులైన, శ్రద్ధగల పౌరుల కోవలో యెహోవాసాక్షులు ఉన్నారు.”—డా. బ్రైయన్ విల్సన్ ఆక్స్‌ఫార్డ్ యూనివర్సిటీ.
“ఆ విశ్వాసంగల వారు దశాబ్దాలుగా స్వతంత్రతా స్పృహను విస్తృతం చేయడానికి చాలా దోహదపడ్డారు.”—నాట్ హెన్‌టఫ్, ఫ్రీ స్పీచ్ ఫొర్ మి—బట్ నాట్ ఫొర్ దీ.
“వాళ్ళు . . . మన ప్రజాస్వామ్యప్రభుత్వంలో అత్యంత విలువైన విషయాల్లో కొన్నింటిని కాపాడడంలో నిర్దిష్టమైన విధంగా తోడ్పడ్డారు.”—ప్రొఫెసర్ సి. ఎస్. బ్రేడన్, దీస్ ఆల్సో బిలీవ్.
పై ఉద్ఘాటనలు సూచిస్తున్నట్లు, యెహోవాసాక్షులు ప్రపంచవ్యాప్తంగా మాదిరికరమైన పౌరులుగా గుర్తించబడ్డారు. అంతేకాక, వాళ్ళు నడిపే ఉచిత బైబిలు విద్యాభ్యాస పనిని బట్టి, కుటుంబ విలువలు పెంచడాన్నిబట్టి పేరుగాంచారు. వాళ్ళు నడిపిన అక్షరాస్యతా తరగతులు వేలకొలది మందికి సహాయపడగా, వాళ్ళు మానవత్వంతో చేసిన పనులు దశాబ్దాలుగా వేలాది మందికి, ముఖ్యంగా ఆఫ్రికాలోనివారికి సహాయపడ్డాయి.
వాస్తవికత యొక్క ప్రాముఖ్యత
నీతి నియమాలు లేని ప్రజలతో నిండివున్న సమాజం నిరపరాధులైన వ్యక్తులపై విరుచుకు పడుతుంది. అందువల్ల, ఎవరైనా తాము మతవిశ్వాసులమని చెప్పుకునేటప్పుడు, అప్రమత్తంగా ఉండవలసిన అవసరం తప్పనిసరిగా ఉంది. కొందరు పత్రికా విలేఖరులు వాస్తవికంగా నిపుణులైనవారిని సంప్రదించకుండా, సభ్యులు తగ్గిపోతున్న చర్చీలూ, లేక మతతెగలవిరుద్ధంగా ఏర్పడిన తీవ్రమైన ప్రశ్నార్హమైన లక్ష్యాలుగల సంస్థలూ ఇచ్చే సమాచారంపై ఆధారపడుతున్నప్పుడు మతస్వాతంత్ర్యం ఎంత వాస్తవికమైనదిగా ఉంటుంది, ఎంత ప్రోత్సాహకరమైనదిగా ఉంటుంది? ఉదాహరణకు, యెహోవాసాక్షులను “అన్ని మత తెగల్లోకెల్లా అత్యంత అపాయకరమైనదని” అన్న ఒక వార్తాపత్రిక, ఆ నిర్వచనం, “[క్యాథలిక్] చర్చి నిపుణుల” నుండే వచ్చిందని ఒప్పుకుంది. మతతెగలు అని వేటి గురించి చెప్పబడుతుందో వాటి గురించిన శీర్షికల్లో అనేకము మతతెగలకు విరుద్ధంగా రూపొందిన సంస్థల నుండి ఆవిర్భవించినవేనని ఒక ఫ్రెంచ్ పత్రిక పేర్కొంది. వాస్తవికమైన సమాచారాన్ని పొందగల అత్యంత నిష్పక్షపాతమైన మార్గమిదేనని మీకనిపిస్తుందా?
యు.ఎన్. వంటి ప్రాథమిక మానవ హక్కులను గురించిన చింతగల అంతర్జాతీయ కోర్టులూ, సంస్థలూ, “మతానికీ, మతతెగకూ మధ్య గీసిన విభజన రేఖ అంగీకరించలేనంతగా అస్వాభావికంగా కనిపిస్తుంది” అని అంటున్నాయి. మరి ప్రతికూలస్ఫూర్తిని కలిగించే పదమైన “మతవిభేదము” అనే పదాన్ని ఉపయోగించేందుకు చాలా మంది ఎందుకు మంకుపట్టు పడతారు? మతస్వాతంత్ర్యం బెదిరింపుకు గురైంది అనేదానికి ఇది అదనపు రుజువునిస్తుంది. అయితే మరి, ఈ అత్యవసరమైన స్వాతంత్ర్యాన్ని ఎలా సంరక్షించవచ్చు?
[8వ పేజీలోని బాక్సు/చిత్రం]
16వ శతాబ్దంలో యూరోప్‌లో మతస్వాతంత్ర్యాన్ని సమర్థించినవాళ్ళు
యూరోప్‌లో 16వ శతాబ్దంలో జరిగిన మతసంబంధ పోరాటంలో నరమేధం జరిగినప్పుడు మతస్వాతంత్ర్యం కొరకైన రోదనం వినబడింది. ఈ రోదనానికి మతస్వాతంత్ర్యాన్ని గురించిన చర్చతో ఇప్పటికీ సంబంధముంది.
సెబాస్టియన్ షాటేయన్ (1515-63): “ధర్మవిరోధి అంటే ఏంటి? మన అభిప్రాయంతో ఏకీభవించనివాళ్ళనందరినీ మనం ధర్మవిరోధులని పిలస్తున్నామన్నది తప్ప మరే తేడా నాకు కనిపించడం లేదు. . . . ఈ నగరంలో లేదా ఈ ప్రాంతంలో, మిమ్మల్ని ఒక నిజమైన విశ్వాసిగా ఎంచుతున్నట్లయితే, మరో చోట మిమ్మల్ని ధర్మవిరోధిగా ఎంచుతారు.” ప్రసిద్ధ ఫ్రెంచ్ బైబిలు అనువాదకుడూ, సహిష్ణుత (సహనశీలం) ఉండాలి అని క్రియాశీలంగా సమర్థించేవాడునైన షాటేయన్, ధర్మవిరోధి అంటే ఎవరో ఎవరు నిర్వచిస్తారు అనే ప్రశ్నతో మతస్వాతంత్ర్యపు చర్చలో అతి కీలకమైన కారకాల్లో ఒక దాన్ని స్పృశించాడు.
డర్క వోల్‌కర్‌ట్సూన్ కోర్న్‌హర్ట్ (1522-90): “గత కాలంలో . . . యెరూషలేములో క్రీస్తుతో సహా యూరోప్‌లో అనేక హతసాక్షులు . . . తమ సత్యపు మాటలతో [సమాజాన్ని] కలతపరచారు. . . . ‘కలతపరచబడింది’ అనే పదం యొక్క అర్థాన్ని ఖచ్చితంగా, స్పష్టంగా నిర్వచించవలసిన అవసరం ఉంది.” కార్న్‌హర్ట్ మతసంబంధ వ్యత్యాసాన్ని ప్రజా భద్రతకు భంగం కలిగించే దానితో సమానమన్నట్లుగా దృష్టించకూడదని వాదించేవాడు. ఆయనిలా అడిగాడు: చట్టానికి శ్రద్ధగా విధేయతచూపిస్తూ, గౌరవంచూపేవారు నిజానికి పౌర భద్రతకు బెదిరింపుగా ఉన్నారా?
ప్యెర్ డ బెల్వా (1540-1611): “వివిధ మతాలుండడం రాష్ట్రంలో సంక్షోభాన్ని కలిగిస్తుందనీ, దానిని మరింత ఉద్ధృతం చేస్తుందనీ నమ్మడం అజ్ఞానం.” బెల్వా అనే ఫ్రెంచ్ లాయర్ మతాల మధ్య యుద్ధాలు జరుగుతున్న సమయంలో (1562-98) వ్రాస్తూ రాష్ట్రంలో ఏకత అనేది, ప్రభుత్వం మతసంబంధంగా ఒత్తిళ్ళు తేకపోతే తప్ప, మత ఐక్యత మీద ఆధారపడదు.
థామస్ హెల్విస్ (దాదాపు 1550-1616): “ఆయన [రాజు] ప్రజలు మానవ చట్టాలన్నింటికీ విధేయులైతే, నమ్మకస్థులైతే, వాళ్ళ నుండి కోరడానికి ఏమిలేదు.” ఆంగ్ల బాప్టిస్ట్‌ల స్థాపకుల్లో ఒకరైన హెల్విన్, చర్చి మరియు ప్రభుత్వం వేరుగా ఉండాలని కోరుతూ, అన్ని చర్చీలకు మతతెగలకు మత స్వాతంత్ర్యాన్ని అనుమతించాలనీ, ప్రజలపై ఆస్తులపై గల సివిల్ అధికారంతో తృప్తిపడమనీ రాజుకు ఉద్బోధించాడు. ఆయన లేఖలు, రాష్ట్రం ఆధ్యాత్మికతపై ఎంత మేరకు అధికారం చేయాలి అనే ప్రస్తుత ప్రశ్నను నొక్కివక్కాణించాయి.
అజ్ఞాత రచయిత (1564): “ఒక వ్యక్తి తాను ఆమోదించే మతాన్ని అవలంభించేందుకు అనుమతి లేకపోతే, తాను ఆమోదించని మతాన్ని అవలంబించకుండా ఉండే అనుమతి ఉన్నా మనస్సాక్షి స్వాతంత్ర్యాన్ని అమలుచేసేందుకు సరిపోదు.”
[చిత్రాలు]
టెర్టూలియన్
షాటేయన్
డ బెల్వా
[క్రెడిట్ లైను]
All photos: © Cliché Bibliothèque Nationale de France, Paris