మత స్వాతంత్ర్యం మీకు ఏ భావాన్ని కలిగివుంది?
అమెరికాలో మత స్వాతంత్ర్యం ప్రాథమిక హక్కుగా పరిగణింపబడుతున్నప్పటికీ, 1940లలో యెహోవాసాక్షులకు విరుద్ధంగా సామూహిక దౌర్జన్యం యొక్క అల ఆ దేశాన్ని ఊపేసింది
కోట్లాదిమంది దాని కొరకు పోరాడారు. కొందరు దాని కొరకు మరణించారు కూడా. వాస్తవంగా అది మానవజాతి యొక్క అత్యంత అమూల్యమైన సంపదల్లో ఒకటి. అదేమిటి? స్వాతంత్ర్యం! స్వాతంత్ర్యం అంటే “ఎంపికలు చేసుకుని, వాటిని నెరవేర్చగల సామర్థ్యం” అని ది వరల్డ్ బుక్ ఎన్సైక్లోపీడియా నిర్వచిస్తుంది. అది ఇంకా ఇలా చెబుతోంది: “న్యాయసంబంధ దృక్కోణం నుండి చూస్తే, సమాజం ప్రజలపై అన్యాయమైన, అనవసరమైన లేక నిర్హేతుకమైన హద్దులను ఏర్పరచకపోతే సాధారణంగా వారు స్వతంత్రంగా ఉంటారు. సమాజం వారి హక్కులను కూడా కాపాడాలి అంటే, వారి ప్రాథమిక స్వేచ్ఛలను, శక్తులను మరియు ఆధిక్యతలను కాపాడాలి.”
ఈ సిద్ధాంతం చాలా సులభంగా అనిపిస్తుంది. అయితే, దాన్ని ఆచరించే విషయానికొస్తే, స్వేచ్ఛకు ఎక్కడ హద్దులు ఏర్పర్చాలనే విషయంలో ప్రజలు ఏకీభవించడం వాస్తవంగా అసంభవమనిపిస్తుంది. ఉదాహరణకు, తన పౌరుల స్వేచ్ఛను కాపాడేందుకు ఒక ప్రభుత్వం శాసనాలను నియమించాలని కొందరు నమ్ముతారు. అయితే పౌరులను ఏ సంకెళ్లనుండి విడిపించాలో ఆ సంకెళ్లే ఈ శాసనాలని ఇతరులు వాదిస్తారు! స్వాతంత్ర్యం అనేది వివిధ ప్రజలకు వివిధ భావాలను కలిగి ఉందన్నది స్పష్టమౌతుంది.
మత స్వాతంత్ర్యం సంగతేమిటి?
బహుశ అన్నిటికంటే ఎక్కువగా మత స్వాతంత్ర్యమే చాలా వివాదాస్పద విషయంగా ఉండి ఉండవచ్చు, అది “ఒకరికి నచ్చిన విశ్వాసంలో నమ్మకాన్ని కలిగి ఉండేందుకు మరియు దాన్ని అనుసరించేందుకు హక్కును కలిగివుండటం” అని నిర్వచించబడింది. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విశ్వవ్యాప్త ప్రకటన ప్రకారం, “ఆలోచనా స్వాతంత్ర్యాన్ని, మనస్సాక్షిని మరియు మతాన్ని కలిగి ఉండగల స్వేచ్ఛను కలిగివుండే హక్కును అందరూ కలిగి ఉన్నారు.” “తన మతాన్ని లేక విశ్వాసాన్ని మార్చుకునే” హక్కుతోపాటు “తన మతాన్ని లేక విశ్వాసాన్ని బోధలో, ఆచరణలో, ఆరాధనలో మరియు అవలంబనలో వ్యక్తం చేయడానికి” ఒక వ్యక్తికున్న స్వేచ్ఛ కూడా ఇందులో ఇమిడివుంది.—ఆర్టికల్ 18.
తన ప్రజల ఎడల నిజమైన శ్రద్ధగల ఏ దేశమైనా అలాంటి స్వాతంత్ర్యాన్ని అందిస్తుందని మనం అపేక్షిస్తాము. అయితే, అది ఎల్లప్పుడూ జరుగకపోవడం దుఃఖకరం. “మతం అనేకమంది ప్రజల అతి లోతైన భావాలను ప్రభావితం చేస్తుంది. కొన్ని ప్రభుత్వాలు ఒక మతంతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉండి ఇతర విశ్వాసాలకు చెందిన ప్రజలను తమ రాజకీయ అధికారానికి ముప్పుగా భావిస్తాయి. ప్రభుత్వానికి లోబడి ఉండటంకంటే దైవభక్తికి మతం ఎక్కువ ప్రాధాన్యతనివ్వవచ్చు గనుక ఒక ప్రభుత్వం మతాన్ని రాజకీయపరంగా ప్రమాదకరమైన దానిగా కూడా దృష్టించవచ్చు” అని ది వరల్డ్ బుక్ ఎన్సైక్లోపీడియా పేర్కొంటుంది.
ఈ కారణాలనుబట్టి కొన్ని ప్రభుత్వాలు మతాన్ని ఆచరించడంలో నిర్బంధాలను కూడా పెట్టవచ్చు. కొన్ని ప్రభుత్వాలు ఎలాంటి విశ్వాసాన్ని అనుసరించడాన్నైనా నిరుత్సాహపర్చవచ్చు. మరి కొన్ని ప్రభుత్వాలు, ఆరాధనాస్వాతంత్ర్యాన్ని ప్రోత్సహిస్తున్నామని చెబుతున్నప్పటికీ, అన్ని మత సంబంధ కార్యకలాపాలను పూర్తిగా నియంత్రిస్తాయి.
ఉదాహరణకు, మెక్సికోలో అనేక సంవత్సరాలపాటు నెలకొని ఉండిన పరిస్థితిని పరిశీలించండి. రాజ్యాంగం మత స్వాతంత్ర్యాన్ని హామీ ఇచ్చినప్పటికీ, అదిలా ఖండితంగా చెప్పింది: “ఆరాధన కొరకు ప్రజలు ఉపయోగించుకునే చర్చీలు, సమాఖ్య ప్రభుత్వం చేత ప్రాతినిధ్యం వహించబడే దేశం యొక్క ఆస్తి, అలా వేటిని ఉపయోగించడంలో కొనసాగవచ్చో నిర్ణయించేది కూడా దేశమే.” ఈ నిర్బంధాలను సమాప్తి చేసేందుకు 1991లో రాజ్యాంగం సవరించబడింది. అయినప్పటికీ, మత స్వాతంత్ర్యం వివిధ దేశాల్లో భిన్నంగా నిర్వచించబడగలదని ఈ ఉదాహరణ చూపుతుంది.
మరొక విధమైన మత స్వాతంత్ర్యం
మీరు నివసించే దేశంలో మత స్వాతంత్ర్యం ఉందా? ఒకవేళ ఉంటే అదెలా నిర్వచించబడుతుంది? మీరు ఎంపిక చేసుకున్న విధంగా మీరు దేవున్ని ఆరాధించగలరా లేక ప్రభుత్వమత సభ్యులుగా మారాలని మీరు బలవంతం చేయబడుతున్నారా? మత సాహిత్యాలను చదివి, వాటిని పంచిపెట్టేందుకు మీరు అనుమతించబడుతున్నారా లేక అలాంటి ప్రచురిత సాహిత్యాన్ని ప్రభుత్వం నిషేధిస్తుందా? మీరు మీ విశ్వాసాన్ని గురించి ఇతరులతో మాట్లాడవచ్చా, లేక ఇది వారి మత హక్కులను ఉల్లంఘించడంగా భావించబడుతుందా?
ఈ ప్రశ్నలకు జవాబులు మీరు ఎక్కడ నివసిస్తున్నారనే దానిపై ఆధారపడి ఉంటాయి. అయితే, ప్రాంతంపై ఎంతమాత్రం ఆధారపడని ఒక మత స్వాతంత్ర్యం ఉందన్నది ఆసక్తికరమైన విషయం. సా.శ. 32వ సంవత్సరంలో యెరూషలేములో ఉన్నప్పుడు, “మీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులై యుండి సత్యమును గ్రహించెదరు; అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని” యేసు తన అనుచరులకు చెప్పాడు.—యోహాను 8:31, 32.
ఇలా వ్యాఖ్యానించినప్పుడు యేసు ఉద్దేశం ఏమిటి? ఆయన మాటలు వింటున్న యూదులు రోమా పరిపాలన నుండి స్వేచ్ఛను కోరుకుంటున్నారు. అయితే యేసు రాజకీయ అణచివేత నుండి స్వాతంత్ర్యాన్ని గురించి చర్చించటం లేదు. బదులుగా, ఆయన తన శిష్యులకు మరెంతో శ్రేష్ఠమైన దాన్ని వాగ్దానం చేస్తున్నాడు, ఆ విషయాన్ని తదుపరి శీర్షికలో మనం చూస్తాము.