బైబిలు ఉద్దేశము
అంతరిక్ష దుర్ఘటన మన ప్రపంచాన్ని నాశనం చేస్తుందా?
“ఒక మైలు వెడల్పున్న ఉల్క భూమిని ఢీకొనబోతుంది” అనే కలవరపర్చే వార్త 1998 మార్చి 12న ప్రపంచవ్యాప్తంగా వార్తాపత్రికల ప్రధాన శీర్షికల్లోనూ, టీవీ తెరల మీదా ఇంటర్నెట్ సైట్లలోనూ వచ్చింది. అసలు ప్రమాదం ఎంత అనేది అంచనా వేయడానికి విజ్ఞానశాస్త్రవేత్తలూ సామాన్యులూ బుర్రలు బద్ధలు కొట్టుకున్నారు. తాకిడి ప్రభావం శూన్యమేనని ఖగోళ శాస్త్రజ్ఞులు వెంటనే తేల్చి చెప్పారు.
అయితే, ఆ గడబిడ మధ్యన ఒక క్రొత్త విషయం వెలుగులోకి వచ్చింది. “ఆ తప్పుడు హెచ్చరిక ఎంత భయాన్ని కల్గించినప్పటికీ, దాన్ని గురించిన ఒక విశిష్టమైన విషయం ఏమైవుండవచ్చునంటే, అది పెద్దగా ఆశ్చర్యపోవాల్సిందేమీ కాదన్నట్లు చాలామంది ప్రజలు వ్యవహరించారు” అని యు. ఎస్. న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ చెప్పింది. “భూమి మీదవున్న మనం, ఇంకా అలాంటి అనేక వస్తువుల కోసం చూస్తూ వాటి విషయంలో ఏదొకటి చేయాలని పథకం వేసుకుంటామనే ఊహ, ఒక దశాబ్దం క్రిందటో లేక అంతకంటే ఎక్కువ కాలం క్రిందటో అయితే అది అనాగరికమైన చర్యగా ఉండేది, కాని ఇప్పుడు శాస్త్రజ్ఞులూ చివరికి కొంతమంది రాజకీయవేత్తలూ ప్రమాద శాతం తక్కువే అయినా అది వాస్తవమైనదేనని అనుకుంటున్నారు.”
భూగోళ విధ్వంసాన్ని కలిగించేంతటి పెద్ద సైజులోవున్న దాదాపు 2,000 అంతరిక్ష దేహాలు, భూ కక్ష్యను తాకే మార్గంలో లేదా దానికి దగ్గరగా వచ్చే మార్గంలో వేగంగా ప్రయాణిస్తున్నాయని కొంతమంది ఖగోళ శాస్త్రజ్ఞులు నమ్ముతున్నారు. ఆ అంతరిక్ష దేహాల్లో చాలా చిన్నది భూమిని తాకినా సంభవించగల విస్ఫోటనం ఎన్నో అణ్వాయుధాలు ఒకేసారి పేలితే వెలువడేంత శక్తికి సమానంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. అలాంటి తాకిడి మూలంగా వచ్చే పర్యవసానాలు మన గ్రహానికీ, అందులో నివసించే మానవులకూ జంతువులకూ ఒకేలా వినాశనకరమైనవిగా పరిణమిస్తాయి.
అలాంటి నిరాశాజనకమైన ఊహల విషయంలో, లెక్కల విషయంలో సాధారణంగా అలక్ష్యం చేయబడే ఏకైక అభిప్రాయం, విశ్వ సృష్టికర్తయైన యెహోవా దేవుని అభిప్రాయమే. (కీర్తన 8:3; సామెతలు 8:27) ఆయన భూమి పట్ల, మానవజాతి పట్ల తనకుగల చిత్తాన్నీ, సంకల్పాన్నీ బైబిలులో స్పష్టంగా తెలియజేశాడు. అంతరిక్ష దుర్ఘటన మన ప్రపంచాన్ని నాశనం చేయడానికి ఆయన అనుమతిస్తాడా?
దైవిక నియంత్రణ క్రిందనున్న విశ్వం
యెహోవా విశ్వ సర్వోన్నత సృష్టికర్త గనుక, అంతరిక్ష దేహాలను నియంత్రించే శక్తులపై పూర్తి అదుపును కలిగివుండే సామర్థ్యం ఆయనకుందనే ముగింపుకు రావడం సహేతుకం. యెహోవా “వివేచనవలన . . . ఆకాశవిశాలమును స్థిరపరచెను” అని జ్ఞానియైన సొలొమోను రాజు చెప్పాడు. (సామెతలు 3:19) దేవుడు “తన ప్రజ్ఞచేత ఆకాశమును విశాలపరచెను” అని ప్రవక్తయైన యిర్మీయా ప్రకటించాడు.—యిర్మీయా 51:15.
నక్షత్రాలు, గ్రహాలు, తోకచుక్కలు, ఉల్కలతోసహా అంతరిక్ష దేహాలన్నింటి కదలికల వెనుకనున్న సూత్రాలనూ శక్తులనూ యెహోవా ప్రారంభింపజేశాడు. (యెషయా 40:26) అయితే, అలంకారికంగా చెప్పాలంటే నక్షత్రాలూ, గ్రహాలూ తన [ఎడతెగని] ప్రమేయంలేకుండానే ఉద్భవించడం, కొంతకాలంపాటు ఉండి, ఆ తర్వాత ఉనికిలో లేకపోవడం వంటి సహజసిద్ధమైన చక్రాలను ఆయన అనుమతిస్తున్నట్టు కనబడుతోంది. అంతరిక్ష దేహాల్లో కొన్ని ఒకదానితో మరొకటి భయంకరంగా ఢీకొనడం వీటిలో చేరివుంది. ఒక తాజా ఉదాహరణ ఏమిటంటే, 1994 జూలైలో జరిగిన కొలిషనే [ఢీకొనడమే]. అప్పుడు షూమేకర్-లేవీ 9 తోకచుక్కకు చెందిన కొన్ని చిన్న ముక్కలు బృహస్పతి గ్రహంలోకి చొచ్చుకుపోయాయి.
మానవ పూర్వ చరిత్రలో, అంతరిక్షంలో నుండి వచ్చిపడ్డ పెద్ద పెద్ద శిలలు భూమిని ఢీకొన్నాయనడానికి భూవిజ్ఞాన శాస్త్రపరమైన సాక్ష్యాధారం ఉంది. కాని ప్రజలతో నిండివున్న మన గ్రహంపై అలాంటిది ఎప్పుడైనా సంభవిస్తుందా? ఉదాహరణకు, ఒక మైలు వెడల్పున్న ఉల్క భూమిని ఢీకొంటే ఏమి జరుగవచ్చు? దాని ప్రభావంవల్ల, హిరోషిమాను నేలమట్టం చేసిన బాంబు కంటే దాదాపు ఇరవై లక్షల రెట్లు ఎక్కువ శక్తి విడుదల కాగలదని ఖగోళ శాస్త్రజ్ఞుడైన జాక్ హిల్స్ చెబుతున్నాడు. అది సముద్రాన్ని తాకితే, ఆటుపోటుల తరంగాలు తీరప్రాంతాన్ని ముంచేస్తాయి. “ఇప్పుడున్న నగరాలు చిత్తడి నేలలుగా మారిపోతాయని” హిల్స్ చెబుతున్నాడు. అన్నిటికంటే మరీ ఘోరమైన ప్రవచనం ఏమిటంటే, మొత్తం మానవజాతి నిర్మూలించబడుతుందన్నదే. నాశనదినాన్ని గూర్చిన ఈ ప్రవచనానికీ, భూమి గురించి మన సృష్టికర్తకున్న చిత్తానికీ పొందిక ఉందా? యెహోవా సంకల్పంలో ఈ గ్రహానికి ప్రత్యేకమైన స్థానం ఉందని బైబిలు చూపిస్తుంది.
మన భూమి—ఒక సంకల్పం కోసం చేయబడింది
మన గ్రహం గురించి, కీర్తన గ్రంథకర్త ఇలా అంటున్నాడు: “ఆకాశములు యెహోవావశము, భూమిని ఆయన నరుల కిచ్చియున్నాడు.” (కీర్తన 115:16) “భూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిరపరచెను. నిరాకారముగానుండునట్లు ఆయన దాని సృజింప లేదు నివాసస్థలమగునట్లుగా దాని సృజిం[చినవాడు]” యెహోవాయేనని యెషయా వర్ణిస్తున్నాడు. (యెషయా 45:18) భూమి యెహోవా మానవజాతికి ఇచ్చిన స్వాస్థ్యం. దైవభయంగల మానవుల కోసం మన సృష్టికర్త నిరంతర భవిష్యత్తును మనస్సులో కల్గివున్నాడు గనుక, భూమి వారి నిత్య గృహంగా నిరంతరం నిలిచివుంటుంది. “భూమి యెన్నటికిని కదలకుండునట్లు [యెహోవా] దానిని పునాదులమీద స్థిరపరచెను” అని కీర్తన 104:5 మనకు హామీ ఇస్తుంది.
నిజమే, మన గ్రహంపై పెద్ద దుర్ఘటనలు జరగడానికి దేవుడు అనుమతించాడు. అవి మానవజాతిలోని అధికభాగం మరణించడానికి కారణమయ్యాయి. అలాంటి దుర్ఘటనల్లో కొన్ని అంటే యుద్ధాలు, కరువులు, రోగాలు వంటివి పూర్తిగా గానీ లేక పాక్షికంగా గానీ మానవుల అత్యాశ, మూర్ఖత్వం, క్రూరత్వం మూలంగా జరిగాయి. (ప్రసంగి 8:9) ఇతరమైనవి అంటే భూకంపాలు, అగ్నిపర్వతాలు బ్రద్ధలవ్వడం, వరదలు, తుపానులు సహజ ప్రక్రియల వల్ల జరిగాయి. అవి అలా ఎందుకు జరుగుతున్నాయో మానవజాతి ఇప్పటికీ పూర్తిగా అర్థంచేసుకోలేకపోతుంది. దేవుని ఆది సంకల్పానికి విరుద్ధంగా, మానవులు ఇక ఎంతమాత్రం పరిపూర్ణులుగా లేరు; వారు పాపులు. తత్ఫలితంగా, ప్రకృతి వైపరీత్యాల నుండి తప్పించుకోవడానికి వ్యక్తిగతంగా మనం దైవిక కాపుదలపై ఈ సమయంలో ఆధారపడలేము.
అయితే, ఈ భూమి మీద మానవుని ఉనికికి తీవ్రమైన ముప్పు వాటిల్లేలా యెహోవా ఎన్నడూ అనుమతించలేదు. మానవుడు సృష్టించబడినప్పటి నుండి, సమస్త మానవాళి ఉనికికి ముప్పు తీసుకువచ్చిన ప్రకృతి వైపరీత్యం సంభవించడం గురించి మనకు తెలిసిన చరిత్ర ఏదీ చెప్పడం లేదు.a
మానవజాతి రక్షణ హామీ ఇవ్వబడింది
మానవ చరిత్రారంభం నుండి, మానవుడు “భూమిని నిండించి దానిని లోపరచు”కోవాలన్నదే మన సృష్టికర్త సంకల్పం. (ఆదికాండము 1:28; 9:1) “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు” అని ఆయన వాగ్దానం చేశాడు. (కీర్తన 37:9, 11, 22, 29) “నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనెదననియు” యెహోవా తన వాగ్దానాల గురించి నొక్కి చెబుతున్నాడు.—యెషయా 46:10; 55:11; కీర్తన 135:6.
అంతరిక్ష ప్రక్రియ వల్ల భూమిపై జరిగేందుకు అవకాశమున్న కొద్దిపాటి నాశనాన్ని బైబిలు పూర్తిగా కాదనడం లేదు. అయితే, భూమి పట్ల మానవజాతి పట్ల తనకు గల ప్రకటిత సంకల్పాన్ని అంతరిక్ష దుర్ఘటన తుడిచిపెట్టడానికి యెహోవా అనుమతించడని మనం నిశ్చయత కల్గివుండవచ్చు. బైబిలు వాగ్దానాల ఆధారంగా, మన గ్రహం నిరంతరం నివాస యోగ్యంగా ఉంటుందనీ, అవును అది మానవజాతికి నిత్యమూ గృహంగా ఉంటుందనీ మనం నిశ్చయత కల్గివుండవచ్చు.—ప్రసంగి 1:4; 2 పేతురు 3:13.
[అధస్సూచీలు]
a దైవిక తీర్పు మూలంగానే నోవహు కాలంలో జలప్రళయం వచ్చింది, కానీ కొంతమంది మానవులు, జంతువులు దాన్ని తప్పించుకుని జీవించేలా యెహోవా ఏర్పాటు చేశాడు.—ఆదికాండము 6:17-21.