రోడ్లు—నాగరికతకు జీవనాడులు
పురాతన కాలంనుండీ విస్తృతమైన కాలిబాటల, రోడ్ల, హైవేల ద్వారా ప్రజలు పరస్పర సంబంధాలను పెంపొందించుకుంటున్నారు. సంచరించి సంపాదించాలనే, యుద్ధంచేసి సామ్రాజ్యాల్ని స్థాపించాలనే మానవుని మనోవాంఛకు సాక్ష్యాధారంగా అవి ఉన్నాయి. అవును, మానవ స్వభావానికున్న చీకటి కోణాన్ని కూడా బాటలు బయల్పరుస్తున్నాయి.
మనుష్యులూ, జంతువులూ నడవడం మూలంగా ఏర్పడిన కాలి బాటల కాలంనుండీ అనేక లైన్లు ఉన్న ఎక్స్‌ప్రెస్ వే వంటి ఆధునిక శీఘ్రయాన మార్గాల వరకూ ఉన్న రోడ్ల చరిత్ర, గతకాలంలోకి తీసుకెళ్లే యాత్ర మాత్రమేకాదు. అది మానవ స్వభావాన్ని గూర్చిన ఒక అధ్యయనం కూడా.
తొలినాటి త్రోవలు
“మొట్ట మొదటి రోడ్డు నిర్మాణ కార్యక్రమాల్ని శ్రద్ధగా చేపట్టింది, బహుశా మెసొపొటొమియన్లు అయివుండవచ్చు” అని ది న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా చెబుతోంది. ఈ ప్రజలు టైగ్రస్, యూఫ్రటీసు నదీ ప్రాంతాల్లో జీవించేవారు. ఊరేగింపుల కోసం ఉపయోగించే వారి రోడ్లు “కాల్చిన ఇటుకలూ, రాళ్లూ పరచి మట్టికీలు మిశ్రమంతో వేయబడిన రోడ్లు” అని అదే ఎన్‌సైక్లోపీడియా జతచేస్తోంది. తొలికాలాల్లో ఉపయోగించిన భవన నిర్మాణ వస్తువుల్ని గురించి బైబిలు చెబుతున్న విషయాన్ని ఆ వివరణ స్ఫురణకు తెస్తోంది: “రాళ్లకు ప్రతిగా ఇటికలును, అడుసునకు ప్రతిగా మట్టికీలును వారికుండెను.”—ఆదికాండము 11:3.
తమ మత సంబంధమైన కర్తవ్యాల్ని నెరవేర్చడానికి ప్రాచీన కాలంలోని ఇశ్రాయేలీయులకు రోడ్లు ఎంతో ఆవశ్యకమయ్యాయి. యేసుక్రీస్తు పుట్టక మునుపు దాదాపు 1,500 సంవత్సరాల క్రిందట, ఇశ్రాయేలీయులకు ఇలా ఆజ్ఞాపించబడింది: “ఏటికి మూడు మారులు, . . . నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున [ఆయనకు ఆధ్యాత్మిక పండుగను ఆచరించేందుకు] నీ మగవారందరు ఆయన సన్నిధిని కనబడవలెను.” (ద్వితీయోపదేశకాండము 16:16) ఆ ఏర్పర్చుకున్న స్థలం యెరూషలేము అయ్యింది, ఆ ఆనందమయ సందర్భాలకు తరచూ కుటుంబసమేతంగా హాజరయ్యేవారు. దానికి చక్కగా పర్యవేక్షించబడిన రహదారులు ఆవశ్యకం !
ప్రధాన రహదారులను చక్కగా నిర్మించారన్న విషయం సుస్పష్టం. క్రీస్తు పుట్టక మునుపు వెయ్యేళ్ల క్రిందట పరిపాలించిన సొలొమోను చక్రవర్తి గురించి చరిత్రకారుడైన ఫ్లేవియస్ జోసిఫస్ ఇలా చెప్పాడు: “ఆయన రహదారుల్ని పట్టించుకోకుండా విడిచిపెట్టలేదుగానీ, యెరూషలేముకు తీసుకుపోయే రోడ్డు పొడవునా నల్ల రాళ్లతో కాజ్‌వేను నిర్మించాడు.”
పొరపాటున ఇతరులను చంపిన వారికి ఆశ్రయాన్నిచ్చే ఆరు ఆశ్రయ పురాలు ఇశ్రాయేలీయులకు ఉన్నాయి. ఈ పురాలకు తీసుకువెళ్లే రహదారుల్ని కూడా ఎప్పటికప్పుడు మరమ్మతు చేసి మంచి స్థితిలో ఉంచేవారు. ప్రతీ కూడలిలోనూ దానికి అతి సమీపంలో ఉన్న ఆశ్రయపురంవైపుకు త్రోవను చూపించే, మంచి స్థితిలో ఉన్న సైన్‌బోర్డులను ఏర్పాటుచేసేవారని యూదా పారంపర్యాచారం సూచిస్తోంది.—సంఖ్యాకాండము 35:6, 11-34.
వర్తక వాణిజ్యాలు వ్యాప్తి చెందడానికి రోడ్లు ఆవశ్యకమయ్యాయి, ప్రాచీనకాలాల్లో ప్రజలు ఎక్కువగా ఇష్టపడే వస్తువుల్లో పట్టు ఒకటి. ఇశ్రాయేలీయులు ఒక జనాంగంగా రూపొందడానికి ఎంతోకాలం ముందే, పట్టుపురుగుల నుండి వడికిన నూలుతో పట్టు వస్త్రాల్ని తయారుచేయడమెలాగో చైనా దేశస్థులు కనుగొన్నా, క్రీస్తు పుట్టిన తర్వాతి కాలం వరకూ దాన్ని తయారుచేసే విధానాన్ని గోప్యంగా ఉంచారని చెప్పబడుతోంది. జీఫ్రీ హిన్డ్‌లీ రచించిన ఎ హిస్టరీ ఆఫ్ రోడ్స్ అనే పుస్తకం ప్రకారంగా అంతకు ముందు కాలంలో కూడా పాశ్చాత్య ప్రపంచంలో పట్టు ఎంతో ప్రసిద్ధిగాంచింది, వాటిని ధరించడం “ఆడంగితనంగా పరిగణించబడేది” గనుక “దాన్ని పురుషులు ధరించకుండా చూసేలా” ఆజ్ఞలను జారీచేయడం జరిగింది.
చైనా నుండి పట్టును రవాణాచేసే వర్తక మార్గం, సిల్కు రోడ్డుగా పేరుగాంచింది. చైనాకు పోయే ఆ రోడ్డుపై సా.శ. 13వ శతాబ్దాంతాన మార్కోపోలో ప్రయాణించేనాటికే, 1,400 ఏళ్ల క్రిందటి నుండీ ఆ రోడ్డు ఉనికిలో ఉంది. 2,000 కన్నా ఎక్కువ సంవత్సరాలపైగా ఆ సిల్కు రోడ్డు ప్రపంచంలో అత్యంత పెద్ద రహదారిగా నిలిచింది. ఆ రోడ్డు పట్టుకు పుట్టినిల్లైన చైనాలోని షాంగై నుండి స్పెయిన్‌లోని (ఆధునిక కాడిజ్) గాడెస్ వరకూ దాదాపు 12,800 కిలోమీటర్ల పొడవున వ్యాపించివుంది.
సైనిక ప్రాముఖ్యత
రోడ్ల నిర్మాణంలో గొప్ప వికాసం సామ్రాజ్య కాంక్షనుండే వృద్ధిచెందింది. ఉదాహరణకు, రోమా చక్రవర్తులైన సీజర్ల ఆధ్వర్యంలో రోమా సామ్రాజ్యపు రోడ్ల వ్యవస్థ, యూరప్, ఉత్తర అమెరికా ఖండాలలోనూ, మధ్య తూర్పు ప్రాంతంలోనూ విస్తరించింది. వాటి మొత్తం పొడవు 80,000 కిలోమీటర్లు ఉంటుందని అంచనా. రోమా సైనికులు యుద్ధాల్లేకుండా తీరుబడిగా ఉన్నప్పుడు కొన్నిసార్లు వాళ్లను, రోడ్లను మరమ్మత్తు చేసే, వాటిని నిర్మించే పనులకు పురమాయించేవారు.
రాజ్యాల్ని జయించడంలో రోడ్లకున్న ప్రాముఖ్యత ఇటీవల కాలాల్లో కూడా ఉదాహరించబడింది. 1934లో అడాల్ఫ్ హిట్లర్ చేపట్టిన ఆటోబాన్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణ కార్యక్రమం, ఇతర జాతులకు చెందిన ప్రజలపై ఆధిపత్యాన్ని చెలాయించేందుకు ఆయన సాగించిన అన్వేషణను మరింత తీవ్రతరం చేసింది. చరిత్రకారుడైన హిన్డ్‌లే ప్రకారంగా, ఈ నిర్మాణ కార్యక్రమం జర్మనీని “ప్రపంచంలోనే మొట్టమొదటి మోటారు ఎక్స్‌ప్రెస్ వే అనుసంధానం”గా నిలబెట్టింది.
రోడ్ల నిర్మాణ రంగం—ఒక సైన్స్
రోమా సర్వేయర్లు గ్రోమా అని పిలువబడిన ఒక ఉపకరణాన్ని ఉపయోగిస్తూ, ముక్కుకు సూటిగా ఉండే రోడ్లను నిర్మించేవారు. శిల్పులు ఎంతో కళాత్మకంగా ఉన్న మైలురాళ్లను తీర్చిదిద్దేవారు. రోడ్డుపై తీసుకెళ్లే బరువుకు ఇంజనీర్లు పరిమితిని నియమించేవాళ్లు. రోడ్లకు పునాది ఉండేది, దానిమీద దృఢమైన గచ్చు ఉండేది. కానీ అవి దీర్ఘకాలంపాటు నిలిచి ఉండడానికి గల కీలకం ఏమిటంటే అవసరాలకు తగ్గట్టుగా నిర్మించిన డ్రైనేజి సిస్టమే. రోడ్డు ఒక మోస్తరు వాలుగా ఉండడం, అలాగే చుట్టు ప్రక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాలకన్నా ఎత్తుగా ఉండడం ఆ డ్రైనేజి సిస్టమ్‌ను మెరుగుపర్చాయి. రోడ్డు అలా ఎత్తులో ఉండడం మూలంగా “హైవే” అన్న పదం ఉనికిలోకి వచ్చింది. రోడ్డు మ్యాప్‌లను షాపుల్లో అమ్మేవారు.
“రోడ్ల నిర్మాణకులుగా రోమన్లు సాధించినదాన్ని చూసిన రచయిత, ప్రస్తుతించే పదజాలాన్ని ఉపయోగించకుండా ఉండలేడు. ఇటలీ రోడ్లు అందించిన సేవలకన్నా మానవుని ఏ ఇతర గత స్మారక స్మృతులైనా మరింత శాశ్వతమైన సేవల్ని అందించివుంటాయా అన్నది సందేహాస్పదమైనదే”నని ఒక చరిత్రకారుడు చెబుతున్నాడు.
ఎ హిస్టరీ ఆఫ్ రోడ్స్ అనే పుస్తకం ప్రకారంగా, రోమ్ నుండి దక్షిణంవైపుగా తీసుకుపోయే అప్పియన్ రహదారి “పాశ్చాత్యుల చరిత్రలో వేయబడ్డ పొడవైన రోడ్లన్నింటిలో మొట్టమొదటిది.” ఈ ప్రఖ్యాతిగాంచిన హైవే సగటున 6 మీటర్ల వెడల్పు ఉండి, పెద్ద పెద్ద అగ్నిపర్వత శిలలతో వేయబడింది. ఖైదీగా రోమ్‌కు వెళ్లేటప్పుడు, అపొస్తలుడైన పౌలు ఈ రహదారిపైనే ప్రయాణించాడు, ఆ రోడ్డులో కొంత భాగం నేటికీ ఉపయోగంలో ఉంది.—అపొస్తలుల కార్యములు 28:15, 16.
రోడ్ల నిర్మాణంలో దక్షిణ అమెరికాలోని తొలి ఆదివాసుల నైపుణ్యాలు అనేకమందిని అదే విధంగా ఆశ్చర్యచకితుల్ని చేసివుండవచ్చు. 1200ల నుండి 1500ల వరకూ ఇన్‌కాలు దాదాపు 1,00,00,000 మంది ప్రజలున్న ఒక జనాంగాన్ని సమైక్యపర్చే 16,000 కిలోమీటర్ల పొడవున్న రోడ్ల అల్లికను నిర్మించారు. ఆ రోడ్లు ఎంతమాత్రం నివాసయోగ్యంకాని, ఎత్తుపల్లాలతో ఉన్న కొన్ని ప్రాంతాలను దాటుకుంటూ, ఎడారుల్నీ, వర్షాధార అడవుల్నీ, విశాలమైన పెరూవియన్ ఆండీస్ పర్వతాన్ని దాటుకుంటూ కూడా పోయాయి!
ఒక రోడ్డు గురించి ది న్యూ ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ఇలా రిపోర్టు చేస్తోంది: “ఆండీస్ పర్వత మార్గం విశిష్టమైనది. ఆ రోడ్డు మార్గం 25 అడుగుల (7.5 మీటర్ల) వెడల్పుండేది, ఎగుడు దిగుడులుగా ఉండి, వాలులు అంతగాలేని ఎత్తైన పర్వత శ్రేణుల మీదుగా సాగిపోతుంది. అడ్డువచ్చిన కొండల్ని తొలిచి ఆ మార్గం వేయడం జరిగింది. ఆ మార్గాన్ని పటిష్టంగా ఉంచేందుకు వందలాది అడుగుల క్రిందనుండి వాలుగోడను కట్టడం జరిగింది. చిన్న చిన్న లోయలూ, అగాధాలూ గట్టి కాంక్రీటు మిశ్రమంతో పూడ్చబడేవి, పర్వతాల్లో ప్రవహించే వాగుల్ని దాటడానికి ఉన్ని కేబుళ్లతోగానీ ఫైబర్ కేబుళ్లతోగానీ వ్రేలాడే వంతెనలు నిర్మించబడేవి. అనేక ప్రాంతాల్లో రోడ్డుపై గచ్చు రాళ్లతో నిర్మించబడేది, ఆస్‌ఫాల్ట్ (ఓడ కీలు) పదార్థాలు విస్తృతంగా ఉపయోగించబడేవి.”
ఇన్‌కాలకు గుఱ్ఱాలు తెలియకపోయినా వాళ్లు నిర్మించిన రోడ్ల అల్లిక, “రాజ వార్తాహరుల కోసం వేయబడ్డ ఒక రాచబాట” అని పిలువబడిన దాన్ని అందుబాటులోనికి తెచ్చింది. ఒక చరిత్రకారుడు ఇలా పేర్కొన్నాడు: “దాదాపు మైలున్నర (2 కిలోమీటర్ల) దూరానికొక మజిలీ చొప్పున దారి పొడవునా మజిలీలు ఏర్పాటు చేయబడ్డాయి, ప్రతీ మజిలీ ఓ మోస్తరు సైనిక శిబిరం, [వర్తమానాన్ని చేరవేసేందుకు] వృత్తిరీత్యా పరిగెట్టే రన్నర్లను పంపే కేంద్రం. ప్రతీ మజిలీ, కుజ్కోలోని రాజధాని నుండి క్విటో నగరానికి అంటే 1,250 మైళ్ల (2,000 కిలోమీటర్ల) దూరం ఐదు రోజుల్లో వర్తమానాన్ని తీసుకెళ్లగల్గేలా (రన్నర్లను) శీఘ్రరీతిలో అంచెలంచెలుగా పంపించేంత దగ్గర్లో ఏర్పాటు చేయబడి, రాత్రీ పగలూ నిర్విరామంగా నిర్వహించబడేది. అంటే, సముద్ర మట్టానికి దాదాపు 15,000 అడుగులకు తక్కువకాని ఎత్తులో ఉన్న రోడ్డుపై సగటున గంటకు పది మైళ్ల (15 కిలోమీటర్ల) వేగమని అర్థం—రోజువారీ రోమన్ పోస్టల్ బట్వాడా విధానం ఆ వేగాన్ని ఎన్నటికీ చేరుకోలేదు!”
విషాద సంఘటనలకు మూలం
మానవ శరీరంలోని ధమనులు (జీవ నాడులు) ప్రతిబంధకాలుగా తయారుకాగలవు, మరి అది విషాదకరమైన పరిణామాలకు దారితీయవచ్చు. అలాగే, జీవిత నాణ్యతను మెరుగుపర్చుకునేందుకు దోహదపడిన రోడ్లు ప్రతిబంధకాలుగా తయారై, ఆ జీవిత నాణ్యతనే తగ్గించివేయవచ్చు. వర్షాధార అడవుల గుండా, కీకారణ్యాల గుండా, దట్టమైన పొద ప్రాంతాల గుండా, నేషనల్ పార్కుల గుండా వేయబడ్డ రోడ్లు వన్య ప్రాణుల ప్రాణాలకు ముప్పు తెచ్చాయి. వాటి మూలంగా తరచూ స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురౌతారు, వారికి పుట్టిల్లుగా ఉండే అడవులూ నష్టాన్ని చవిచూస్తాయి. హౌ ఉయ్ బిల్డ్ రోడ్స్ పుస్తకం ఇలా చెబుతోంది: “అభివృద్ధి కార్యక్రమాల పేరిట చేపట్టినప్పటికీ ట్రాన్స్ అమెజోనియన్ హైవే, వర్షాధార అడవి ప్రాంతాల్లోని ఎక్కువ భాగాన్ని నాశనం చేసింది, అడవుల్లో జీవిస్తున్న అనేకమంది ప్రజల మొత్తం జీవిత విధానాన్ని సమూలంగా తుడిచిపెట్టి వారి పాలిట విపత్తుగా పరిణమించింది.”
ప్రతీ సంవత్సరమూ అనేక వాహనాలు, నాగరికతకు జీవనాడులైన నగర రోడ్లకు ప్రతిబంధకాలు అవుతుండగా నగరాలు కూడా తీవ్రమైన పరిణామాల్ని ఎదుర్కుంటున్నాయి. నిధులు అందుబాటులో ఉంటే, చివరకు ఎక్స్‌ప్రెస్ వే నిర్మించబడుతుంది. అయితే దీర్ఘకాలంలో, ఈ ఎక్స్‌ప్రెస్ వేలు మరింత ట్రాఫిక్ రద్దీకి కారణమౌతాయి. అది, కోట్లాదిమందిని రోగగ్రస్థుల్ని చేస్తున్న కాలుష్యాన్ని పెంచుతుంది. అంతేగాక, రోడ్డు ప్రమాదాల్లో సంవత్సరానికి దాదాపు 5,00,000 మంది చనిపోతున్నారు, 150 లక్షలమంది క్షతగాత్రులౌతున్నారు, కొందరైతే తీవ్రంగా గాయపడుతున్నారు. పోల్చిచూస్తే, మొదటి ప్రపంచ యుద్ధం దాదాపు 90 లక్షల మంది సైనికుల ప్రాణాల్ని బలిగొంది. అయితే ఆ యుద్ధం నిలిచిపోయింది. మరో వైపున, రోడ్లపై మరణాలు థపాలవారీగా జరుగుతున్నట్లుంది.—రోజుకి 1,000కన్నా ఎక్కువమంది చనిపోతున్నారు, అది అలా సాగుతూనే ఉంది !
అవును, అనేక రీతుల్లో రోడ్లు మన గురించి ఒక సందేశాన్ని అందిస్తున్నాయి—మనలో ఉన్న లోపాల్నీ బలమైన విషయాల్నీ సూచించే ఒక కారెక్టర్ రిఫరెన్సుగా ఉన్నాయి. శ్రద్ధ తీసుకోమని మనకు అప్పగించబడిన ఈ మహత్తరమైన గ్రహాన్ని మనమెలా దృష్టిస్తున్నామో కూడా అవి తెలియజేస్తున్నాయి.
[25వ పేజీలోని చిత్రం]
అపొస్తలుడైన పౌలు ప్రయాణించిన అప్పియన్ రహదారి, ఇప్పటికీ ఉపయోగంలో ఉంది
[26వ పేజీలోని చిత్రం]
ప్రతీ సంవత్సరమూ రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 5,00,000 మంది చనిపోతున్నారు