యువత ఇలా అడుగుతోంది . . .
నా తల్లిదండ్రులు లేకుండా నేనెలా మనగలను?
“నాకు మూడేళ్లు, మా అక్కకు నాలుగేళ్లు ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. మమ్మల్ని తమతో ఉంచుకొనేందుకు కోర్టులో దావా వేశారు. మేము మా అమ్మతో ఉండేందుకు న్యాయనిర్ణయమయ్యింది. అయితే, నాకు ఏడేళ్ల వయస్సు ఉన్నప్పుడు నేను, మా అక్క మా నాన్నతో ఉండాలని నిర్ణయించుకున్నాము.”—ఓరాసియో.
కొన్ని సంవత్సరాల తర్వాత, ఓరాసియో తండ్రి తన ప్రియురాలితో కలిసి—ఓరాసియోను, వాళ్లక్కను వదలి వెళ్లిపోయాడు. ఓరాసియో ఇలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు: “ఆ విధంగా నాకు 18 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, 19 సంవత్సరాల మా అక్క, నేను, 12 సంవత్సరాల మా సవతి తల్లి కూతురు ఉన్న మా ఇంటికి యజమానినయ్యాను. ఆమె మాతో కలిసి ఉండాలని నిర్ణయించుకుంది.”
ముందటి శీర్షిక ఒకటి చూపించినట్లు, ప్రపంచవ్యాప్తంగా తల్లిదండ్రులు లేని యౌవనస్థులు అనేకులున్నారు.a ఓరాసియో వలె కొందరు యౌవనస్థులు విడిచిపెట్టబడుతున్నారు. మరికొందరు తమ తల్లిదండ్రులను మరణం మూలంగా కోల్పోయారు, లేదా యుద్ధం, ప్రకృతి వైపరీత్యాలు వారి తల్లిదండ్రుల నుండి వారిని విడదీశాయి. పరిస్థితి ఏదేమైనప్పటికీ, తల్లిదండ్రులు లేకపోవడం బాధాకరం, అది కష్టతరంగా ఉండవచ్చు. దాని మూలంగా తలమునకలయ్యే బాధ్యతలు మొదలవుతాయి.
‘ఎవరు నా పట్ల శ్రద్ధ వహిస్తారు?’
మీరు ఎంత బాగా తట్టుకోగలరన్నది చాలా వరకు మీ వయస్సు పైనా, మీ పరిస్థితుల పైనా ఆధారపడి ఉంటుంది. స్పష్టంగా, మీరు ఇంకా బాల్యంలో లేదా లేత ప్రాయంలో ఉన్నట్లయితే, పరిస్థితి మరింత కష్టతరం. అయినప్పటికీ, మీరు పూర్తిగా విడిచిపెట్టబడి ఉండకపోవచ్చు. బహుశా మీ మామయ్యగానీ, అత్తయ్యగానీ, అన్నయ్యగానీ, అక్కగానీ తమతో పాటు మిమ్మల్ని ఉంచుకోవడానికి ఇష్టపడవచ్చు.
అనాధల పట్ల, విధవరాళ్ల పట్ల శ్రద్ధ వహించడం తమ ఆరాధనలో ఒక భాగమని యెహోవాసాక్షులకు తెలుసు. (యాకోబు 1:27; 2:15-17) తరచుగా సంఘంలోని వ్యక్తులు సహాయాన్ని అందిస్తారు. ఉదాహరణకు, ఓరాసియో, ఆయన ఇద్దరు అక్కచెల్లెళ్లు యెహోవాసాక్షులతో బైబిలును పఠించడం, మీటింగులకు హాజరు కావడం ప్రారంభించారు. వారికి సహాయాన్ని అందించిన ఒక క్రైస్తవ కుటుంబాన్ని వారు కనుగొన్నారు. ఓరాసియో ఇలా అన్నాడు: “తన నడిపింపును, ప్రేమ పూర్వక శ్రద్ధను అనుదినము చూపుతున్న యెహోవాకు నేనెంతటి కృతజ్ఞుడ్ని! సంఘంలో మా వయస్సు పిల్లలను కల్గిన ఒక చక్కని ఆధ్యాత్మికత గల కుటుంబం చేసిన సహాయం ద్వారా మేము ఆశీర్వదించబడ్డాము. వారు మమ్మల్ని దత్తత తీసుకున్నట్లే మాతో ప్రవర్తించేవారు, ముందెన్నడూ మేము ఒక కుటుంబంలోని సభ్యులమని అంతగా భావించలేదు. వారి సహాయ, సహకారాల కోసం మేము వారిపై ఆధారపడగలిగాము.
ఏమైనప్పటికీ, యౌవనులందరికీ అటువంటి అవకాశం ఉండదు. ఐక్యరాజ్య సమితి పిల్లల నిధి ఇలా నివేదిస్తుంది: “కొన్నిసార్లు తల్లిదండ్రులు లేని పిల్లలు శారీరక దుర్వ్యవహారానికి గురి కావడం, వేతనం దొరని పని, అభివృద్ధికి అవకాశం లేకుండా పోవడం, వేశ్యాగృహాలకు అమ్మబడడం, బానిసలుగా మార్చడం జరుగుతుంది.” కాబట్టి, ఎవరైనా మీ పట్ల చక్కని శ్రద్ధను కనబరుస్తున్నట్లైతే అందుకు కృతజ్ఞులై ఉండండి.
తల్లిదండ్రులను కోల్పోవడం భయంకర పరిస్థితియని ఒప్పుకోవలసిందే. మీ పట్ల శ్రద్ధను చూపడానికి వారు లేనందుకు సహజంగానే మీకు కోపం రావచ్చు. మీ బంధువుగానీ, మీ అక్క లేదా మీ అన్నయ్యగానీ మీకొక విషయాన్ని చెబుతున్నప్పుడు అది మీకు ప్రాణం విసిగిస్తున్నట్లుగా అనిపించవచ్చు. కానీ ఆ కోపాన్ని మీ పట్ల శ్రద్ధను కనబరుస్తున్న వారిపై మాత్రం ప్రదర్శించకండి. “నీకు క్రోధము పుట్టుచున్నది గనుక నీవు ఒకవేళ తిరస్కారము చేయుదువేమో జాగ్రత్తపడుము. . . . జాగ్రత్తపడుము చెడుతనము చేయకుండుము.” (యోబు 36:18, 21) బైబిలులోని యౌవన స్త్రీయైన ఎస్తేరును గుర్తుచేసుకోండి. మొర్దెకై తన పినతండ్రి కుమార్తెయైన తల్లిదండ్రులు లేని ఈమెను పెంచాడు. ఆయన ఆమెకు స్వంత తండ్రి కాకపోయినప్పటికీ, మొర్దెకై ‘ఆమెకు ఆజ్ఞలను ఇచ్చాడు,’ ఆ ఆజ్ఞలకు ఆమె యుక్తవయస్కురాలైనప్పటికీ విధేయత చూపింది ! (ఎస్తేరు 2:7, 15, 20) విధేయతను చూపడానికి, సహకరించడానికి ప్రయత్నించండి. ఇది ఉద్రిక్తస్థితిని తగ్గించేదిగాను, చుట్టుప్రక్కల ఉన్నవారు ప్రశాంతమైన జీవితాలను గడపడానికి సహాయం చేస్తుంది.
కుటుంబ బాధ్యత
మీకు ఒక అన్న లేదా అక్క ఉంటే—మీరే పెద్దన్నయ్య లేదా పెద్దక్క అయితే—మీరు, మీ తోబుట్టువులు మీ స్వంత కాళ్లపై నిలబడడం సాధ్యం కావచ్చు. కుటుంబ పెద్దగా పాత్ర వహించడం అనే బాధ్యత కూడా మీపై పడవచ్చు—ఇది తల మునకలయ్యే బాధ్యతగా మీకు కన్పిస్తుంది. ఇటువంటి క్లిష్టపరిస్థితులు ఉన్నప్పటికీ, అనేక యౌవనస్థులు తమ తోబుట్టువులను పెంచడమనే బాధ్యతను ఆశ్చర్యం కల్గించేంతటి శ్రేష్టమైన రీతిలో నిర్వర్తించారు.
ఉక్రోషాన్ని కల్గించే కొన్ని భావాలతో వ్యవహరించవలసి రావచ్చన్నది అర్థంచేసుకోవచ్చు. కానీ, మీరు మీ తమ్ముళ్లను, చెల్లెళ్లను ప్రేమిస్తున్నారు, వారి పట్ల శ్రద్ధను కనపరుస్తున్నారన్న రెండు వాస్తవాలపై ధ్యానించడం మీరు అనుకూల దృక్పథం కల్గివుండడానికి సహాయం చేస్తుంది. వారి పట్ల శ్రద్ధను చూపడమనేది దేవుడు అప్పగించిన బాధ్యతగా దృష్టించినట్లయితే, అది కూడా మీకు సహాయకరంగా ఉంటుంది. క్రైస్తవులు తమ స్వకీయులను సంరక్షింపవలెనని ఆజ్ఞాపించబడ్డారు. (1 తిమోతి 5:8) మీ తోబుట్టువులకు తల్లిగా లేదా తండ్రిగా ఉండాలని మీరెంతగా ప్రయత్నించినప్పటికీ, మీరెన్నటికీ వారి నిజ తల్లిదండ్రులు మాత్రం కాలేరు.
మీ తోబుట్టువులు మీ తల్లిదండ్రుల మాట వినే రీతిలోనే మీ మాట కూడా వినాలని ఆశించడం సమంజసం కాదు. నిజానికి చెప్పాలంటే, వారు స్థిమిత పడేందుకు, ఆ పరిస్థితిని అంగీకరించి, మీ యాజమాన్యాన్ని గంభీరంగా తీసుకోవాలంటే వారికి కొంత సమయం పట్టవచ్చు. ఈలోగా మాత్రం మీరు నిరాశా నిస్పృహలకు లోనుకాకుండా ఉండడానికి ప్రయత్నించండి. “ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ”లను విసర్జించండి. మీ మాదిరి ద్వారా “ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై” ఉండాలని వారికి బోధించండి.—ఎఫెసీయులు 4:31, 32.
“నేను ఒకానొక సమయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవాడ్ని. కానీ అది కొంతమేరకు కాపుదలగాను, యెహోవా దృష్టిలో సరియైన ప్రవర్తనను కల్గివుండడానికి మాకు సహకరించింది” అని ఓరాసియో తాను తప్పులు చేశానని ఒప్పుకుంటున్నాడు.
మిమ్మల్ని మీరు సంరక్షించుకోవడం
మీపట్ల శ్రద్ధను చూపడానికి మీ తల్లిదండ్రులు లేరు కాబట్టి, మీ కోసం మీరే వస్తుపరంగా సమకూర్చుకోవడం నిస్సందేహంగా ఒక పెద్దపని. మీరు ఇంతకు ముందు అంతగా పట్టించుకోని ఇప్పుడు తప్పనిసరిగా చేయవలసిన వంటపని, శుభ్రం చేయడం, ఇతర ఇంటిపనులు ఎలా చేయాలో నేర్చుకోవడానికి క్రైస్తవ సంఘంలోని కొంతమంది సభ్యులు మీకూ మీ తోబుట్టువులకూ సహాయం చేయగలరు. కానీ, డబ్బును సంపాదించడానికి ఏం చేయాలి? బహుశా మీరు, మీ తోబుట్టువులు పని వెదుక్కోవడం కంటే వేరొక మార్గం ఏమీ ఉండకపోవచ్చు.
ఏమైనప్పటికీ, తక్కువ చదువు, తక్కువ అనుభవం, పనిలో నైపుణ్యం లేకపోవడం వల్ల ఉద్యోగం సంపాదించడం దుర్లభం కావచ్చు. కాబట్టి మీ ప్రాథమిక విద్యను—లేదా ఉద్యోగానికై అదనపు శిక్షణను—పూర్తి చేయడానికి ఏ విధమైన సాధ్యత కన్పించినా దాన్ని చేయండి. ఓరాసియో ఇలా గుర్తు చేసుకుంటున్నాడు: “మా అక్క, నేను పని చేసేవాళ్లం, అది నేను, మా చెల్లి చదువుకోవడానికి ఆధారమయ్యింది. మీరు అభివృద్ధిచెందుతున్న దేశంలో నివసిస్తున్నట్లయితే, మీరు పనిని వెదుక్కోవడానికి మీకు కాస్త చాతుర్యం అవసరం అవుతుంది.”—నవంబరు 8, 1994, తేజరిల్లు!లోని “వర్ధమాన దేశాల్లో ఉద్యోగాలను కల్పించటము” అనే శీర్షికను చూడండి.
బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం పొందడం కూడా సాధ్యం కావచ్చు. తరచుగా ప్రభుత్వ, ప్రైవేటు ఏజెన్సీలు తల్లిదండ్రులు లేనివారికి, వదిలివేయబడిన పిల్లలకు సహాయాన్ని అందిస్తాయి. ఉదాహరణకు, కొన్ని ఏజెన్సీలు ఆహారాన్ని సంపాదించుకోడానికి, నివాస స్థలాన్ని కనుగొనడానికి సహాయపడవచ్చు. మీకు ఏ విధమైన ఆర్థిక సహాయం లభించినా దానిని వివేకంతో వినియోగించండి. “ద్రవ్యము ఆశ్రయాస్పదము” అని బైబిలు చెబుతుంది. (ప్రసంగి 7:12) డబ్బును బడ్జెట్ వేసుకోవడంలోనూ, వినియోగించడంలోను జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం, అది వెంటనే ‘రెక్కలు ధరించి ఎగిరిపోవును.’—సామెతలు 23:4, 5.
పెద్దవారు మీ పట్ల శ్రద్ధను కనబరుస్తున్నట్లైతే, వస్తుపరంగా సమకూర్చుకోవడం మీకు పెద్ద సమస్య కాకపోవచ్చు. ఏమైనప్పటికీ, భవిష్యత్తులో వస్తుపరంగా మీ కోసం మీరు సమకూర్చుకొనే సమయం వస్తుంది. చదువు విషయంలో మిమ్మల్ని ప్రోత్సహించేందుకు మీ తల్లిదండ్రులు లేరు కాబట్టి, చదువు పట్ల ఆసక్తిని పెంచుకోవడానికి మీరే నిజమైన ప్రయత్నాన్ని చేయాలి. ఆధ్యాత్మిక పురోభివృద్ధికై క్రైస్తవ అపొస్తలుడైన పౌలు తిమోతికి ఇచ్చిన సలహా మీకు చదువు విషయంలో కూడా వర్తిస్తుంది. “నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటియందే సాధకము చేసికొనుము.” (1 తిమోతి 4:15) ఇలా చేస్తూ ఉండగా, మీ తోబుట్టువులకు మీరొక మంచి మాదిరిని ఉంచుతారు, మీకై మీరే ప్రయోజనం పొందుతారు కూడా.
మిమ్మల్ని మీరు ఆధ్యాత్మికంగా పోషించుకోవలసిన అవసరత అన్నిటికంటే ప్రాముఖ్యం. క్రమమైన సమతూకమైన ఆధ్యాత్మిక కార్యకలాపాలను ఏర్పర్చుకోవడానికి ప్రయత్నించండి. (ఫిలిప్పీయులు 3:16) ఉదాహరణకు, కుటుంబాలుగా కలిసి ప్రతిదినము ఒక బైబిలు వచనాన్ని చర్చించడమనేది యెహోవాసాక్షుల మధ్య వాడుకైన పద్ధతి. దీనిని మీ దినచర్యలో ఒక భాగంగా ఎందుకు చేసుకోకూడదు? క్రమ బైబిలు పఠనాన్ని కల్గి ఉండడం, క్రైస్తవ కూటాలకు క్రమంగా హాజరు కావడం మీరూ, మీ తోబుట్టువులు ఆధ్యాత్మికంగా బలంగా ఉండడానికి కూడా సహాయపడతాయి.—హెబ్రీయులు 10:24, 25.
సవాళ్లను ఎదుర్కోవడం
తల్లిదండ్రులు లేకుండా జీవించడమనేది చాలా కష్టం, దీనర్థం జీవితం నిరాశాపూరితం, దుఃఖమయం కావాలని కాదు. ఇరవై సంవత్సరాల పవోలాకు ఆరేండ్ల వయస్సు ఉన్నప్పుడే వాళ్లమ్మ చనిపోయింది. పదేండ్ల వయస్సు ఉన్నప్పుడు ఆమె తండ్రి చనిపోయాడు. ఒక దయగల స్త్రీ ఆమెకు, ఆమె అక్కచెల్లెళ్లకు ఆశ్రయాన్నిచ్చింది. మరి ఆమె జీవితం నిరాశా, నిస్పృహలతో నిండి పోయిందా? లేదు. పవోలా ఇలా చెబుతుంది: “నిజానికి మేము ఒక పూర్తి భావంలో కుటుంబాన్ని కల్గి లేకపోవచ్చు గానీ, మామూలు జీవితాన్నే అనుభవించాము. వాస్తవానికి, మా మధ్య గల ప్రేమ ఇతర అనేక కుటుంబాలలోని ప్రేమ కంటే చాలా బలమైనది.”
పవోలా అక్క ఈరీన్ ఇలా జతచేస్తుంది: “మాకు తల్లిదండ్రులు లేకపోయినప్పటికీ కూడా మేము ఇతర యౌవనస్థుల వలె ఉన్నాము.” ఇటువంటి పరిస్థితిలో ఉన్న వారికి ఆమె ఇచ్చే సలహా? “మీకేదో లోటు ఉన్నట్లుగా భావించవద్దు.” ఓరాసియో కూడా ఈ విధంగా చెబుతున్నాడు: “ఈ పరిస్థితి నన్ను పరిపక్వత గల వ్యక్తిగా చాలా వేగంగా చేసింది.”
తల్లిదండ్రులను కోల్పోవడం ఎంత బాధాకరమైన సంఘటనో ఊహించగలం. అయితే, యెహోవా సహాయంతో మీరు నిలవగలరన్న, ఆయన ఆశీర్వాదాలను పొందగలరన్న నిశ్చయతను కల్గి ఉండండి.
[అధస్సూచీలు]
a 1998, డిసెంబరు 8 తేజరిల్లు!లోని “యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . . నేనెందుకు నా తల్లిదండ్రులు లేకుండా జీవించాలి?” అనే శీర్షిక చూడండి.
[20వ పేజీలోని చిత్రం]
క్రైస్తవ పెద్దల నుండి మీరు మద్దతును పొందగలరు