కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g98 10/8 పేజీలు 25-27
  • బంగారం—దాన్ని ఆవరించి ఉన్న నిగూఢత

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • బంగారం—దాన్ని ఆవరించి ఉన్న నిగూఢత
  • తేజరిల్లు!—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బంగారమూ, దాని చరిత్రా
  • రక్తం కారుతున్న చరిత్ర
  • 19వ శతాబ్దంలో బంగారం కోసం ఎగబడటం
  • మునిగిపోయిన నిక్షేపం
  • యుద్ధపు బంగారం
  • బంగారానికి ఉన్న శాశ్వతమైన ఆకర్షణ
    తేజరిల్లు!—2005
  • రాజైన సొలొమోను సంపదను గూర్చి అతిశయోక్తిగా చెప్పబడిందా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • బంగారం కన్నా మరింత విలువైనదాన్ని వెదకండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
తేజరిల్లు!—1998
g98 10/8 పేజీలు 25-27

బంగారం—దాన్ని ఆవరించి ఉన్న నిగూఢత

బంగారం—మెత్తని, ఉజ్జ్వలమైన గంధకం రంగులోని ఈ లోహం, దానికున్న అసాధారణ గుణాల వల్ల ప్రాచీన కాలం నుండీ కూడా చాలా విలువైనదిగా ఎంచబడుతోంది. దాని రంగూ, ఆకర్షణీయతా, మలచబడగల గుణమూ, తుప్పును ఎదిరించగల దాని గుణమూ లోహాల్లోకెల్లా దానిని అసాధారణమైనదిగా చేస్తుంది. బంగారం కోసం అన్వేషించినవారి మనసుల్లో దానికున్న విలువ కారణంగా, మరే లోహానికీలేనటువంటి చరిత్ర దానికుంది.

“బంగారం! నిజం, అది బంగారం! నిజం!” బంగారాన్ని కనుగొన్నప్పుడు మనస్సు గంతులు వేసింది, నాడి వేగంగా కొట్టుకుంది. ఊహలు పరవళ్ళుతొక్కాయి. దాని కోసం భూమి మీదా, నదుల్లోనూ, సెలయేరులలోనూ, భూమి ఉపరితలానికి వేల మీటర్ల లోతు వరకూ కూడా అన్వేషణ జరిగింది.

విలువైన ఆభరణాల రూపంలో బంగారం రాజులనూ, రాణులనూ అలంకరించింది. సింహాసనాలూ, రాజభవనాల గోడలూ బంగారంతో అలంకృతమయ్యాయి. బంగారంతో చేపలు, పక్షులు, జంతువుల ప్రతిమలను, మరితర వస్తువులను చేసి, వాటిని దేవుళ్ళుగా ఆరాధించడం జరుగుతూ వస్తుంది. బంగారం కొరకైన నిర్విరామమైన అన్వేషణ చాలా దూరం వచ్చి, నాగరికతపై కూడా ప్రభావం చూపింది.

బంగారమూ, దాని చరిత్రా

ప్రాచీన ఐగుప్తులోని ఫరోలు బంగారం కోసం వెదికేందుకు తమ వ్యాపారులను, సైన్యాలను సుదూర దేశాలకు పంపారు. బంగారం ఐగుప్తు దేవుళ్ళ, ఫరోల సొత్తు అని అనుకునేవారు. 1922లో కనుగొన్న టుటన్ఖామెన్‌ సమాధి అమూల్యమైన బంగారు నిధులతో నిండి ఉంది. అతని శవపేటిక కూడా స్వచ్ఛమైన మేలిమి బంగారంతో చేయబడి ఉంది.

కొందరు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, అలెగ్జాండర్‌ ద గ్రేట్‌, “పర్షియాలోని ప్రసిద్ధ బంగారు నిక్షేపాలకు ఆకర్షితుడై మొదట ఆసియాకు వచ్చాడు.” ఆయన సైన్యము వేలకొలది జంతువులను ఉపయోగించి పర్షియాలో ఆయన స్వాధీనంచేసుకున్న బంగారాన్ని గ్రీస్‌కు తీసుకువచ్చిందని నివేదించబడింది. దాని ఫలితంగా గ్రీస్‌ బంగారంతో సమృద్ధమైన దేశమైంది.

రోమ్‌ “చక్రవర్తులు రాజోద్యోగుల నమ్మకాన్ని పరిరక్షించుకునేందుకూ, ఇతర దేశాల్లో ఉన్నత పదవుల్లో ఉన్నవారిని తమ అదుపాజ్ఞల్లో ఉంచుకునేందుకూ బంగారాన్ని విరివిగా ఉపయోగించేవారు. వాళ్ళు కాంతులీనుతున్న స్వర్ణాభరణాలను ప్రదర్శిస్తూ తమ సిరిసంపదలను సులభంగా చూపుతూ తమ ప్రజలకు విస్మయం కలిగించేవారు, తరచూ భయపెట్టేవారు.” రోమన్‌లు స్పెయిన్‌ను, స్పెయిన్‌వారి బంగారు గనులను స్వాధీనం చేసుకుని చాలా బంగారాన్ని సంపాదించారని ఒక ప్రచురణ చెబుతుంది.

అయినప్పటికీ, దాని మరింత రక్తసిక్తమైన చరిత్రను త్రవ్వకుండా బంగారం కథ సంపూర్ణం కాదు. అది గెలుపు, క్రూరత్వము, బానిసత్వము, మరియు మరణముల కథ.

రక్తం కారుతున్న చరిత్ర

నాగరికత అభివృద్ధి చెందగా, పెద్దవైన మరింత బలమైన తెరచాపలున్న ఓడలు క్రొత్త దేశాలను కనుగొనేందుకు, క్రొత్త కాలనీలను స్థాపించేందుకు, బంగారాన్ని అన్వేషించేందుకు బయల్దేరాయి. బంగారాన్ని కనుగొనడమనేది సముద్రయానం చేసి క్రొత్తప్రదేశాలను కనిపెట్టినవారిలో మొదటివాడైన క్రిస్టఫర్‌ కొలంబస్‌తో సహా (1451-1506) అనేక అన్వేషకులకు పిచ్చిగా మారింది.

కొలంబస్‌ బంగారం కోసం అన్వేషిస్తున్నప్పుడు, ఆయన ఆ దేశస్థుల ప్రాణాలను కూడా లెక్క చేయలేదు. ఒక ద్వీపంలో తనకు ఎదురైన అనుభవాలను తన సాహసయాత్రకు అవసరమైన ఖర్చులుపెట్టుకున్న స్పెయిన్‌ రాజుకూ, రాణీకి చెబుతూ, తన ప్రయాణ విశేషాలను తెలిపే పుస్తకంలో ఆయన ఇలా వ్రాశాడు: “ఇక్కడ ఏలాలంటే, ఇక్కడ స్థిరపడి, ఈ దేశస్థులపై అధికారం చెలాయించడమే. వాళ్ళకు ఏది ఆజ్ఞాపిస్తే అది చేస్తారు. . . . ఇండియన్లు . . . దిగంబరులు, నిరాయుధులు. కనుక ఆజ్ఞలను విని, వాటిని శిరసావహించడానికి సిద్ధంగా ఉంటారు.” తనకు దేవుని ఆశీర్వాదముందని కొలంబస్‌ నమ్మాడు. స్పెయిన్‌ చేసే పవిత్ర యుద్ధాలకు కావలసిన ఆర్థిక మద్దతును బంగారు నిధులు ఇచ్చేవి. బంగారు మాస్క్‌ బహుమతిగా లభించిన తర్వాత, ఒకసారి ఆయన, ‘నేను బంగారాన్ని కనుగొనేందుకు దేవుడు తన దయతో నాకు సహాయం చేయునుగాక’ అన్నాడు.

బంగారం అన్వేషణలో కొలంబస్‌ అడుగుజాడలను అనుసరిస్తూ, సముద్రాలపై ప్రయాణం చేసిన స్పెయిన్‌ కాన్‌క్విస్టడోర్‌లకు (విజేతలకు) స్పెయిన్‌ దేశపు రాజు “బంగారం తీసుకురండి! సాధ్యమైతే, మానవత్వాన్ని విడిచిపెట్టకుండానే తీసుకురండి. ఎలా తీసుకు వస్తారన్నది నాకనవసరం, కానీ మీరు మాత్రం బంగారంతో రావాలి” అని ఆజ్ఞాపించాడు. నిర్దయులైన అన్వేషకులు మెక్సికోలోను మధ్య మరియు దక్షిణ అమెరికాలోను ఎదురైన అక్కడి ప్రజలను వేలాదిమందిని చంపేశారు. విజేతలు స్పెయిన్‌కు తిరిగి తీసుకువెళ్ళిన బంగారం నుండి ఆలంకారికంగా రక్తం కారుతూ ఉండింది.

తర్వాత ఏ దేశానికీ ప్రాతినిధ్యం వహించని సముద్రపు దోపిడీదారులు వచ్చారు. సముద్ర ప్రవేశద్వారమున వాళ్ళు బంగారము, మరితర విలువైన నిక్షేపాలుగల స్పెయిన్‌ నౌకలను దోచుకున్నారు. తరచూ ఆయుధబలమో, మానవబలమో అంతగా లేని ఆ నౌకలు సాయుధులైన దోపిడీదారులకు సమవుజ్జీలు కావు. 17, 18 శతాబ్దాల్లో, సముద్ర ప్రయాణంలో దోపిడీదారుల భయం ఉండేది. ముఖ్యంగా వెస్ట్‌ ఇండీస్‌లోనూ, అమెరికా తీరప్రాంతంలోనూ.

19వ శతాబ్దంలో బంగారం కోసం ఎగబడటం

కాలిఫోర్నియాలో, సాక్రమెంటో వ్యాలీ 1848లో బంగారం కనుగొనబడింది. ఆ వార్త త్వరగా అంతటా వ్యాపించింది. వలసవెళ్ళి స్థిరనివాసం ఏర్పరచుకుని, మేము మొదట వచ్చామంటే, మేము మొదట వచ్చామని ఎగబడ్డారు. అలా పద్దెనిమిదివందల “నలభై తొమ్మిదిలో వచ్చిన” వేల కొలది మంది—అదృష్టాన్ని వెదుక్కుంటూ ప్రపంచ నలుమూలల నుండి వచ్చినవాళ్ళు—తర్వాతి సంవత్సరానికెల్లా, కాలిఫోర్నియాను చుట్టుముట్టారు. 1848లో 26,000గా ఉన్న కాలిఫోర్నియా జనాభా 1860లో 3,80,000కు పెరిగింది. రైతులు తమ పొలాలను వదిలిపెట్టారు, నావికులు ఓడలను ఉపేక్షించారు, సైనికులు సైన్యం నుండి విరమించుకున్నారు—ఎందుకు, బంగారంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయాణం కోసమే. కొందరిని “రక్తదాహంగల దుర్మార్గులు” అని వర్ణించడం జరిగింది. మానవత్వం కరువై, నేరం, హింసా ఉప్పెనలా విరుచుకుపడ్డాయి. బంగారపు వ్యామోహంలో పడినా, పని చేయడానికి ఇష్టపడనివారు దోపిడీలకు పాల్పడి, గుర్రపు బండ్లను, రైళ్ళను దోచుకోవడం మొదలెట్టారు.

1851లో కాలిఫోర్నియాలో బంగారం కోసం వలసవెళ్ళి ఎంతోకాలం గడవక ముందే, ఇంకా పెద్ద బంగారు నిక్షేపాలు ఆస్ట్రేలియాలో ఉన్నాయనే వార్త అంతటా వ్యాపించింది. “ఫలితం నిజంగా అద్భుతంగా ఉంది” అని నివేదిక తెలిపింది. కొద్ది కాలంలోనే, ఆస్ట్రేలియా ప్రపంచంలోని అతి పెద్ద బంగారు ఉత్పత్తిదారు అయ్యింది. కాలిఫోర్నియాకు వలస వెళ్ళిన వాళ్ళు వెంటనే తమ బ్యాగ్‌లను సర్దుకుని డౌన్‌ అండర్‌కు వెళ్ళారు. ఆస్ట్రేలియా జనాభా విపరీతంగా పెరిగిపోయింది—1850లో 4,00,000గా ఉన్న జనాభా 1860లో 11,00,000 కన్నా ఎక్కువగా పెరిగింది. అనేకులు బంగారంలో తమ అదృష్టాన్ని వెదుక్కుంటూ వెళ్ళారు గనుక, వ్యవసాయమూ మరితర పనులూ దాదాపుగా ఆగిపోయాయి.

19వ శతాబ్దాంతానికెల్లా, బంగారం పిచ్చిపట్టిన జనసమూహం బంగారాన్ని అన్వేషిస్తూ యూకాన్‌, అలాస్కాలకు తరలివెళ్ళి బంగారం కనుగొనబడిన ప్రాంతాలకు తరలి వెళ్ళింది. వేలాది మంది ప్రజలు సుదూర ఉత్తరానికి, క్లాండైక్‌ ప్రాంతానికి, అలాస్కాకు వెళ్ళి, బంగారం సమృద్ధిగానున్న ఆ దేశంలో తాము ముందొచ్చామని చెప్పగల్గేందుకు ముందు వెళ్ళి అక్కడి విపరీతమైన చలిని భరించారు.

మునిగిపోయిన నిక్షేపం

20వ శతాబ్దంలో, సముద్రపు లోతుల్లో డైవింగ్‌ మొదలవ్వడంతో, బంగారపు అన్వేషకులు తమ శ్రద్ధను సముద్రపు అడుగు భాగానికి మళ్ళించారు. వాళ్ళు అక్కడ మునిగిపోయిన నిక్షేపాల కోసం, అంటే శతాబ్దాల క్రితం నాటి బంగారపు ఆభరణాల కోసం, ఇతర కళావస్తువుల కోసం ఓడ శిథిలాలను వెదికారు.

1638 సెప్టెంబర్‌ 20న, తీవ్రమైన వాతావరణంవల్ల బండల మీదుగా వెళ్ళిన కన్‌సెప్సియన్‌ స్పెయిన్‌ నౌక సైపాన్‌ తీరానికి దూరంగా పసిఫిక్‌ మహా సముద్రంలో మునిగిపోయింది. అది బంగారాన్ని, నేడు లక్షల డాలర్ల విలువ చేయగల మరితర నిక్షేపాలను తీసుకు వెళ్తుండగా అలా జరిగింది. ఓడలో ఉన్న 400 మందిలో దాదాపు అందరూ చనిపోయారు. డైవర్లు ఆ శిథిలాల నుండి 32 బంగారు గొలుసులను కనుగొన్నారు. ఒక్కొక్కటి దాదాపు ఐదు అడుగుల పొడవు, అనేక కిలోగ్రాముల బరువు ఉన్నాయి. మొత్తం 1,300 బంగారు వస్తువులను—గొలుసులను, సిలువ గుర్తులను, గుండీలను, బ్రోచ్‌లను, ఉంగరాలను, బకెల్స్‌ను—డైవర్లు కనుగొన్నారు.

ఇతర శిథిలాలు కూడా కనుగొనబడ్డాయి. డైవర్లు శాంటా మార్గారీట అనే 17వ శతాబ్దపు స్పెయిన్‌ నౌకా శిథిలాలను 1980లో అమెరికాలోని ఫ్లోరిడా తీరానికి దూరాన కనుగొన్నారు. తర్వాతి సంవత్సరాంతంలో, 44 కిలోగ్రాముల కన్నా ఎక్కువ బంగారు రాశినీ, దానితోపాటు మరితర బంగారు కళావస్తువులను కనుగొన్నారు.

యుద్ధపు బంగారం

1945లో జర్మన్‌ ప్రభుత్వ షరతులను అనుసరిస్తూ, మిత్ర కూటాలు తురుంగియాలోని కైజెరోడా ఉప్పు గనుల్లో ఆశ్చర్యకరమైన ఒకదానిని కనుగొన్నాయి. అట్లాంటా జర్నల్‌ అభిప్రాయం ప్రకారం, “ఆ గనుల్లో మతి చెడేంతగా, బంగారు రాశులుగానూ, కళావస్తువులుగాను, కరెన్సీగానూ, సెక్యూరిటీల రూపంలోనూ 210 కోట్ల డాలర్ల విలువగల ఫలితం లభించింది.” సంచుల నిండా దంత చికిత్స సంబంధమైన బంగారు మరియు వెండి పరికరాలు కూడా కనుగొనబడ్డాయి, హోలోకాస్ట్‌కు [నాజీ మారణహోమానికి] గురైన వారి నుండి తీసుకున్న బంగారం అప్పటికే కరిగించబడింది. బంగారపు ఈ పెద్ద నిక్షేపం దీర్ఘకాలం కొనసాగిన యుద్ధంలో నాజీ యుద్ధప్రభువులకు ఆర్థికంగా సహాయపడింది. ఒకప్పుడు హిట్లరు అధీనంలో ఉన్న దాదాపు పది దేశాలకు 2.5 కోట్ల మూల్యం గల బంగారం తిరిగి చేరుకుందని అంచనా వేయబడింది అని జర్నల్‌ నివేదిస్తుంది. మరుగున పడిపోయిన నాజీ బంగారం అంతా కూడా బయటపడలేదన్న నమ్మకం కారణంగా పరిశోధన కొనసాగుతుంది.

బంగారానికి విలువ ఉన్నదన్నది నిజమే. అయినప్పటికీ, ఇతర భౌతిక సంపదలకు మల్లే బంగారం కూడా జీవితాన్ని కోరుకునేవారికి జీవితాన్నివ్వలేదని బైబిలు చెబుతుంది. (కీర్తన 49:6-8; జెఫన్యా 1:18) “అపరంజిని సంపాదించుటకంటె జ్ఞానమును [“బుద్ధిని,” NW] సంపాదించుట ఎంతో శ్రేష్ఠము” అని ఒక బైబిలు సామెత చెబుతుంది. (సామెతలు 16:16) నిజమైన బుద్ధి అనేది సృష్టికర్తయైన యెహోవా దేవుడి నుండే వస్తుంది, ఆయన వాక్యమైన బైబిలులోనే అది కనుగొనబడుతుంది. దేవుడి వాక్యాన్ని పఠించడం ద్వారా, అలాంటి బుద్ధిని వెదికేవారు దేవుడి నియమాలనూ, సూత్రాలనూ, ఉపదేశాన్నీ తెలుసుకుని వాటిని తమ జీవితంలో ఆచరణలో పెడ్తారు. కనుక, మానవుడు ఇప్పటి వరకు కనుగొన్న బంగారమంతటికన్నా కూడా అలా సంపాదించిన బుద్ధి ఎంతో కోరదగినది. అలాంటి బుద్ధి వల్ల ఇప్పుడు కాస్త మెరుగైన జీవితమూ, భవిష్యత్తులో నిత్యజీవమూ సాధ్యమౌతాయి.—సామెతలు 3:13-18.

[27వ పేజీలోని బాక్సు]

బంగారాన్ని గురించిన కొన్ని వాస్తవాలు

• లోహాలన్నింటిలోకెల్లా, ఎలాగైనా మలచగల, ఎంతైనా సాగగొట్టగల లోహం బంగారమే. దాన్ని ఒక అంగుళంలో 40 లక్షల్లో ఒక వంతు వరకు పలుచగా చేయవచ్చు. 28 గ్రాముల బంగారాన్ని దాదాపు 17 చదరపు మీటర్ల విస్తీర్ణంగల ప్రాంతాన్ని కప్పేంతగా కొట్టి సాగదీయవచ్చు. 28 గ్రాముల బంగారాన్ని 70 కిలోమీటర్ల పొడవు దాకా సాగదీయవచ్చు.

• బంగారం చాలా మెత్తగా ఉంటుంది గనుక, దానిని సాధారణంగా ఇతర లోహాలతో కలిపి దాని గట్టితనాన్ని పెంచి ఆభరణాలను మరితర బంగారు వస్తువులనూ తయారు చేసేందుకు ఉపయోగిస్తారు. బంగారంలో ఉండే మిశ్రితాన్ని సూచించేందుకు క్యారెట్ల లెక్క చెబుతారు. 12 క్యారెట్ల బంగారం అంటే, అందులో 50 శాతం బంగారం ఉందనీ, 18 క్యారెట్లు అంటే 75 శాతం బంగారం ఉందనీ అర్థం. 24 క్యారెట్లంటే శుద్ధమైన బంగారమన్నమాట.

• బంగారాన్ని ఉత్పత్తి చేసే ప్రముఖ దేశాలు దక్షిణ ఆఫ్రికా, అమెరికా.

[25వ పేజీలోని చిత్రసౌజన్యం]

అలెగ్జాండర్‌ ద గ్రేట్‌: The Walters Art Gallery, Baltimore

[26వ పేజీలోని చిత్రాలు]

క్రిస్టఫర్‌ కొలంబస్‌ బంగారాన్ని వెదుక్కుంటూ 1492లో బహమాస్‌కు రావడాన్ని ఈ పెయింటింగ్‌ చిత్రీకరిస్తుంది

[క్రెడిట్‌ లైను]

Courtesy of the Museo Naval, Madrid (Spain), and with the kind permission of Don Manuel González López

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి