నత్తి నుండి విముక్తి!
దాదాపు ఎనిమిది దశాబ్దాలుగా, దైనందిన సమస్యలను ఎదుర్కోవడానికి తేజరిల్లు! తన పాఠకులకు సహాయపడింది. క్రింది వృత్తాంతం తెలియజేస్తున్నట్లు, కొన్నిసార్లు, తమ జీవితాలపై ప్రభావం చూపే వైద్య రంగపు క్రొత్త పురోగతులు, ధోరణులు విషయమై తేజరిల్లు! వారిని అప్రమత్తులను చేస్తుంది.
ఉత్తర ఇంగ్లండ్‌లో 1989లో మ్యాత్యూ జన్నించాడు. రెండేండ్ల వరకూ అతడు మూమూలు అబ్బాయిలానే ఉండేవాడు. ఆ తర్వాత, సెలవుల్లో ఉన్నప్పుడు అకస్మాత్తుగా అతనికి తీవ్రమైన నత్తి మొదలైంది.
“నేను నా భర్తా మా స్థానిక స్వీచ్ థెరపీ యూనిట్‌ను సంప్రదించాం. ఏడేండ్ల వయస్సు వరకూ పిల్లలు తమ స్వర తంత్రులను అదుపులో ఉంచుకోలేరు గనుక, అప్పటి వరకు ఏమీ చేయలేమని వాళ్ళు చెప్పారు. కానీ మ్యాత్యూ స్కూల్‌కు వెళ్ళినప్పుడు, మిగతా పిల్లలు ఎగతాళి చేస్తుంటే తట్టుకోలేకపోయాడు. అతడికి నత్తి ఇంకా ఎక్కువయ్యింది. గుంపులో ఉండడాన్ని ఏవగించుకున్నాడు. ఎవరితోను కలిసేవాడు కాదు. రాజ్యమందిరంలో కూటాలకు హాజరు కావడం కూడా అతడికి ఒక సవాలై పోయింది.
“తేజరిల్లు! ఏప్రిల్ 8, 1995 సంచికలో (ఆంగ్ల సంపుటి) ‘ప్రపంచ పరిశీలన’లో ‘నత్తి వారికి నిరీక్షణ’ అన్నది మాకు కనిపించింది. అది ఆస్ట్రేలియాలోని సిడ్నిలో స్వీచ్ థెరపిస్ట్‌ల బృందం చేస్తున్న పనిని క్లుప్తంగా వివరించింది. ఆ బృందం పిల్లల్లోని నత్తికి చికిత్స చేయడంలో సాఫల్యాన్ని సాధిస్తూ వచ్చింది.
“మేము యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీకి ఉత్తరం వ్రాశాం. తనను టెలిఫోను ద్వారా సంప్రదించమని అంటూ డా. మార్క్ ఆన్‌జ్‌లో దయతో మాకు జవాబిచ్చారు. మేముండేది ప్రపంచానికి మరోవైపున కనుక, స్వీచ్ థెరపిస్ట్‌ల ఆయన బృందం ‘దూరం నుండే సహాయాన్నందించడానికి’ ప్రయత్నించుదామనే నిర్ణయానికి వచ్చారు. మ్యాత్యూ తల్లిదండ్రులముగా మాకు టెలిఫోన్, ఫాక్స్, ఆడియోటేప్‌ల ద్వారా ఆ బృందం ఉపయోగించే పద్ధతులను గురించిన నిర్దేశాలు ఇవ్వబడ్డాయి. మ్యాత్యూ వ్యక్తిగత అవసరాలకు తగినట్లుగా థెరపీ మలచబడింది. నేను ప్రశాంతంగా, మామూలుగానే వాటితో కూర్చుని, వాటికి పలకడానికి ఇబ్బిందిగా ఉండే మాటలను సరిచేస్తూ సహాయపడేదాన్ని. నేను బాగా పొగిడేదాన్ని, ‘అనర్గళంగా’ మాట్లాడినప్పుడు చిన్న బహుమానాలను ఇచ్చేదాన్ని.
“ఆరునెలల తర్వాత మ్యాత్యూ తనలో తాను మగ్గిపోవడం మానేసి, అందరితో కలిసిపోవడం మొదలుపెట్టాడు. సాధారణ పిల్లల్లా సంతోషంగా కలిపిపోయే పిల్లవాడిగా మారాడు. ఇప్పుడు సంఘ కూటాల్లో జవాబులిస్తున్నాడు, రాజ్య మందిరంలో నియమిత బైబిలు భాగాన్ని చక్కగా నిర్వహిస్తాడు. ఇంటింటి పరిచర్యలో అర్థవంతమైన భాగాన్ని వహిస్తున్నాడు కూడా. ఇప్పుడు అతని మాట మామూలుగానే ఉంది!
“తేజరిల్లు!లో వచ్చిన ఆ చిన్న సమాచారం మా అబ్బాయి జీవితాన్ని మార్చివేసింది. ఆ సమాచారాన్ని బట్టి మేము ఎంత కృతజ్ఞులమో చెప్పలేం!”—ఒక పాఠకురాలి లేఖ.