రాజైన సొలొమోను సంపదను గూర్చి అతిశయోక్తిగా చెప్పబడిందా?
“ఏటేట సొలొమోనునకువచ్చు బంగారము వెయ్యిన్ని మూడువందల ముప్పదిరెండు మణుగుల యెత్తు.”—1 రాజులు 10:14.
ఆ బైబిలు వచనం ప్రకారం, కేవలం ఒక సంవత్సరంలోనే రాజైన సొలొమోను 25 టన్నుల కంటే ఎక్కువ బంగారాన్ని ఆర్జించాడు! అది నేడు 24,00,00,000 డాలర్లంత విలువను కలిగివుంటుంది. అది, 1800వ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా వెలికి తీయబడిన బంగారానికి దాదాపు రెండంతలుంటుంది. ఇది సాధ్యమేనా? పురావస్తుశాస్త్ర రుజువు ఏమి చూపుతుంది? సొలొమోను సంపదను గూర్చిన బైబిలు రికార్డు తప్పక నమ్మదగినదని అది సూచిస్తుంది. బిబ్లికల్ ఆర్కియాలజీ రివ్యూ ఇలా చెబుతుంది:
◻ ఐగుప్తు రాజైన మూడవ తట్మోస్ (సా.శ.పూ. రెండవ సహస్రాబ్ది) కార్నాక్ నందలి అమోన్-రా ఆలయానికి దాదాపు 13.5 టన్నుల బంగారు వస్తువులను అర్పించాడు—అది ఆ బహుమతిలో కొంతభాగం మాత్రమే.
◻ రాజైన ఒకటవ ఓసార్కన్ (సా.శ.పూ. మొదటి సహస్రాబ్ది ప్రధమార్థం) దేవుళ్లకు దాదాపు 383 టన్నుల బంగారాన్ని మరియు వెండిని బహుమతిగా ఇచ్చిన విషయాన్ని ఐగుప్తీయుల శిలాశాసనాలు నివేదిస్తున్నాయి.
అంతేకాకుండా, గ్రేట్ ఏజెస్ ఆఫ్ మ్యాన్ అనే పుస్తక పరంపరలో క్లాసికల్ గ్రీస్ అనే సంపుటి ఇలా నివేదిస్తుంది:
◻ థ్రేస్లోని పంగేయన్ గనులు రాజైన రెండవ ఫిలిప్ (సా.శ.పూ. 359-336) కొరకు ప్రతి సంవత్సరం 37 టన్నుల కంటే ఎక్కువ బంగారాన్ని ఉత్పత్తి చేసేవి.
◻ ఫిలిప్ కుమారుడైన అలెగ్జాండర్ ద గ్రేట్ (సా.శ.పూ. 336-323) పర్షియా రాజధానియైన సూసాను స్వాధీనం చేసుకున్నప్పుడు, దాదాపు 1,200 టన్నుల బంగారంగల నిధులు వెలికితీయబడ్డాయి.
కాబట్టి రాజైన సొలొమోను సంపదను గురించిన బైబిలు వర్ణన అసహజమైనదేమీ కాదు. సొలొమోను “ధనముచేతను జ్ఞానముచేతను” ఆ సమయంలోని “భూపతులందరిలో అధికుడై” ఉండెననే విషయాన్ని కూడా జ్ఞాపకముంచుకోండి.—1 రాజులు 10:23.
సొలొమోను తన సంపదను ఎలా ఉపయోగించాడు? ఆయన సింహాసనము “సువర్ణముతో” పొదిగించబడింది, ఆయన పానపాత్రలు “బంగారపువై యుండెను” మరియు “సుత్తెతో కొట్టిన బంగారముతో” చేయబడిన 200 పెద్ద డాళ్లు మరియు 300 కేడెములు ఆయన దగ్గర ఉండేవి. (1 రాజులు 10:16-21) అతి ప్రాముఖ్యంగా, సొలొమోను వద్దవుండిన బంగారం యెరూషలేములోని యెహోవా మందిరం కొరకు ఉపయోగించబడింది. మందిరములోని దీపస్తంభాలు మరియు ముండ్ల కొంకులు, గిన్నెలు, కూజాలు మరియు పాత్రలవంటి పవిత్ర ఉపకరణములు బంగారము మరియు వెండితో చేయబడ్డాయి. అతి పరిశుద్ధ స్థలంలో ఉండే 4.5 మీటర్ల పొడవుగల కెరూబులు, బలిపీఠము మరియు మందిరము యొక్క లోపలి భాగమంతయూ బంగారంతో పొదగబడింది.—1 రాజులు 6:20-22; 7:48-50; 1 దినవృత్తాంతములు 28:17.
బంగారంతో పొదగబడిన మందిరం విషయమేమిటి? ఆసక్తికరంగా, ప్రాచీన కాలంలో బంగారాన్ని అలా ఉపయోగించడం అసాధారణమేమీ కాదు. ఐగుప్తుకు చెందిన మూడవ ఎమినోఫిస్, “‘థీబేస్ వద్ద, లోపలంతా బంగారం పొదిగి, వెండితో నేలను అలంకరించి [మరియు] ద్వారాలన్నీ—వెండి బంగారాల మిశ్రమమైన ఎలెక్ట్రమ్తో చేయబడిన’ ఒక మందిరాన్ని గొప్ప దేవుడైన అమున్కు అర్పించి అతన్ని ఘనపరిచాడు” అని బిబ్లికల్ ఆర్కియాలజీ రివ్యూ పేర్కొంటోంది. అంతేకాకుండా, అసిరియాకు చెందిన ఇసార్-హద్దోన్ (సా.శ.పూ. ఏడవ శతాబ్దం) అష్షూర్ గుడిలోని తలుపులను మరియు గోడలను బంగారంతో పొదిగించాడు. హారాన్ నందలి సిన్ దేవాలయాన్ని గురించి, బబులోనుకు చెందిన నెబోనిడస్ (సా.శ.పూ. ఆరవ శతాబ్దం) ఇలా నమోదు చేయించాడు: “నేను దాని గోడలను బంగారము మరియు వెండితో అలంకరించాను, అవి సూర్యునివలె మెరిసేలా చేశాను.”
అలా, రాజైన సొలొమోను యొక్క ధనాన్ని గురించిన బైబిలు వృత్తాంతం అతిశయోక్తిగా చెప్పబడలేదని చారిత్రక నివేదికలు చూపుతున్నాయి.