యౌవనస్థులు ఇట్లడుగుదురు. . .
నా మనస్సును ఎలా నిలుపగలను?
“నేను సంవత్సరాలుగా కూటాలకు హాజరౌతున్నాను, కానీ వాటినుండి ప్రయోజనం పొందలేకపోతున్నాను. నా మనసు ఎక్కడెక్కడో విహరిస్తూ ఉంటుంది.”—మ్యాత్యూ.
మీరెప్పుడైనా పాఠశాల తరగతి గదిలో లేదా క్రైస్తవ కూటంలో కూర్చుని ఉండగా, అక్కడ ఏమి చర్చించబడుతుందో మీకు తెలియట్లేదన్న విషయాన్ని అకస్మాత్తుగా గ్రహించారా? సరే, కొన్నిసార్లు మీ మనస్సు ఎక్కడెక్కడికో పరుగులు తీస్తుందా? అయితే మనస్సు ఎక్కడికెక్కడికో వెళ్తున్న సమస్య ఉన్నది మీ ఒక్కరికి మాత్రమే కాదు. ముందటి శీర్షిక చెప్పినట్లు, యౌవనస్థులు ఎక్కువసేపు ఏకాగ్రత నిలపలేకపోవడం సాధారణమే.a అయినప్పటికీ, కాస్త ప్రయత్నం చేస్తే, మీ దృక్పథాన్ని కొంచెం మార్చుకుంటే, మీరు ఏకాగ్రతను నిలపగల మీ సామర్థ్యాన్ని పెంచుకోవడం నేర్చుకుంటారు.
ఆసక్తిగలవారై ఉండండి
శిక్షణ పొందిన అథ్లెట్ గురించి ఆలోచించండి. “పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును” అని అపొస్తలుడైన పౌలు అంటున్నాడు. అథ్లెట్ తన ధ్యాసను ఒక్కనిమిషం మళ్ళించినా, ఓడిపోగలడు. విజయం సాధించాలంటే, ఆయన ఏకాగ్రతను నిలపడానికి నేర్చుకోవలసిందే.—జనసమూహపు అరుపులను పట్టించుకోకుండా, తన నొప్పినీ, నిస్సత్తువను లక్ష్యపెట్టకుండా ఓటమి అనే తలంపును కూడా రానివ్వకుండా ఏకాగ్రతను నిలపడానికి నేర్చుకోవలసిందే. అలాంటి అసాధారణ కృషిని సలిపేందుకు అథ్లెట్లను ప్రేరేపించేదేమిటి? అపొస్తలుడైన పౌలు చెప్పినదాని ప్రకారం “వారు క్షయమగు కిరీటమును”—ట్రోఫీలను, విజేతలకు ఇచ్చే అవార్డులను—‘పొందవచ్చు’ గనుకనే అలా చేస్తారు.—1 కొరింథీయులు 9:25.
అలాగే, మీరు కూడా శ్రద్ధ చూపడానికి పురికొల్పబడాలి ! విలియమ్ హెచ్. ఆర్మ్‌స్ట్రాంగ్ వ్రాసిన స్టడీ ఈస్ హార్డ్ వర్క్ (పఠనం కష్టమైన పని) అనే పుస్తకం ఇలా చెబుతుంది: “ఆసక్తి కలిగి ఉండడం” విద్యార్థి బాధ్యత. మీ కోసం మరొకరు ఆసక్తి కలిగి ఉండలేరు. మీకు అలాంటి కోరిక లేకపోతే, మరొకరు మీలో ఆసక్తిని పెంచనూ లేరు.” మీ చుట్టూవున్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి జ్ఞానమే కీలకం. మీకెంతగా తెలిస్తే, మీరు అంతగా నేర్చుకుంటారు. “తెలివిగలవానికి జ్ఞానము సులభము” అని సామెతలు 14:6 చెబుతుంది. మీరు స్కూల్లో నేర్చుకునే విషయాలనన్నింటినీ గుర్తుంచుకోలేకపోవచ్చు, కానీ కనీసం, మీరు ఆలోచించే సామర్థ్యాన్ని అలవర్చునేందుకు, దాన్ని పెంపొందించుకునేందుకూ అది సహాయపడుతుంది. (పోల్చండి సామెతలు 1:4.) మానసిక క్రమశిక్షణనూ, ఏకాగ్రతను నిలపగల సామర్థ్యాన్నీ కలిగివుండడం మీ జీవితమంతా కూడా మీకు ప్రయోజనాన్ని కలిగిస్తుంది.
విసుగెత్తిన టీచర్లు, విసుగెత్తించే టీచర్లు
అయితే, తమ టీచర్లకు కూడా ఆసక్తిలేనట్లు కనిపిస్తుందని కౌమారప్రాయంలో ఉన్న కొందరు ఫిర్యాదు చేస్తున్నారు. జెస్సీ అనే పేరుగల ఒక యౌవనస్థుడు, “మీ ఎదుట టీచర్లు నిలబడతారు, ఏదో చెబుతారు, మీకు ఏదో ఒక పని చెబుతారు, తర్వాత, మిమ్మల్ని పంపించేస్తారు. వాళ్ళకు అంతా నిర్లక్ష్యమేనని నాకు అనిపిస్తుంది. అది అంత ప్రాముఖ్యమైనదన్నట్లు టీచర్లు ప్రవర్తించరు కనుక, శ్రద్ధ చూపించవలసిన అవసరమున్నట్లు మాకూ అనిపించదు” అని అంటున్నాడు.
అయితే, శ్రద్ధ చూపించడం సమయం వృథా చేయడమేనని మీరనుకోవాలా? అలా అనుకోనవసరం లేదు. చాలా మంది టీచర్లు విషమవలయంలో చిక్కుకుపోతారు. “టీచర్లు చెప్పేది ఎవరూ శ్రద్ధగా వినరు. కనుక నేర్చుకోవాలన్న ఆసక్తి ఎవరికీ లేదని టీచర్లు అనుకుంటారు. అలాంటప్పుడు వాళ్ళు కూడా పాఠాలను నేర్పడానికి అంత శ్రమ తీసుకోరు, అంత ఉత్సాహం చూపించరు” అని కౌమారప్రాయంవాడైన కాలిన్ వివరిస్తున్నాడు.
మీరు నమ్మినా, నమ్మకపోయినా, వాళ్ళు ఈ పద్ధతిని మార్చుకునేందుకు మీరు సహాయపడగలరు. ఎలా? అవధానాన్నివ్వడం ద్వారానే. విసుగెత్తిన టీచర్ తన ఉద్యోగంలో మళ్ళీ ఆసక్తిని చూపించడానికి ఆసక్తివున్న ఒక్క విద్యార్థి చాలు. నిజమే, కొందరు టీచర్లకు క్లాసులో పిల్లలందరి ఆసక్తిని చూరగొనే సామర్థ్యం ఉండదు. కానీ, మీరు పగటికలల్లోకి జారిపోకముందు, ‘తను దేనిని గురించి మాట్లాడుతున్నారో టీచర్‌కు తెలుసా?’ అని ప్రశ్నించుకోండి. టీచర్‌కు తెలుసు అన్నదే జవాబైతే, మీరు ఆ టీచర్ నుండి ఏదైనా నేర్చుకోవాలని నిర్ణయించుకోండి. జాగ్రత్తగా వినండి—ఏకాగ్రత నిలపండి ! క్లాసులో చర్చించబడేవాటిలో పూర్తిగా లీనమైపొండి. ఆ విషయానికి సంబంధించిన ప్రశ్నలను వేసుకోండి. “టీచర్ బోర్డు మీద వేసే డయాగ్రామ్‌లను, చార్టులను వేసుకోవడమూ, వాటికి సంబంధించిన మాటలను, నిర్వచనాలను, ముఖ్య తలంపులను లేదా టీచర్ నొక్కి చెప్పే విషయాలను వ్రాసుకోవడమూ సహాయకరంగా ఉంటుందని చాలా మంది విద్యార్థులు భావిస్తారు” అని హౌ టు స్టడీ ఇన్ హై స్కూల్ అనే పుస్తకం పేర్కొంటోంది.
“మరీ శ్రద్ధ” వహించడం
క్రైస్తవ కూటాల విషయానికి వస్తే మీరు ఎంత ప్రయోజనం పొందుతారు, ఎంత నష్టపోతారు అన్నది మీరు ఎలా వింటున్నారన్నదానిపై ఆధారపడి ఉంటుంది. “కొన్నిసార్లు యౌవనస్థులు కూటాలవంటి వాటికి శ్రద్ధనివ్వరు, ఎందుకంటే కూటాలు ఎంత ప్రాముఖ్యమైనవో వాళ్ళు గ్రహించరు” అని జెస్సీ ఒప్పుకుంటున్నాడు. హెబ్రీయులు 2:1లో, “మనం విన్న విషయాలలో మరీ శ్రద్ధవహించాలి” (పరిశుద్ధ బైబిల్) అని ఆజ్ఞాపించబడింది. సంఘ కూటానికి హాజరైన తర్వాత, అక్కడ అందించబడిన సమాచారాన్ని దేనినైనా మీరు గుర్తుచేసుకోగలరా? లేదా ఆ కార్యక్రమాన్ని నిర్వహించినదెవరన్న విషయం కూడా కొన్నిసార్లు గుర్తుచేసుకోలేకపోతున్నారా?
మరోసారి, మీరు నేర్చుకుంటున్న దాని ప్రాముఖ్యతను గ్రహించవలసిన అవసరం ఉంది. అంతెందుకు, మీ జీవితం కూడా అందులో ఇమిడి ఉంది ! (యోహాను 17:3) మీరు పరిగణనలోనికి తీసుకోవలసిన మరో విషయం: మీరు బైబిలు పఠించేటప్పుడు, దేవుడు తలంచేలాగే మీరూ తలంచడాన్ని నేర్చుకుంటున్నారు! (యెషయా 55:8, 9) మీరు నేర్చుకున్న విషయాన్ని మీరు ఆచరణలో పెట్టినప్పుడు, బైబిలు చెబుతున్న “నూతన పరచబడుచున్న నవీనస్వభావము” అలవర్చుకుంటున్నవారౌతారు. (కొలొస్సయులు 3:9, 10) మరోవైపు, మీరు శ్రద్ధ నిలపకపోతే, మీరు మీ జీవితానికి అవసరమైన మెరుగులు పెట్టుకోకపోవచ్చు; మీరు మీ సొంత ఆధ్యాత్మిక పెరుగుదలను నిరోధించినవారౌతారు. మనందరిలోను ధ్యాస నిలపలేని బలహీనత ఉందని యెహోవాకు తెలుసు. కనుక, “నా మాట జాగ్రత్తగా ఆలకించి . . . చెవియొగ్గి నాయొద్దకు రండి. మీరు వినినయెడల మీరు బ్రదుకుదురు” అని ఆయన కోరుతున్నాడు.—యెషయా 55:2, 3.
కూటాల నుండి మరెక్కువ ప్రయోజనాన్ని పొందడమెలాగంటే
అయినప్పటికీ, కూటాల్లో శ్రద్ధగా వినడం అన్నది మొదట్లో కష్టమే కావచ్చు. కాని, మనం ఏకాగ్రత నిలపడానికి ఎంత ఎక్కువ అభ్యసిస్తే మన మెదడు అంత ఎక్కువగా ఏకాగ్రతను నిలపగలుగుతుంది. మొదట్లో పేర్కొన్న మ్యాత్యూ, కూటాల్లో తన మనస్సు ఎక్కడెక్కడికో పరుగులు తీసే స్వభావాన్ని అధిగమించాడు. ఆయన ఇలా అంటున్నాడు: “నేను శ్రద్ధపెట్టి వినేందుకు నాకై నేను క్రమశిక్షణ అలవర్చుకోవాల్సి ఉందని కనుగొన్నాను. కాస్తంత మెరుగుపడ్డాక, మీరు మరెక్కువ సమయం వరకూ అలాగే శ్రద్ధనిలపగల్గుతారు.” తనకు కూటాలు ఆస్వాదించగలవిగా మారడానికి కారణమైన ఒక పెద్ద కీలకాన్ని మ్యాత్యూ చెప్పాడు. ఆయనిలా అంటున్నాడు: “నేను ముందే చదువుకుని వెళ్తాను.” షరీస్ అనే ఒక అమ్మాయి కూడా అలాగే అంటుంది: “నేను సిద్ధపడినప్పుడు, నేను కూటంలో మరి బాగా పాల్గొన్నట్లు భావిస్తాను. ప్రసంగాల్లో బాగా లీనమైపోతాను, అవి మరింత అర్థవంతంగా ఉన్నట్లుంటాయి.”
ఆలోచనలు అటుయిటు వెళ్ళడాన్ని ఆపడం కూడా చాలా ప్రాముఖ్యం. నిజమే, వచ్చే వారంలోని పరీక్షలు, భిన్న వ్యక్తిత్వాల వల్ల కలిగే ఘర్షణలు, రానున్న ఖర్చులు వంటి అనేక కారణసహితమైన చింతలు మీ మనస్సులో ఉండవచ్చు. కాని యేసు ఈ సలహాను ఇచ్చాడు: “మీలో నెవడు చింతించుటవలన తన యెత్తు మూరెడెక్కువ చేసికొనగలడు? రేపటినిగూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులనుగూర్చి చింతించును; ఏనాటికీడు ఆనాటికి చాలును.” (మత్తయి 6:27, 34) సంఘ కూటాల్లో శ్రద్ధ నిలపడం వల్ల మీ సమస్యలు తీరవుగానీ, అది మీ ఆధ్యాత్మికతను నూతనపరచుకోవడానికి, అలా మీరు సమస్యలను మరింత మెరుగ్గా ఎదుర్కోవడానికి సహాయపడతాయి.—పోల్చండి 2 కొరింథీయులు 4:16.
మీరు శ్రద్ధగా వినడం కూడా మీరు ఏకాగ్రతను నిలిపేందుకు సహాయపడుతుంది. “ప్రసంగికుడు తన ప్రసంగంలో ఏమి చెబుతాడా అని ఎదురు చూసేవాడ్ని, ఆయన దాన్ని ఎలా చెబుతాడో గమనించేవాడ్ని” అని మ్యాత్యూ అంటున్నాడు. ‘చర్చలోని ముఖ్య విషయాలు ఏమిటి? బోధించబడినవాటిని నేనెలా ఉపయోగంలో పెట్టగల్గుతాను?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ప్రసంగికుడు తర్వాత ఏమి చెప్పబోతున్నాడో అని ఎదురు చూడడం కూడా మీరు మీ మనస్సును దారిలో ఉంచడానికి సహాయపడుతుంది. ప్రసంగీకుని తర్కాన్ని అనుసరించడానికి ప్రయత్నించండి. ఆయన ఉపయోగించే లేఖన వాదాలను వ్రాసుకోండి. ఆయన చెప్పే ముఖ్య విషయాలను తలపోస్తూ, సంక్షిప్తంగా సమీక్షించుకోండి. క్లుప్తమైన, అర్థవంతమైన నోట్స్ తీసుకోండి. ప్రేక్షకులు పాల్గొనవలసిన భాగం వచ్చినప్పుడు పాల్గొనండి ! అలా చేయడం వల్ల మీరు మీ మనస్సును లగ్నం చేసి, మీ ఆలోచనలు ఎక్కడికెక్కడికో వెళ్ళకుండా చూసుకోగల్గుతారు.
ఏ ప్రసగింకుడికైనా ఉత్సాహం లేకపోతే, లేదా ఆయన ప్రసంగం విసుగు పుట్టించేలా ఉన్నట్లయితే, ఆలకించడం ఒక సవాలేనని ఒప్పుకోవలసిందే. మొదటి శతాబ్దపు క్రైస్తవులు కొందరు అపొస్తలుడైన పౌలు యొక్క ప్రసంగ సామర్థ్యాన్ని తాము ఎలా దృష్టించారో వ్యక్తం చేస్తూ, “అతడు శరీరరూపమునకు బలహీనుడు, అతని ప్రసంగము కొరగానిదని” అన్నారని గుర్తుంచుకోండి. (2 కొరింథీయులు 10:10) కానీ “మాటల యందు నేను నేర్పులేనివాడనైనను జ్ఞానమందు నేర్పులేని వాడను కాను” అని అంటూ పౌలు ఆ విమర్శకు ప్రతిస్పందించాడు. (2 కొరింథీయులు 11:6) అవును, పౌలు శ్రోతలు ఆయన మాట్లాడే సామర్థ్యాన్ని కాదు కానీ, ఆయన చెప్పినదానిలోని సారాంశమేమిటో గ్రహిస్తే, వారు “దేవుని మర్మములను” ఎన్నింటినో గ్రహించగల్గేవారు. (1 కొరింథీయులు 2:10) అదేవిధంగా, మీరు ఏకాగ్రతను నిలిపి ఆలకించినట్లయితే, “చురుకుదనంలేని” ప్రసంగీకుడి నుండి కూడా మీరు పాఠాలను నేర్చుకోగల్గుతారేమో. ఆయన మీరు మునుపు గ్రహించని అర్థాన్ని చెప్పవచ్చేమో, లేదా మీ మనస్సుకు ఎన్నడూ తట్టని విధంగా ఒక లేఖనాన్ని అన్వయించవచ్చేమో కూడా. ఎవరికి తెలుసు?
లూకా 8:18లో “మీరేలాగు వినుచున్నారో చూచుకొనుడని” యేసు చెప్పిన మాటలు విషయాన్ని చక్కగా సంగ్రహంగా చెబుతున్నాయి. నిజమే, శ్రద్ధ నిలిపేందుకు,—మనస్సు పరిపరివిధాలుగా పోకుండా ఉంచుకునేందుకు ప్రయత్నమూ, అభ్యాసమూ అవసరం. అలా అయితే, మీరు సకాలంలో ఫలితాన్ని పొందుతారు. ఏకాగ్రతను అలవర్చుకోవడం వల్ల మంచి మార్కులు సంపాదించుకోవచ్చు—మరి ముఖ్యంగా, ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించవచ్చు కూడా!
[అధస్సూచీలు]
a ఆగస్టు 8, 1998 సంచికలోని “యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . . నేనెందుకు ఏకాగ్రత చూపలేకపోతున్నాను?” అనే శీర్షికను చూడండి.
[21వ పేజీలోని చిత్రం]
మీరు వినేదానిలో ఆసక్తిని పెంచుకోవడమే శ్రద్ధ నిలపడానికి కీలకం