బైబిలు ఉద్దేశము
మన పాపాలకు సాతానును నిందించాలా?
మొదటి మానవుడు చేసిన పాపానికి సాతానుపై నింద పడింది. ‘సర్పం నన్ను మోసపుచ్చినందువల్ల తిన్నాను’ అని హవ్వ అంది. (ఆదికాండము 3:13.) అప్పటి నుండి, “అపవాదియనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘటసర్పము” ప్రజల ‘మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగజేస్తూ,’ ‘సర్వలోకమును మోసం చేస్తూ’ మానవజాతి ఎడల క్రోధంగా ప్రవర్తిస్తూ వచ్చింది. (ప్రకటన 12:9; 2 కొరింథీయులు 4:4) ఏ మానవుడూ అతడి ఒత్తిడిని తప్పించుకోలేరు. అంటే దానర్థం మనం అతని ప్రభావాన్ని ఎదిరించలేమనా? మనం పాపం చేసిన ప్రతిసారీ తప్పు అతనిదేనా?
వాస్తవంగానే, సాతాను హవ్వను వంచించాడని బైబిలు వివరిస్తుంది. (1 తిమోతి 2:14) దేవుని ఆజ్ఞను ఉల్లంఘించడం ద్వారా దేవుడికున్నటువంటి అంతర్దృష్టినీ, స్వతంత్రాన్నీ తను పొందగలదని తలంచేలా సాతాను హవ్వను మోసం చేశాడు. (ఆదికాండము 3:4, 5) అలాంటి తలంపుతో ఆమె పాపం చేసింది. అయితే, దేవుడు ఆమెను బాధ్యురాలిగా ఎంచి, ఆమెకు మరణశిక్ష విధించాడు. ఎందుకని? సాతాను అబద్ధం చెప్పినప్పటికీ, ఆమె దేవుడి ఆజ్ఞలను గురించి పూర్తిగా తెలుసు. ఆమె అవిధేయత చూపేందుకు బలవంతం చేయబడలేదు; బదులుగా ఆమె తన చర్యలపై అదుపు కలిగి ఉండింది. సాతాను ప్రభావాన్ని ఎదిరించగల సంపూర్ణ శక్తి ఆమెకు ఉండింది.
సాతానును ఎదిరించండి
మానవులమైన మనం సాతానును ఎదిరించడం సాధ్యమే. ‘మనం . . . ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము’ అని ఎఫెసీయులు 6:12 మనకు చెబుతుంది. మనం సాతాను ప్రభావాన్ని ఎదిరించాలని దేవుడు కోరుకుంటున్నాడన్నది స్పష్టం. మానవాతీత శక్తిగల సాతానుకు మరియు అతని దయ్యాలకు మానవుడెలా సమవుజ్జీ కాగలడు? మనం తప్పకుండా ఓడిపోయేటువంటి యుద్ధంలో, మనం ఓడించలేనివారితో యుద్ధం చేయమని మనల్ని కోరడం జరిగిందా? లేదు. అపవాదిని మన సొంత బలంతో పోరాడమని దేవుడు మనకు చెప్పడం లేదు. అపవాది వశీకరణ శక్తిని నిరోధించి విజయం సాధించేందుకు యెహోవా మనకు అనేక మార్గాలను చూపిస్తాడు. అపవాది ఎవరో, అతడు ఎలా ప్రవర్తిస్తాడో, మనల్ని మనం ఎలా కాపాడుకోగలమో బైబిలు మనకు చెబుతుంది.—యోహాను 8:44; 2 కొరింథీయులు 2:11; 11:14.
‘అపవాదిని ఎదిరించడం’ ఎలాగంటే
అపవాదిని ఎదిరించడానికి రెండు చర్యలు ఇమిడివున్న పద్ధతిని లేఖనాలు సిఫారసు చేస్తున్నాయి. “దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును” అని మనకు బోధించబడుతుంది. (యాకోబు 4:7) దేవునికి లోబడి ఉండడంలో ఇమిడి ఉన్న మొదటి చర్య ఆయన ఆజ్ఞలను శిరసావహించడమే. దేవుని అస్తిత్వము, ఆయన మంచితనము, సంభ్రమాశ్చర్యాలను గొలిపే ఆయన శక్తి, ఆయన అధికారం, ఆయన ఉన్నత సూత్రాలను గురించిన స్పృహను ఎడతెగక కలిగి ఉండడం సాతానును ఎదిరించే శక్తిని ఇస్తుంది. దేవుడికి విడువక ప్రార్థన చేయడం కూడా ముఖ్యం.—ఎఫెసీయులు 6:18.
అపవాది యేసును ప్రలోభపెట్టిన సందర్భాన్నే తీసుకోండి. దేవుని వివిధ ఆజ్ఞలను గుర్తుచేసుకుని వాటిని గురించి చెప్పడం ఎదిరించేందుకు యేసుకు ఎంతగానో తోడ్పడింది. పాపం చేసేలా యేసును వశీకరించడంలో పరాజితుడు కావడంతో, సాతాను అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ విషమ పరీక్ష తర్వాత, యెహోవా తన దూతల ద్వారా యేసును బలపరచాడు. (మత్తయి 4:1-11) కనుక, ‘దుష్టుడినుండి తప్పించమని’ దేవుడ్ని కోరమని యేసు తన శిష్యులను నమ్మకంతో ప్రోత్సహించగల్గాడు.—మత్తయి 6:13.
దేవుడు మనలను తప్పిస్తాడంటే, ఆయన మన చుట్టూ రక్షక కవచాన్ని ఉంచుతాడని కాదు. మనం సత్యం, నీతి, సమాధానం, విశ్వాసం వంటి దైవిక లక్షణాలను అలవర్చుకోవడానికి కృషి చేయాలని ఆయన మనకు చెబుతున్నాడు. ఈ గుణాలు “సర్వాంగకవచము”గా పనిచేస్తూ, మనం ‘అపవాది తంత్రములను ఎదిరించేందుకు శక్తిమంతులమయ్యేలా’ చేస్తాయి. (ఎఫెసీయులు 6:11, 13-18) కనుక, అపవాది పెట్టే ప్రలోభాలను తిరస్కరించడం దేవుని సహాయంతో సాధ్యమే.
యాకోబు 4:7లో సిఫారసు చేసిన రెండవ చర్య “అపవాదిని ఎదిరించండి” అన్నదే. అందులో అతని హానికరమైన ప్రభావం నుండి పారిపోవడమనే కచ్చితమైన చర్య ఇమిడి ఉంది. అతని వంచనాత్మక ప్రభావానికి దూరంగా ఉండడం తప్పనిసరి. నేటి లోకంలో ప్రబలంగా ఉన్న భౌతికవాదపు, అనైతికపు తత్త్వశాస్త్రాలను నిరాకరించాలి. అలా అపవాదిని వ్యతిరేకించడంతోపాటు దేవుడ్ని ప్రీతిపర్చేందుకు సమర్పించుకున్న జీవితం సాతానుకు వ్యతిరేకంగా చేసే పోరాటంలో చాలా విలువైనది. అయితే అన్ని పాపాలూ నేరుగా అపవాది ప్రభావ ఫలితాలేనా?
మనలో అంతర్గతంగా జరిగే పోరాటం
బైబిలు రచయితయైన యాకోబు, “ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడినవాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును” అని వివరిస్తున్నాడు. (యాకోబు 1:14, 15) విచారకరమైన విషయమేమిటంటే, మనలో స్వభావసిద్ధంగా ఉన్న బలహీనతను, అపరిపూర్ణతనూ పూర్తిగా అధిగమించలేం. (రోమీయులు 5:12) “పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమిమీద ఒకడైనను లేడు” అని బైబిలు చెబుతుంది.—ప్రసంగి 7:20.
దీనర్థం అన్ని పాపాలూ మనం అదుపు చేయలేనివని కాదు. కొన్ని సందర్భాల్లో, మనం తీసుకునే తప్పుడు నిర్ణయాలవల్లే మనకై మనం ప్రలోభాలను తెచ్చిపెట్టుకుంటాం. కనుక, ఒక తప్పుడు కోరిక మన సొంత అపరిపూర్ణత వల్ల లేక సాతాను ప్రభావం వల్ల కలగవచ్చు. కానీ మనం దానిని పెంచుకుంటామా లేక నిరాకరిస్తామా అన్నది పూర్తిగా మనపైనే ఆధారపడి ఉంటుంది. “మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును” అని అపొస్తలుడైన పౌలు వ్రాయడం సముచితమే.—గలతీయులు 6:7.
బాధ్యతను అంగీకరించండి
మనుష్యులు తమ సొంత బలహీనతలను, పరాజయాలను, లోపాలను—అవును, తమ పాపాలను గుర్తించడం తరచూ చాలా కష్టం. (కీర్తన 36:2) మన పాపాలకు మనం బాధ్యత వహించేందుకు సహాయపడేదేమిటంటే, దేవుడు మనం ఇప్పుడు పరిపూర్ణులంగా ఉండాలని కోరుకోవట్లేదన్నదే. ఆయన “మన పాపములనుబట్టి మనకు ప్రతికారము చేయలేదు మన దోషములనుబట్టి మనకు ప్రతిఫలమియ్యలేదు” అని కీర్తనల రచయిత అయిన దావీదు ప్రకటించాడు. (కీర్తన 103:10) దేవుడు క్షమిస్తున్నప్పటికీ, మనం అపవాది వశీకరణలకూ, పాపం చేసే మన సొంత నైజానికీ వ్యతిరేకంగా గట్టిగా పోరాడాలనీ, మనకై మనం క్రమశిక్షణనిచ్చుకోవాలనీ ఆయన ఎదురు చూస్తున్నాడు.—1 కొరింథీయులు 9:27.
సాతాను మన చర్యలను ప్రక్కదారి పట్టించగలడనీ, మానవుని పాపభరిత పరిస్థితికి సాతానే ఎక్కువ బాధ్యత వహిస్తాడనీ దేవుడు అంగీకరిస్తున్నప్పటికీ, లెక్క అప్పజెప్పవలసిన మన వ్యక్తిగత బాధ్యత నుండి మనలను విముక్తులను చేయడం లేదని మనం తప్పక గ్రహించాలి. కనుక, “మనలో ప్రతివాడును తన్నుగురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను” అని రోమీయులు 14:11 చెబుతుంది.
అయినప్పటికీ, మనం “చెడ్డదాని నసహ్యించుకొని మంచిదానిని హత్తుకొని” ఉంటే కీడును జయంచగల్గుతాం. (రోమీయులు 12:9, 21) మొదటి స్త్రీయైన హవ్వ అలా చేయలేకపోయింది, ఆమె తన అవిధేయత వల్ల శిక్షించబడింది; ఆమె ఎదిరించి, దేవుడికి విధేయత చూపగల్గివుండేది. (ఆదికాండము 3:16) అయినప్పటికీ, ఆమెను మోసం చేయడంలో అపవాది నిర్వహించిన పాత్రను దేవుడు పట్టించుకోకుండా ఉండలేదు. అపవాది శపించబడి, శాశ్వత కాల నాశనానికి నిర్ణయించబడ్డాడు. (ఆదికాండము 3:14, 15; రోమీయులు 16:20; హెబ్రీయులు 2:14) కీడుకు కారణమయ్యే అతని ప్రభావంతో మనం పోరాడనవసరం లేని పరిస్థితి త్వరలోనే వస్తుంది.—ప్రకటన 20:1-3, 10.
[22వ పేజీలోని చిత్రసౌజన్యం]
Erich Lessing/Art Resource, NY