బైబిలు ఉద్దేశము
మీ వస్త్రధారణనూ కేశాలంకరణనూ—దేవుడు పట్టించుకుంటాడా?
“విషయసూచిక ఎలాగైతే పుస్తకంలోని విషయాన్ని వెల్లడిస్తుందో, . . . అలాగే బాహ్య రూపమూ, వస్త్రాలూ, అది స్త్రీ అయినా పురుషుడైనా వారి మనో వైఖరిని సూచిస్తాయి.” —ఆంగ్ల నాటకరచయిత ఫిలిప్ మెస్సింగర్.
సా.శ. మూడవ శతాబ్దంలో, చర్చి రచయిత టైటస్ క్లెమెన్స్ వస్త్రధారణకూ కేశాలంకరణకూ సంబంధించి ఒక పెద్ద నియమాల చిట్టాని రూపొందించాడు. ఆభరణాలూ, ఖరీదైన వివిధ వర్ణాల వస్త్రాలు నిషిద్ధం. స్త్రీలు తమ జుత్తుకు రంగు వేసుకోకూడదు లేదా, “జిత్తులమారితనంతో వలలో పడవేసే వస్తువులను ముఖాలకు అద్దుకో”కూడదు, అంటే “ముఖానికి రంగులు పులుముకోకూడదు.” పురుషులు తమ తలవెండ్రుకలు క్షవరం చేయించుకోవాలని చెప్పబడింది, ఎందుకంటే “క్రాఫు చేయించుకున్న తల . . . ఆ వ్యక్తి గంభీరమైనవాడని చూపుతుంది,” కానీ గడ్డంపైని జుత్తు తీయకూడదు, ఎందుకంటే అది “ముఖానికి గౌరవాన్ని చేకూరుస్తుంది, అది తండ్రిలో ఉండాల్సిన కాఠిన్యాన్ని ప్రదర్శిస్తుంది.”a
శతాబ్దాల తర్వాత ప్రొటెస్టెంటు నాయకుడైన జాన్ కల్విన్ తన అనుచరులు వేసుకోదగ్గ వస్త్రాల రంగును, రకాన్నీ తెలియజేస్తూ చట్టాల్ని చేశాడు. ఆభరణాలు, అల్లికవస్త్రాలు అనిష్టానికి గురయ్యేవి, ఒక స్త్రీ తన జుత్తును “అనైతికమైన ఎత్తు”కు కొప్పు వేసుకుంటే ఆమెను జైలుకు పంపించగలరు.
అటువంటి అతివాద దృక్పథాలు, సంవత్సరాలు తరబడి మతనాయకులచే ప్రోద్బలపర్చబడినందున, అనేకమంది నిజాయితీగా ఆలోచించే వ్యక్తులు, నేనేమి వేసుకుంటున్నాననేది దేవుడు పట్టించుకుంటాడా అని అడిగేందుకు కారణమైంది. ఆయన ఫలాని ఫ్యాషన్లను తిరస్కరిస్తాడా, లేక మేకప్‌ను ఉపయోగించడాన్ని తిరస్కరిస్తాడా? బైబిలు ఏమని బోధిస్తుంది?
అది వ్యక్తిగతమైన విషయం
ఆసక్తికరంగా, యోహాను 8:31, 32లో నమోదు చేయబడినట్లుగా, యేసు తన శిష్యులతో ఇలా చెప్పాడు: ‘మీరు నా వాక్యమందు నిలిచినవారైతే, . . . సత్యమును గ్రహించెదరు; అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును.’ అవును, యేసు బోధించిన సత్యాలు ప్రజలను సాంప్రదాయమూ, అబద్ధబోధలూ సృష్టించిన పెద్ద పెద్ద భారాల్ని వారిపైనుండి తీసివేసి వారిని విముక్తులను చేయడానికి ఉద్దేశించబడ్డాయి. ఆ సత్యాలు “ప్రయాసపడి భారము మోసికొనుచున్న” వారికి సేదదీర్పును ఇవ్వడానికి రూపొందించబడ్డాయి. (మత్తయి 11:28) మనుష్యులు ఇక ఎన్నటికీ తమ వ్యక్తిగత విషయాల్లో చొరవ తీసుకుని తమ స్వంత తార్కికశక్తిని ఉపయోగించలేనంతగా వారి జీవితాల్ని నియంత్రించాలన్న కోరిక అటు యేసుకు గానీ లేక ఆయన తండ్రి యెహోవా దేవునికి గానీ లేదు. వారు పరిణతిగల వ్యక్తులుగా అవ్వాలనీ, “అభ్యాసముచేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగియున్న” వ్యక్తులుగా అవ్వాలనీ యెహోవా కోరుకుంటున్నాడు.—హెబ్రీయులు 5:14.
ఆ విధంగా వస్త్రధారణా, కేశాలంకరణల గురించి లేక కాస్మెటిక్‌లు ఉపయోగించడం గురించి ఎటువంటి వివరణలతో కూడిన నియమాలనూ బైబిలు ఇవ్వడం లేదు. మోషే ధర్మశాస్త్రం మాత్రం చుట్టూ ఉన్న జనాంగాల నుండీ వారి అనైతిక ప్రభావం నుండీ వేరుగా ఉండడానికి సహాయపడే ఉద్దేశంతో యూదులు గైకొనవలసిన వస్త్రసంబంధమైన ఆవశ్యకతలను ఇచ్చింది. (సంఖ్యాకాండము 15:38-41; ద్వితీయోపదేశకాండము 22:5) క్రైస్తవ ఏర్పాటు క్రింద మాత్రం వస్త్రధారణా, కేశాలంకరణలు ప్రాథమికంగా వ్యక్తిగత అభిరుచికి సంబంధించిన విషయాలు.
అయితే దీనర్థం మనం ఏమి ధరిస్తాము అనే విషయంలో దేవునికి అసలు ఏమాత్రం పట్టింపు లేదనీ లేక ‘అంతా నడుస్తుంది’ అనీ కాదు. దానికి విరుద్ధంగా, వస్త్రధారణా, కేశాలంకరణల విషయంలో దేవుని దృక్కోణాన్ని ప్రతిఫలించే సహేతుకమైన నిర్దేశకాలు బైబిలులో ఉన్నాయి.
“అణుకువయు స్వస్థబుద్ధియు గలవారైయుండి”
క్రైస్తవ స్త్రీలు “అణుకువయు స్వస్థబుద్ధియు గలవారై యుండి, తగుమాత్రపు వస్త్రముల చేతనేగాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక” ఉండాలని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. అదేవిధంగా పేతురు, “జడలు అల్లుకొనుటయు, బంగారునగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయునను వెలుపటి అలంకారము” వద్దని సలహా ఇస్తున్నాడు.—1 తిమోతి 2:9; 1 పేతురు 3:3.
స్త్రీలూ పురుషులు తాము కన్పించే రీతిని మెరుగుపర్చుకోవద్దని ఇక్కడ పేతురు, పౌలు సూచిస్తున్నారా? ఎంతమాత్రం కాదు! నిజానికి, ఆభరణాలనూ లేక అలంకరణ తైలములనూ సుగంధద్రవ్యములనూ ఉపయోగించిన విశ్వసనీయులైన స్త్రీపురుషులను గూర్చి బైబిలు పేర్కొంటుంది. రాజైన అహష్వేరోషు ముందుకు తీసుకురాబడక మునుపు ఎస్తేరు సుగంధతైలాలు రాయడం, మసాజ్ వంటి సౌందర్యానికి మెరుగులు దిద్దే ప్రక్రియలకు లోనయ్యింది. యోసేపుకు సన్నపు నారబట్టలు వేసుకోమని ఇవ్వబడ్డాయి, మెడలో బంగారు గొలుసు వేయబడింది.—ఆదికాండము 41:42; నిర్గమకాండము 32:2, 3; ఎస్తేరు 2:7, 12, 15.
పౌలు ఉపయోగించిన “స్వస్థబుద్ధి” అనే మాట ఆ ఉద్బోధను అర్థంచేసుకోవడానికి మనకు సహాయపడుతుంది. మూల గ్రీకు పదం సంయమనం కలిగివుండడాన్నీ, ఆత్మనిగ్రహం కలిగివుండడాన్నీ సూచిస్తుంది. అందులో ఒకరు తమ గురించి తాము గంభీరంగా ఆలోచించడం, అనావశ్యకమైన అవధానాన్ని ఆకర్షించడాన్ని నివారించడం ఇమిడివున్నాయి. ఇతర బైబిలు అనువాదాలు ఈ పదాన్ని “వివేచనతో,” “బుద్ధిసూక్ష్మతతో,” “సంస్కరించబడి,” లేక “ఆత్మనియంత్రణతో” అని అనువదిస్తున్నాయి. క్రైస్తవ పెద్దలు కాబోయేవారికి ఉండాల్సిన ప్రాముఖ్యమైన లక్షణం ఇది.—1 తిమోతి 3:2.
అందుకని, మన వస్త్రధారణా కేశాలంకరణలు తగినవిధంగాను గౌరవం కలిగించే విధంగాను ఉండాలని చెబుతూ, ఇతరులను అభ్యంతరపర్చే, మనపైకీ మన క్రైస్తవ సంఘంపైకీ అపనిందను తీసుకువచ్చే మరీ అతిగా ఉండే స్టైళ్లకు దూరంగా ఉండమని లేఖనాలు మనల్ని ప్రోత్సహిస్తున్నాయి. శారీరక అలంకరణలద్వారా తమ రూపంవైపుకు అవధానాన్ని ఆకర్షించడానికి బదులుగా, దైవభక్తి ఉందని చెప్పుకునేవారు స్వస్థబుద్ధిని ప్రదర్శించాలి, “సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగాగల . . . హృదయపు అంతరంగ స్వభావము”కు ప్రాధాన్యతనివ్వాలి. ఇది, “దేవుని దృష్టికి మిగుల విలువగలది” అని పౌలు ముగిస్తున్నాడు. (ఇటాలిక్కులు మావి.)—1 పేతురు 3:4.
క్రైస్తవులు “లోకమునకు వేడుకగా” ఉన్నారు. వారు ఇతరుల్లో తమ గురించిన అభిప్రాయాన్ని కలుగజేసే విషయంలో అప్రమత్తంగా ఉన్నారు, సువార్తను ప్రకటించే ఉత్తర్వు వారికి ఉన్న దృష్ట్యా ఇది మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. (1 కొరింథీయులు 4:9; మత్తయి 24:14) అందుకని వారు ఏదీ కూడా, చివరికి తమ రూపం కూడా, ఇతరులు అతి కీలకమైన ఆ సమాచారాన్ని వినకుండా చేసేలా అనుమతించరు.—2 కొరింథీయులు 4:2.
స్టైళ్లు ఒక ప్రాంతానికీ మరో ప్రాంతానికీ వేరుగా ఉంటుండగా, ప్రతి ఒక్కరు జ్ఞానయుక్తంగా ఎంపికలు చేసుకునేందుకు సహాయపడుతూ బైబిలు స్పష్టమైన సహేతుకమైన నిర్దేశకాలను ఇస్తుంది. ప్రజలు ఈ సూత్రాలకు అంటిపెట్టుకుని ఉన్నంతకాలము, అందరూ వస్త్రధారణా, కేశాలంకరణల్లో తమ వ్యక్తిగత రుచులను కలిగివుండేందుకు దేవుడు స్వేచ్ఛగాను ప్రేమపూర్వకంగాను అనుమతిస్తాడు.
[అధస్సూచీలు]
a ఈ నిషేధాలకు మద్దతునిచ్చేందుకు లేఖనాల్ని వక్రీకరించే ప్రయత్నం జరిగింది. బైబిలు అటువంటి విషయాలు చెప్పకపోయినప్పటికీ, ప్రసిద్ధ వేదాంతవేత్త టెర్టూలియన్, స్త్రీ “మొదటి పాపానికీ, మనం శాపగ్రస్తులం కావడానికీ . . . మానవులు నిత్యనాశనానికి గురికావడానికీ” కారణం గనుక స్త్రీలు “విలపిస్తూ, పశ్చాత్తాపంతో” సంచరించాలి అని బోధించాడు. నిజానికి, సహజంగానే అందంగా ఉండే స్త్రీ తన అందాన్ని కప్పిపుచ్చుకునేంత దూరం వెళ్లాలని ఆయన నొక్కిచెప్పాడు.—రోమీయులు 5:12-14; 1 తిమోతి 2:13, 14, పోల్చండి.