ప్రకటనా వెల్లువలో కొట్టుకుపోవడం
“నాన్నారూ, చంద్రుడు దేని గురించిన ప్రకటన వేయబోతున్నాడు?” ఈ వింత ప్రశ్న, 50 సంవత్సరాల క్రితం, కాల్ సాండ్బర్గ్ వ్రాసిన కవితలో ఒక పాప వేసిన ప్రశ్న. భవిష్యత్తులో, అలాంటి ప్రశ్న అంత వింతగా కనిపించకపోవచ్చు. న్యూ సైంటిస్ట్ మ్యాగజిన్ ప్రకారం, చంద్రుని ఉపరితలంపై ప్రకటనలను వేసేందుకు పరావర్తనం చెందిన సూర్యకాంతిని ఉపయోగించాలనే పథకంపై లండన్‌లోని ఇరువురు ప్రకటనా ఎక్జిక్యూటివ్లు పని చేస్తున్నారు.
చంద్రుడ్ని ప్రకటనా బోర్డుగా ఉపయోగించడాన్ని ఒక్కసారి ఊహించండి! ప్రపంచవ్యాప్త ప్రేక్షకులకు వాణిజ్య సందేశాన్ని, వీక్షకులు కట్టేయ లేని, మధ్యలో ఆపలేని, చెత్తబుట్టలోకి విసిరేయలేని, రిమోట్ కంట్రోల్‌తో శబ్దాన్ని కట్టేయలేని సందేశాన్ని ప్రకటించడాన్ని ఊహించండి. ఈ తలంపు మీకు అంత ఆహ్లాదాన్ని ఇవ్వకపోవచ్చు, కానీ ఇతరులకు అది కల నిజం కావడమే కావచ్చు.
ప్రకటనలు చంద్రుడ్ని చేరుకోకపోయినప్పటికీ, అవి భూమిని ముంచెత్తేశాయి. అనేక అమెరికన్ పత్రికల్లోని మరియు వార్తాపత్రికల్లోని 60 శాతం పేజీలు ప్రకటనల కోసమే కేటాయించబడ్డాయి. ఒక్క ద న్యూయార్క్ టైమ్స్ ఆదివారం సంపుటిలోనే 350 పేజీల ప్రకటనలు ఉంటాయి. కొన్ని రేడియో స్టేషన్లు వ్యాపార ప్రకటనల కోసం గంటకు 40 నిమిషాలను కేటాయిస్తాయి.
టెలివిజన్ కూడా ఈ రంగంలో ఉంది. ఒక అంచనా ప్రకారం, అమెరికాలోని యౌవనస్థులు ప్రతి వారం మూడు గంటలు టెలివిజన్ వ్యాపార ప్రకటనల ముందు కూర్చుంటారు. వాళ్ళు హై స్కూల్ చదువు ముగించేసరికి, 3,60,000 టీ.వీ. ప్రకటనలను చూసి ఉంటారు. ఎయర్పోర్ట్లలోనూ, ఆసుపత్రి వెయిటింగ్ రూమ్‌లలోనూ, పాఠశాలల్లోనూ టెలివిజన్లు ప్రకటనలను చూపిస్తాయి.
ఇప్పుడు పెద్ద పెద్ద క్రీడలే భారీ ప్రకటనలకు నెలవులు. రేసింగ్‌లో ఉపయోగించబడే కార్లు ఇప్పుడు అతి వేగంగల ప్రకటనాబోర్డులుగా ఉపకరిస్తున్నాయి. కొందరు క్రీడాకారులు తమ ఆదాయంలో ఎక్కువ భాగం ప్రకటనల నుండే పొందుతున్నారు. ఒక అగ్రగణ్యుడైన బాస్కెట్ బాల్ ప్లేయర్ బాస్కెట్‌బాల్ ఆడడం ద్వారా 39,00,000 డాలర్లు సంపాదించాడు. ప్రకటనదారులు తమ ఉత్పత్తులను ప్రబలం చేసేందుకు దానికి తొమ్మిది రెట్లు ఆయనకు చెల్లించారు.
ఎక్కడకు వెళ్ళినా ప్రకటనల బెడద తప్పదు. వాణిజ్య ప్రకటనలు గోడలపైనా, బస్సులపైనా, ట్రక్కులపైనా కనిపిస్తాయి. టాక్సీలలోపలా, భూగర్భ రైలు మార్గాల్లోనూ,—పబ్లిక్ టాయ్లెట్ల తలుపుల మీదా కూడా అవి అలంకారంగా కనిపిస్తాయి. సూపర్ మార్కెట్లలోనూ, స్టోర్లలోనూ, ఎలవేటర్లలోనా—(కొన్ని దేశాల్లో) టెలిఫోన్లలోనా ప్రకటనలు వినబడతాయి. కొన్ని దేశాల్లో తపాలాలో చాలా ప్రకటనలు వస్తాయి. చాలా మంది వాటిని మెయిల్ బాక్స్ నుండి తీసి నేరుగా దగ్గర్లో ఉన్న చెత్త బుట్టలో పడవేస్తారు.
అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఐన మ్యాక్కాన్-ఎరిక్సన్ ప్రచురించిన ఇన్సైడర్స్ రిపోర్ట్ ప్రకారం, 1990లో ప్రపంచవ్యాప్తంగా ప్రకటనలపై ఖర్చు చేసిన డబ్బు 275.5 బిలియన్ డాలర్లు, అప్పటి నుండి ఆ ఖర్చు 1997లో 411.6 బిలియన్లకు పెరిగింది, 1998లో 434.4 బిలియన్ల మేరకు పథకం వేయబడింది. చాలా పెద్ద మొత్తమే!
వీటంతటి ఫలితమేమిటి? ఒక విశ్లేషణ ఈ విధంగా ఉంది: “ప్రకటన అనేది సంస్కృతిలో అత్యధిక శక్తివంతమైన సోష్యలైజింగ్ శక్తుల్లో ఒకటి. . . . ప్రకటనలు ఉత్పత్తులను అమ్మడం మాత్రమే కాదు. అవి ఇమేజ్‌లను, విలువలను, లక్ష్యాలను మనముందుంచుతాయి, మనమెవరం, మనమెవరమై ఉండాలి అనే వాటిని గురించిన భావనలను కలిగిస్తాయి. . . . అవి మన దృక్పథాలకు, మన మనోభావాలకు, మన ప్రవర్తనకు ఒక రూపాన్ని కల్పిస్తాయి.”
మీరు ప్రకటనల నుండి తప్పించుకోలేరు గనుక, అది ఎలా పనిచేస్తుందో, అది మీపై ఎలా ప్రభావం చూపగలదో ఎందుకు తెలుసుకోకూడదు?