తగుమాత్రపు వస్త్రములు దేవునికి గౌరవాన్ని తెస్తాయి
1. రానున్న జిల్లా సమావేశానికి సంబంధించి మనం మన కృతజ్ఞతను ఎలా వ్యక్తం చేయగలం?
1 త్వరలోనే జరగబోయే 2003వ సంవత్సరపు “దేవుణ్ణి మహిమపరచండి” జిల్లా సమావేశంలో యెహోవా అతిథులుగా ఉండే ఆధిక్యత మనకు లభిస్తుంది. ఇంత గొప్ప ఆధ్యాత్మిక విందుకు మనల్ని ఆహ్వానించినందుకు మనం యెహోవాకు ఎంత కృతజ్ఞులమో కదా! మనం మన వస్త్రధారణ కేశాలంకరణల ద్వారా ఆయనపట్ల మన గౌరవాన్ని, ఆయన ఆధ్యాత్మిక ఏర్పాట్లపట్ల మన కృతజ్ఞతను చూపించగలం.—కీర్త. 116:12, 17.
2. మనం పరిశుభ్రంగా, చక్కని కేశాలంకరణతో ఉండడం ఎందుకు ప్రాముఖ్యం?
2 పరిశుభ్రంగాను, పద్ధతిగాను: పరిశుభ్రంగా పద్ధతిగా ఉండే మన దేవుడైన యెహోవా ప్రమాణాలను మన బాహ్యరూపం ప్రతిబింబించాలి. (1 కొరిం. 14:33; 2 కొరిం. 7:1) మన శరీరం, శిరోజాలు, గోళ్ళు శుభ్రంగా ఉండాలి, మన కేశాలంకరణ చక్కగా ఉండాలి. నేడు జుట్టును చిందరవందరగా ఉంచుకోవడం సాధారణమైపోయింది. ఒక సినిమా తార లేదా క్రీడాకారుని ఆకారం పిచ్చిపిచ్చిగా ఉన్నంతమాత్రాన క్రైస్తవుడు కూడా అలాగే ఉండడానికి ఎలాంటి కారణమూ లేదు. మనం జనులందరి ఫ్యాషన్లను అనుసరిస్తే, సత్యదేవుణ్ణి ఆరాధించేవారికీ ఆయనను ఆరాధించనివారికీ మధ్య తేడా తెలుసుకోవడం ప్రజలకు కష్టమవుతుంది.—మలా. 3:18.
3. మన బాహ్యరూపం 1 తిమోతి 2:9, 10 వచనాల్లోని ఉపదేశానికి అనుగుణంగా ఉందని మనమెలా నిశ్చయపరచుకోగలం?
3 క్రైస్తవ పరిచారకులకు తగిన వస్త్రములు: అపొస్తలుడైన పౌలు క్రైస్తవ పైవిచారణకర్తగావున్న తిమోతికి వ్రాసినప్పుడు, “స్త్రీలును అణుకువయు స్వస్థబుద్ధియు గలవారై యుండి, తగుమాత్రపు వస్త్రముల చేత . . . దైవభక్తిగలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియలచేత తమ్మును తాము అలంకరించుకొనవలెను” అని ప్రోత్సహించాడు. (1 తిమో. 2:9, 10) మన వస్త్రాలు గౌరవప్రదంగా ఉన్నాయని నిశ్చయపరచుకోవడానికి జాగ్రత్తగా ఆలోచించడం అవసరం. వస్త్రాలు శుభ్రంగా, నిరాడంబరంగా ఉండాలి కానీ ఎబ్బెట్టుగా, లైంగికాకర్షణ కలిగించేవిగా లేదా రెచ్చగొట్టేవిగా ఉండకూడదు.—1 పేతు. 3:3.
4, 5. క్రైస్తవ స్త్రీలు, పురుషులు ఏ హెచ్చరికను లక్ష్యపెట్టాలి?
4 “జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను” మితిమీరి అలంకరించుకోవద్దని కూడా పౌలు హెచ్చరించాడు. (1 తిమో. 2:9) ఆభరణాలు, మేకప్, ఇతర అలంకార వస్తువులు ఉపయోగించడంలో సమతుల్యంగా ఉండడం క్రైస్తవ స్త్రీలు అనుసరించవలసిన జ్ఞానయుక్తమైన మార్గం.—సామె. 11:2.
5 పౌలు క్రైస్తవ స్త్రీలను ఉద్దేశించి ఇచ్చిన ఉపదేశంలోని సూత్రం క్రైస్తవ పురుషులకు కూడా అన్వయిస్తుంది. సహోదరులు కూడా ప్రాపంచిక పోకడను ప్రతిబింబించే శైలి విడిచిపెట్టాలి. (1 యోహా. 2:16) ఉదాహరణకు, కొన్ని దేశాల్లో బాగా వదులుగా ఉండి, పెద్ద సైజు వస్త్రాలకు జనాదరణ ఉంది, కానీ అవి దేవుని పరిచారకునికి తగవు.
6. సమావేశానికి వెళ్ళేటప్పుడు, సమావేశం నుండి వస్తున్నప్పుడు, సమావేశంలో ఉన్నప్పుడు, ప్రతీరోజు సెషన్లు ముగిసిన తర్వాత మనం మన వస్త్రధారణ, కేశాలంకరణ విషయంలో ఎందుకు ఉన్నత ప్రమాణాన్ని అనుసరించాలి?
6 తీరికవేళల్లోని కార్యకలాపాలు: కార్యక్రమానికి హాజరయ్యేటప్పుడు చాలామంది సహోదర సహోదరీలు వస్త్రధారణ కేశాలంకరణల విషయంలో చక్కని మాదిరిగా ఉంటారు. అయితే కొందరు సమావేశానికి వచ్చేటప్పుడు, సమావేశం నుండి తిరిగి వెళ్ళేటప్పుడు లేదా సెషన్ల తర్వాత తీరికవేళ కార్యకలాపాలందు నిర్లక్ష్యంగా ఉంటున్నారని నివేదికలు సూచిస్తున్నాయి. నిజానికి మన బాహ్యరూపం, అది సమావేశంలోనైనా ఇతర సమయాల్లోనైనా, ఇతరులు దేవుని ప్రజలను ఎలా దృష్టిస్తారనే విషయంపై ప్రభావం చూపుతుంది. మనం సమావేశపు బ్యాడ్జి కార్డులు ధరిస్తాం కాబట్టి మన వస్త్రధారణ ఎల్లప్పుడూ క్రైస్తవ పరిచారకులకు తగినట్టుగానే ఉండాలి. ఇది తరచూ ఇతరులు మనల్ని ప్రశంసించేలా వారిని పురికొల్పి, మనం వారికి సాక్ష్యమివ్వడానికి మార్గాన్ని తెరుస్తుంది.—1 కొరిం. 10:31-33.
7. పద్ధతిగావున్న మన వస్త్రధారణ కేశాలంకరణలు ఇతరులపై ఎలాంటి ప్రభావాన్ని చూపగలవు?
7 స్నేహపూర్వకమైన చిరునవ్వు మన ముఖం మరింత అందంగా కనపడేలా చేసినట్లే, పద్ధతిగా ఉన్న వస్త్రధారణ చక్కని కేశాలంకరణ మనం చెప్పే సందేశపు విలువను, మనం ప్రాతినిధ్యం వహించే సంస్థ విలువను పెంచుతాయి. ఈ సంవత్సరంలో జరిగే “దేవుణ్ణి మహిమపరచండి” జిల్లా సమావేశాల్లో మనల్ని గమనించే కొందరు మనం ఇతరుల నుండి ఎందుకు భిన్నంగా ఉన్నామో అడిగేందుకు కదిలించబడి చివరకు ఇలా చెబుతారని మనం ఆశిద్దాం: “దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది [మేము దానిని గమనించాము] గనుక మేము మీతోకూడ వ[స్తాము].” (జెక. 8:23) మనలో ప్రతి ఒక్కరమూ మన వస్త్రధారణ కేశాలంకరణల ద్వారా యెహోవాపట్ల మనకున్న గౌరవాన్ని చూపించుదుము గాక.
[5వ పేజీలోని బాక్సు]
గౌరవపూర్వకంగా కనపడండి
◼ ప్రయాణించేటప్పుడు
◼ సమావేశంలో ఉన్నప్పుడు
◼ తీరికవేళల్లోని కార్యకలాపాలప్పుడు