కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g98 8/8 పేజీలు 22-25
  • డెంగ్యూ—ఒక్క కాటుతో వచ్చే జ్వరం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • డెంగ్యూ—ఒక్క కాటుతో వచ్చే జ్వరం
  • తేజరిల్లు!—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • డెంగ్యూ అంటే ఏమిటి?
  • “ప్రపంచ జనాభాలో ఐదింట రెండొంతుల మంది” ప్రమాదంలో ఉన్నారు
  • డి.హెచ్‌.ఎఫ్‌ తెచ్చిపెట్టే అపాయాలు
  • మీ కుటుంబాన్ని రక్షించుకోవడం
  • నివారణా పద్ధతులు
  • ప్రపంచ పరిశీలన
    తేజరిల్లు!—1993
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1999
  • ఎందుకు మళ్ళీ ప్రారంభమైంది?
    తేజరిల్లు!—2003
  • కీటక సంక్రమిత వ్యాధులు పెరుగుతున్న సమస్య
    తేజరిల్లు!—2003
మరిన్ని
తేజరిల్లు!—1998
g98 8/8 పేజీలు 22-25

డెంగ్యూ—ఒక్క కాటుతో వచ్చే జ్వరం

ఫిలిప్పైన్స్‌లోని తేజరిల్లు! విలేఖరి

చిన్నారి చేతిపై ఒక దోమ వాలడం కనబడదు. ఆ పాప శరీరంలోకి ఆ దోమ తన తొండాన్ని చొప్పించి, రక్తనాళాన్ని పట్టుకుంటుంది. కొన్ని క్షణాలు గడిచిపోయిన తర్వాత, వాళ్లమ్మ ఆ పాపవైపొకసారి చూడగానే ఆ పాప శరీరంపై దోమ కనబడుతుంది. వెంటనే దాన్ని కొట్టగానే అది చచ్చి ఊరుకుంటుంది. అంతటితో ఆ కథ ముగిసి పోతుందా? ముగిసిపోక పోవచ్చు. ఆ దోమ చస్తే చావొచ్చుగాక, ఆ పాప రక్తప్రసరణపై అది చేసిన ఆ కొద్దిపాటి దాడి రోగాల్ని తెచ్చిపెట్టే అవాంఛనీయ సూక్ష్మజీవుల్ని విడిచిపెట్టింది.

రెండు వారాలు కూడా గడవకముందే ఆ పాప చలి కుదుపులతోనూ, తలనొప్పితోనూ, కళ్ల నొప్పులతోనూ, విపరీతమైన కీళ్లపోట్లుతోనూ, తీవ్రమైన జ్వరంతోనూ బాధపడుతుంది. రోగం ఎక్కువౌతుండగా, ఆ చిన్నారి శరీరంపై ఎర్రని దద్దుర్లుతేలి, పూర్తిగా నీరసపడిపోతుంది. ఆ పాపకు దోమ కుట్టడం మూలంగా వచ్చే జ్వరమైన డెంగ్యూ సోకింది.

అయినా, ఆ పాపకు ఇంతకు ముందొకసారి గనుక డెంగ్యూ సోకి ఉంటే, ఈసారి మరింత ప్రమాదకరమైన డెంగ్యూ హెమరేజ్‌ ఫీవర్‌ (డిహెచ్‌ఎఫ్‌) వచ్చే అవకాశం ఉంది. అది వస్తే, కేశనాళాలు లీక్‌ అవుతాయి, తత్ఫలితంగా చర్మం ద్వారా రక్తస్రావం (స్కిన్‌ హెమరేజ్‌) జరుగుతుంది. శరీరంలోపల కూడా రక్తస్రావం జరగవచ్చు. సరియైన చికిత్సలేకపోతే, రోగి షాక్‌కి గురౌతుంది, రక్తప్రసరణ సరిగా జరగకపోవడం మృత్యుముఖానికి తీసుకెళుతుంది.

డెంగ్యూ అంటే ఖచ్చితంగా ఏమిటి? అది మీకు రాగలదా? దాని బారినుండి మిమ్మల్నీ మీ కుంటుంబాన్నీ మీరు ఎలా కాపాడుకోగలరు? దాని గురించి నిశితంగా పరిశీలిద్దాం.

డెంగ్యూ అంటే ఏమిటి?

(రోగికి ఎముకలు విరిచేసినట్లు భావన కలగడం వల్ల) బ్రేక్‌బోన్‌ ఫీవర్‌ అని కూడా పిలువబడే డెంగ్యూ జ్వరం అనేది దోమలు కుట్టడం వల్ల కలిగే రోగాల్లో ఒకటి. నిజానికి ఈ రోగం ఒక వైరస్‌ మూలంగా వస్తుంది. ఆ వైరస్‌ సోకిన దోమ (అంటే ఆ రోగం సోకిన వ్యక్తిని ఇంతకుముందు కుట్టిన దోమ) లాలాజల గ్రంథుల్లో ఆ వైరస్‌ ఉంటుంది. రక్తాన్ని పీల్చేందుకు ఒక వ్యక్తిని కుట్టే ప్రక్రియలో అది ఆ వైరస్‌ను ఆ వ్యక్తిలోపలికి విడిచిపెడుతుంది.

డెంగ్యూ వైరస్‌లలో నాలుగు రకాలు ఉన్నాయి. వాటిలో ఒక రకమైన వైరస్‌ సోకడం, మిగిలిన మూడు రకాల వైరస్‌లనుండి ఏ విధమైన నిరోధకశక్తినీ ఇవ్వదు. ఒక రకపు వైరస్‌ సోకిన తర్వాత, మరో రకపు వైరస్‌ ఉన్న దోమ గనుక ఆ వ్యక్తిని కుడితే, అది డి.హెచ్‌.ఎఫ్‌కు దారి తీయగలదు.

“ప్రపంచ జనాభాలో ఐదింట రెండొంతుల మంది” ప్రమాదంలో ఉన్నారు

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారంగా, 250 కోట్ల మంది ప్రజలను అంటే “ప్రపంచ జనాభాలో ఐదింట రెండొంతుల మంది”ని ప్రమాదంలో పడవేసింది. ఏష్యన్‌ వీక్‌ ఇలా రిపోర్టు చేసింది: “100కన్నా ఎక్కువ ఉష్ణమండల, ఉప-ఉష్ణమండల దేశాలు డెంగ్యూ కేసులను రిపోర్టు చేశాయి, ప్రతీ సంవత్సరమూ రిపోర్టు చేయబడిన కేసులు కోట్లకొద్దీ ఉన్నాయి, వాటిలో 95% పిల్లల కేసులే.”

డెంగ్యూ జ్వరాన్ని ప్రపంచంలో మొట్ట మొదట గుర్తించింది ఎప్పుడన్నది స్పష్టంగా తెలియదు. 1779లో కైరోలోని “మోకాలి జ్వరం” గురించిన ఒక రిపోర్టు, నిజానికి డెంగ్యూ జ్వరాన్ని సూచిస్తుండవచ్చు. అప్పటి నుండీ, డెంగ్యూ జ్వరాన్ని గురించిన వార్తలు ప్రపంచవ్యాప్తంగా వినవస్తున్నాయి. విశేషంగా రెండవ ప్రపంచ యుద్ధకాలంనాటి నుండి మానవుని ఆరోగ్యం విషయంలో అది తనదైన ప్రభావాన్ని చూపిస్తోంది. డెంగ్యూ ఆగ్నేయాసియాలో ప్రారంభమైంది. వైరస్‌లోని అనేక రకాలు వ్యాప్తిచెందడం ఆరంభించాయి, అది మరింత ప్రాణాంతకమైనటువంటి రకరకాల హెమరేజిక్‌లకు దారితీసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రచురించిన ఓ ప్రచురణ ఇలా చెబుతోంది: “ఆసియాలో హెమరేజిక్‌ జ్వరం మొదటిసారిగా 1954లో మనీలా దేశంలో గుర్తించబడింది.” అటు తర్వాత ఇతర దేశాలకు విశేషంగా థాయ్‌లాండ్‌కూ, వియత్నామ్‌కూ, మలేషియాకూ, మరి వాటి పొరుగు దేశాలకూ వ్యాపించింది. ఆగ్నేయాసిలో డెంగ్యూ రోగం బయటపడిన ఆ మొదటి దేశాల్లో మరణాల రేట్లు 10-50 శాతం వరకు ఉండేవికానీ, ఆ రోగాన్ని గురించి తెలుసుకుంటున్నకొద్దీ ఆ మరణాల రేట్లు తగ్గిపోయాయి.

1960ల నుండీ, ఆ రోగకారక వైరస్‌ను కల్గివున్న దోమల్ని నియంత్రించే కార్యక్రమ నిర్వహణ సరిగ్గా జరగకపోవడం, డెంగ్యూ రోగం ఒక్కసారిగా పెల్లుబుకడానికి దోహదపడింది. డెంగ్యూ వ్యాప్తిచెందుతున్నట్టుగానే డి.హెచ్‌.ఎఫ్‌ కూడా వ్యాప్తిచెందింది. 1970నాటికి ముందు 9 దేశాలు మాత్రమే రోగానికి గురయ్యాయిగానీ, 1995నాటికి ఈ దేశాల సంఖ్య 41కి పెరిగింది. సంవత్సరానికి 5,00,000 మంది డి.హెచ్‌.ఎఫ్‌ రోగులను హాస్పిటల్‌లో చేర్పించాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనావేస్తోంది.

ఉష్ణమండలంకాని ప్రాంతాల్లో ఈ రోగాన్ని గురించి అంతగా తెలియకపోయినా, ఆ రోగంసోకే అపాయమున్న ప్రాంతాలకు వెళ్లిన ప్రయాణికులు దానికిగురై, తమతోపాటూ ఆ రోగాన్ని ఇంటికి తీసుకొచ్చిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు, అమెరికాలో అంటే మస్సాచుసెట్స్‌, న్యూయార్క్‌, ఒరెగాన్‌, టెక్సాస్‌ నగరాల్లోని డెంగ్యూ కేసుల్ని గురించి 1996 సంవత్సరాంతంలో ది న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక తెలియజేసింది.

డి.హెచ్‌.ఎఫ్‌ తెచ్చిపెట్టే అపాయాలు

మనం ముందు గమనించినట్టుగానే, డి.హెచ్‌.ఎఫ్‌ అనేది డెంగ్యూరోగం యొక్క ప్రాణాంతకపు రూపం. డి.హెచ్‌.ఎఫ్‌ తెచ్చిపెట్టే అపాయాల్లో ఒకటేమిటంటే, ఇదంత సీరియస్‌ అయినది కాదులే అని ప్రజలు అనుకోవడమే. దీన్ని ఫ్లూ అనుకొని అనేకమంది పొరపాటుపడతారు. అయినా, ఏం కాదులే అని ఊరుకోవడం రోగాన్ని ముదరపెట్టవచ్చు, ఆ స్థాయిలో రక్తకణాల్లోని ప్లేట్‌లెట్‌ విపరీతంగా తగ్గిపోయి, (శరీరంలోపలా లేదా చిగుళ్లనుండీ, ముక్కునుండీ లేదా చర్మంనుండీ) రక్తస్రావం జరిగి, బి.పి. (రక్తపోటు) పడిపోతుంది. బహుశా రోగి స్పృహతప్పి పడిపోవచ్చు. పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కుటుంబ సభ్యులు గుర్తించేలోగానే, అతడు అప్పటికే షాక్‌కి లోనౌతాడు. వాళ్లతణ్ణి ఆసుపత్రికి త్వరగా తీసుకెళతారు. అక్కడ, అతనికి అప్పటికే రక్తప్రసరణ సరిగా జరగడంలేదన్నట్లు డాక్టర్లు కనుగొంటారు. ఆందోళనకరమైన పరిస్థితినిబట్టి, నరాలద్వారా ద్రవాల్ని ఎక్కించాలని ఆదేశిస్తారు.

మీ కుటుంబాన్ని రక్షించుకోవడం

ఆ రోగ ప్రభావాన్ని తగ్గించివేయడానికి ఏం చెయ్యాలి? డెంగ్యూ ఎక్కువుగా ఉండే ప్రాంతంలో జీవిస్తున్న కుటుంబంలోని ఒక సభ్యునికి తీవ్రమైన జ్వరంవచ్చి ఒక రోజులోపులో తగ్గకపోతే, డాక్టర్‌ని కలవడం జ్ఞానయుక్తమైన పని. ముఖ్యంగా, ఆ రోగికి చర్మంపై పొట్టు ఊడడమూ (రాషెస్‌), కండరాలనొప్పీ, కీళ్లనొప్పీ, లేదా కళ్లవెనుక భాగాన నొప్పీ వంటి డెంగ్యూ రోగలక్షణాలు ఉంటే డాక్టర్ని కలవడం ప్రాముఖ్యం.

డాక్టరు రక్తాన్ని పరీక్ష చేయవచ్చు. హెమరేజిక్‌కాని డెంగ్యూకి మామూలు చికిత్స మాత్రమే సరిపోవచ్చు. కానీ పరీక్షల్లో అది డి.హెచ్‌.ఎఫ్‌ అని గనుక తేలితే, డాక్టరు బహుశా జాగ్రత్తగా ఫ్లూయిడ్‌ని (ద్రవాన్ని) ఇవ్వమని సిఫారసు చేయవచ్చు. ఇందులో డయేరియా వచ్చినప్పుడు ఉపయోగించే ద్రవాలువంటి నోటి ద్వారా ఇచ్చే రిహైడ్రేషన్‌ సొల్యూషన్‌లూ, లేదా మరింత క్లిష్టమైన పరిస్థితుల్లో రింజర్‌ సొల్యూషన్‌నీ, సెలైన్‌ సొల్యూషన్‌లనూ, లేదా ఇతర సొల్యూషన్‌లనూ ఉపయోగిస్తూ నరాలద్వారా ఇచ్చే ద్రవ ప్రత్యామ్నాయాలూ చేరివుండవచ్చు. షాక్‌కి గురైన వ్యక్తులకు చికిత్స చేయడంలో, డాక్టరు రక్త పోటును పెంచడానికీ, ప్లేట్‌లెట్‌ మోతాదును మునుపటి స్థాయికి తీసుకురావడానికీ సహాయపడే కొన్ని మందులను సిఫారసు చేయవచ్చు.

రక్తం ఎక్కువగా పోతుంటే రక్తమార్పిడి చేసుకోమని సిఫారసుచేయడానికి డాక్టర్లు మొగ్గు చూపించవచ్చు. రక్త ప్రత్యామ్నాయాలను గురించి పరిశీలించకుండానే కొంతమంది డాక్టర్లు రక్తమార్పిడి చేసుకోమని వెంటనే సిఫారసు చేయవచ్చు. అయినా, అలా చేయడం దేవుని చట్టానికి విరుద్ధమైనచర్యయేగాక, సాధారణంగా దానికి రక్తాన్ని ఎక్కించుకోవాల్సిన అవసరమేమీ ఉండదు. (అపొస్తలుల కార్యములు 15:29) చికిత్సలో అత్యంత ప్రాముఖ్యమైన కారకం ఏమిటంటే రోగారంభం నుండీ రక్తప్రసరణస్థాయి నిలకడగా ఉండేలా ద్రవాలను జాగ్రత్తగా ఇస్తూవుండడమేనని అనుభవం తెలియజేసింది. ఈ విషయంలో రోగికీ డాక్టరుకీ మధ్య ఉన్న పరస్పర సహకారం, రక్తమార్పిడి విషయంలో ఎదురయ్యే ప్రతిఘటనల్ని తొలగించుకునేందుకు సహాయపడగలదు. ఒక వ్యక్తి డి.హెచ్‌.ఎఫ్‌కి గురయ్యాడని అనుమానించినప్పుడు సత్వరం చర్యల్ని తీసుకోవాల్సిన ప్రాముఖ్యతను ఇదంతా నొక్కిచెబుతోంది.—“రోగ లక్షణాలు ఏమిటి?” అనే బాక్సును చూడండి.

నివారణా పద్ధతులు

డెంగ్యూ వైరస్‌ ప్రధాన వాహకాల్లో ఒకటి ఎయిడిజ్‌ ఈజిప్టి దోమే. ఈ దోమలు ప్రపంచమందంతటా సర్వసాధారణంగా ఉష్ణమండల ప్రాంతాల్లోనూ, ఉప ఉష్ణమండల ప్రాంతాల్లోను ఉంటాయి. (దీనితోపాటు ఉన్న మ్యాప్‌ను చూడండి.) ఎయిడిజ్‌ ఈజిప్టి దోమలు జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వృద్ధిచెందుతాయి. ఆ రోగాన్ని నియంత్రించే కీలకాల్లో ఒకటి, ఆ దోమల్ని నియంత్రించడమే.

దోమల్ని ప్రపంచవ్యాప్తంగా నియంత్రించడం అంత సులభమైన విషయమేమీకాదు. అయినా, మీ ఇంటి చుట్టూ పొంచి ఉన్న అపాయాన్ని తగ్గించుకోవడానికి సహాయపడేందుకు మీరు చేయగల్గేవి కొన్ని ఉన్నాయి. ఆడ దోమ గ్రుడ్లను నీటిలో పెడుతుంది. పారవేసిన టైర్లూ, పాతజాడీలూ, సీసాలూ లేదా కొబ్బరి చిప్పలు వంటి వాటిలో, ఒక వారంగానీ లేదా అంతకన్నా ఎక్కువ రోజులుగానీ నిల్వ ఉన్న నీటిలో దోమల లార్వా వృద్ధిచెందగలదు. అలాంటి వాటిని తొలగించడమంటే దోమలు గ్రుడ్లు పెట్టే స్థలాలను లేకుండా చేయడమే అవుతుంది. అంతేగాక, బకెట్లనూ, పడవలనూ బోర్లించి పెట్టాలని సిఫారసు చేయబడింది. మురికికాల్వల్లో నిలిచిపోయిన నీటిని తొలగించడం కూడా సహాయకరంగా ఉంటుంది. ఈ కారణాన్నిబట్టే స్కూలు తరగతి గదుల్లో పూలకుండీలను ఉంచవద్దని 1997/98 విద్యా సంవత్సరంలో ఫిలిప్ఫైన్స్‌లోని ఆరోగ్యశాఖ తెలియజేయడం ఆసక్తికరమైన విషయం.

ఇంట్లో ఒకరికి డెంగ్యూ రోగం సోకితే, అతణ్ణి వేరే దోమలు కుట్టకుండా జాగ్రత్తవహించేందుకు అవసరమైన ముందు జాగ్రత్తల్ని తీసుకోండి, అలా కుట్టిన దోమ మరలా ఇతరులకు ఆ రోగాన్ని అంటించవచ్చు. దోమలు చొరబడకుండా తెరలు కట్టిన ఇల్లు లేదా ఎయిర్‌ కండిషన్డ్‌ బిల్డింగ్‌ రక్షణను ఇవ్వగలదు.

టీకాల విషయమేమిటి? ఇంత వరకూ సరియైన టీకాలు లభ్యంకాలేదు. ఒక టీకాను తయారుచేయడానికి పరిశోధన జరుగుతుందిగానీ, పూర్తి రక్షణను ఇవ్వడానికి నాలుగు రకాల డెంగ్యూ వైరస్‌లు సోకకుండా నిరోధించే రోగనిరోధకశక్తి అవసరమౌతుందనే వాస్తవాన్నిబట్టి చూస్తే, ఇది ఎంతో సంక్లిష్టమైనదైవుంది. ఒక్కరకానికే టీకా వేయడమంటే, నిజానికి డి.హెచ్‌.ఎఫ్‌ని పెంచడమేనని అర్థం. బాగా పనిచేయగల టీకాలు ఐదు నుండి పదేళ్ల వ్యవధిలో లభ్యమవ్వవచ్చనే ఆశను పరిశోధకులు వ్యక్తపర్చారు.

కొంతమంది పరిశోధకులు మరొక మార్గాన్ని ప్రయత్నిస్తున్నారు. జన్యు ఇంజనీరింగ్‌ను ఉపయోగించడం ద్వారా, దోమ లాలాజల గ్రంథుల్లో డెంగ్యూ వైరస్‌ రెట్టింపుకావడాన్ని రిప్లికేటింగ్‌ చేయడం ద్వారా నివారించవచ్చని ఆశిస్తున్నారు. అనుకున్నట్టుగానే ఇది పనిచేస్తే, జన్యు ఇంజనీరింగ్‌ ఉపయోగించబడిన దోమలు తమ సంతానానికి డెంగ్యూ వైరస్‌ను నిరోధించగలశక్తిని అందిస్తాయి. కొంత పురోభివృద్ధి సాధించినప్పటికీ, ఇదెంతమేరకు సఫలీకృతమౌతుందనే విషయాన్ని వేచి చూడాల్సిందే.

ప్రస్తుతం, డెంగ్యూను పూర్తిగా నిర్మూలించడం సాధ్యమయ్యేటట్లుగా కనిపించడంలేదు. కానీ అభ్యాససిద్ధమైన ముందు జాగ్రత్తల్ని తీసుకోవడం, దోమకాటు మూలంగా వచ్చే జ్వరమైన డెంగ్యూ నుండి ప్రాణానికి ముప్పును తెచ్చే జటిలమైన పరిస్థితులకు గురికాకుండా మీకూ, మీరు ప్రేమించేవారికీ సహాయపడగలదు.

[23వ పేజీలోని బాక్సు]

రోగ లక్షణాలు ఏమిటి?

డెంగ్యూ జ్వరానికీ డెంగ్యూ హెమరేజిక్‌ జ్వరానికీ (డి.హెచ్‌.ఎఫ్‌కు) గల రోగలక్షణాలు

• హఠాత్తుగా జ్వరం ఎక్కువగా రావడం

• తీవ్రమైన తలపోటు*

• కళ్ల వెనుక భాగాన నొప్పి పుట్టడం

• కీళ్లనొప్పులూ, కండరాల నొప్పులూ

• శోషరస (లింఫ్‌) గ్రంథులలో వాపు

• చర్మంపై పొట్టు ఊడిపోవడం

• నీరసపడిపోవడం

డి.హెచ్‌.ఎఫ్‌ను నిర్ధారించే మరింత నిర్దిష్టమైన రోగలక్షణాలు

• హఠాత్తుగా స్పృహకోల్పోవడం

• చర్మంద్వారా రక్తస్రావం జరగడం

• ఇతర భాగాల్లో నుండి రక్తస్రావం జరగడం

• చర్మం తడిగానూ, జిగటగానూ ఉండడం

• అవిశ్రాంతంగా ఉండడం

• నాడి బలహీనంగా కొట్టుకోవడంతోపాటు షాక్‌ కల్గడం (డెంగ్యూ షాక్‌ సిండ్రోమ్‌)

రోగలక్షణాలు గనుక కనబడితే డాక్టరు దగ్గరకు వెళ్లడానికి ఆలస్యం చేయకండి. ముఖ్యంగా పిల్లలకు చాలా ప్రమాదం

[అధస్సూచి]

ఆస్పిరిన్‌ రక్తస్రావం ఎక్కువయ్యేలా చేయవచ్చు గనుక దాన్ని తీసుకోవద్దని వైద్యసంబంధిత అధికారులు తెలియజేస్తున్నారు.

[24వ పేజీలోని బాక్సు]

ప్రయాణీకుల కొరకు టిప్స్‌

ఉష్ణమండల ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులకు అప్పుడప్పుడూ డెంగ్యూ రోగం సోకుతుందిగానీ, డెంగ్యూ హెమరేజ్‌ జ్వరం మాత్రం ఎంతో అరుదుగా వస్తుంది, ఎందుకంటే ప్రమాదభరితమైన ఈ రోగం డెంగ్యూ రెండోసారి సోకిన తర్వాతనే సాధారణంగా వస్తుంది. ప్రయాణీకుల కోసం కొన్ని సురక్షిత సలహాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

• పొడుగు చేతుల చొక్కాల్నీ, పాంటుల్నీ వేసుకోండి

• దోమల మందును ఉపయోగించండి

• జనసాంద్రత అధికంగాగల ప్రాంతాలకు దూరంగా ఉండండి

• మీ కిటికీల్ని మూసివేసుకొని, దోమలు చొరబడకుండా ఉండే వసతిసౌకర్యాలుగల చోటనే విడిది చేయండి

• ఇంటికి తిరిగి వచ్చాక మీకు జ్వరం గనుక వస్తే, మీరే ప్రాంతానికి వెళ్లి వచ్చారో డాక్టరుకి చెప్పండి

[24వ పేజీలోని బాక్సు/చిత్రం]

డెంగ్యూకు ఇటీవల గురైన ప్రాంతాలు

డెంగ్యూ సోకే ప్రమాదంలో ఉన్న ప్రాంతాలు

డెంగ్యూ వైరస్‌ ఉన్న దోమయైన “ఎయిడిజ్‌ ఈజిప్టి” వ్యాప్తి

[క్రెడిట్‌ లైను]

మూలం: Centers for Disease Control and Prevention, 1997

©Dr. Leonard E. Munstermann/Fran Heyl Associates, NYC

[24వ పేజీలోని చిత్రాలు]

దోమలు గ్రుడ్లను పెట్టడానికి అవకాశమున్న స్థలాలు: (1) పారవేసిన టైర్లు, (2) నిలిచిపోయిన వర్షపు నీరు, (3) పూల కుండీలు, (4) బకెట్లు లేదా మరితర పాత్రలు, (5) పారవేసిన క్యాన్‌లు, (6) పీపాలు

[24వ పేజీలోని చిత్రసౌజన్యం]

© Dr. Leonard E. Munstermann/Fran Heyl Associates, NYC

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి