కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g98 8/8 పేజీలు 15-18
  • కలకత్తా—చైతన్యంగా ఉండే వైరుద్ధ్యాల నగరం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • కలకత్తా—చైతన్యంగా ఉండే వైరుద్ధ్యాల నగరం
  • తేజరిల్లు!—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • నగర స్థాపన
  • కలకత్తా యొక్క బ్లాక్‌ హోల్‌
  • కలకత్తా ఆధునికీకరణ
  • మెట్రోపొలిస్‌ వర్తక నగరం
  • రవాణా—పురాతన మరియు ఆధునిక
  • కలకత్తాలో భిన్నమైన సంస్కృతి
  • చూడదగిన అసాధారణ విషయాలు
  • మంచి భోజనశాలలు
  • భారతీయ రైల్వేలు దేశమంతటా వ్యాపించివున్న మహత్తరమైన వ్యవస్థ
    తేజరిల్లు!—2002
  • భారతీయ వనితలు—21వ శతాబ్దంలోనికి అడుగుపెట్టడం
    తేజరిల్లు!—1995
  • మర్రి చెట్టు—ఒక చెట్టే ఓ వనం అవుతుంది
    తేజరిల్లు!—1996
  • ఇండియాలోని కోతవిషయమై ఆనందించుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
తేజరిల్లు!—1998
g98 8/8 పేజీలు 15-18

కలకత్తా—చైతన్యంగా ఉండే వైరుద్ధ్యాల నగరం

ఇండియాలో తేజరిల్లు! విలేఖరి

బ్రిటీష్‌ రచయితయైన రడ్‌యార్డ్‌ కిప్లింగ్‌ దృష్టిలో అది “భయంకర రాత్రుల నగరం,” “జనాలతో క్రిక్కిరిసి పోతున్న, వ్యాధులను కలిగించే నగరం.” అయితే సుప్రసిద్ధ ఉర్దూ కవి మీర్జా గాలిబ్‌ దృష్టిలో అది “ఎంతో నవోత్తేజాన్ని కలిగించే నగరం,” “స్వర్గసుఖాలనిచ్చే నగరం.” ఆ నగరానికి వెళ్ళిన ప్రతిసారీ “సమ్మోహనపరచే ఒక క్రొత్త అనుభవం” పొందుతున్నట్లు డుమీనీక్‌ లప్యర్‌ అనే రచయిత అంటుండగా, ఇతరులు దానిని “భయంకరమైనది, అసహ్యకరమైనది, భీతిజనకమైనది. ప్రపంచంలోని అతి పెద్ద మురికివాడ” అని పిలుస్తున్నారని నేషనల్‌ జియోగ్రాఫిక్‌లో పీటర్‌ టి. వైట్‌ ఉటంకిస్తున్నారు. నిస్సందేహంగా, కలకత్తా (బెంగాలీలో కొలికత) వైరుధ్యాల నగరం.

నగర స్థాపన

కలకత్తా నగరం భారత దేశపు ఈశాన్య తీరంలో, పశ్చిమ బెంగాల్‌లో ఉంది. అది పురాతన భారత దేశంలో భాగం కాదు. ఢిల్లీ, తంజావూర్‌ వంటి నగరాలతో పోల్చి చూస్తే, ఈ నగరం వయస్సులో చిన్నదే. సాధారణంగా నగరాల విషయంలో తరచూ జరుగుతున్నట్లు, కలకత్తా ఒక నది మూలంగా, అంటే గంగా మహా నది కారణంగా పుట్టింది. బంగాళా ఖాతాన్ని సమీపిస్తుండగా గంగా నది రెండు ఉపనదులుగా విభజించబడి, ఆ తర్వాత మరనేక ఉపనదులుగా మారింది. అలా అది ప్రపంచంలోని అతి పెద్ద డెల్టాగా తయారైంది. ఆ డెల్టా యొక్క పశ్చిమ అంచున ఉన్న నది మునుపు భగీరథీ గంగ అని పిలువబడేది, తర్వాత హుగ్లీ అని పిలువబడుతుంది. అది సముద్రంలోని దక్షిణం వైపుకు ప్రవహిస్తుంది.

15, 16 శతాబ్దాల్లోని పోర్చుగీస్‌, డచ్‌, బ్రిటీష్‌ వర్తకులు హుగ్లీకి సముద్ర యానం చేసి వచ్చి, అక్కడి స్థానిక అధికారుల అనుమతితో, వ్యాపారాన్ని వేరుపారజేసుకున్నారు. బ్రిటీష్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఆఫీసర్‌ అయిన జోబ్‌ చార్నక్‌, వ్యాపార కేంద్రంగా సుతానుటీ గ్రామాన్ని ఎంచుకున్నారు. కొన్నిసార్లు విఫలమైనప్పటికీ, ఆయన ఆ తర్వాత సుతానుటీకి పడవ ప్రయాణం చేసి, అలా గోవిందపూర్‌, కొలికత గ్రామాలవారిని ప్రలోభపెట్టి, 1690, ఆగస్ట్‌ 24న అక్కడ కేవలం వ్యాపార కంపెనీలను మాత్రమే కాదు గానీ, బ్రిటీష్‌వారి కొరకైన సంస్థాపనకు కూడా పునాది వేశాడు. అలా కలకత్తా జన్మించింది!

బ్రిటీష్‌ దేశస్థులు 1698లో కౌలుకు తీసుకునే హక్కును చట్టబద్ధంగా పొందారు. 1757 వరకూ మొగలు పరిపాలకులకు అద్దె చెల్లించారు. అలా నిర్మించబడుతున్న ఆ నగరానికి సైనిక సంరక్షణనిచ్చేందుకు ఫోర్ట్‌ విలియమ్‌ను నిర్మించారు. వ్యాపారస్థులు, ఫోర్ట్‌ విలియమ్‌ భద్రతనిస్తుందన్న భావనతో, పెద్ద ఇళ్ళను కట్టనారంభించారు. అప్పటికెల్లా ఆ పట్టణంలోని, అలాగే చుట్టుప్రక్కల గ్రామాల్లోని జనాభా 4,00,000కు చేరుకుంది. వ్యాపారం నిమిత్తం ఒక్కో సంవత్సరం దాదాపు 50 ఓడలు వరకూ హుగ్లీకి వచ్చేవి.

కలకత్తా యొక్క బ్లాక్‌ హోల్‌

1756లో కఠినుడైన, బెంగాల్‌ స్థానిక యువ పరిపాలకుడైన సిరాజ్‌-ఉద్‌-దౌలా కలకత్తాను ముట్టడి చేశాడు. నివాసుల్లో అనేకులు పరారయ్యారు. అయితే, ఫోర్ట్‌ విలియమ్‌లో శరణం ప్రాప్తించిన కొందరు యూరోపియన్లు పట్టబడి, మండుటెండలున్న జూన్‌ నెలలో ఒక చిన్న జైలులో ఖైదు చేయబడ్డారు. మరుసటి రోజు, అనేకులు ఊపిరాడక చనిపోయారని తెలిసింది. ఆ జైలు కలకత్తా యొక్క బ్లాక్‌ హోల్‌ అని పిలువబడింది.

ఈ సంఘటన ఈస్టిండియా కంపెనీవారికి కోపాన్ని రగిలించింది. 1757లో రాబర్ట్‌ క్లైవ్‌ ఆ పట్టణాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు బ్రిటీష్‌ సైనిక దళాన్ని పంపాడు. తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చేసిన ప్లాసీ యుద్ధమే ఇండియాలో బ్రిటీష్‌వారి పరిపాలనకు నాందిపలికిందని చెప్పబడుతుంది. మరి కలకత్తా విషయమేమైంది? 1773లో అది బ్రిటీష్‌ ఇండియా రాజధానియైంది. అది 1911 వరకూ అలాగే కొనసాగింది.

కలకత్తా ఆధునికీకరణ

ఆ నగరంలోకి గొప్ప సంపద కదిలి రావడంతో, బ్రహ్మాండమైన కట్టడాలు నిర్మించబడ్డాయి. అలా కలకత్తాకు సిటీ ఆఫ్‌ ప్యాలసెస్‌ అనే పేరు వచ్చింది. విశాలమైన రోడ్లు నిర్మించబడ్డాయి, మ్యూజియమ్‌లూ, గ్రంథాలయాలూ స్థాపించబడ్డాయి. అందుకు తార్కాణంగా ఆకర్షణీయమైన ఆ కట్టడాల్లో అనేకము ఇప్పటికీ నిలిచి ఉన్నాయి.

బ్రిటీష్‌వారి 190 సంవత్సరాల పరిపాలన తర్వాత, మోహన్‌దాస్‌ గాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూల సారథ్యంలో, భారత దేశం 1947లో స్వాతంత్ర్యాన్ని సంపాదించుకుంది. దానితోపాటు దేశ విభజన కూడా జరిగింది. మహమ్మద్‌ అలీ జిన్నా నేతృత్వంలో, తూర్పు పాకిస్తాన్‌, పశ్చిమ పాకిస్తాన్‌ అనే ముస్లిమ్‌ దేశాలు రూపొందాయి. అయితే, 1971లో, తూర్పు పాకిస్తాన్‌ బంగ్లాదేశ్‌గా మారింది. ఈ సంఘటనల వల్ల శరణార్థుల ప్రవాహం కలకత్తాలోకి కదలివచ్చింది; నేడు ఈ మెట్రో సిటీలో 1,20,00,000 కన్నా ఎక్కువ మంది ఉన్నారని అంచనా వేయబడింది.

అకస్మాత్తుగా అనేక మంది జీవనాధారం లేకుండా రావడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. నివసించడానికి ఇళ్ళు లేనందువల్ల నిజంగానే లక్షలాది మంది పేదరికపు మురికివాడల్లో నివసిస్తున్నారు. కార్డ్‌బోర్డ్‌, జనపనారవంటివాటితో నిర్మించిన ఇండ్లలో, పారిశుద్ధ్యమూ, విద్యుచ్ఛక్తీ, లేదా నీళ్ళు ఏదో కాస్త ఉన్న లేదా అసలు లేని పరిస్థితిలో జీవిస్తున్నారు. మరనేక వేలమంది వీధుల్లో జీవిస్తున్నారు. కలకత్తాలోని పరిస్థితులను గురించి నివేదిస్తూ, అది “తన ఆర్థిక పరిస్థితిలోనూ, గృహవసతుల విషయంలోనూ, పారిశుద్ధ్యంలోనూ, రవాణాలోనూ, మానవజీవితానికి అత్యవసరమైనవాటి విషయంలోనూ చాలా త్వరగా పడి”పోతోందని 1967లో తొమ్మిదిమంది అంతర్జాతీయ పట్టణ ప్లానర్‌లు చెప్పారు. భవిష్యత్తు భయంకరంగా కనిపించింది.

గృహాల లభ్యతను పెంచే ప్రయత్నంలో, ముఖ్యంగా తక్కువ ఆదాయం గలవారి కోసం గృహవసతులను కల్పించే ప్రయత్నంలో నదీతీరాన ఉన్న విస్తారమైన లోతట్టు ప్రాంతం ఇవ్వబడింది. అలాగే, నదిలోని ఒండ్రుమట్టిని తీసి ఆ లోతట్టు ప్రాంతాన్ని కాస్త ఎత్తుగా చేయడం ద్వారా ఓడ ప్రయాణం కూడా మెరుగుపడింది.

1990ల తొలిభాగంలో భారత దేశంలో అంతర్జాతీయ పెట్టుబడులు ప్రవేశించాయి. కలకత్తా కూడా ఆ అవకాశాన్ని చేజార్చుకోవాలనుకోలేదు. అందుకని పెద్ద ఎత్తున పారిశుద్ధ్య పని ప్రారంభమయ్యింది. మురికి వాడ నివాసులను మళ్ళీ నగరం వెలుపలికి పంపించేశారు. విద్యుచ్ఛక్తినీ, ఎరువులనూ ఉత్పత్తి చేసేందుకు చెత్త ఉపయోగించబడింది. పొగను విడుదల చేసే గాడిపొయ్యిలూ, అలాగే కాలుష్యాన్ని ఉత్పత్తిచేసే వాహనాలూ నిషేదించబడ్డాయి. రోడ్లను విశాలం చేశారు. షాపింగ్‌ సెంటర్‌లు నిర్మించబడ్డాయి. పౌర గ్రూపులు అనవసర చెత్తను తీసివేసి, శుభ్రం చేసి, పెయింట్‌ వేశాయి. కలకత్తా వినాశపు అంచు నుండి తప్పించబడింది, దాని జీవితం పునరుద్ధరించబడింది—ఒకప్పుడు ‘చనిపోబోయిన’ ‘వినాశన’ నగరం మళ్ళీ జవజీవాల్ని పోసుకుంది. ప్రయోజనాలు, అలాగే పౌర సమ్మతిపై చేసిన 1997 సంవత్సర నివేదికలో అది భారత దేశం యొక్క ప్రముఖ నగరాల పట్టికలో మంచి స్థానంలో ఉంది.

మెట్రోపొలిస్‌ వర్తక నగరం

పొరుగు దేశాల్లోని శరణార్థులూ, దేశంలోని ఇతర రాష్ట్రాల నుండి వలసవచ్చినవారూ, స్థానిక బెంగాలీలు, ఎంతోకాలంగా నివసిస్తున్న చైనీయులు, అర్మేనియన్లతో ఈ ముఖ్య నగరం అనేక భాషల, సంస్కృతుల, మతాల, మరియు వంట విధానాల కలగూరగంపగా ఉంది. ఈ లక్షల కొలది ప్రజలను కలకత్తాకు ఆకర్షించిందేమిటి? వ్యాపారమే! ప్రపంచ నలుమూలల ఉన్న ఓడలు ఈ ఓడరేవుకు వచ్చేవి. ఇక్కడ తూర్పూ పడమరా కలుసుకుంటాయి. పొటాషియమ్‌ నైట్రేట్‌, జనపనార, తేయాకు, పంచదార, ఇండిగో, ప్రత్తి, సిల్క్‌ మొదలైనవి ఎగుమతి చేయబడేవి. రోడ్డు ద్వారా, రైలు ద్వారా, మరియు సముద్రం ద్వారా భారీ ఎత్తున వస్తువులు కలకత్తాలో ప్రవేశించడమూ, బయటకు వెళ్ళడమూ జరిగేది. అలా స్వాతంత్ర్యం తర్వాత, ఇనుమునూ, ఉక్కునూ పోతపోసే భారీ స్థలాలు ఏర్పాటు చేయబడ్డాయి, గృహావసరాల కొరకైన, ఎగుమతి కొరకైన విలువైన లోహాలు త్రవ్వి తీయబడ్డాయి.

ఆ వ్యాపారం వృద్ధికావడానికి కారణం ఆ ఓడరేవే. మొదట్లో బ్రిటీష్‌వారే హుగ్లీలోని లోతైన చోట తమ ఓడలను ఆపి, అక్కడ నుండి వస్తువులను పడవల్లో రవాణా చేసేవారు. ఏ ఓడరేవు కాలక్రమేణా భారత దేశంలో ముఖ్య ఓడరేవు కానై ఉండిందో ఆ ఓడరేవుకు 1758లో కలకత్తాలో పునాది వేయబడింది. కొనసాగుతున్న ఆధునికీకరణా, గంగానది ఆనకట్ట నుండి నీటి ప్రవాహం అధికం కావడమూ కలకత్తా యొక్క అంతర్జాతీయ, తీరప్రదేశపు అలాగే అంతర్దేశీయ నీటి మార్గ ట్రాఫిక్‌ అభివృద్ధికి ఎంతో తోడ్పడ్డాయి.

రవాణా—పురాతన మరియు ఆధునిక

120 లక్షలకన్నా ఎక్కువ మంది ఉండే నగరంలో రవాణా సౌకర్యం ఒక పెద్ద సమస్యే. సాధారణంగా ఆధునిక నగరంలో కనిపించే అన్ని రవాణా సౌకర్యాలూ కలకత్తాలో ఉన్నాయి—ఇంకా అంతకన్నా ఎక్కువే ఉన్నాయి! రిక్షాను చేతితో లాక్కుంటూ, పెద్ద ట్రాఫిక్‌ గుండా వేగంగా వెళ్ళే రిక్షా వాళ్ళను చూడడం సందర్శకులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రిక్షావాళ్ళు తరచూ ఆటంకాలు కలిగించే బస్సు లేదా టాక్సీలకన్నా వేగంగా ప్రయాణికులను వారి గమ్యానికి తీసుకువెళ్తారు. వస్తువులను తీసుకువెళ్ళేందుకు, 1900లో రంగ ప్రవేశం చేసిన రిక్షా త్వరలోనే ప్రజలను తీసుకువెళ్ళడానికి ఉపయోగించబడింది. ఈ నగర వీధుల్లో దాదాపు 25,000 రిక్షాలు ఉన్నాయని అంచనా! అవి ట్రాఫిక్‌ వేగాన్ని తగ్గిస్తున్నప్పటికీ, బహుశా 50,000 మందికి పనిని కల్పించి అంత కన్నా ఎక్కువ మందికి రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి.

ప్రతిరోజూ, చిన్న ఫెర్రీ బోట్‌లు వేలాది కమ్యూటర్లను కలకత్తాలోని ముఖ్య రైల్వే స్టేషన్‌ నుండి ముఖ్య వర్తక ప్రాంతంలోకి తీసుకువెళ్తాయి. రోడ్‌ ట్రాఫిక్‌ సమస్యలను సరళతరం చేసేందుకు నదీ రవాణాను పెంచారు. 50,000 కన్నా ఎక్కువ కార్లు, వేలాది ట్రక్కులూ ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించబడే బ్రిడ్జ్‌ అయిన హౌరా బ్రిడ్జ్‌ మీదుగా వెళ్తాయి.

బహుశా ఈ నగరంలో అత్యధికంగా ఇష్టపడేది ఎలక్ట్రిక్‌ ట్రామ్‌లు. ప్రతిరోజూ, లక్షలాది మందిని ఆ నగరం చుట్టూ తీసుకపోయే, కాలుష్యాన్ని ఉత్పత్తి చేయని, హై కెపాసిటీగల, ఎనర్జీ-ఎఫిష్యంట్‌ వాహనాల ఉన్నత విధానమది. అది ప్రతిరోజు వేలాది మంది ప్రజలను నగరం నలువైపులకూ తీసుకువెళ్తుంది, అయితే ఆ ప్రయాణం అన్నివేళలా అంత సౌకర్యప్రదంగా ఉండదు. ఆ ట్రామ్‌లో తలుపు దగ్గర వ్రేలాడుతూ ప్రయాణం చేసేందుకు ప్రత్యేక నైపుణ్యం అవసరం! ఇటీవల మెట్రో రైల్‌ సిస్టమ్‌ రావడంతో చాలా గొప్ప అభివృద్ధి కనిపించింది. అది 60,000 కన్నా ఎక్కువ మంది ప్రయాణికులను నగరంలోకి తీసుకువెళ్తుంది. ఆ ప్రయాణం చాలా హాయిగా సజావుగా సాగుతుంది.

కలకత్తాలో భిన్నమైన సంస్కృతి

కలకత్తాలోని విద్యాభ్యాస అవకాశాలు అనేకులను వైజ్ఞానిక, న్యాయ రంగాల్లోకి తీసుకువెళ్ళాయి. కళలు అభివృద్ధి చెంది, ఈ ఉప ఖండపు సాంస్కృతిక కేంద్రంగా కలకత్తా రూపుదిద్దుకుంది. ప్రపంచంలో అతి పెద్ద యూనివర్సిటీల్లో ఒకటైన, 140 ఏండ్ల కలకత్తా యూనివర్సిటీకి రెండున్నర లక్షలకన్నా ఎక్కువ మంది విద్యార్థులు వెళ్తున్నారు.

ముంబయ్‌ భారతదేశంలోని వాణిజ్య సినిమాలకు కేంద్రమైతే, కలకత్తా ఉన్నత నాణ్యతగల ఆర్ట్‌ సినిమాలకు పుట్టినిల్లన్నది నిశ్చయం. సత్యజిత్‌రే, మృణాల్‌ సేన్‌లు ఈ రంగంలో చేసిన సేవలను బట్టి ప్రపంచవ్యాప్తంగా పేరు గాంచారు. రోమ్‌లోనూ, పారిస్‌లోనూ ఉన్న కవులందరి కంటే కలకత్తాలోనే ఎక్కువ మంది ఉన్నారు. న్యూయార్క్‌, లండన్‌లో కన్నా, ప్రపంచంలోని సెకండ్‌హ్యాండ్‌ పుస్తకాల పెద్ద మార్కెట్‌లలో ఒకటైన కాలెజ్‌ స్ట్రీట్‌లోకన్నా ఎక్కువ సాహిత్య పత్రికలు కలకత్తాలోనే ఉన్నాయి.

చూడదగిన అసాధారణ విషయాలు

అతి గొప్ప స్థలాల్లో ఇటాలియన్‌ రినయస్సాన్స్‌ శైలిలో పాలరాతితో నిర్మించిన విక్టోరియా మెమోరియల్‌ ఒకటి. ఇది 1921లో శంకుస్థాపన చేయబడింది. ఈ పెద్ద మ్యూజియమ్‌ భారతదేశంలోని బ్రిటీష్‌ రాజ్‌ స్మారకము. కలకత్తాలో ఒక పెద్ద ఇండియన్‌ మ్యూజియమూ, 30 కన్నా ఎక్కువ ఇతర మ్యూజియమ్‌లూ ఉన్నాయి. ఇండియన్‌ బొటానికల్‌ గార్డెన్స్‌లో ఉన్న 240 సంవత్సరాల మర్రి వృక్షం చుట్టుకొలత 400 మీటర్లు. అది జూలాజికల్‌ గార్డెన్స్‌లాగే సందర్శించదగినది. మైదాన్‌—1,280 ఎకరాలు విస్తరించి ఉండే బయలు ప్రదేశం. అది కలకత్తా యొక్క ఊపిరితిత్తులుగానూ, భారతదేశమంతటిలోని అతి పెద్ద బయలుప్రదేశం గల గ్రామంగాను ఎంచబడుతుంది. అలాగే కలకత్తాలో బిర్లా ప్లానిటోరియమ్‌ కూడా ఉంది. అది లోకంలోని అతి పెద్ద ప్లానిటోరియమ్‌లలో ఒకటి. క్రికెట్‌ ఆటలో ఆసక్తివున్నవారి కోసం, ఈడెన్‌ గార్డెన్స్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ నిర్మించబడింది. అందులో అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగేటప్పుడు ఉత్సాహవంతులైన దాదాపు 1,00,000 మంది ప్రేక్షకులతో అది సందడిగా ఉంటుంది.

సైన్స్‌ సిటీ నిజంగా అందమైన కట్టడం. ఆసియాలోని అతి పెద్ద ఇంటరాక్టివ్‌ సైన్స్‌ సెంటర్‌ అది. సందర్శకులు భూకంపాన్నీ, మునిగివున్న దీవిని అనుభవపూర్వకంగా చూసేందుకు, సుడిగాలి రూపొందడాన్ని చూసేందుకు, పర్యావరణం, అనేక ప్రాణుల అలవాట్లు వంటి ఆసక్తికరమైన వాస్తవాలను గురించి తెలుసుకునేందుకు అది అపూర్వ అవకాశాన్నిస్తుంది. అయితే, హిందువులకు కలకత్తాలో అతి పెద్ద ఆకర్షణ ఏదంటే దుర్గా పూజ ఉత్సవమే. ఈ ఉత్సవ కాలంలో ఈ నగరం ఐదు రోజుల వరకూ మతసంబంధ వేడుకలతో ఆవేశభరితంగా ఉంటుంది. అది దైనందిన కార్యకలాపాలను చాలామట్టుకు నిలిపివేస్తుంది.

మీరు కలకత్తాలో షాపింగ్‌ చేస్తున్నట్లయితే, మీరు ఏమి కనుగొంటారు? దేనికోసమైన షాపింగైనా సరే! అయితే సందడిగా ఉన్న జనసమూహంతో కలిసేందుకు సిద్ధంకండి. వివిధ వర్ణాల్లోని అందమైన చీరల్లో ఉన్న స్త్రీలను చూడండి. చైనీస్‌ షాపుల్లో మేలైన లెదర్‌ షూలతో సహా మీరు తోలు వస్తువులను సరసమైన ధరలకు పొందవచ్చు. స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ సామానులు, వస్త్రాలు, అందమైన మట్టిపాత్రలు, చక్కని ఆభరణాలూ అనేవి “షాపింగ్‌చేసేవారి పరదైసు” అయిన ఈ పెద్ద మార్కెట్‌లో కనుగొనేవాటిలో కొన్ని మాత్రమే.

మంచి భోజనశాలలు

కలకత్తా కమ్మని భోజనప్రియుల పరదైసు అని కూడా వర్ణించబడుతుంది. అక్కడి పసందైన భోజనాల్లో కొన్నైనా రుచిచూడకుండా అక్కడి నుండి బయల్దేరలేం. బెంగాలీలు ఆహారానికి ప్రాముఖ్యత ఇస్తారనీ, వంట నైపుణ్యాలను బట్టి ప్రజల ఔన్నత్యాన్ని కొలుస్తారనీ చెప్పబడుతుంది! కలకత్తా భోజనంలో చేపలు తప్పనిసరిగా ఉంటాయి. పెద్ద సంతల్లో వివిధ రకాల చేపలూ, మాంసమూ, కూరగాయలూ లభ్యమౌతాయి. తాజా మసాలాలను జాగ్రత్తగా సరైన పాళ్ళలో వేసి, సాధారణ కూరగాయల రుచి నాణ్యతను పెంచుతారు. చైనీయుల ఆహారం సమృద్ధంగా ఉంటుంది. కలకత్తాలోని పసందైన తినుబండారాల్లో అగ్ర స్థానాన ఉన్నది పేరుగాంచిన స్వీట్సే. విరగ్గొట్టిన పాలను నీళ్లు లేకుండా పిండేసి, రుచినికలిగించే ఇతర పదార్థాలను కలిపి ముద్దలుగా చేసి, చక్కెర పాకంలో నానబెట్టిన రసగుల్లాలు బెంగాల్‌కు ప్రతీక. మిష్టీ దోయ్‌ని చేజార్చుకోకండి; అది తియ్యని పెరుగు. భోజనానంతరం మిష్టీ దోయ్‌ని ఇవ్వడం సాంప్రదాయం. మీకు నోరూరుతుందా? ఆ రెస్టారెంట్లలో కమ్మనివాసనలను పసిగట్టగలరా? అవును, నిజంగానే, కలకత్తా పులకరింత కలుగజేసే, వైరుద్ధ్యాలుగల ఆసక్తికరమైన నగరం!

[15వ పేజీలోని చిత్రం]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

శ్రీలంక

భారత దేశం

కలకత్తా

బంగ్లాదేశ్‌

[చిత్రం]

కలకత్తా

ఇండియన్‌ బొటానికల్‌ గార్డెన్స్‌

మైదాన్‌

జూలాజికల్‌ గార్డెన్స్‌

బిర్లా ప్లానిటోరియమ్‌

విక్టోరియా మెమోరియల్‌

ఇండియన్‌ మ్యూజియమ్‌

హుగ్లీ నది

సాల్ట్‌ వాటర్‌ లేక్‌

డమ్‌ డమ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం

[క్రెడిట్‌ లైను]

Mountain High Maps® Copyright © 1997 Digital Wisdom, Inc.

[15వ పేజీలోని చిత్రం]

సైన్స్‌ సిటీ

[16వ పేజీలోని చిత్రం]

విక్టోరియా మెమోరియల్‌

[17వ పేజీలోని చిత్రం]

సందడిగా ఉన్న మార్కెట్‌ దృశ్యం

[17వ పేజీలోని చిత్రం]

రోడ్డు ప్రక్కనున్న మంగలి దుకాణం

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి