మీరు పైరూపాలను బట్టి న్యాయనిర్ణయం చేస్తారా?
మీరు ఒక పుస్తకం పై కవరును చూసి ఆ పుస్తకంపట్ల ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారా? మీరు బహుశ మోసపోవచ్చు. దాన్ని నివారించేందుకు, మీరు మొదట దాని విషయసూచికను చూస్తారు. అది టర్కీ జానపద కథలలోని ఒక ప్రఖ్యాత పాత్రైన నసీరుద్దీన్ హాజ్ విషయంలో ఉదహరించబడింది. (హాజ్ అనే టర్కీ పదం “బోధకుడు” అనే అర్థాన్ని కలిగివుంది.) ఆయన “జిత్తులమారే కాదు నేర్పులేని వాడు కూడా, ఆయన జ్ఞానే కాదు అవివేకి కూడా . . . ఆయన పవిత్రమైన వాడు, అయితే మానవ అపరిపూర్ణతలు గలవాడు.” ఆయన “జీవితంలో ఎదురయ్యే అనూహ్యమైన, అసాధారణమైన సంగతులను బట్టి భీతిల్లడు.”—జాన్ నూనన్ రచించిన టేల్స్ ఆఫ్ ది హాజ్, అరామ్కో వరల్డ్, సెప్టెంబరు-అక్టోబరు 1997.
ఒక ఆట్టమన్ అధికారిని దర్శించి ఆయనతో విందుభోజనాన్ని ఆరగించేందుకు ఆయన చేసిన ఒక ప్రయాణాన్ని గురించి ఒక కథ చెబుతోంది. “[నసీరుద్దీన్] గుఱ్ఱం దిగి, నిటారుగా నడుస్తూ ఎదుటనున్న పెద్ద తలుపు తడతాడు. అది తెరుచుకున్న తర్వాత, విందు అప్పటికే ప్రారంభమైందని ఆయన గమనిస్తాడు. అయితే ఆయన తనను తాను పరిచయం చేసుకోకముందే, ప్రయాణంలో మాసిపోయిన ఆయన బట్టలవైపు చూసి, అడుక్కునే వాళ్లను లోనకు రానీయమని అతిథేయి కఠినంగా చెబుతాడు.”
నసీరుద్దీన్ వెళ్లిపోయి, “తన గుఱ్ఱంపైనున్న సంచీలోనుండి, తనవద్ద ఉన్న వాటిలోకెల్లా అత్యంత ఖరీదైన బట్టలను తీసి వేసుకుంటాడు: అవి ప్రశస్తమైన పట్టు వస్త్రాలు, వాటి అంచులకు బొచ్చు కుట్టి ఉంది, ఒక పెద్ద పట్టు తలపాగా తీసుకుంటాడు. అలా ముస్తాబై, ఆయన తలుపు వద్దకు వెళ్లి మళ్లీ తలుపు తట్టాడు.
“ఈసారి, అతిథేయి ఆయనను సాదరంగా ఆహ్వానించాడు . . . సేవకులు రుచికరమైన ఆహార పదార్థాలను ఆయన ముందుంచారు. నసీరుద్దీన్ హాజ్ ఒక గిన్నె నిండా ఉన్న సూప్‌ను తన అంగీ జేబులో పోసుకుంటాడు. ఇతర అతిథులు వింతగా చూస్తుండగా, ఆయన వేయించిన మాంసాన్ని తన తలపాగా మడతల్లో పెట్టుకుంటాడు. తర్వాత, భీతిల్లిన తన అతిథేయి చూస్తుండగా, ఆయన తన బట్టలకు ఉన్న బొచ్చు అంచులను పలావ్ పళ్లెంలో పెట్టి ఇలా అంటాడు, ‘తిను, బొచ్చూ, తిను!’
“‘ఏమిటి మీరు చేస్తున్నది?’ అని అతిధేయి కోపంగా అడుగుతాడు.
“‘అయ్యా, నేను నా బట్టలకు తినిపిస్తున్నాను. మీరు అరగంట క్రితం నాతో వ్యవహరించిన విధానాన్ని బట్టి నాకు కాదు గానీ నా బట్టలకే మీరు ఆతిథ్యమిస్తున్నారు!’ అని హాజ్ సమాధానమిస్తాడు.”
మనం కేవలం పైరూపం ఆధారంగానే ఎంత తరచుగా ప్రతికూలమైన లేక అనుకూలమైన అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటాము! దావీదు అన్న అయిన ఏలీయాబు, ఇశ్రాయేలు యొక్క తర్వాతి రాజుగా ఉండేందుకు యెహోవా ఎన్నుకున్న వాడేమో అని ప్రవక్త అయిన సమూయేలు అనుకున్నప్పుడు, యెహోవా ఆయనకు ఇలా చెప్పాడు: “అతని రూపమును అతని యెత్తును లక్ష్యపెట్టకుము, మనుష్యులు లక్ష్యపెట్టువాటిని యెహోవా లక్ష్యపెట్టడు; నేను అతని త్రోసివేసి యున్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును.” (1 సమూయేలు 16:7) అవును, యెహోవా రూపాలను బట్టి కాక హృదయస్థితిని బట్టి తీర్పుతీరుస్తాడు. మరి మీరెలా చేస్తారు?
[17వ పేజీలోని చిత్రం]
పైరూపాన్నిబట్టి మోసపోవద్దని యెహోవా సమూయేలును హెచ్చరించాడు