ప్రపంచ పరిశీలన
పిల్లల్లో అతిసారాన్ని నయం చేయడం
“పిల్లల్లో తీవ్రమైన అతిసారాన్ని దాదాపు నివారించగల ఒక టీకామందును వెనిజ్యులా పరిశోధకులు తయారు చేశారు” అని కరాకాస్‌కు చెందిన ది డెయిలీ జర్నల్ చెబుతుంది. “ఆ టీకామందు . . . అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని ఐదు సంవత్సరాలలోపు వయస్సుగల దాదాపు 8,73,000 మంది పిల్లలను ప్రతి సంవత్సరం చంపుతున్న రోటవైరస్ అతిసారవ్యాధి నుండి కాపాడేందుకు రూపొందించబడింది.” అమెరికాలో కూడా, ఈ వ్యాధి మూలంగా ప్రతి సంవత్సరం 1,00,000 కంటే ఎక్కువమంది శిశువులూ, ఇంకా పాఠశాలకు వెళ్లడం ప్రారంభించని పిల్లలూ ఆసుపత్రి పాలౌతున్నారు. ఆ టీకామందును ఉపయోగించడం వైరస్‌కు విరుద్ధంగా 88 శాతం కాపుదలనిచ్చిందనీ మరియు తీవ్రమైన అతిసారం మూలంగా ఆసుపత్రిలో చేర్పించడాన్ని 70 శాతం తగ్గించిందనీ ది న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించబడిన అధ్యయనం నివేదిస్తోంది. అయితే, ఇక్కడో సమస్య ఉంది. “అయితే చికిత్సా, ఆరోగ్య సంరక్షణల విషయమై ప్రతి సంవత్సరం ఒక్కో వ్యక్తిపై 20 డాలర్లకంటే తక్కువ ఖర్చుచేసే దేశాలూ, మరియు దాని అవసరత ఎంతో ఎక్కువగా ఉన్న దేశాలూ అయిన అభివృద్ధి చెందుతున్న దేశాలకు మరీ ఖరీదైనదిగా ఉండవచ్చు” అని ది డెయిలీ జర్నల్ చెబుతోంది. ఆ టీకామందును పెద్ద ఖర్చులేకుండా ఉత్పత్తి చేసేంతవరకూ, అతిసారం వలన కలిగే నిర్జలీకరణ నుండి కోలుకునేందుకు సహాయబడే పద్ధతి శరీరం కోల్పోయిన ద్రవం స్థానంలో క్రొత్త ద్రవాన్ని చేర్చడమే. ఈ పద్ధతి 20 సంవత్సరాలుగా ఎంతో ప్రభావవంతంగా ఉపయోగించబడుతున్నది.
పని, ఒత్తిడి, గుండెపోటులు
హృదయం మరియు రక్తప్రసరణ సంబంధిత సమస్యల్లో రిస్కును కలిగించే అత్యంత ప్రాముఖ్యమైన కారకాల్లో ధూమపానం మొదటిదైతే, పనిలో కలిగే మానసిక ఒత్తిడి రెండవది అని ఫ్రాంక్‌ఫర్టర్ రుంట్‌షాపు నివేదిస్తోంది. జర్మనీనందలి బెర్లిన్‌లోని, ఫెడరల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ ద్వారా జరుపబడిన ఒక సర్వే యొక్క సారాంశాన్ని పేర్కొంటూ, ఆ నివేదిక ఇలా చెబుతోంది: “నిర్ణయాలు తీసుకునే స్వాతంత్ర్యం ఎక్కువగా లేని ఉద్యోగులూ మరియు చక్కని వైవిధ్యం అంతగాలేని ఉద్యోగాలను చేస్తున్న వారు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారు. ఒకవేళ వారు తమ స్వంత సమయంలో కూడా ఒత్తడిని అనుభవిస్తున్నట్లయితే, ఉదాహరణకు వారు తమ స్వంత ఇళ్లు కట్టుకుంటుండటం లేక అనారోగ్యంగా ఉన్న బంధువు ఎడల శ్రద్ధ వహిస్తుండటం మూలంగా వారు ఒత్తిడిని అనుభవిస్తున్నట్లయితే అప్పుడు గుండెపోటు వచ్చే సాధ్యత తొమ్మిది రెట్లకు పెరుగుతుంది.” నిర్ణయాలు తీసుకునే విషయంలో ఉద్యోగస్థులకు మరింత ఎక్కువ స్వాతంత్ర్యాన్ని ఇవ్వాలని ఒక నిపుణుడు పురికొల్పుతున్నాడు. “విభాగంలోని ఉద్యోగస్థులందరితో నెలలో కేవలం ఒకసారి చర్చ జరిపినా అది పరిస్థితులను మెరుగుపర్చగలదు.”
తల్లిపాలు అనారోగ్యాలను తగ్గిస్తాయి
“2 నుండి 7 నెలల వయస్సులోని 1,700కు పైగా శిశువులపై జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, తల్లిపాలు త్రాగే శిశువులకు చెవి ఇన్‌ఫెక్షన్ మరియు అతిసార వ్యాధులు వచ్చే సాధ్యత తక్కువగా ఉంటుందని” పేరెంట్స్ పత్రిక పేర్కొంటోంది. “పూర్తిగా తల్లిపాలపైనే ఆధారపడిన శిశువుతో పోల్చితే డబ్బాపాలపైనే పూర్తిగా ఆధారపడిన బిడ్డకు ఈ అనారోగ్యాల్లో ఒకటి వచ్చే సాధ్యత రెండింతలుగా ఉంటుందని వ్యాధి నియంత్రణ మరియు నివారణా కేంద్రాలలోని పరిశోధకులు కనుగొన్నారు.” తల్లిపాల ద్వారా తల్లిలోని కాపుదలనిచ్చే యాంటీబాడీలు బిడ్డలోకి వస్తాయి గనుక తల్లిపాలు ఇన్‌ఫెక్షన్‌కు విరుద్ధంగా మంచి సంరక్షకమైనవని వైద్యులు ఎంతో కాలంగా విశ్వసిస్తుండగా, ఆ ప్రయోజనాలు ఎంతో గణనీయంగా ఉన్నాయని ఈ అధ్యయనం చూపిస్తోంది. ఆ అధ్యయనంలోని ఒక రచయితయైన లారెన్స్ గ్రూమర్-స్ట్రాన్ ఇలా చెబుతున్నాడు: “ఒక శిశువు మొదటి ఆరు నెలల్లో తల్లిపాలు ఎంత ఎక్కువగా త్రాగితే అంత మంచిదని చెప్పడంలో తప్పేమీ లేదు.”
ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన రవాణా సదుపాయం
మీరు ఒక నగర ప్రాంతంలో ఎనిమిది కిలోమీటర్లకంటే తక్కువ దూరం ప్రయాణించాలంటే, ఒక కారుకంటే సైకిలే త్వరగా వెళ్తుందని శ్రీలంకలోని కొలంబోకు చెందిన ది ఐలాండ్ నివేదిస్తోంది. అంతర్జాతీయ పర్యావరణ సంబంధ గుంపు అయిన పుడమి స్నేహితులు, “భూమిపైనున్న అత్యంత ప్రభావవంతమైన రవాణా సదుపాయం” అని సైకిల్‌ను పిలుస్తున్నారు. ఒక సైకిలుపై 2,400 కంటే ఎక్కువ కిలోమీటర్లు, ఒక గ్యాలన్ పెట్రోలుకు సరిసమానమైన ఆహార శక్తితో, ఎలాంటి కాలుష్యమూ లేకుండా ప్రయాణించవచ్చు అని వారు సూచిస్తున్నారని చెబుతూ, సైకిల్ ఉపయోగం ఆరోగ్య సంబంధ ప్రయోజనాలను కూడా అందిస్తుందని ఆ నివేదిక పేర్కొంటుంది.
సిజేరియనా లేక మామూలు ప్రసవమా?
బ్రెజిల్ నందలి వైద్యులూ, తల్లులూ కూడా మామూలు ప్రసవంకంటే సిజేరియన్ సెక్షన్‌నే ఇష్టపడతారు. “తాను మరిన్ని ప్రసవ కేసులు తీసుకోగలడూ, తన కార్యాలయంలోనే మరింత ఎక్కువ డబ్బు సంపాదించగలడూ, మరియు తన వారాంతాన్ని పోగొట్టుకోవలసిన అవసరం ఉండదని” ఒక వైద్యుడు కనుగొంటాడని వేజా పత్రిక నివేదిస్తోంది. తల్లులు “నొప్పులను నివారించేందుకై మామూలు ప్రసవ ప్రక్రియలను ఇష్టపడరు (అయితే, సిజేరియన్ ప్రసవం తర్వాత కోలుకోవడంలో మరింత ఎక్కువ నొప్పి ఉంటుంది), మరియు సిజేరియన్ పద్ధతి తమ శరీర సౌందర్యానికి ప్రయోజనకరంగా ఉంటుందని (వాస్తవానికి అది ఎంతమాత్రం ప్రయోజనకరం కాదు) వారు విశ్వసిస్తారు. ప్రజా ఆసుపత్రుల్లో, ప్రసవాలన్నింటిలో మూడవవంతు సిజేరియన్ పద్ధతిలోనే జరుగుతాయి, మరి కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆ సంఖ్య 80 శాతం వరకూ కూడా ఉంది. “ప్రసవం ఒక వాణిజ్య ఉత్పత్తి అయ్యింది” అని, కంపీనస్ విశ్వవిద్యాలయంలోని ఆబ్‌స్టెట్రిక్స్ (ప్రసూతి సాధన శాస్త్రం) విభాగానికి అధ్యక్షుడైన డా. జ్వావున్ లూయీష్ కార్‌వాల్యున్ పీంటూ ఈ సీల్వ చెబుతున్నాడు. “మామూలు ప్రసవంలా కాకుండా సిజేరియన్ అనేది ఒక శస్త్రచికిత్స అనే విషయాన్ని ప్రజలు తరచూ విస్మరిస్తారు. సిజేరియన్ పద్ధతిలో రక్తం ఎక్కువ పోతుంది, ఎక్కువసేపు ఎనస్తీషియా ఇవ్వవలసి ఉంటుంది, మరియు ఇన్‌ఫెక్షన్ అయ్యే సాధ్యత ఎక్కువ ఉంటుంది.” వైద్యుని ప్రకారం, “రోగి ప్రాణం లేక బిడ్డ ప్రాణం ప్రమాదంలో ఉన్నప్పుడు, ప్రసవనొప్పులు రానప్పుడు, లేక ఆకస్మిక చిక్కులు వచ్చిపడినప్పుడు, అంటే ఈ మూడు కేసుల్లో మాత్రమే సిజేరియన్ చేయాలి” అని వేజా చెబుతోంది.