బైబిలు ఉద్దేశము
2000 సంవత్సరం ఎంత ప్రాముఖ్యమైనది?
పాశ్చాత్య దేశాల్లో అలాగే అనేక ఇతర దేశాల్లో 2000వ సంవత్సరానికి ఇస్తున్న మతపరమైన ప్రాముఖ్యతను అనేకమంది ప్రజలు ఇవ్వరు. ఉదాహరణకు, హిందువులకూ, ముస్లిమ్‌లకూ, యూదులకూ వారి వారి సొంత మతపరమైన క్యాలెండర్లు ఉన్నాయి. ఆ క్యాలెండర్లు పాశ్చాత్య క్యాలెండర్లతో ఏకీభవించవు. మతపరమైన, సాంప్రదాయ సంబంధమైన తారీఖుల విషయంలో, చైనా దేశస్థులు చాంద్రమాన క్యాలెండర్ని అనుసరిస్తారు. అందుకే, నేడున్న కోట్లాదిమంది ప్రజలు, బహుశా ప్రపంచ జనాభాలోని అధికశాతం మంది ప్రజలు 2000వ సంవత్సరానికి ఏ విధంగానూ ప్రత్యేకమైన అర్థాన్నీ ఆపాదించరు.a
అయినప్పటికీ, సమీపిస్తున్న క్రొత్త సహస్రాబ్ది ప్రారంభాన్ని అంటే గ్రెగోరియన్ క్యాలెండరు గుర్తించిన సహస్రాబ్ది ప్రారంభాన్ని అనేకమంది, విశేషంగా పాశ్చాత్య దేశస్థులు ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. కొంతమందికిది కేవలమొక ఉత్సుకత మాత్రమే కాదు. వాళ్లు 2000వ సంవత్సరాన్ని నూతన శకంలోనికి తీసుకుపోయే ముఖద్వారంగా, చరిత్రలో ఓ మలుపు రాయిగా దృష్టిస్తారు. బైబిల్ని విశ్వసిస్తున్నామని చెప్పుకొనే అనేకమంది, ప్రవచనాల నెరువేర్పును 2000వ సంవత్సరంతో ముడిపెడుతున్నారు. కొంతమందైతే, గొప్ప పరిమాణంలో ఆధ్యాత్మిక ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తారు. మరితరులు ప్రళయం—ప్రపంచాంతం వస్తుందని భయపడతారు. బైబిలు, ఇలాంటి అంచనాలకు మద్దతు ఇస్తుందా?
యెహోవా, సమయాన్ని అదుపులో ఉంచువాడు
బైబిలు దేవుడు, ‘మహావృద్ధు’నిగా వర్ణించబడ్డాడు. (దానియేలు 7:9) గ్రహాల కదలికల దగ్గరనుండి పరమాణు కణాల చలనాల వరకూ తన సృష్టి పనిచేసే తీరుతెన్నుల్లో కనబడుతున్నట్టుగానే ఆయన కాలాన్ని హెచ్చుతగ్గుల్లేకుండా సంపూర్ణంగా అదుపులో ఉంచుతున్నాడు. ఆయనకు తన సొంత టైమ్‌టేబుల్ ఉంది, ఆ టైమ్‌టేబుల్‌కి ఆయన కట్టుబడి ఉంటాడు. “ఆయన . . . నిర్ణయకాలమును వారి [మనుష్యుల] నివాసస్థలముయొక్క పొలిమేరలను ఏర్ప[ర్చాడు]” అని బైబిలు చెబుతోంది. (అపొస్తలుల కార్యములు 17:26) యెహోవా దేవుడు సమయాన్ని ఖచ్చితంగా అదుపులో ఉంచేవాడు.
అదే ప్రకారంగా, బైబిలు కాలవృత్తాంతానికి నిర్దిష్టమైన అవధానాన్ని ఇస్తోంది. ఒకదానితో మరొకటి సంబంధంకల్గివున్న రికార్డును బైబిలు అందజేస్తుంది. ఈ చరిత్ర, ఒక పద్ధతి ప్రకారంగా వెనక్కి లెక్కిస్తూ మానవచరిత్ర ఆరంభాన్ని గుర్తించడానికి తోడ్పడుతుంది. ఆ విధమైన లెక్కింపు, సా.శ.పూ. 4026వ సంవత్సరాన్ని దేవుడు ఆదామును సృష్టించిన సంవత్సరంగా సూచిస్తోంది. దాదాపు 2000 సంవత్సరాల తర్వాత, అబ్రహాము జన్మించాడు. యేసు జన్మించేనాటికి మరొక 2000 సంవత్సరాలు గడిచిపోయాయి.
బైబిలు కాలవృత్తాంతాల్ని అధ్యయనం చేసే కొంతమంది వ్యక్తులు భవిష్యత్తులో నిర్దిష్టమైన తేదీల్ని సూచించే హేతుబద్ధంకాని సమీకరణాల్ని రూపొందించారు. ఉదాహరణకు, ఆదాము, అబ్రహాము, యేసులకు మధ్య ఇంచుమించుగా పట్టిన 2000 సంవత్సరాల క్రమానుగత కాలాల్ని ఒక ఆధారంగా ఉపయోగిస్తూ, యేసు పుట్టినప్పటి నుండి 2000వ సంవత్సరాల తర్వాత దుస్సంఘటనొకటి జరుగుతుందని కొంతమంది ప్రవచిస్తారు. బైబిలు కాలవృత్తాంతాలపై ఆధారపడి కాలాన్ని లెక్కిస్తున్నామని చెప్పుకునే ఫార్ములాలకు కేవలమిదొక ఉదాహరణ మాత్రమే.
నిజమే, చెడుతనాన్ని తొలగించి, నూతన లోకాన్ని తీసుకురావడం ద్వారా మానవ వ్యవహారాల్లో యెహోవా దేవుడు జోక్యం చేసుకోబోయే సమయాన్ని గురించి బైబిలు మాట్లాడుతోంది. “అంత్యకాలమును” గూర్చీ, “యుగసమాప్తి[ని]” గూర్చీ, “అంత్యదినముల”ను గూర్చీ బైబిలు ప్రవచనం మాట్లాడుతోంది. (దానియేలు 8:17; మత్తయి 24:3; 2 తిమోతి 3:1; 2 పేతురు 3:12) అయితే, బైబిల్లో ప్రవచించబడిన ‘అంతం’ అనేది 2000వ సంవత్సరానికి ఏ విధంగానూ ముడిపెట్టబడలేదు. గ్రెగోరియన్ క్యాలెండరు ప్రకారంగా లెక్కించబడిన రెండవ సహస్రాబ్ది ముగింపుకు లేఖనాల్లో ప్రత్యేకమైన ప్రాముఖ్యతనేది ఆపాదించబడలేదు.
“ఇవి ఎప్పుడు జరుగును?”
“ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనలేవి? మాతో చెప్పుమ[ని]” యేసు అపొస్తలులు ఆయనను అడిగినప్పుడు వాళ్లు దేవుని టైమ్‌టేబుల్‌పై ఆసక్తిని చూపించారు. (మత్తయి 24:3) భవిష్యత్తు విషయంలో నేడు కూడా అనేకమంది అలాంటి జిజ్ఞాసనే చూపించారు. అలాంటి ప్రాముఖ్యమైన బైబిలు ప్రవచనాల విషయంలోనూ, వాటి నెరవేర్పు జరిగే సమయం విషయంలోనూ అత్యంతాసక్తి కల్గివుండడం సహజమే. అయితే, ఆ విషయంపై దేవుని స్థానాన్ని అంగీకరించి, గౌరవించడం జ్ఞానయుక్తమైన పని.
తన కుమారుని ద్వారా, యెహోవా తన ఉద్దేశాల్ని బయల్పర్చి, ఆ వివాదాంశంపై సూటైన జవాబును ఇచ్చాడు. యేసు పరలోకానికి ఆరోహణంకావడానికి కొంచెం ముందు, దేవుని సంకల్పాలు నెరవేరే కాలాన్ని గురించి ఆయన శిష్యులు ఆయన్ని మరలా అడిగారు. యేసు ఇలా జవాబిచ్చాడు: “కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచు కొనియున్నాడు; వాటిని తెలిసికొనుట మీ పనికాదు.” (అపొస్తలుల కార్యములు 1:7) అంతకుముందొక సందర్భంలో, యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు: “అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియనుగూర్చియు తండ్రి మాత్రమే (యెరుగును) గాని, యే మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు.”—మత్తయి 24:36.
‘కాలాల్నీ, సమయాల్నీ తెలిసికోవడం,’ మరి విశేషంగా బైబిలు ప్రవచనాల భావి నెరవేర్పు విషయానికి వచ్చినప్పుడు వాటిని తెలుసుకోవడం అనేది మానవుని స్వాధీనంలో లేదు. అలాంటి సమాచారాన్ని మనకు తెలియజేయకూడదని దేవుడు నిర్ణయించుకున్నాడు. (మత్తయి 24:22-44) ఆయన అభీష్టానికి భిన్నంగా ‘ఆ దినాన్ని గూర్చీ, ఆ గడియను గూర్చీ’ మనం మనకు తోచిన భావాన్ని చెప్పుకోవడం ద్వారా దేవుని సంకల్పాలను మనమే విధంగానైనా ప్రభావితం చేయగల్గుతామా? అలా ప్రభావితం చేయడం దుస్సాధ్యమనేది సుస్పష్టమే. (సంఖ్యాకాండము 23:19; రోమీయులు 11:33, 34) బైబిలిలా చెబుతోంది: “యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును.” (కీర్తన 33:11) సర్వశక్తిమంతుడైన దేవునిగా, ఆయన అన్నివేళలా సఫలీకృతుడే.—యెషయా 55:8-11.
“కాలములను సమయములను . . . తన స్వాధీనమందుంచు కొ[నే]” దేవుని శక్తిని గురించి తెలిసినప్పటికీ, అనేకమంది ఇంకా అంచనాలు వేయడానికే ఇష్టపడతారు. కొంతమంది వినాశనాన్ని గురించి ప్రవచించే స్వయం నియమిత ప్రవక్తలుగా తయారౌతారు. ఈ కారణాన్నిబట్టే, అపొస్తలుడైన పౌలు తారీఖుల్ని గురించి అంచనాలువేసే వారు చెప్పే వాటిని వినడం మూలంగా కలిగే అపాయాన్ని గూర్చిన నిర్దిష్టమైన ఉపదేశాన్ని థెస్సలొనీకయులకు ఇచ్చాడు. ఆయనిలా రాశాడు: “ప్రభువుదినమిప్పుడే [“యెహోవా దినమిప్పుడే,” NW] వచ్చియున్నట్టుగా ఆత్మ వలననైనను, మాటవలననైనను, మా యొద్దనుండి వచ్చినదని చెప్పిన పత్రికవలననైనను, ఎవడైనను చెప్పినయెడల మీరు త్వరపడి చంచలమనస్కులు కాకుండవలెననియు, బెదరకుండవలెననియు . . . మిమ్మును వేడుకొనుచున్నాము.”—2 థెస్సలొనీకయులు 2:1-3.
భవిష్యత్తు కొరకైన దేవుని సంకల్పాలు తన పూర్వనిర్ధారిత సమయంలో, ఖచ్చితంగా తాను నిర్దేశించిన దినంలో, ఘడియలో జరుగుతాయని యెహోవాసాక్షులు దృఢంగా నమ్ముతారు. (హబక్కూకు 2:3; 2 పేతురు 3:9, 10) ఈ సంఘటనలు సమీప భవిష్యత్తులో జరుగుతాయని మేం విశ్వసిస్తాం. (2 తిమోతి 3:1-5) అయితే, నేడు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న సిద్ధాంతాలపై మేం ఊహాగానాలు చేయం లేక వాటికి మద్దతునివ్వం.b 2000వ సంవత్సరంతోగానీ లేక 2,001వ సంవత్సరంతోగానీ లేక మానవులచే నిర్దేశించబడ్డ మరే ఇతర సమయంతోగానీ యెహోవా టైమ్‌టేబుల్‌కి ఖచ్చితంగా సంబంధమేమీలేదు.
[అధస్సూచీలు]
a సాంకేతికరీత్యా చూస్తే, మూడవ సహస్రాబ్ది అని పిలువబడేది 2001 జనవరి 1న ఆరంభమౌతుంది. మొదటి సహస్రాబ్ది, సున్న సంవత్సరంతోగాక 1వ సంవత్సరంతో ప్రారంభమైంది. అయితే, ప్రజలు “మూడవ సహస్రాబ్ది” అనే పదాన్ని 2000వ సంవత్సరంతో ముడిపెడుతున్నారు. 2000వ సంవత్సరాన్ని గూర్చి పాపులరైన అంచనాలపై ఈ శీర్షిక కేంద్రీకరిస్తోంది.
b కావలికోట సెప్టెంబరు 1, 1997 సంచికలో 21-2 పేజీల్లో ఇలా తెలియజేసింది: “యెహోవా దినము ఎప్పుడు వస్తుందో తెలుసుకోవాలని యెహోవాసాక్షులు ఆతురత కల్గివున్నారు. వారు ఆ ఆతురతతో, అదెప్పుడు వస్తుందో అంచనా వేయడానికి ప్రయత్నాలు చేశారు. కాని అలా చేయడం ద్వారా, “ఆ కాలమెప్పుడు వచ్చునో [మనకు] తెలియదు” అని తమ ప్రభువు చేసిన హెచ్చరికను వినడంలో వాళ్లు యేసు తొలి శిష్యుల్లానే విఫలమయ్యారు. (మార్కు 13:32, 33) అపహాసకులు నమ్మకమైన క్రైస్తవులను వారి అకాల అపేక్షలను బట్టి అపహసించారు. (2 పేతురు 3:3, 4) అయినప్పటికీ, యెహోవా కాలపట్టిక అనుసారంగా ఆయన దినం తప్పక వస్తుందని పేతురు నొక్కి చెబుతున్నాడు.”