మన ఇళ్ళ ముందు డాల్ఫిన్
ఆస్ట్రేలియాలోని తేజరిల్లు! విలేఖరిద్వారా
అది వెచ్చని, లోతులేని ఉష్ణమండల నీటిని, అవి ఉప్పుగా ఉండేవైనా లేదా తాజాగా ఉండేవైనా, మసకగా ఉండేవైనా, పారదర్శకంగా కనిపించేవైనా సరే ఇష్టపడుతుంది. అది భారతదేశం యొక్క బంగాళాఖాతం మొదలుకొని, ఉత్తర ఆస్ట్రేలియాలోని మలే దీవుల వరకూ కనిపిస్తుంది.
అయితే, కొద్దిమంది—ముఖ్యంగా, ప్రపంచంలోని మరెక్కడి కన్నా కూడా ఎవరి ఇళ్ళ ముందు ఈ జంతువులు ఎక్కువ సాంద్రతలో కనిపిస్తాయో ఆ ఆస్ట్రేలియా దేశస్థులు—మాత్రమే ఇరావాడీ డాల్ఫిన్‌లను చూసి ఉంటారు, కనీసం విని ఉంటారు. ఆశ్చర్యకరమా? అవుననవచ్చు, కాదనవచ్చు.
మ్యాన్‌మార్‌లోని (అప్పట్లో బర్మా) ఇరావాడీ నదిలో నీలిరంగూ బూడిద రంగూ కలగలిసిన వర్ణంలో, గుండ్రంగా ఉండి, ముక్కులేని తలగల డాల్ఫిన్లు గుంపుగా ఈదుతుండడాన్ని 19వ శతాబ్దంలో జంతుశాస్త్రజ్ఞుడైన జాన్ ఆండర్‌సన్ చూశాడు. ఆయనే దానికి ఇరావాడీ డాల్ఫిన్ అనే పేరు పెట్టాడు.
అరుదుగా కనిపించేదెందుకంటే
ఇరావాడీలు వెచ్చని, మరియు చల్లని తీరప్రాంతాల్లోనూ, సముద్రపు నీటిపోటుగల నదీముఖాల్లోనూ, నదీ ప్రాంతాల్లోనూ వర్థిల్లుతాయి. ఇరువైపులా బురదా, మాన్‌గ్రోవ్ చెట్లూ, అడవి ప్రాంతాలూ, దోమల సముదాయమూ, అంతెందుకు మొసళ్ళు కూడా ఉన్న ప్రాంతాలు—మనష్యులను ఆకర్షించని ప్రాంతాలు—వాటి నివాస స్థలాలు.
ఈ ప్రాంతాల్లో ఉండే నీళ్ళు సాధారణంగా పారదర్శకంగా ఉండవు కూడా. కనుకనే డాల్ఫిన్ శ్వసించేందుకు కొద్దిగా నీటి ఉపరితలంపైకి వచ్చినప్పుడు మాత్రమే మీరు దానిని చూడగలరు. అప్పుడైనా అది పూర్తిగా కనిపించడం అరుదు. దాని వీపు కొంచెం కనిపిస్తుంది. మిగతా డాల్ఫిన్‌లను పోల్చితే, దాని రెక్క చిన్నగా ఉంటుంది.
అయితే కొన్ని ప్రాంతాల్లో ఇరావాడీ డాల్ఫిన్‌లు కనిపించేది అరుదేమీ కాదు. మ్యాన్‌మార్‌లోని ఇరావాడీ నదిలోను, అలాగే డాల్ఫిన్‌ల ఆసియా సామ్రాజ్యంలోని ఇతర నదుల్లోనూ ప్రయాణించే జాలరులూ, పడవను నడిపేవారూ ఈ జంతువులు తరచూ వేటాడుతుండడాన్నీ, ప్రవాహం మీదుగా దూకుతుండడాన్నీ, నీటి బుగ్గలకుమల్లే, నీటితోటల్లోని ప్రతిమలకుమల్లే నీటిని ధారలుగా చిమ్ముతుండడాన్నీ చూస్తారు.
ఆస్ట్రేలియా జలాల్లో, అంటే పశ్చిమ తీరం మొదలుకొని, ఆ ఖండం యొక్క శిఖరభాగం చుట్టూ, ఆ తర్వాత క్రింది భాగాన ఉండే ప్రాచ్య తీరం వరకూ ఇరావాడీలు కనిపిస్తాయి. నీటిలో, అవి సాధారణంగా గుంపులు గుంపులుగా కనిపిస్తాయి. ఒక్కో గుంపులో 6 కన్నా తక్కువే ఉంటాయి, కానీ ఒక్కోసారి 15 వరకూ ఉంటాయి. ఆస్ట్రేలియా జలాల్లోని ఈ డాల్ఫిన్‌లు ఆసియాలోని తమ బంధువులకుమల్లే నీటి బుగ్గలను అనుకరించగలవనేదానికి దాఖలాలేమీ లేవు.
అది డాల్ఫినేనా?
ఇరావాడీలు ఒడ్డుకు దగ్గర్లో నివసిస్తాయి. ఇంకాస్త పారదర్శకంగా కనిపించే నీలినీటిలోని వాటి బంధువులతో పోల్చితే చాలా నెమ్మదిగా ఈదుతాయి. అయితే, వాటిని అధ్యయనం చేయడంలో శాస్త్రజ్ఞులకు కష్టంగా ఉండేది. వాటి సామ్రాజ్యం అంత ఆసక్తికరంగా ఉండదన్నదే అందుకు ముఖ్య కారణం. అయినప్పటికీ ఇండోనేషియాలోని జాకార్టాలోని జయ ఆన్‌కొల్‌లోని ఓషియనేరియమ్‌లో సజీవ ఇరావాడీల అధ్యయనం జరిగింది.
ఇరావాడీల గురించి తెలిసింది కొంతే కనుక వాటిని వేల్ డాల్ఫిన్ వంశ వృక్షంలో చేర్చాలా వద్దా అన్న విషయంలో ఇటీవలి కాలం వరకూ జీవశాస్త్రజ్ఞులు అనిశ్చయతతోనే ఉన్నారు. స్పష్టంగా, వాటికి డాల్ఫిన్‌లతో చాలా సాదృశ్యముంది. అయితే రంగులో కాదు కానీ, (అవి పాలిపోయిన రంగు మొదలుకొని ముదురు నీలి-బూడిద రంగు వరకూ ఉంటాయి), రూపంలో, చాలావరకూ, ఆర్కిటిక్ బెలూగా వేల్ లేదా వైట్ వేల్‌ల మరో రూపంలా కనిపిస్తాయి. అసాధారణంగా అటు ఇటూ త్రిప్పగల వాటి మెడ చాలావరకూ బెలూగాలాగే ఉంటుంది. కనుక అది ఏమిటి—బెలూగాకు సమానమైన భూమధ్యరేఖకు సమీపంలో ఉన్న ప్రాణా లేక నిజమైన డాల్ఫినా?
ఇరావాడీలు బెలూగా కోవకు చెందినవా లేక డాల్ఫిన్ కోవకు చెందినవా అన్న విషయాన్ని కనుగొనే ఒక మార్గం వాటి అవయవ నిర్మాణాన్నీ, జన్యు వ్యవస్థనూ పరిశీలించడమే. ఆధారసహితంగా కనిపిస్తున్న రుజువులన్నీ అది డాల్ఫిన్ జాతికి చెందినవని సూచిస్తున్నట్లనిపిస్తుంది.
మనకు తెలిసిన కొద్దిపాటి సమాచారం
ఇరావాడీ డాల్ఫిన్ పిల్లలు పుట్టినప్పుడు దాదాపు మూడు అడుగుల పొడవూ, దాదాపు 12 కిలోగ్రాముల బరువూ ఉంటాయి. మగవి దాదాపు 9 అడుగుల వరకూ, ఆడవి దానికన్న కాస్త తక్కువ పొడవు వరకూ పెరుగుతాయి. అవి 28 సంవత్సరాలు బ్రతుకవచ్చు.
చనిపోయిన ఇరావాడీల పొట్టలో నుండి తీసిన సాంపుల్స్ చూపించేదేమంటే, అవి స్క్విడ్‌లనూ, రొయ్యలనూ, ప్రాన్‌లను, చేపలను—ముఖ్యంగా నీటి అడుగుభాగాన నివసించే చేపలను ఆహారంగా భుజిస్తాయి. ఆసియా డాల్ఫిన్‌లు జిజ్ఞాసను కల్గించేలా నోటి నుండి నీటిని చిమ్మే ప్రక్రియ మసకగా ఉండే నీళ్ళలో చేపలను వేటాడేందుకు సహాయపడుతుందని కొందరు శాస్త్రజ్ఞులు ఊహిస్తున్నారు.
మిగతా డాల్ఫిన్‌లలాగే, ఇరావాడీలు కూడా శబ్దాలను చేస్తాయి. మ్యూజియమ్ ఆఫ్ ట్రాపికల్ క్వీన్స్‌ల్యాండ్‌కు చెందిన డా. పీటర్ అర్నోల్డ్, “జయ ఆన్‌కొల్ ఓషియానేరియమ్‌లో చేసిన పరిశోధన ప్రకారం, ఇరావాడీ డాల్ఫిన్ మిగతా డాల్ఫిన్‌లలాగే శబ్దాలనుపయోగించి వాటి ప్రతిధ్వనుల ద్వారా తమ ఎర ఎక్కడుందో కనిపెడుతుంది” అని తేజరిల్లు!తో చెప్పాడు.
దానికి భవిష్యత్తుందా?
ప్రపంచంలో ఎన్ని ఇరావాడీలున్నాయో శాస్త్రజ్ఞులకు తెలియదు. కాని అవి అంతరించిపోయే అపాయంలో ఉన్నాయన్న చింత మాత్రం అధికంగా ఉంది. ఆగ్నేయ ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో వాటి సంఖ్యలు తగ్గిపోతున్నాయి. మిగతా ప్రాంతాల్లో అయితే, ఇంక కొంత కాలం గడిస్తే మచ్చుకైనా కనిపించవు.
అది ముఖ్యంగా చెట్లను నరికివేసే పనులు, దాని సంబంధంగా కలిగే కాలుష్యమూ మరియు నదుల్లో బురద పేరుకుపోవడం వలనా జరుగుతుంది. ఆస్ట్రేలియాలో ఇరావాడీ ప్రాంతంలోని అధిక భాగం సాపేక్షికంగా చూస్తే నిర్మానుష్యంగానే ఉంది. అయితే తూర్పు తీరంలోని మరింత ఆకర్షణీయమైన ప్రదేశాలను నగరాలుగా మార్చడమూ, టూరిజమూ నష్టాన్ని కలుగజేస్తున్నాయి. కొన్ని ఇరావాడీలు జాలరుల వలల్లోనూ, మరికొన్ని ఈతగాళ్ళకు రక్షణగా ఉండేందుకని సముద్ర తీరానికి సమీపంలో ఉంచిన షార్క్ వలల్లోను చిక్కుకున్నాయి. ఇరావాడీ డాల్ఫిన్‌ల ఆహారమైన చేపలను అతిగా పట్టడంవల్ల ఇరావాడీల సంఖ్య కూడా బాధించబడుతుంది.
అయితే, అన్నింటికన్నా అతి పెద్ద ప్రమాదకారి నదుల్లోకీ, నీటిపోటుగల నదీ ముఖాల్లోకి పారవేయబడుతున్న కలుషితం చేసే పదార్థాల పరిమాణం అధికం కావడమే కావచ్చు. పర్యావరణంలో ఎక్కువ సేపు ఉండేటువంటి పాలిక్లోరినేటెడ్ బైఫినైల్స్ (పి.సి.బిలు) వంటి సంయోజక సేంద్రీయ మిశ్రమాలు అన్నింటికన్నా ప్రమాదకరమైనవి. పిసిబిలు విద్యుత్ అంశాల్లో, పెయింట్లలో, లూబ్రికెంట్లలో, కలప మరియు లోహాలు, మరితర ఉత్పత్తుల కొరకు తయారు చేసే కోటింగులలో ఉపయోగించబడుతున్నాయి.
ఇక అనుకూలమైన కోణానికి వస్తే, ఆస్ట్రేలియన్ నేచర్ కన్సర్వేషన్ ఏజెన్సీ ద యాక్షన్ ప్లాన్ ఫర్ ఆస్ట్రేలియన్ సెటాసియన్స్ అనే తమ డాక్యుమెంట్‌లో ఇలా పేర్కొంది: “క్వీన్స్‌ల్యాండ్‌లో ఉండే అనేక [ఇరావాడీ డాల్ఫిన్‌లు] ద గ్రేట్ బారియర్ రీఫ్ మరైన్ పార్క్‌వారి పర్యవేక్షణలో ఉన్నాయి; కనుక క్వీన్స్‌ల్యాండ్ జలాల్లో ఉన్న ఇరావాడీలు మనగల్గే అవకాశాలు బాగా ఉన్నాయి.”
మంచి మ్యానేజ్‌మెంట్‌కు మరో మెట్టుగా, హమ్ప్‌బ్యాక్ వేల్, దక్షిణ రైట్ వేల్, బాటిల్ నోస్డ్ డాల్ఫిన్‌లతోపాటు ఇరావాడీలను కూడా జనప్రచార కార్యక్రమాల్లో ప్రాథమిక జాతుల శ్రేణిలో చేర్చాలని ఆ ఏజెన్సీ సిఫారసు చేస్తోంది. అది ఇరావాడీ డాల్ఫిన్‌లకూ, అలాగే మనకూ శ్రేయస్కరమైనదిగా ఉంటుంది.
[21వ పేజీలోని చిత్రసౌజన్యం]
ఫోటోలు: Courtesy Dr. Tony Preen