మినియేచర్ బుక్‌ల ఆసక్తికరమైన లోకం
బ్రిటన్‌లోని తేజరిల్లు! విలేఖరి ద్వారా
అత్యున్నత పర్వతం, అతి లోతైన మహాసముద్రం, అత్యంత ఎత్తైన కట్టడం, అత్యధిక పొడవు గల సొరంగం—అతిగా కనిపించే విషయాలన్నీ జిజ్ఞాస కలిగించేవే. మరి అతి చిన్నపుస్తకం విషయమేమిటి? మినియేచర్ బుక్‌లు ఆసక్తికరంగా ఉంటాయి మరి! కనీసం 20 భాషల్లో అర్థం చేసుకోగల ప్రతి విషయంపై లక్షలాది మినియేచర్ బుక్‌లు ముద్రించబడ్డాయి. వాటి లోకాన్ని మీరింతవరకూ పరికించనట్లయితే, ఇప్పుడు ఒకసారి చూడండి.
ఒక మినియేచర్ బుక్‌ను మనమెలా నిర్వచించవచ్చు? పుస్తకం పొడవులోగానీ, వెడల్పులోగానీ 76 మిల్లీమీటర్లను మించని పరిమాణమే అంగీకృత ప్రమాణం. మరీ పట్టింపుగా సేకరించే కొందరు వ్యక్తులు కేవలం పుస్తకంలోని పేజీలను మాత్రమే గణనలోకి తీసుకుంటున్నప్పటికీ, ఈ కొలతల్లో బైండింగ్ కూడా ఇమిడి ఉంది. ఈ మినియేచర్ సంపుటులను ఎందుకు ముద్రించినట్లు?
కళా రూపాలు
ఒకరు అనుకునేదానికి భిన్నంగా, మినియేచర్ బుక్‌లు చాలామట్టుకు చదివేందుకు వీలుగానే ఉంటాయి. మినియేచర్ పంచాంగాలు, సాహిత్య పాఠ్యపుస్తకాలు, నవలలు, నాటకాలు, నిఘంటువులు, పరిశుద్ధ లేఖనాలను పెద్ద శ్రమలేకుండా వెంట తీసుకువెళ్ళవచ్చు, ఉపయోగించవచ్చు. సంవత్సరాల క్రితం ఇలాంటి చిన్ని సంపుటులను సొంతం చేసుకోవడానికి పైది ప్రాథమిక కారణమైతే, వాటిని సేకరించే ఆధునిక వ్యక్తి మినియేచర్ బుక్‌ల విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్న మరో కారకం: వాటిని ముద్రించి, బైండ్ చేసినవారి నిపుణతే.
భూతద్దం సహాయంతోగానీ, దాని సహాయం లేకుండాగానీ చదవగల్గేలాంటి అచ్చును రూపొందించేందుకూ, తయారు చేసేందుకూ ముద్రించేవాళ్ళు చాలా సాంకేతిక సమస్యలను అధిగమించాల్సి వచ్చింది. వాళ్ళ పనిలో చాలాభాగం పుస్తకాలు మరింత అందంగా ఉండేందుకు దోహదపడింది. కాగితం, సిరా ఉత్పత్తిదారులు కూడా ముద్రించిన పేజీలు తాజాగా, శుభ్రంగా స్పష్టంగా ఉండేలా నిశ్చయపరచుకునేందుకు తమ నిపుణతలను వెచ్చించారు.
ఒక పుస్తకం ముద్రించబడిన తర్వాత, అది బైండ్ చేయబడుతుంది; మినియేచర్ బుక్‌ల బైండింగ్‌లు అద్భుతంగా ఉంటాయి. చేతిపనులు చేసేవారి నైపుణ్యాలు చిన్ని పుస్తకాల మంచి ఆకృతినిచ్చిన లెదర్‌తో చేసిన కవరులో, దాని మీద బంగారం లేదా వెండి పూత అలంకరణలో, అలంకరించిన తాబేలు పెంకుల్లో, లేదా పూతలోనూ కనిపిస్తాయి. కొన్నింటి కవర్లు సిల్క్‌తో, వెల్వెట్‌తో చేయబడి ఉంటాయి, లేదా ఎంబ్రాయిడరీ చేసి ఉంటాయి, లేదా ముత్యాలతో లేదా చమ్కీలతో కూడా అలంకరించబడి ఉంటాయి. కొన్ని పుస్తకాలకు భద్రతనిచ్చే తొడుగులు కూడా ఉంటాయి.
చిత్రకారులు పుస్తకంలోని పేజీల మీద ఏడు చదరపు సెంటీమీటర్లకన్నా తక్కువ చోటులో నమ్మలేనంత విశదమైన చిత్రాలను వేసి పాఠ్యభాగాలను సోదాహరణగా చూపారు! ఒక ఉదాహరణ, 1890లలో ముద్రించబడిన 368 పేజీల బ్రైస్ తమ్బ్ ఇంగ్లీష్ డిక్షనరీలో ఇంగ్లీష్ నిఘంటు రచయితయైన డా. సామ్యేల్ జాన్‌సన్ చిత్రం; మరొకటి, 1909లో ఇంగ్లీష్ నటి ఎలన్ టెరీకి అంకితం చేసిన షేక్‌స్పియర్ వ్రాసిన కింగ్ రిచర్డ్ IIIలోని ప్రకాశకుల పేజీకి అభిముఖంగా ఉన్న చిత్రం.
నెపోలియన్ బోనాపార్ట్ తన సైనిక ఉద్యమకాలంలో వెంట తీసుకువెళ్ళిన మినియేచర్ గ్రంథాలయం, పారిస్‌లో ప్రచురించబడిన బీబ్లీయొటక్ పొర్టాటీవ్ డ్యూ వాయాగోర్ అని తలంచబడుతుంది. దాని 49 సంపుటుల ఫ్రెంచ్ సాహిత్యం చర్మతొడుగుగల పెట్టెలో ఉంచబడింది. దాన్ని తాళం వేసినప్పుడు పెద్ద పేజీల పుస్తకంలా కనిపిస్తుంది.
తమ్బ్ బైబిళ్ళు
తమ్బ్ బైబిళ్ళు పూర్తి బైబిళ్ళయి ఉండాలని లేదు. కొన్ని “క్రొత్త నిబంధనలు” మాత్రమే. ఇతర తమ్బ్ బైబిళ్ళలో పిల్లలు చదివేందుకు తయారు చేసిన బైబిలు కథల సారాంశాలు లేదా దాదాపు 7,000 మాటల్లో క్లుప్తమైన మొత్తం బైబిలు చరిత్ర మాత్రమే ఉంటాయి. వాటి పేర్లు ఇలా ఉన్నాయి, ద బైబిల్ ఇన్ మినియేచర్, ద హిస్టరీ ఆఫ్ ద హోలీ బైబిల్, ద చైల్డ్స్ బైబిల్.
తమ్బ్ బైబిలుకు ఆ పేరు ఎలా వచ్చింది? దాని స్పష్టమైన వివరణ ఏమిటంటే, ఆ బైబిలు మానవుని బొటనవ్రేలు యొక్క పై భాగం కన్నా కాస్త పెద్దదిగా ఉంటుంది. త్రీ సెంచ్యురీస్ ఆఫ్ తమ్బ్ బైబిల్స్ అనే పుస్తకం తెలిపేదేమిటంటే, జెనరల్ టామ్ తమ్బ్ అనే పేరున ప్రఖ్యాతిగాంచిన అమెరికా మరుగుజ్జు అయిన చార్ల్స్ స్ట్రాటన్ ఇంగ్లండ్ దర్శించిన తర్వాతే ఈ పేరు రూపుదాల్చి ఉంటుంది. టామ్ తమ్బ్ 1844లో ఇంగ్లండ్ సందర్శించాడన్న వాస్తవమూ, “తమ్బ్ బైబిల్” అన్న పదం మొదటిసారిగా లండన్‌లో 1849లో ఉపయోగించినట్లనిపించిందన్న వాస్తవమూ పై వాదనకు బలాన్నిస్తున్నాయి.
అసాధారణ లేఖన సంపుటులు
చిన్ని పుస్తకాల లోకంలో జిజ్ఞాస కలిగించే మరో పుస్తకం ఈ శతాబ్దారంభంలో ముద్రించబడిన ద ఫింగర్ న్యూ టెస్టమెంట్. ఇది కేవలం మూడు సెంటీమీటర్ల వెడల్పూ, తొమ్మిది సెంటీమీటర్ల పొడవు—వ్రేలి పొడవు ఉంటుంది. అందుకే దానికా పేరు. అయినప్పటికీ దీనిని అలాంటి బైబిళ్ళ కోవలోకే వర్గీకరించినప్పటికీ, ఇది పొడవులో 76 మిల్లీమీటర్లకన్నా ఎక్కువే ఉంటుంది కనుక, కచ్చితంగా చెబితే మినియేచర్ బుక్ కాదు. ఈ చిన్న సంపుటిలో ఉపయోగించబడిన 4 పాయింట్ టైప్ సైజ్ చాలా స్పష్టంగా ఉంటుంది. భూతద్దం లేకుండానే దానిని సులభంగా చదవవచ్చు.
ద ఇలస్ట్రేటెడ్ బైబిల్ అనేది అసాధారణమైన ఉదాహరణ. అందులో స్వర్గానికి రైల్వే అనే కవిత ఉంది. అది బ్రిటన్‌లో రైల్వేలు ఆరంభమైన కాలఘట్టంలో 50 కన్నా ఎక్కువ సంవత్సరాలు ముద్రించబడింది. “మీకు మరో లైన్‌ను చూపించేందుకు” అనే రెండు పేజీల కవిత వ్రాసిన రచయిత రైల్వే గురించి వ్రాసి బాగా డబ్బు సంపాదించాడు. ఆ మరో లైన్ “యెహోవా కుమారుడైన యేసు క్రీస్తు”ను సూచించింది. “నా కుమారుడా నీ హృదయాన్ని నాకివ్వు. త్వరపడు.—లేకపోతే ట్రెయిన్ వెళ్ళిపోతుంది అని దేవుడు అంటాడు” అనే మాటలతో ఆ కవిత ముగుస్తుంది.
1900వ సంవత్సరంలోని, మై మార్నింగ్ కౌన్సిలర్ కూడా అసాధారణ సంపుటే. అందులో ప్రతిరోజు చదవవలసిన బైబిలు వచనముంది. ప్రతి నెల ముందు దైవికనామం యొక్క ఏదో ఒక రూపం ఉండేది. ఉదాహరణకు ఫిబ్రవరి నెల ముందు “యెహోవా-షాలోమ్” అనే నామవాచకం ఉపయోగించబడింది. ఈ పుస్తకమూ, మరియు ముందు పేర్కొన్న ద ఇలస్ట్రేటెడ్ బైబిల్ అనే పుస్తకమూ, వంద సంవత్సరాల క్రితం బ్రిటన్‌లో, దేవుని నామమైన యెహోవాను ఉపయోగించడమన్నది సర్వసాధారణంగా ఉండేదన్న వాస్తవాన్ని చూపిస్తున్నాయి.
అతి చిన్నదా?
అనేక శతాబ్దాలుగా అనేక పుస్తకాలని గురించి, ఫలానిది అతి చిన్నదని వాదించబడింది. హేతుబద్దమైన మొదటి వాదన 1674లో, సి. వాన్ లాంగా వ్రాసిన బ్లూమ్‌హుఫ్య అనే పుస్తకం చిన్న టైప్‌లో ముద్రించబడినప్పుడు జరిగింది. అది “చేతి గోరు పరిమాణం”లో ఉన్నట్లు మినియేచర్ బుక్స్ వర్ణించింది. ఆ రికార్డ్ 200 కన్నా ఎక్కువ సంవత్సరాలు కొనసాగింది.
డాంటె వ్రాసిన ప్రఖ్యాత లా డీవీనా కామేడ్‌యా సంపుటి, 2 పాయింట్ టైప్‌లో ముద్రించబడింది. ఆ టైప్ ఇంతవరకు ఉపయోగించబడినవాటన్నిటిలోకెల్లా చిన్నటైప్ అని తలంచబడింది. అది నగ్న నేత్రాలకు కనిపించడం చాలా కష్టం. ఆ పుస్తకం 1878లో ఇటలీలోని పాడ్వాలో ఉత్పత్తి చేయబడింది. అందులోని 30 పేజీలు ముద్రించేందుకు ఒక నెల పట్టింది. ప్రతి క్రొత్త పదానికి క్రొత్త అచ్చు అవసరమయ్యేది. ఇంతైనా కూడా, 1,000 ప్రతులు ముద్రించబడ్డాయి.
సైజ్ తగ్గించడం కొనసాగింది. 1978లో, స్కాట్‌లాండ్‌లోని పేస్‌లీ పట్టణంలో ఉన్న గ్లెనిఫర్ ప్రెస్ ప్రచురించిన త్రీ బ్లైండ్ మైస్ అనే నర్సరీ రైమ్ “ప్రపంచంలోని అతి చిన్న పుస్తకం” అయ్యింది. చాలా తక్కువ సంఖ్యలో ముద్రించబడిన ఈ సంపుటి స్థానం, 1985లో అదే ప్రచురణ కర్తలు ఓల్డ్ కింగ్ కోల్! అనే మరో నర్సరీ రైమ్‌ల 85 కాపీలను తయారు చేయడంతో పోయింది. ప్రతి ప్రతికి ఒక మిల్లీమీటర్ బై ఒక మిల్లీమీటర్ కొలతే ఉండేది. సూదిమొన సహాయంతోనే దాని పేజీలను త్రిప్పగలం!
ఇలాంటి మరీ చిన్న పుస్తకాలు, “ధూళి పరిమాణానికి మించవు” అని లూయస్ బుండీ చేసిన వర్ణన దానిని తయారుచేసినవారి చెప్పలేనంత సహనానికీ, హస్తకళా నైపుణ్యానికీ రుజువులనిస్తున్నాయి. అయినప్పటికీ, చదవగల, వెంటనే ఉపయోగించగల పుస్తకాలను ఉత్పత్తి చేయాలన్న మినియేచర్ పుస్తకం యొక్క అసలు సంకల్పాన్ని మించిపోతున్నాయి.
ఈ ఆనందకరమైన మినియేచర్ సంపుటుల చక్కని సేకరణలు మ్యూజియమ్‌లలో కనిపిస్తాయి. మరనేక సంపుటులు అనేక వ్యక్తుల కైవశంలో ఉన్నాయి. మీరు వాటి ఆసక్తికరమైన లోకంలోకి ప్రవేశించేటప్పుడు, ఈ చిన్ని పుస్తకాలను చాలా జాగ్రత్తగా ఉపయోగించాలన్న విషయాన్ని గుర్తుంచుకోండి. నిజానికి అవి కళా రూపాలు!
[23వ పేజీలోని బాక్సు/చిత్రం]
ఫోటోమెకానికల్ రిడక్షన్
అతి చిన్న “క్రొత్త నిబంధన”ను 1895లో స్కాట్‌లాండ్‌లోని గ్లాస్‌గోలోని డేవిడ్ బ్రైస్ ఉత్పత్తి చేశాడు. దాని కొలత 1.9 సెంటీమీటర్లు బై 1.6 సెంటీమీటర్లు. దాని మందం కేవల 0.8 సెంటీమీటర్లు! ఇలా ముద్రించడం ఎలా సాధ్యమైంది? “ఫోటోమెకానికల్ రిడక్షన్‌లో దీన్ని చక్కగా, చాలా స్పష్టంగా ముద్రించడం జరిగింది” అని మినియేచర్ బుక్స్‌లో లూయస్ బుండీ వివరిస్తున్నాడు. వంద సంవత్సరాల క్రితం, ఫోటోగ్రఫీ దాని శైశవ దశలో ఉన్నప్పుడు దీనిని సాధించడం అంత స్వల్పమైన విషయం కాదు.
డేవిడ్ బ్రైస్ కూడా ఇదే పద్ధతిని ఉపయోగించి అనేక తమ్బ్ పూర్తి బైబిళ్ళను ముద్రించాడు. చిన్న అక్షరాలను చదవడం ఇబ్బందిగా ఉండేవారిని ఉద్దేశించి ప్రతి బైబిలులోని కవర్ బైండింగ్ లోపల చిన్ని భూతద్దం ఉండేది. చదవాలన్న పట్టుదలగలవారికి ఈ సహాయకంతో చదవడం సాధ్యమయ్యేది.
ఫోటోగ్రాఫికల్‌గా కుదించి ముద్రించిన ప్రచురణలు రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో నాజీలచేత హింసించబడినప్పుడూ, మరియు తర్వాత కమ్యూనిస్టుల చేత హింసించబడినప్పుడు యెహోవాసాక్షులకు సౌకర్యప్రదమయ్యాయన్న విషయం గమనార్హం. ఇక్కడున్న చిత్రాల్లో కనిపిస్తున్న బైబిలు పఠన సహాయకం ఈ పద్ధతిలోనే ముద్రించబడింది. దీన్ని అగ్గిపెట్టెలో పెట్టి, నాజీ కాన్‌సెంట్రేషన్ క్యాంపులో ఉన్న సాక్షులకు దొంగచాటుగా చేరవేయడం జరిగింది.
దీన్ని అగ్గిపెట్టెలో పెట్టి, కాన్‌సెంట్రేషన్ క్యాంపుకు దొంగచాటుగా చేరవేయడం జరిగింది
[22వ పేజీలోని చిత్రం]
మినియేచర్ పుస్తకాలు చిన్నవైనప్పటికీ చదవగల్గేవే
[24వ పేజీలోని చిత్రం]
మినియేచర్ పుస్తకాల గ్రంథాలయం