స్త్రీలనూ, వారి పనినీ మెచ్చుకోవడం
మూడు వేల సంవత్సరాల క్రితం, లెమూయేలు అనే ఒక వ్యక్తి సామర్థ్యంగల భార్యను గురించిన ఉజ్జ్వలమైన వర్ణనను వ్రాశాడు. ఇది బైబిలు గ్రంథమైన సామెతలు 31వ అధ్యాయంలో లిఖించబడి ఉంది. ఆయన అంతగా పొగిడిన స్త్రీ ఎప్పుడూ బిజీగా ఉండేది. ఆమె తన కుటుంబ ఆలనాపాలనా చూసుకునేది. సంతస్థలాల్లో వ్యాపార వ్యవహారాలు చూసుకునేది. భూమిని అమ్మడం కొనడం వంటి పనులు చేసేది. తన కుటుంబ సభ్యుల కోసం దుస్తులను తయారు చేసేది. పొలాల్లో పని చేసేది.
ఈ స్త్రీని గురించి అలా తేలిగ్గా తీసుకోవడం జరగలేదు. ‘ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలంటారు. . . . ఆమె పెనిమిటి ఆమెను పొగుడుతాడు.’ అలాంటి భార్య నిధివంటిది. బైబిలు ఆమె “ముత్యముకంటె అమూల్యమైనది” అని చెబుతుంది.—సామెతలు 31:10-28.
లెమూయేలు సమయం నుండి, స్త్రీ పని మరింత సంక్లిష్టమయ్యిందే తప్ప ఎంత మాత్రమూ తగ్గలేదు. వారి 20వ శతాబ్దపు పాత్ర వాళ్ళు ఒకే సమయంలోనే భార్యలుగాను, తల్లులుగానూ, ఆయాలుగానూ, గురువులుగానూ, సంపాదించేవారుగానూ, రైతులుగానూ ఉండడాన్ని అవశ్యకం చేస్తోంది. లెక్కలేనంత మంది స్త్రీలు తమ పిల్లలకు కావలసినంత ఆహారం పెట్టేందుకుగానూ ఉదాత్తమైన త్యాగాలు చేస్తుంటారు. ఈ స్త్రీలందరూ కూడా ప్రశంసకూ, పొగడ్తకూ అర్హులు కారా?
స్త్రీలు సంపాదించేవారిగా
మునుపెన్నటికన్నా నేడు చాలా మంది స్త్రీలు తమ కుటుంబానికి మద్దతునివ్వడంలో సహాయపడేందుకు బయటికి వెళ్ళి పనిచేస్తున్నారు లేదా తమ కుటుంబానికి వాళ్ళే ఏకైక ఆసరాగా పనిచేస్తున్నారు. “స్త్రీలు చేసేది కేవలం ఇంటి పనే కాదు. ప్రపంచంలో ఎక్కడైనా సరే, ‘కేవలం గృహిణి’గా ఉంటున్నానని చెప్పగల స్త్రీలు సాపేక్షంగా చాలా తక్కువే” అని చెబుతున్న ఒక నివేదికను విమెన్ అన్డ్ ద వరల్డ్ ఎకనామిక్ క్రైసిస్ అనే పుస్తకం పేర్కొన్నది. స్త్రీల పని ఆకర్షణీయమైనదిగా ఉండడం అరుదు. పత్రికలూ, లేదా టెలివిజన్ ధారావాహికలు ఎంతో సౌకర్యప్రదమైన ఆఫీసుల్లో ఎగ్జిక్యూటివ్‌లుగా స్త్రీలను చిత్రీకరిస్తున్నప్పటికీ, వాస్తవం దానికి ఎంతో భిన్నంగా ఉంటుంది. ప్రపంచంలోని అధిక సంఖ్యాకులైన స్త్రీలు చాలా తక్కువ ప్రతిఫలానికి అనేక గంటలు కష్టపడి పనిచేస్తున్నారు.
కోట్లకొలది స్త్రీలు పొలంలో ధాన్యాలను పండిస్తూ, కొన్ని చిన్న తోటలను వేస్తూ, లేదా పశువులను మేపుతూ చాలా పని చేస్తారు. ప్రపంచంలోని సగం ఆహారధాన్యాలు వారి కాయకష్టం వల్లే పండించబడుతున్నాయి. కానీ వారికి చాలా తక్కువ కూలి ఇవ్వడం లేదా అసలు ఇవ్వకపోవడం జరుగుతుంది. “ఆఫ్రికాలో, 70 శాతం ఆహారధాన్యాలను స్త్రీలే పండిస్తున్నారు. ఆసియాలో 50 నుండి 60 శాతం, లాటిన్ అమెరికాలో 30 శాతం పంటను స్త్రీలే పండిస్తున్నారు” అని విమెన్ అన్డ్ ది ఎన్‌విరాన్‌మెంట్ నివేదిస్తుంది.
స్త్రీలకు జీతమిచ్చేటప్పుడు, సాధారణంగా మగవాళ్ళకు ఇచ్చేదానికన్నా తక్కువే ఇస్తారు, దానికి కారణం వాళ్ళు స్త్రీజాతికి చెందినవారు కావడమే. కుటుంబంలో తల్లే సంపాదించే వ్యక్తిగా అవ్వడం లోకంలో మరెక్కువ సాధారణమవుతోంది. ముఖ్యంగా అలాంటి తల్లులకు ఇలాంటి వివక్ష మింగుడుపడని చేదు విషయం అవుతోంది. ఆఫ్రికా, కరీబియన్, లాటిన్ అమెరికాలలో 30 నుండి 50 శాతం కుటుంబాలు తమ పోషణకర్తగా ముఖ్యంగా స్త్రీపైనే ఆధారపడుతున్నాయి. మరెక్కువ అభివృద్ధి చెందిన దేశాల్లో గూడా, ముఖ్య పోషణకర్తలుగా మారవలసివస్తున్న స్త్రీల సంఖ్య పెరుగుతోంది.
వర్థమాన దేశాలన్నింటిలో కూడా మారుమూలల్లో ఉన్న పేదరిక ప్రాంతాల్లో ఈ వైనం పెరిగిపోతుంది. తన కుటుంబాన్ని పోషించడం చాలా కష్టంగా ఉన్నట్లు కనుగొనే భర్త పని సంపాదించుకునేందుకు దగ్గర్లో ఉన్న నగరానికి లేదా మరో దేశానికి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. కుటుంబాన్ని చూసుకునే బాధ్యతను తన భార్యకు వదిలిపెట్టి వెళ్తాడు. తను ఉద్యోగం సంపాదించుకోగల్గితే, ఇంటికి చెక్కులు పంపిస్తాడు. అతనికి అలాంటి సదుద్దేశాలే ఉన్నప్పటికీ, తరచూ అలా జరుగదు. ఆయన వెళ్ళాక కుటుంబం మరింత పేదరికంలో మునిగిపోతుంది, వాళ్ళ క్షేమం ఇప్పుడు తల్లి మీద ఆధారపడి ఉంటుంది.
ఈ విషవలయం “పేదరికానికి స్త్రీత్వాన్ని కల్పించడం” అని సరిగానే వర్ణించబడింది. అది లక్షలాది మంది స్త్రీలపై పెద్ద భారాన్ని వేస్తుంది. “ప్రపంచవ్యాప్తంగా మూడింట ఒక వంతు కుటుంబాలు స్త్రీలు నడిపిస్తున్న కుటుంబాలేనని అంచనావేయబడుతుంది. మగవాళ్ళు నడిపించే కుటుంబాలకన్నా ఆ కుటుంబాలు మరెన్నో రెట్లు ఎక్కువ పేదరికంతో ఉన్నాయి, అలాంటి కుటుంబాల సంఖ్య పెరుగుతోంది” అని విమెన్ అన్డ్ హెల్త్ అనే పుస్తకం వివరిస్తుంది. పరిస్థితి అంత విషమంగా ఉంది. అయితే స్త్రీ ఎదుర్కోవలసిన సవాలు భోజనం అమర్చి పెట్టడం మాత్రమే కాదు.
తల్లులూ, గురువులూ
తల్లి పిల్లల భావోద్వేగ సంక్షేమాన్ని కూడా చూసుకోవలసిన అవసరం ఉంది. వాని శారీరక అవసరతలను తీర్చడం ఎంత ప్రాముఖ్యమో అంతే ప్రాముఖ్యమైన ప్రేమానురాగాలను గూర్చిన పాఠాలను నేర్చుకునేందుకు బిడ్డకు సహాయపడడంలో ఆమె ముఖ్య పాత్ర నిర్వహిస్తుంది. మంచి సమతుల్యత గల వయోజనుడుగా ఎదిగేందుకు, బిడ్డ పెరిగేటప్పుడు సౌహార్ద్రతగల, భద్రతగల పరిసరాలు అవసరం. దాంతో తల్లి పాత్ర మరింత జటిలమవుతుంది.
ద డెవలపింగ్ చైల్డ్ అనే పుస్తకంలో హెలన్ బీ ఇలా వ్రాస్తోంది: “సౌహార్ద్రత గల తల్లి వాత్సల్యాన్ని వ్యక్తం చేస్తుంది, తరచూ లేదా క్రమంగా బిడ్డ అవసరాలకు మొదటి స్థానం ఇస్తుంది, బిడ్డ చేసే పనుల్లో ఉత్సాహం చూపిస్తుంది, బిడ్డ అనుభూతుల ఎడల మార్దవంగా, సానుభూతితో ప్రతిస్పందిస్తుంది.” అలా శ్రద్ధ చూపించే తల్లినుండి అలాంటి సౌహార్ద్రతను పొందిన పిల్లలు తప్పకుండా తమ మెప్పుదలను చూపించాలి.—సామెతలు 23:22.
చాలా మంది తల్లులు చనుపాలివ్వడం ద్వారా పుట్టినది మొదలుకొని తమ బిడ్డకోసం వాత్సల్యపూర్వకమైన పరిసరాలను ఉంచుతారు. ముఖ్యంగా పేద కుటుంబాల్లో, తల్లి తన నవజాత శిశువుకు ఇవ్వగలిగిన అమూల్యమైన బహుమతి తన పాలే. (10-11 పేజీల్లోని బాక్సును చూడండి.) ఆసక్తికరంగా, అపొస్తలుడైన పౌలు థెస్సలొనీకలోని క్రైస్తవుల ఎడల తనకున్న ఆర్ద్రతతోకూడిన వాత్సల్యాన్ని “స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించునట్లు” అని పోల్చాడు.—1 థెస్సలొనీకయులు 2:7, 8.
తన పిల్లలను పోషించి, ప్రేమించడమే కాక, తరచూ తల్లే వాళ్ళ ముఖ్య గురువుగా ఉంటుంది. బైబిలు “నా కుమారుడా, నీ తండ్రి ఇచ్చే క్రమశిక్షణను ఆలకించు, నీ తల్లి శాసనాన్ని నిరాకరించకు” అని సలహా ఇస్తూ, పిల్లల విద్యాభ్యాసంలో తల్లుల విస్తృత పాత్రను సూచిస్తుంది. (సామెతలు 1:8, NW) బిడ్డ మాట్లాడడానికీ, నడవడానికి, ఇంటిపనులు చేయడానికీ, మరెన్నో లెక్కలేనన్ని కార్యాలను ఎంతో ఓర్పుతో నేర్పించేది ముఖ్యంగా తల్లీ లేదా అమ్మమ్మ/నానమ్మే.
సానుభూతి చాలా అవసరం
స్త్రీలు తమ కుటుంబ సభ్యులకు ఇవ్వగల అతి గొప్ప బహుమతుల్లో ఒకటి సానుభూతే. కుటుంబంలోని ఒకరికి వంట్లో బాగులేనప్పుడు, అమ్మ తన మిగతా బాధ్యతలనన్నింటినీ నిర్వహిస్తూనే నర్సు పాత్రను కూడా నిర్వహిస్తుంది. “వాస్తవానికి, ప్రపంచంలో చాలామట్టుకు ఆరోగ్య సంరక్షణనిస్తున్నది స్త్రీలే” అని విమెన్ అన్డ్ హెల్త్ అనే పుస్తకం వివరిస్తుంది.
తన పిల్లలకు ఆహారం సరిపోయేందుకు గాను తల్లి తన వంతు తక్కువ తినడానికి కూడా ఆమె సానుభూతి ఆమెను పురికొల్పుతుంది. కొంతమంది స్త్రీలు తమకు కుపోషణ జరుగుతున్నప్పటికీ, తాము తీసుకునే ఆహారం సరిపోతున్నట్లే దృష్టిస్తారు అని పరిశోధకులు కనుగొన్నారు. తమ భర్తలకూ, పిల్లలకూ ఎక్కువ వంతు ఇవ్వడం వాళ్ళకు బాగా అలవాటైనందువల్ల, తాము పనిచేయగలిగినంత కాలం కూడా తాము కావలసినంత భుజించినట్లు భావిస్తారు.
కొన్నిసార్లు స్థానిక పర్యావరణం సంబంధంగా తనకు కలిగిన చింతలో కూడా స్త్రీ సానుభూతి వ్యక్తమౌతుంది. అనావృష్టి, ఎడారిగా మారడం, అటవీ నిర్మూలన అనేవి భూమిని నిస్సారంగా చేసినప్పుడు తను కూడా కష్టపడవలసి వస్తుంది గనుక, పర్యావరణం కూడా ఆమెకు ప్రాముఖ్యమైనదే. ఇండియాలోని ఒక పట్టణంలో ఉన్న స్త్రీలు సమీపాన ఉన్న అడవిలోని దాదాపు 2,500 చెట్లను కలప కంపెనీ నరకబోతుందని తెలుసుకున్నప్పుడు ఉగ్రులైపోయారు. ఆహారం, ఇంధనం, పశువుల మేత సంబంధంగా వాళ్ళకు ఆ చెట్ల అవసరం ఉంది. చెట్లను నరికేవాళ్ళు ఆ స్థలానికి చేరుకునే సరికి స్త్రీలు అప్పటికే, చెట్లను కాపాడేందుకుగానూ రెండు చేతులతో చెట్టును పట్టుకుని నిలబడ్డారు. ‘మీరు చెట్లను నరికేయాలనుకుంటే, మా తలలను నరికివేయవలసి ఉంటుంది’ అని ఆ స్త్రీలు చెట్లు నరికేవారితో అన్నారు. అలా ఆ అడవి రక్షించబడింది.
“ఆమెకు అర్హమైన ప్రతిఫలం రావాలి”
సంపాదించే వ్యక్తిగా, తల్లిగా, గురువుగానైనా లేదా సానుభూతికి నెలవుగానైనా సరే, తాను చేస్తున్నదాన్నిబట్టి గౌరవానికి, గుర్తించబడడానికి స్త్రీ యోగ్యురాలు. సామర్థ్యం గల భార్యను గురించి అంత ఉన్నతంగా మాట్లాడిన జ్ఞానియైన ఈ లెమూయేలు స్త్రీ పనికి, ఆమె ఉపదేశానికి విలువనిచ్చాడు. వాస్తవానికి, ఆయన సందేశంలోని ఎక్కువ భాగం అతనికి అతని తల్లి ఇచ్చిన నిర్దేశంలోనిదేనని బైబిలు వివరిస్తోంది. (సామెతలు 31:1) శ్రద్ధగల భార్యను, తల్లిని తేలికగా కొట్టిపారెయ్యకూడదని లెమూయేలుకు నమ్మకం కుదిరింది. “ఆమెకు అర్హమైన ప్రతిఫలం రావాలి. ఆమె చేసిన విషయాల కోసం ప్రజలు ఆమెను బహిరంగంగా ఘనపర్చాలి.”—సామెతలు 31:31, పరిశుద్ధ బైబల్.
అయినప్పటికీ, లెమూయేలు ఆ దృక్కోణాలను నమోదు చేసినప్పటికీ, అవి కేవలం మానవ ఆలోచనా సరళి యొక్క ప్రతిబింబం కాదు. అవి దేవుని వాక్యమైన బైబిలులో నమోదు చేయబడ్డాయి. “లేఖనాలన్ని దైవావేశం వల్లే కలిగినవి.” (2 తిమోతి 3:16, పరిశుద్ధ బైబిల్) ఆ వాక్యభాగాలు మనకు నిర్దేశంగా ఉండేలా అవి బైబిలులో ఉండేలా దేవుడే ప్రేరేపించాడు గనుక, స్త్రీల విషయంలో సర్వశక్తిమంతుడైన దేవుని దృక్కోణమేమిటో భావోద్వేగంతో కూడిన ఆ ప్రస్తావనలు ప్రతిబింబిస్తున్నాయి.
అంతేకాక, భర్తలు “[తమ భార్యలను] గౌరవించాలి” అని దైవావేశము వలన కలిగిన వాక్యం పేర్కొంటోంది. (1 పేతురు 3:7, పరిశుద్ధ బైబల్) “ప్రతి పురుషుడును తననువలె తన భార్యను ప్రేమింపవలెను,” అని ఎఫెసీయులు 5:33లో భర్తకు చెప్పబడుతుంది. నిజానికి, ఎఫెసీయులు 5:25 ఇలా చెబుతుంది: “పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి, . . . దానికొరకు తన్నుతాను అప్పగించుకొనెను.” అవును, క్రీస్తు తన అనుచరుల కోసం చనిపోవడానికి కూడా ఇష్టపడడం ద్వారా వారి మీద తనకు అలాంటి ప్రేమ ఉందని వ్యక్తం చేశాడు. ఆయన భర్తల కోసం ఎంత చక్కని, నిస్వార్థపు మాదిరినుంచాడు! యేసు నేర్పించినటువంటి, తన జీవితంలో అనుసరించినటువంటి ప్రమాణాలు దేవుని ప్రమాణాలను ప్రతిబింబించాయి. ఆ ప్రమాణాలు మన ప్రయోజనార్థం బైబిలులో లిఖించబడ్డాయి.
అయితే, స్త్రీలు అనేక రంగాల్లో శ్రమపడుతున్నప్పటికీ, తాము చేసినదానికి ప్రశంసనందుకోవడమన్నది చాలా మంది స్త్రీల విషయంలో చాలా అరుదైన విషయం. వాళ్ళు తమ పరిస్థితిని ఇప్పుడైనా ఎలా మెరుగుపర్చుకోవచ్చు? అలాగే, వాళ్ళను గూర్చిన దృక్పథం మారే అవకాశం ఏమైనా ఉందా? స్త్రీల కొరకైన భవిష్యత్ నిరీక్షణలేమిటి?
[10, 11వ పేజీలోని బాక్సు/చిత్రం]
ఒక స్త్రీ తన పరిస్థితిని మెరుగుపర్చుకోగల మూడు మార్గాలు
విద్యాభ్యాసం. ప్రపంచంలో దాదాపు 60 కోట్లమంది స్త్రీలు నిరక్షరాస్యులే—వారిలో అనేకులకు బడికి వెళ్ళే అవకాశం ఎన్నడూ దొరకలేదు. మీరూ అంతగా చదువుకోకపోయి ఉండవచ్చు. కానీ దానర్థం మీకై మీరు విద్యనభ్యసించలేరని కాదు. అది అంత సులభం కానప్పటికీ, చాలా మంది స్త్రీలు ఈ విషయంలో సఫలీకృతులయ్యారు. “వయోజనులు అక్షరాస్య నిపుణతలను సంపాదించుకోవాలని ప్రేరేపించబడడంలో మతసంబంధ కారణాలు చాలా ముఖ్య పాత్రను నిర్వహించగలవు” అని విమెన్ అన్డ్ లిటెరసీ అనే పుస్తకం వివరిస్తుంది. మీరు బైబిలు చదవగల్గడం మీరు చదువు నేర్చుకోవడం వలన కలిగే గొప్ప ప్రతిఫలం. అయితే మరెన్నో ప్రయోజనాలున్నాయి.
అక్షరాస్యురాలైన తల్లికి ఆర్థికంగా మంచి అవకాశాలు ఉండడమే కాక, మంచి ఆరోగ్య అలవాట్లను గురించి ఆమె నేర్చుకోగలదు కూడా. ఇండియాలోని కేరళ రాష్ట్రం అక్షరాస్యత వలన కలిగే ప్రయోజనాలను నాటకీయంగా సోదాహరణంగా చెబుతుంది. ఆదాయం సంబంధంగా చూస్తే, ఈ ప్రాంతంలోని ఆదాయం దేశంలోని సగటు ఆదాయం కన్నా తక్కువే అయినా, ఇక్కడ 87 శాతం మంది స్త్రీలు అక్షరాస్యులే. ఆసక్తికరంగా, ఇక్కడి శిశు మరణ రేటు అనేది ఇండియాలోని మిగతా చోట్లకన్నా ఐదు రెట్లు తక్కువే; సగటున, స్త్రీలు 15 సంవత్సరాల ఎక్కువ కాలం జీవిస్తారు; ఆడపిల్లలందరూ బడికి వెళ్తారు.
సహజంగానే, అక్షరాస్యురాలైన తల్లి నేర్చుకునే ప్రక్రియను తన పిల్లల్లో అలవరుస్తుంది—ఈ పని ఏ మాత్రం అల్పమైనది కాదు. ఆడపిల్లల విద్యాభ్యాసం ఉత్తమమైన పెట్టుబడి వంటిది. కుటుంబ ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు, స్త్రీలు తమ జీవన పరిస్థితులను మెరుగుపర్చేందుకూ దానికున్నంత శక్తి దేనికీ లేదని ఐక్యరాజ్య సమితి పిల్లల నిధి (యూనిసెఫ్) ప్రచురణయైన ద స్టేట్ ఆఫ్ ద వరల్డ్స్ చిల్డ్రన్ 1991 పేర్కొంటోంది. ఆ విషయంలో ఏ మాత్రం సందేహం లేదు. చదివే వ్రాసే నిపుణతలు మీరు మేలైన తల్లిగా పోషణకర్తగా ఉండేందుకు సహాయపడతాయి.a
ఆరోగ్యం. ఒక తల్లిగా, మీరు మీ విషయంలో శ్రద్ధ తీసుకోవాలి, మీరు గర్భిణియైతే లేదా బిడ్డకు పాలిస్తున్నట్లయితే చెప్పనక్కర్లేదు. మీరు మీ ఆహారాన్ని తీసుకునే విధానాన్ని మెరుగుపర్చుకోగలరా? ఆఫ్రికాలోని, అలాగే, దక్షిణ మరియు పశ్చిమ ఆసియాల్లోని దాదాపు మూడింట రెండవవంతు గర్భిణీల్లో రక్తహీనత ఉన్నట్లు పరీక్షలు తేల్చాయి. రక్తహీనత మీ శరీరంలోని శక్తిని లేకుండా చేయడమే కాక, శిశుజనన సంబంధమైన ప్రమాదాలను అధికం చేస్తుంది, మలేరియా వచ్చే సాధ్యతను అధికం చేస్తుంది. మాంసమూ, లేదా చేపలూ అంతగా లభ్యం కానప్పటికీ, లేదా ఖరీదైనవైనప్పటికీ, గ్రుడ్లు మరియు ఇనుము సమృద్ధిగా ఉన్న పండ్లు లేదా కూరగాయలు లభ్యమౌతుండవచ్చు. పోషకాహారాన్ని తీసుకోకుండా ఉండేందుకు మీ మూఢనమ్మకాలను అనుమతించకండి. కుటుంబంలో మీ వంతు ఆహారాన్ని మీ దగ్గర నుండి తీసివేయడానికి స్థానిక ఆచారాలను అనుమతించకండి.b
చనుపాలివ్వడం మీకూ మీ బిడ్డకూ మంచిది. చనుపాలు మరే ప్రత్యామ్నాయం కన్నా చౌకైనవి, మరింత శుభ్రమైనవి, మరింత పోషణకరమైనవి. తల్లులు తమ పిల్లలకు వారి మొదటి నాలుగు నెలల నుండి ఆరు నెలల వరకూ చనుపాలు ఇస్తే ప్రతి సంవత్సరం పది లక్షల పిల్లల మరణాలను నివారించవచ్చని యూనిసెఫ్ అంచనా వేస్తుంది. అయితే తల్లికి అంటువ్యాధి ఉంటే, అది చనుపాల ద్వారా బిడ్డకు సంక్రమించేదైతే, సురక్షితమైన ప్రత్యామ్నాయాన్ని ఉపయోగించాలి.
మీరు మీ ఇంట్లో పొయ్యి మీద వంట చేస్తున్నప్పుడు గాలి ప్రసరణ సరిగ్గా ఉందా లేదా అన్నది నిశ్చయపరచుకోవాలి. “వంట చేస్తున్నప్పుడు వచ్చే పొగకు, విషవాయువులకు గురికావడం బహుశా నేటి వృత్తి సంబంధ ఆరోగ్య ప్రమాదాల్లోకెల్లా అతి గంభీరమైన ప్రమాదమై ఉండవచ్చు” అని విమెన్ అన్డ్ హెల్త్ అనే పుస్తకం హెచ్చరిస్తోంది.
ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ, పొగ త్రాగకండి. వర్థమాన దేశాల్లో ప్రబలంగా ఉన్న సిగరెట్ ప్రకటనలు స్త్రీలను లక్ష్యంగా చేస్తూ, పొగత్రాగడం జ్ఞానయుక్తమని వాళ్ళను నమ్మించడానికి ప్రయత్నిస్తున్నాయి. అంతకన్నా అబద్ధం ఇంకొకటుండదు. పొగ మీ పిల్లలకు హానికరం కాగలదు, మిమ్మల్ని చంపగలదు. చివరికి పొగత్రాగేవారిలో నాలుగింట ఒక వంతు మంది తమ ధూమపాన వ్యసనం వల్లే చనిపోతారు. అంతేకాక, మొదటిసారిగా సిగరెట్ త్రాగే వ్యక్తి పొగాకు వ్యసనపరుడయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పారిశుద్ధ్యం. పారిశుద్ధ్యం విషయంలో మీరుంచే మాదిరీ, మీ సలహా మీ కుటుంబ ఆరోగ్యానికి చాలా ప్రాముఖ్యమైనవి. ఫ్యాక్ట్స్ ఫర్ లైఫ్ అనే ప్రచురణ మంచి పారిశుద్ధ్యం కొరకైన ప్రాథమిక చర్యలను గురించి ఈ క్రింది విధంగా చెబుతుంది:
• మల విసర్జన తర్వాతా, ఆహార పదార్థాలను ముట్టుకునే ముందూ నీటినీ సబ్బునూ ఉపయోగించి మీ చేతులను కడుక్కోండి. మీ పిల్లలు భోజనానికి ముందు చేతులు కడుక్కునేలా చూడండి.
• టాయ్‌లెట్‌ను ఉపయోగించండి, దాన్ని శుభ్రంగా ఉంచండి, దాన్ని మూసివేయండి. అది సాధ్యం కానట్లైతే, మీ ఇంటికి సాధ్యమైనంత దూరంలో మల విసర్జనకు వెళ్ళి, విసర్జనను వెంటనే నేలలో పాతివెయ్యండి.—పోల్చండి ద్వితీయోపదేశకాండము 23:12, 13.
• మీ కుటుంబం కోసం శుభ్రమైన నీళ్ళను ఉపయోగించడానికి కృషి చెయ్యండి. అందుకోసం బావులను మూసి ఉంచండి, నీళ్ళను తీసుకురావడానికి శుభ్రమైన బిందెలనే ఉపయోగించండి.
• సురక్షితమైన త్రాగునీరు దొరకని పరిస్థితైతే, నీళ్ళను కాగబెట్టి, త్రాగడానికి ముందు చల్లారనివ్వండి. కాగబెట్టని నీళ్ళు శుభ్రంగా కనిపించినప్పటికీ, అవి అపరిశుభ్రంగా ఉండగల సాధ్యత ఉంది.
• సరిగా ఉడకని ఆహారం ఇన్ఫెక్షన్‌కు కారణం కాగల అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందని జ్ఞాపకముంచుకోండి. పచ్చిగా తినే ఆహార పదార్థాలను తినే ముందు శుభ్రంగా కడిగి, సాధ్యమైనంత వెంటనే తినాలి. మిగతా ఆహార పదార్థాలు, ముఖ్యంగా మాంసమూ, కోడి మాంసమూ బాగా ఉడకాలి.
• ఆహార పదార్థాన్ని కీటకాలు గానీ, జంతువులు కానీ అపరిశుభ్రం చేయకుండా ఉండేందుకు శుభ్రంగా ఉంచి, మూసిపెట్టాలి.
• ఇంట్లో చెత్తను కాల్చడమో పాతిపెట్టడమో చేయండి.c
[అధస్సూచీలు]
a తమ విస్తృత బైబిలు విద్యాభ్యాస కార్యక్రమంలో భాగంగా యెహోవాసాక్షులు ఉచిత అక్షరాస్య తరగతులను సంస్థీకరిస్తారు.
b కొన్ని దేశాల్లో, స్త్రీలు గర్భిణిలుగా ఉన్నప్పుడు చేపలను, గ్రుడ్లను, లేదా కోడి మాంసాన్ని తినకూడదనీ, అవి గర్భస్థ శిశువుకు హానికరం కాగలవనీ మూఢనమ్మకాలు చెబుతాయి. మగవాళ్ళూ, మగ పిల్లలూ తినగా మిగిలిన దాన్నే ఆడవాళ్ళు తినాలని కొన్ని ఆచారాలు చెబుతాయి.
c మరెక్కువ వివరాల కోసం తేజరిల్లు! ఏప్రిల్ 8, 1995, 6-11 పేజీలను చూడండి.
[8వ పేజీలోని చిత్రం]
పాశ్చాత్య ప్రపంచంలోని అనేక మంది స్త్రీలు ఆఫీసుల్లో పని చేస్తున్నారు
[9వ పేజీలోని చిత్రం]
చాలా మంది స్త్రీలు అపరిశుభ్రమైన పరిస్థితుల్లో పనిచేయడం తప్పనిసరౌతుంది
[క్రెడిట్ లైను]
Godo-Foto
[9వ పేజీలోని చిత్రం]
ఇంట్లో గురువులు తల్లులే