స్త్రీల ఎడల వివక్ష
పశ్చిమ ఆఫ్రికాలోని ఒక వ్యాపారి తొమ్మిదేండ్ల బిడ్డను కొనుక్కుంటాడు. ఆసియాలో నవజాత శిశువు ఎడారి ఇసుకలో సజీవంగా పాతిపెట్టబడింది. ఒక ప్రాచ్యదేశంలో ఇప్పుడిప్పుడే నడక నేర్చుకుంటున్న ఒక బిడ్డ అనాధాశ్రయంలో పస్తులుండి—అవాంఛితమైనదిగా, అశ్రద్ధచేయబడి—చనిపోతుంది. ఈ విషాద ఘటనల్లో ఉమ్మడిగా ఉన్న విషయమేమిటంటే: బాధితులందరూ ఆడపిల్లలే. వాళ్ళు ఆడపిల్లలై పుట్టినందుకే అనవసరమైనవారిగా పరిగణించబడ్డారు.
ఇవి అరుదైన సంఘటనలేమీ కావు. ఆఫ్రికాలో వేలకొలది బాలికలు, యువతులు దాస్యానికి అమ్మబడ్డారు, కొందరిని 15 డాలర్ల మాత్రపు వెలకు అమ్మడం జరిగింది. ప్రతి సంవత్సరం లక్షల కొలది అమ్మాయిలు, ఎక్కువగా ఆసియాలోని అమ్మాయిలు వేశ్యావృత్తికి అమ్మివేయబడుతున్నారు, లేదా బలవంతం చేయబడుతున్నారని నివేదించబడింది. మరీ ఘోరంగా, అనేక దేశాల్లోని జనాభా ఏమి సూచిస్తుందంటే, 10 కోట్ల మంది అమ్మాయిలు “కనిపించడం లేదు.” ముఖ్యంగా గర్భస్రావం, శిశుహత్య, లేదా ఆడశిశువులను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్లే ఇలా జరుగుతుందన్నది స్పష్టం.
ఎంతోకాలంగా—శతాబ్దాలుగా, అనేక దేశాల్లో స్త్రీజాతి ఇలాగే దృష్టించబడుతూ వచ్చింది. కొన్ని స్థలాల్లో ఇప్పటికీ అలాగే జరుగుతుంది. ఎందుకని? ఎందుకంటే, అలాంటి దేశాల్లో, అబ్బాయిలకు మరింత విలువ ఇవ్వబడుతోంది. అబ్బాయైతే వంశాన్ని నిలబెట్టగలడనీ, ఆస్తిని వారసత్వంగా పొందగలడనీ, తల్లిదండ్రులు వృద్ధులైనప్పుడు చూసుకుంటాడనీ—ఈ దేశాల్లో చాలామటుకు వృద్ధులకు ప్రభుత్వ పెన్షన్ ఇవ్వబడదు—అక్కడి వాళ్ళు నమ్ముతారు. “ఒక ఆడపిల్లని పెంచడమంటే, పొరుగువాళ్ళ తోటలోని మొక్కకు నీళ్ళు పోయడమే” అని ఒక తెలుగు సామెత చెబుతుంది. ఆమె ఎదిగిన తర్వాత, పెళ్ళి చేసుకుని అందరినీ విడిచి వెళ్ళిపోతుంది లేదా వేశ్యావృత్తిలోకి అమ్మబడవచ్చు కూడా. అలా వృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ విషయంలో ఆమె ఏ మాత్రం సహాయపడలేదు.
చిన్న వంతు
పేదరికం పట్టిపీడిస్తున్న దేశాల్లో, ఈ దృక్పథం వల్ల కుటుంబంలో ఆడపిల్లలకు, తక్కువ తిండి, తక్కువ ఆరోగ్య సంరక్షణ, తక్కువ చదువు లభిస్తాయి. ఆసియాలోని ఒక దేశంలో కుపోషణకు గురయ్యే కేవలం 5 శాతం మంది అబ్బాయిలను పోల్చితే, అమ్మాయిల శాతం 14 అని పరిశోధకులు కనుగొన్నారు. కొన్ని దేశాల్లో ఆరోగ్య కేంద్రాలకు తీసుకురాబడిన ఆడపిల్లల సంఖ్యకంటే మగ పిల్లల సంఖ్య రెండు రెట్లు అధికంగా ఉంది అని ఐక్యరాజ్య పిల్లల నిధి (యూనిసెఫ్) నుండి వచ్చిన నివేదిక వివరిస్తోంది. ఆఫ్రికాలోనూ, అలాగే, దక్షిణ మరియు పశ్చిమ ఆసియాల్లోనూ 40 శాతం కన్నా ఎక్కువ మంది యువతులు నిరక్షరాస్యులే. “అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆడా మగా అన్న వివక్ష చాలా భయంకరంగా కొనసాగుతోంది” అని ఇటీవలనే చనిపోయిన, యూనిసెఫ్ మాజీ అంబాసడర్ అయిన ఆడ్రీ హెప్‌బర్న్ బాధపడ్డారు.
ఈ “ఆడా మగా అన్న వివక్ష” అమ్మాయిలు యౌవనంలోకి ప్రవేశించాక ఆగిపోదు. పేదరికం, హింస, అవిరామమైన కాయకష్టం అనేవే తరచూ స్త్రీల జీవితంగా ఉంటోంది. ఆమె ఒక స్త్రీ అన్నదే దానికి కారణం. ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ ఇలా వివరించాడు: “ప్రపంచంలో మూడింట రెండు వంతుల పనిని స్త్రీలు చేస్తారు. . . . అయినప్పటికీ, వాళ్ళు సంపాదించేది ప్రపంచ ఆదాయంలో పదింట ఒక వంతు మాత్రమే. వాళ్ళకు సొంతంగా ఉండే ఆస్తి ప్రపంచ ఆస్తిలో కేవలం ఒక శాతం మాత్రమే. ప్రపంచంలోని పేదవారిలో అతి పేదవారు వారే.”
ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం, ప్రపంచంలోని కడుబీదరికంలో జీవిస్తున్న 130 కోట్ల ప్రజల్లో 70 శాతం కన్నా ఎక్కువ మంది స్త్రీలే. “అది మరీ విషమించిపోతోంది. మారుమూల ప్రాంతాల్లోని, పూర్తి దారిద్ర్యంలో జీవిస్తున్న స్త్రీల సంఖ్య గత రెండు దశాబ్దాల్లో దాదాపు 50 కన్నా ఎక్కువ శాతం పెరిగింది. పేదరికంలో ముఖ్యంగా జీవిస్తున్నది స్త్రీలే” అని ఆ నివేదిక జతచేస్తుంది.
అణిచివేసే పేదరికంకన్నా చాలా భయంకరమైనది హింసే. అది చాలా మంది స్త్రీల జీవితాలను నాశనం చేస్తుంది. పది కోట్ల మంది అమ్మాయిలు ముఖ్యంగా ఆఫ్రికాలోని అమ్మాయిలు అంగఛేదం వల్ల బాధపడుతున్నారు. మానభంగం సర్వవ్యాప్తంగా ఉన్న అత్యాచారం, కొన్ని దేశాల్లో ప్రతి ఆరుగురు స్త్రీలలో ఒకరు మానభంగం చేయబడ్డారని అధ్యయనాలు చూపిస్తున్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి కేసులు పూర్తిగా మరుగుచేయబడుతున్నాయి. యుద్ధాలు స్త్రీలనూ పురుషులనూ ఒకేలా బాధిస్తున్నప్పటికీ, తమ ఇండ్ల నుండి పారిపోవడానికి బలవంతపెట్టబడిన శరణార్థుల్లో ఎక్కువ మంది స్త్రీలు మరియు పిల్లలే.
మాతలు, ప్రదాతలు
కుటుంబ ఆలనాపాలనా చూసుకునే భారం పోషించే భారం తరచూ తల్లి మీదే ఎక్కువగా పడుతోంది. ఆమె అనేక గంటలు పనిచేస్తుంటుంది, కుటుంబాన్ని పోషించే ఏకైక వ్యక్తి ఆమే అయ్యుండవచ్చు. ఆఫ్రికాలోని కొన్ని మారుమూల ప్రాంతాల్లో, దాదాపు సగం కుటుంబాలను నడిపేది స్త్రీలే. పాశ్చాత్య ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో, చాలా మట్టుకు కుటుంబాలు స్త్రీలచేతే నడిపించబడుతున్నాయి.
అంతేకాక, ముఖ్యంగా వర్థమాన దేశాల్లో, పారంపర్యంగా, అతి శ్రమతోకూడిన పనులలో కొన్నింటిని—నీళ్ళనూ, వంటచెరకును తీసుకురావడం వంటి పనులను—స్త్రీలే చేస్తారు. చెట్లను కొట్టివేయడం వల్లా, మరీ అడవి ఖాళీ అయ్యేంతగా పశువులను అతిగా మేయించడం వల్లా ఈ పనులు మరింత కష్టతరం అయ్యాయి. కొన్ని అనావృష్టి బాధిత దేశాల్లో, ప్రతిరోజూ, స్త్రీలు వంట చెరకు కోసం మూడు లేదా అంత కన్నా ఎక్కువ గంటలూ, నీళ్ళను తీసుకురావడానికి నాలుగు గంటలూ గడుపుతారు. శ్రమతోకూడిన ఈ పనులు పూర్తయిన తర్వాతే, ఇంట్లో అయినా, పొలంలో అయినా వాళ్ళు చేయాలని నిరీక్షించబడే పనిని చేయనారంభించగలుగుతారు.
స్పష్టంగా, జీవితమంటే, పేదరికమూ, ఆకలీ లేదా చేదు అనుభవమూ మాత్రమే అనేటువంటి అవస్థలో ఉన్న దేశాల్లో స్త్రీపురుషులిరువురూ బాధలననుభవిస్తున్నారు. కానీ స్త్రీలే ఎక్కువగా కష్టపడతారు. ఈ పరిస్థితి ఎప్పుడైనా మారుతుందా? అన్నిచోట్లా ఉన్న స్త్రీలు గౌరవించబడే, పరిగణించబడే రోజు వస్తుందని నిరీక్షించగలమా? ఇప్పుడు స్త్రీలు తమ పరిస్థితిని మెరుగుపరచుకోగల్గేందుకు చేయగల్గిందేమైనా ఉందా?
[5వ పేజీలోని బాక్సు/చిత్రం]
వేశ్యలైన బాలికలు—ఎవరిని నిందించాలి?
ప్రతి సంవత్సరం పది లక్షల మంది పిల్లలు—ఎక్కువగా ఆడపిల్లలే—వేశ్యావృత్తిలోకి బలవంతపెట్టబడుతున్నారు లేదా దానికి అమ్మివేయబడుతున్నారు. ఆగ్నేయాసియాలోని అరాయాa తన తోటి విద్యార్థినుల్లోని కొందరికి ఏమి సంభవించిందో గుర్తుచేసుకుంటుంది. “కుల్‌వాడీ తనకు కేవలం 13 ఏండ్లున్నప్పుడు వేశ్య అయ్యింది. ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి, కానీ వాళ్ళమ్మ తరచూ త్రాగేది, పేకాట ఆడేది. అలా తన కూతురు మీద శ్రద్ధ చూపేందుకు ఆమెకు సమయముండేది కాదు. కుల్‌వాడీ వాళ్ళమ్మ, ఆమెను మగవాళ్ళతో వెళ్ళి డబ్బు సంపాదించడానికి ప్రోత్సహించేది. మరీ ఎంతో కాలం కాక ముందే ఆ అమ్మాయి వేశ్యయైంది.
“సీవూన్ మా తరగతిలోని మరో విద్యార్థిని. ఆమె దేశం యొక్క ఉత్తర భాగం నుండి వచ్చింది. ఆమె వేశ్యగా పనిచేసేందుకు ఆమె తల్లిదండ్రులు ఆమెను రాజధానికి పంపినప్పుడు ఆమెకు కేవలం 12 ఏండ్లు. ఆమె తల్లిదండ్రులు సంతకం చేసిన కాంట్రాక్ట్ బాకీ తీర్చేందుకు ఆమె రెండు సంవత్సరాలు పనిచేయవలసి వచ్చింది. సీవూన్ మరియు కుల్‌వాడీల విషయం అరుదైనదేమీ కాదు—మా తరగతిలోని 15 మంది అమ్మాయిల్లో 5 మంది అమ్మాయిలు వేశ్యలయ్యారు.”
సీవూన్ మరియు కుల్‌వాడీ వంటి యువతులు లక్షల కొలది ఉన్నారు. “లైంగిక పరిశ్రమ అన్నది తన స్వప్రేరణగల పెద్ద మార్కెట్” అని అంటూ యునెస్కో (ఐక్యరాజ్య సమితి విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ) లోని వాసీలా టామ్‌సాలీ విచారిస్తున్నారు. “14 ఏండ్ల అమ్మాయిని అమ్మడం సర్వసాధారణం గనుక అది పాతబడిన విషయం.” లైంగిక బానిసత్వానికి ఈ అమ్మాయిలను ఒకసారి అమ్మిన తర్వాత, వాళ్ళను అమ్మిన ఖరీదును చెల్లించడమన్నది దాదాపు అసాధ్యంగానే ఉంటుంది. మంజుకు 12 ఏండ్లున్నప్పుడు ఆమెను వాళ్ళ నాన్న అమ్మేశాడు. ఏడు సంవత్సరాలు వేశ్యాపని చేసిన తర్వాత కూడా ఇంకా 12,000 రూపాయల అప్పు ఉంది. “నేను చేయగల్గింది ఏమీ లేదు—నేను చిక్కుకుపోయాను” అని ఆమె వివరిస్తోంది.
తమను బానిసలుగా చేసిన వేశ్యాగృహ యజమానులను తప్పించుకోవడం ఎంత కష్టంగా ఉంటుందో ఆ అమ్మాయిలు ఎయిడ్స్‌ను తప్పించుకోవడం కూడా అంతే కష్టంగా ఉంటుంది. ఈ బాలికా వేశ్యల్లో 33 శాతం మందికి ఎయిడ్స్ వైరస్ ఉన్నట్లు ఆగ్నేయ ఆసియాలో నిర్వహించిన సర్వే సూచిస్తుంది. 5 కోట్ల డాలర్ల ఈ వేశ్యా పరిశ్రమ వర్థిల్లుతూనే ఉన్నంతకాలం, ఈ అమ్మాయిలు ఈ కష్టాలను అనుభవిస్తూనే ఉంటారు.
ఈ భయంకరమైన సంప్రదాయానికి ఎవరిని నిందించాలి? స్పష్టంగా, అమ్మాయిలను వేశ్యావృత్తికి కొనుక్కునేవాళ్ళూ, అమ్మేవాళ్ళూ ఎక్కువగా నిందార్హులు. అయితే, తమ కామాన్ని తృప్తిపరచుకునేందుకు అమ్మాయిలను వాడుకునే నీచులైన మగవారిని కూడా ఇందుకు ఖండించవలసిందే. ఇలాంటి అనైతిక పనులు చేసేవాళ్ళు లేకపోతే, ఈ అమ్మాయిల వేశ్యావృత్తి ఉనికిలోనే ఉండదు.
[అధస్సూచి]
a పేర్లు మార్చబడ్డాయి.
ప్రతి సంవత్సరం, దాదాపు పది లక్షల మంది అమ్మాయిలు వేశ్యావృత్తిలోకి దిగేందుకు బలవంతపెట్టబడుతున్నారు
[6వ పేజీలోని బాక్సు/చిత్రం]
మధ్యాఫ్రికాలో ఒక స్త్రీ పనిదినం
ఒక స్త్రీ ఉదయం ఆరుగంటలకు లేచి, కుటుంబం కోసమూ, తన కోసమూ ఉదయకాల ఆహారాన్ని తయారు చేస్తుంది. కాసేపయ్యాక వాళ్ళు దాన్ని భుజిస్తారు. సమీపంలో ఉన్న నది నుండి నీళ్ళు తెచ్చిన తర్వాత, తాను పనిచేసే పొలానికి ఆమె వెళ్తుంది—అక్కడికి వెళ్ళేందుకు గంట సేపు నడవవలసి ఉండవచ్చు.
మధ్యాహ్నం నాలుగు గంటల దాకా పొలం దున్నుతుంది, కలుపుమొక్కలను తీసివేస్తుంది, లేదా పొలానికి నీళ్ళు పెడుతుంది. తను తెచ్చుకున్న భోజనం తినేటప్పుడు మాత్రమే కాసేపు పని ఆపుతుంది. పగలు మిగిలిన రెండు గంటలు కట్టెలను కొట్టేందుకూ, కుటుంబం కోసం కసావా ఆకులను లేదా ఇతర కూరగాయలను సేకరించేందుకూ ఉపయోగిస్తుంది—వాటినన్నింటినీ తనే ఇంటికి మోసుకువెళ్తుంది.
సాధారణంగా, సూర్యుడు అస్తమిస్తున్నప్పుడే ఆమె ఇంటికి చేరుకుంటుంది. ఇప్పుడు ఆమెకు రాత్రి భోజనం తయారు చేసే పని ఉంది. దానికి రెండు లేదా అంత కన్నా ఎక్కువ గంటలు పట్టవచ్చు. ఆదివారాలు స్థానిక నదిలో బట్టలు ఉతికి, అవి ఆరిన తర్వాత ఇస్త్రీ చేస్తుంది.
ఆమె భర్త ఆమె పడే శ్రమను మెచ్చుకోవడమైనా, ఆమె ఇచ్చే సలహాలను ఆలకించడమైనా అరుదు. అలా ఆమె నేలను సేద్యానికి సిద్ధం చేయగలిగేందుకుగానూ, ఆయన చెట్లను నరికివేయడానికి లేదా క్రిందవున్న పొదలను కాల్చివేయడానికి పెద్ద ఇబ్బందేమీ పడడు. కానీ ఆయన అంతకన్నా ఎక్కువ ఇంకేమీ చేయడు. అప్పుడప్పుడు ఆయన తన పిల్లలను స్నానానికని నది దగ్గరకు తీసుకువెళ్తాడు, మహా అంటే కాస్త వేటాడడమూ, చేపలు పట్టడమూ చేస్తాడేమో. కానీ రోజులో ఎక్కువ సమయం గ్రామంలోని మిగతా మగవాళ్ళతో కబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తాడు.
కొన్ని సంవత్సరాల తర్వాత, భర్త తనకు వీలైతే, ఇంటికి మరో క్రొత్త, యౌవన భార్యను తెస్తాడు. ఆయన తన ప్రేమనంతా ఆమె మీదే ఒలకబోస్తాడు. అయితే, అతని మొదటి భార్య తనకు జబ్బు చేసే వరకు, లేదా చనిపోయే వరకు ఎల్లవేళలా పనిచేస్తూనే ఉండాలని నిరీక్షించబడుతుంది.
ఆఫ్రికా స్త్రీలు చాలా పెద్ద పనిభారాన్ని మోస్తున్నారు