కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g98 2/8 పేజీలు 4-8
  • వెళ్ళనివ్వడానికి నేర్చుకోవడం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వెళ్ళనివ్వడానికి నేర్చుకోవడం
  • తేజరిల్లు!—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బాధ్యతాయుతంగా ఉండేలా పిల్లలకు నేర్పించడం
  • ప్రేమగా తప్పుదిద్దడం
  • జీవనము కొరకైన విద్యాభ్యాసం
  • పసితనంనుండే మీ పిల్లవానికి తర్ఫీదునివ్వండి
    కుటుంబ సంతోషానికిగల రహస్యము
  • తల్లిదండ్రులారా—మీ పిల్లలకు ప్రేమతో శిక్షణనివ్వండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • మీ పిల్లలకు యెహోవాను ప్రేమించడం నేర్పించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • ఆధ్యాత్మికంగా బలమైన కుటుంబాన్ని నిర్మించుకోవడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
మరిన్ని
తేజరిల్లు!—1998
g98 2/8 పేజీలు 4-8

వెళ్ళనివ్వడానికి నేర్చుకోవడం

“యౌవనకాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములవంటివారు” అని బైబిలు కీర్తన రచయిత వ్రాశాడు. (కీర్తన 127:4) బాణము యాధృచ్చికంగా దాని గమ్యాన్ని చేరుకోదు. దాన్ని జాగ్రత్తగా గురిపెట్టాలి. అదే విధంగా, పిల్లలు తల్లిదండ్రుల నడిపింపు లేకుండా బాధ్యతగల వయోజనులయ్యే గమ్యాన్ని చేరుకోకపోవచ్చు. “బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు” అని బైబిలు ఉద్బోధిస్తుంది.—సామెతలు 22:6.

బాల్యకాలపు ఆధారపడే స్థితి ఒక్కరాత్రిలోనే యౌవనపు స్వతంత్ర స్థితిలోనికి మారదు. కనుక, పిల్లలు తమకై తామే నిలిచేలా చేసే తర్ఫీదును పిల్లలకు ఎప్పటి నుండి ఇవ్వాలి? అపొస్తలుడైన పౌలు తిమోతి అనే పేరుగల యౌవనస్థునికి ఇలా గుర్తుచేశాడు: “క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసముద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధలేఖనములను బాల్యము [“శైశవం,” NW] నుండి నీవెరుగుదువు.” (2 తిమోతి 3:14, 15) తిమోతి తల్లి అతడు శిశువుగా ఉన్నప్పటి నుండే ఆయనకు ఆధ్యాత్మిక తర్ఫీదునివ్వనారంభించిన విషయాన్ని మనోనేత్రాలతో చూడండి!

మరి, చిన్నారి శిశువులు ఆధ్యాత్మిక తర్ఫీదు నుండి ప్రయోజనం పొందగలిగినట్లయితే, యుక్తవయస్సు కొరకు సిద్ధం చేసే తర్ఫీదును పిల్లలకు సాధ్యమైనంత త్వరగా ఇవ్వడం సహేతుకం కాదా? అందుకు ఒక మార్గం ఏంటంటే, బాధ్యతాయుతంగా ఉండేందుకు, సొంతంగా నిర్ణయాలు తీసుకునేందుకూ వాళ్ళకు నేర్పడమే.

బాధ్యతాయుతంగా ఉండేలా పిల్లలకు నేర్పించడం

బాధ్యతాయుతంగా ఉండేందుకు మీ పిల్లలను మీరెలా ప్రోత్సహించగలరు? తమ కుమార్తె గురించి జాక్‌, నోరా అనే దంపతులు ఇలా గుర్తు చేసుకుంటున్నారు: “ఆమె నడక ఆరంభించినప్పటి నుండే, సాక్సులను, చిన్న చిన్న వస్తువులను తన పడకగదిలోకి తీసుకెళ్ళి వాటిని సరైన సొరుగులో ఉంచడం నేర్చుకుంది. ఆటవస్తువులను పుస్తకాలను అవి ఉంచవలసిన చోటే ఉంచడం కూడా నేర్చుకుంది.” ఇవి చిన్న ఘట్టాలు మాత్రమే. అయితే బిడ్డ అప్పటికే బాధ్యతాయుతమైన నిర్ణయాలను తీసుకోవడం నేర్చుకోనారంభించింది.

బిడ్డ పెరుగుతున్న కొలది, బహుశా, ఆమె/ఆయనకు మరి కొంత బరువైన బాధ్యతలను అప్పజెప్పవచ్చు. ఆబ్రా మరియు ఆనీటాలు తమ కూతురు పెంపుడు కుక్కను పెంచుకోవడానికి అనుమతించారు. ఆ కుక్కను చూసుకునే బాధ్యతంతా ఆ చిన్నారిదే. ఆ పాప తనకివ్వబడిన డబ్బులో కొంత ఆ కుక్క బాగోగులను చూసుకోవడంకోసం ఇచ్చేది. తమ బాధ్యతలను నిర్వహించేలా పిల్లలకు తర్ఫీదునిచ్చేందుకు ఓపిక అవసరం. అయితే, అది వారి భావోద్వేగ ఎదుగుదలకు ప్రయోజనకరంగానూ, తోడ్పడేదిగానూ ఉంటుంది.

పిల్లలకు బాధ్యతను నేర్పించడంలో ఇంటి పనులు మరో అవకాశాన్నిస్తాయి. కొంత మంది తల్లిదండ్రులు పిల్లలు సహాయకరంగా ఉండే బదులు చికాకు కలిగిస్తారనే ఉద్దేశంతో కుటుంబ కర్తవ్యాల నుండి వాళ్ళను దాదాపుగా పూర్తిగా తప్పిస్తారు. తమ పిల్లలు ‘తాము బాల్యంలో అనుభవించినదాని కన్నా శ్రేష్ఠమైనదాన్ని అనుభవించాలి’ అనే నిర్ణయానికి ఇతరులు వస్తారు. అది సరికాదు. “ఒకడు తన దాసుని చిన్నప్పటినుండి గారాబముగా పెంచినయెడల తుదిని వాడు కుమారుడుగా ఎంచబడును [“కృతఘ్నుడుగా తయారౌతాడు,” NW]” అని లేఖనాలు చెబుతున్నాయి. (సామెతలు 29:21) ఈ పాఠ్యాంశంలోని సూత్రం పిల్లలకు తప్పకుండా వర్తిస్తుంది. ఒక యౌవనస్థుడు యుక్తవయస్సులో అడుగుపెట్టేసరికి “కృతఘ్నుడు”గా మాత్రమే కాక, ఇంటి పనుల్లో అతి చిన్న పనిని కూడా చేయలేని అసమర్థుడుగా కూడా తయారవుతాడు.

బైబిలు కాలాల్లోని యౌవనస్థులకు సాధారణంగా ఇంటి పనులు అప్పజెప్పబడేవి. ఉదాహరణకు, 17 ఏండ్ల లేత ప్రాయంలో, యౌవనస్థుడైన యోసేపు తమ కుటుంబం యొక్క గొర్రెల మందను చూసుకునే బాధ్యతలో పాలుపంచుకున్నాడు. (ఆదికాండము 37:2) అతని తండ్రి యొక్క గొర్రెల మంద చాలా పెద్దది కనుక, ఆయనకు అప్పజెప్పబడినది అంత చిన్నపనేమీ కాదు. (ఆదికాండము 32:13-15) యోసేపు శక్తిమంతుడైన నాయకుడయ్యేంతగా ఎదిగినదాని దృష్ట్యా, ఈ చిన్ననాటి తర్ఫీదు ఆయన వ్యక్తిత్వాన్ని అనుకూలమైన విధంగా మలచడంలో ఎంతో తోడ్పడిందన్నది అసంభవమైన విషయమేమీ కాదు. ఇశ్రాయేలుకు భావి రాజైన దావీదుకు కూడా తను యౌవనస్థుడిగా ఉన్నప్పుడు తమ కుటుంబం యొక్క గొర్రెలమందను చూసుకునే పని అప్పగించబడింది.—1 సమూయేలు 16:11.

నేడు తల్లిదండ్రులు నేర్చుకోగల పాఠమేమిటి? మీ పిల్లలకు అర్థవంతమైన ఇంటి పనులను అప్పజెప్పండి. శుభ్రం చేయడమూ, వంటపనీ, ఇంటి పరిసరాలను చక్కగా ఉంచడమూ, ఇంటినీ, వాహనాన్నీ బాగుచేయడమూ వంటి పనుల్లో భాగం వహించేందుకు సమయం తీసుకుని, శ్రమ తీసుకుని ఓపికతో మీ పిల్లలకు నేర్పించవచ్చు. నిజమే, బిడ్డ వయస్సూ మరియు సామర్థ్యాల మీద కూడా ఎంతో ఆధారపడి ఉంటుంది. అయితే, ‘స్కూటర్‌ను బాగు చేయడంలో నాన్నకు సహాయపడడంలో’ గానీ లేదా ‘వంట పనిలో అమ్మకు సహాయం చేయడంలో’ గానీ చిన్న పిల్లలు కూడా సాధారణంగా భాగం వహించవచ్చు.

పిల్లలకు ఇంటి పనులు నేర్పేందుకు తల్లిదండ్రులు గొప్ప బహుమతిని, అంటే తమ సమయాన్ని ఇవ్వవలసిన అవసరముంది. పిల్లలకు తర్ఫీదునివ్వడంలోని విజయ రహస్యమేమిటని ఇద్దరబ్బాయిల తల్లిదండ్రులను అడగడం జరిగింది. వాళ్ళు దానికి “సమయం, సమయం, సమయం!” అని జవాబిచ్చారు.

ప్రేమగా తప్పుదిద్దడం

పిల్లలు తమ పనులను చక్కగా చేసినప్పుడు, లేదా చక్కగా చేయాలని కనీసం ప్రయత్నమైనా చేసినప్పుడు వారిని ఉదారమైన, యథార్థమైన మెచ్చుకోలుతో ప్రోత్సహించండి! (పోల్చండి మత్తయి 25:21.) నిజమే, పిల్లలు పెద్దవాళ్ళు చేసేంత సవ్యంగా పనులను చేయడం అరుదే. పిల్లలు తమ సొంత నిర్ణయాలు చేసుకోవడానికి అనుమతించినప్పుడు తరచూ వాళ్ళు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. కానీ మీరు అతిగా ప్రతిస్పందించకుండా ఉండేందుకు జాగ్రత్తపడండి. పెద్దవారైన మీరు తప్పులు చేయలేదా? మరి మీ బిడ్డ తప్పులు చేసినప్పుడు మీరు సహిష్ణుతను ఎందుకు చూపించకూడదు? (పోల్చండి కీర్తన 103:13.) తప్పులను వదిలిపెట్టండి. నేర్చుకోవడంలో అదీ భాగమేనని దృష్టించండి.

మైకిల్‌ షూల్‌మాన్‌ అనే రచయిత మరియు ఈవా మెక్‌లర్‌ అనే రచయిత్రి ఇలా అన్నారు: “స్నేహభావంతో వ్యవహరించబడిన పిల్లలు తాము స్వతంత్రంగా చర్యను గైకొంటే శిక్షించబడతామని భయపడరు.” అయితే, “ఉదాసీనంగా లేదా కఠినంగా వ్యవహరించే తల్లిదండ్రుల పిల్లలు అప్పటికప్పుడు ఎలాంటి చర్యలను గైకొనవలసి ఉన్నా, సహాయకరమైనవైనా సరే భయపడతారు. ఎందుకంటే, తాము చేసిన పనుల్లో తమ తల్లిదండ్రులు తప్పు పడతారని, విమర్శిస్తారని లేదా తమను శిక్షిస్తారని భయపడతారు.” ఈ వ్యాఖ్యానం “మీ పిల్లల మనస్సు క్రుంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి” అని తల్లిదండ్రులకు బైబిలు ఇస్తున్న హెచ్చరికకు అనుగుణ్యంగా ఉంది. (కొలొస్సయులు 3:21) పిల్లవాని ప్రయత్నాలు అనుకున్నంతగా సఫలం కానట్లయితే, వాడు కనీసం ప్రయత్నించడమైనా చేసినందుకు వాడ్ని మెచ్చుకోవచ్చుకదా? ఈ సారి ఇంకాస్త బాగా చేసేందుకు వాడ్ని ప్రోత్సహించండి. వాడి పురోభివృద్ధి మీకు ఆనందాన్నిస్తుందని వాడికి తెలియనివ్వండి. మీరు వాడిని ప్రేమిస్తూనే ఉంటారని హామీ ఇవ్వండి.

అవును, కొన్నిసార్లు దిద్దుబాటు అవసరమౌతుంది. పిల్లలు తమ సొంత గుర్తింపును సంపాదించుకోవాలనీ, తమ వ్యక్తిత్వాన్ని అందరూ అంగీకరించేలా చేయాలని శ్రమించేటువంటి కౌమార ప్రాయంలో దిద్దుబాటు మరి ముఖ్యంగా అవసరమని రుజువవుతుంది. కనుక, వారిని ఎల్లప్పుడూ తిరుగుబాటుదారులుగా వ్యాఖ్యానించే బదులు స్వాతంత్ర్యాన్ని పొందాలనే వారి ప్రయత్నాలను తల్లిదండ్రులు అవగాహనతో దృష్టించడం జ్ఞానయుక్తం.

నిజమే, యౌవనస్థులు అప్పటికప్పుడు తోచినదానినిబట్టి ప్రవర్తించడానికి, లేదా “యౌవనేచ్ఛల”కు లోబడడానికి మొగ్గు చూపుతారు. (2 తిమోతి 2:22) యౌవనస్థుల ప్రవృత్తిపై పరిధులను పెట్టలేకపోతే అది పిల్లలకు భావోద్వేగ సంబంధంగా అపాయకరం కాగలదు; వాడు ఆత్మసంయమనాన్ని, స్వయంగా క్రమశిక్షణను ఇచ్చుకోవడాన్ని నేర్చుకోవడంలో విఫలుడౌతాడు. “అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును” అని బైబిలు హెచ్చరిస్తుంది. (సామెతలు 29:15) కానీ సరైన క్రమశిక్షణ ప్రేమపూర్వకంగా ఇవ్వబడితే అది ప్రయోజనకరంగా ఉండి, యుక్తవయస్సులోని అవసరాలనూ ఒత్తిళ్ళనూ ఎదుర్కొనేందుకు పిల్లవాడిని సిద్ధం చేస్తుంది. “బెత్తము వాడనివాడు తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును” అని బైబిలు బోధిస్తుంది. (సామెతలు 13:24) అయితే, క్రమశిక్షణనివ్వడమంటే బోధించడమూ, తర్ఫీదునివ్వడమూ. అంతేకానీ శిక్షించడం కాదని గుర్తుంచుకోండి. ఇక్కడ “బెత్తము” అనే పదం గొర్రెల కాపరులు తమ మందలను నడిపేందుకు ఉపయోగించే కర్రను సూచిస్తుంది. (కీర్తన 23:4) అది తీవ్రమైన క్రూరత్వానికి కాదు గానీ ప్రేమపూర్వక నడిపింపుకే ప్రతీకము.

జీవనము కొరకైన విద్యాభ్యాసం

మరిముఖ్యంగా పిల్లవాని విద్యాభ్యాసం విషయానికొచ్చినప్పుడు తల్లిదండ్రుల నడిపింపు మరెక్కువ అవసరం. మీ పిల్లవాని విద్యాభ్యాసంలో శ్రద్ధ తీసుకోండి. సముచితమైన విద్యాభ్యాస కోర్సులను ఎన్నుకునేందుకు, అదనపు విద్యాభ్యాసమేమైనా పొందాలా అనే విషయంలో బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకునేందుకూ వాడికి సహాయం చేయండి.a

నిజమే, అన్నింటికన్నా ముఖ్యమైన విద్యాభ్యాసం ఆధ్యాత్మిక విద్యాభ్యాసమే. (యెషయా 54:13) పెద్దవాళ్ళ ప్రపంచంలో మనుగడ సాగించేందుకు పిల్లలకు దైవిక విలువలు అవసరమౌతాయి. వాళ్ళ “వివేచించు . . . జ్ఞానేంద్రియముల”కు తప్పకుండా తర్ఫీదు ఇవ్వబడాలి. (హెబ్రీయులు 5:14) వాళ్ళకు ఈ విషయంలో సహాయం చేసేందుకు తల్లిదండ్రులు చాలా చేయగలరు. యెహోవాసాక్షుల కుటుంబాల్లోని వారు తమ పిల్లలతో బైబిలును క్రమంగా పఠించాలని ప్రోత్సహించబడ్డారు. శైశవం నుండే తిమోతికి లేఖనాలను బోధించిన ఆయన తల్లి మాదిరిని అనుసరిస్తూ సాక్షులైన తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు అలా బోధిస్తారు.

బార్‌బ్ర అనే పేరుగల ఒంటరి తల్లి కుటుంబ బైబిలు పఠనాన్ని తమ పిల్లలకు అత్యంత ఆహ్లాదకరమైన అనుభవంగా చేస్తుంది. “ఆ సాయంకాలం వాళ్ళకు ఇష్టమైన భోజనాన్నీ, వాళ్ళు ఆస్వాదించే డెసెర్ట్‌తో సహా తయారు చేసి పెట్టేలా నిశ్చయపరచుకుంటాను. సరైన వాతావరణం సృష్టించేందుకు కింగ్‌డమ్‌ మెలడీస్‌ పెడ్తాను. తర్వాత, ఆరంభ ప్రార్థన చేసి, మేము సాధారణంగా కావలికోట పత్రికను పఠిస్తాము. ఏదైనా ప్రత్యేక అవసరమున్నట్లయితే, నేను యౌవనస్థులు అడిగే ప్రశ్నలు—ఆచరణాత్మకమైన జవాబులుb (ఆంగ్లం) వంటి ప్రచురణలను ఉపయోగిస్తాను.” బార్‌బ్ర అభిప్రాయం ప్రకారం, “విషయాలను గురించిన యెహోవా దృక్కోణాన్ని పొందేందుకు” బైబిలు పఠనం ఆమె పిల్లలకు సహాయపడుతుంది.

పిల్లలకు దేవుని వాక్యమైన బైబిలు జ్ఞానాన్నీ, అవగాహననూ ఇవ్వడం కన్నా గొప్ప బహుమతి వేరే లేదు. అది ‘జ్ఞానములేని వారికి బుద్ధి కలిగించును యౌవనులకు తెలివియు వివేచనయు పుట్టించును.’ (సామెతలు 1:4) అలా సన్నద్ధుడైన, యుక్తవయస్సులోకి ప్రవేశించే పిల్లవాడు క్రొత్త ఒత్తిళ్ళను మరియు పరిస్థితులను ఎదుర్కోగల్గుతాడు.

అయినప్పటికీ, పిల్లలు వెళ్ళిపోవడం అనేక మంది తల్లిదండ్రుల జీవనరీతిలో పెద్ద మార్పునే తెస్తుంది. తర్వాతి శీర్షికలో వాళ్ళు బోసిపోయిన ఇంట్లో ఎలా విజయవంతంగా కొనసాగగలరో చర్చించబడుతుంది.

[అధస్సూచీలు]

a సెప్టెంబర్‌ 8, 1988 (ఆంగ్లం) సంచిక తేజరిల్లు!లో “తల్లిదండ్రులారా—మీకు కూడా హోమ్‌వర్క్‌ ఉంది!” అనే శీర్షిక పరంపరను చూడండి.

b వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించినది.

[6వ పేజీలోని చిత్రం]

“ఉదాసీనంగా లేదా కఠినంగా వ్యవహరించే తల్లిదండ్రుల పిల్లలు అప్పటికప్పుడు ఎలాంటి చర్యలను గైకొనవలసి ఉన్నా, అవి సహాయకరమైన చర్యలైనా సరే భయపడతారు. ఎందుకంటే, తాము చేసిన పనుల్లో తమ తల్లిదండ్రులు తప్పు పడతారని, విమర్శిస్తారని లేదా తమను శిక్షిస్తారని భయపడతారు.”—మైకిల్‌ షూల్‌మాన్‌ మరియు ఈవా మెక్‌లర్‌ వ్రాసిన బ్రింగింగ్‌ అప్‌ ఎ మోరల్‌ చైల్డ్‌ అనే పుస్తకం

[6వ పేజీలోని బాక్సు]

ఒంటరి తల్లులు/తండ్రులు—వెళ్ళనివ్వడంలోని సవాలు

రెబెకా అనే ఒంటరి తల్లి ఇలా అభిప్రాయపడుతుంది: “తమ పిల్లలను వెళ్ళనివ్వడం ఒంటరి తల్లులకు/తండ్రులకు చాలా కష్టంగా ఉంటుంది. మనకు మనం జాగ్రత్తపడకపోతే, మనం వాళ్ళను అతిగా కాపాడేందుకూ, వాళ్ళ అభివృద్ధిని ఆపేందుకూ మొగ్గు చూపుతాం.” కుటుంబ సంతోషానికిగల రహస్యము* అనే పుస్తకం 106-7 పేజీల్లో సహాయకరమైన ఈ క్రింది అభిప్రాయాలు ఇవ్వబడ్డాయి:

“ఒంటరి తల్లి/తండ్రి తమ పిల్లలతో ప్రాముఖ్యంగా సన్నిహితంగా ఉండటం సహజమే, అయినప్పటికీ తలిదండ్రులు మరియు పిల్లల మధ్య ఉండే, దేవుడు నియమించిన హద్దులను ఛేదించకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఉదాహరణకు, తన కుమారుడు ఇంటి యజమాని బాధ్యతను చేపట్టాలని ఒకవేళ ఒక ఒంటరి తల్లి అపేక్షిస్తే లేక తన కుమార్తెను ఒక ఆంతరంగిక స్నేహితురాలివలె వ్యవహరించి, ఆ అమ్మాయికి తన వ్యక్తిగత సమస్యలను చెప్పి భారాన్ని కలిగిస్తే గంభీరమైన కష్టాలు తలెత్తవచ్చు. అలా చేయడం సరైనది కాదు, వారికి ఒత్తిడిని కలిగిస్తుంది, బహుశా గందరగోళాన్ని కూడా కలిగించవచ్చు. “తల్లి/తండ్రిగా పిల్లల ఎడల సంరక్షణ చూపాల్సింది తామని, సంరక్షణాపని పిల్లలది కాదని వారికి హామీ ఇవ్వండి. (2 కొరింథీయులు 12:14 పోల్చండి.) కొన్నిసార్లు, మీకు కొన్ని సలహాలు లేక మద్దతు అవసరం కావచ్చు. క్రైస్తవ పెద్దలనుండి లేక బహుశా పరిపక్వత చెందిన క్రైస్తవ స్త్రీలనుండి వాటిని కోరండి, కానీ మీ చిన్న పిల్లలనుండి కాదు.—తీతు 2:3.” ఒంటరి తల్లి/తండ్రి సరైన సరిహద్దులను ఏర్పరుచుకుని, తమ పిల్లలతో ఆరోగ్యకరమైన అనుబంధాన్ని కాపాడుకుంటే, వాళ్ళను వెళ్ళనివ్వడం సాధారణంగా సులభంగానే ఉంటుంది.

*వాచ్‌ టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించినది.

[7వ పేజీలోని చిత్రం]

ఆచరణాత్మక తర్ఫీదు మరింత బాధ్యతాయుత వయోజనులయ్యేందుకు పిల్లలకు తోడ్పడుతుంది

[8వ పేజీలోని చిత్రం]

ఒక కుటుంబ బైబిలు పఠనం పెద్దవాళ్ళయిన తర్వాత జీవితాన్ని ఎదుర్కోవడానికి అవసరమైన జ్ఞానాన్ని పిల్లలకు ఇస్తుంది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి