బోసిపోయిన ఇంట్లో సంతోషంగా జీవించడం
“మనలో అనేకులకు చివరి ఎడబాటు అనేది మనమెంతగా ముందే సిద్ధపడినా, చాలా దిగులుగానే ఉంటుందని” ఒక తల్లి ఒప్పుకుంది. అవును, బిడ్డ ఎడబాటు అనేది ఎంత అనివార్యమైనా సరే, అది నిజంగా సంభవించేటప్పుడు, ఆ ఎడబాటుతో వ్యవహరించడమనేది అంత సులభంగా ఉండకపోవచ్చు. తన కుమారునికి గుడ్‌బై చెప్పాక, తన ప్రతిస్పందనను గూర్చి ఒక తండ్రి ఇలా చెబుతున్నాడు: “నా జీవితంలో మొదటిసారిగా . . . , నేను భోరున ఏడ్చాను.”
చాలా మంది తల్లిదండ్రులకు తమ పిల్లల ఎడబాటు జీవితంలో ఏదో శూన్యతను—పెద్ద గాయాన్ని కలిగిస్తుంది. కొంతమంది తమ పిల్లలను ప్రతి రోజు కలవలేనందువల్ల ఒంటరితనం, బాధ, ఏదో కోల్పోయామన్న దిగులు వంటి తీవ్రమైన అనుభూతులకు గురౌతారు. సర్దుకుపోవడం కష్టంగా ఉండేది తల్లిదండ్రులకు మాత్రమే కాకపోవచ్చు. ఎడ్‌వార్డ్ మరియు అవ్‌రల్ అనే వివాహిత దంపతులు మనకిలా గుర్తు చేస్తున్నారు: “మిగతా పిల్లలు ఇప్పటికీ ఇంట్లో ఉన్నట్లయితే, వాళ్ళు కూడా ఏదో కోల్పోయిన అనుభూతికి గురౌతుండవచ్చు.” ఈ దంపతులిచ్చే సలహా ఏమిటి? “వాళ్ళకు మీ సమయాన్నిచ్చి, అవగాహనను కలిగించండి. ఇది సర్దుబాటు చేసుకునేందుకు వారికి సహాయపడుతుంది.”
అవును, జీవితం అలా సాగుతూనే ఉంటుంది. మీ మిగతా పిల్లలపై మీరు శ్రద్ధ కనబరచాలంటే, మీరు బాధలో మునిగిపోవడానికి మిమ్మల్ని మీరు అనుమతించకూడదు. మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే, లేదా ఇంటి బాధ్యతలనూ చూసుకోవలసి ఉన్నట్లయితే ఇక చెప్పనక్కర్లేదు. కనుక, మీ పిల్లలు ఇల్లు వదిలి వెళ్ళేటప్పుడు కూడా మీరు సంతోషాన్ని కనుగొనే కొన్ని మార్గాలను మనం పరిశీలిద్దాం.
అనుకూల విషయాలపై శ్రద్ధను కేంద్రీకరించండి
మీరు విచారంగా ఉన్నట్లయితే, ఒంటరితనాన్ని అనుభవిస్తున్నట్లయితే, ఏడ్చి దుఃఖాన్ని తీర్చుకోవలసిన అవసరముంటే, లేదా మీ అనుభూతులను సానుభూతిగల మీ నేస్తం ఎదుట వెళ్ళబోసుకోవలసిన అవసరముంటే, తప్పకుండా అలా చేయండి. బైబిలిలా చెబుతుంది: “ఒకని హృదయములోని విచారము దాని క్రుంగ జేయును దయగల మాట దాని సంతోషపెట్టును.” (సామెతలు 12:25) కొన్నిసార్లు, ఇతరులు విషయాలను క్రొత్త దృక్కోణంతో చూసేందుకు మీకు సహాయపడవచ్చు. ఉదాహరణకు, “మీరు ఏదో నష్టపోయినట్లు దృష్టించక, మీరు లక్ష్యాన్ని సాధించడంలో సఫలీకృతులయ్యారని దృష్టించండి” అని వాల్‌డమార్, మారీఆనా అనే దంపతులు సలహా ఇస్తున్నారు. విషయాలను దృష్టించవలసిన ఎంత అనుకూలమైన విధమది! “మా అబ్బాయిలను బాధ్యతాయుతులైన వయోజనులుగా తీర్చిదిద్దినందుకు మేము సంతోషిస్తున్నాం” అని రూడల్ఫ్ మరియు హిల్డె అనే దంపతులు చెబుతున్నారు.
“ప్రభువు [“యెహోవా,” NW ] యొక్క శిక్షలోను బోధలోను” మీ బిడ్డను పెంచేందుకు మీరు ప్రయత్నించారా? (ఎఫెసీయులు 6:4) మీరు అలా చేసినప్పటికీ, ఆమెగానీ ఆయనగానీ వదిలి వెళ్ళే విషయంలో మీకు వ్యాకులత ఉండవచ్చు. తమ బిడ్డకు అలా తర్ఫీదునిచ్చినవారికి, “వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు” అని బైబిలు హామీ ఇస్తుంది. (సామెతలు 22:6) మీ బిడ్డ మీ తర్ఫీదుకు ప్రతిస్పందించాడని చూడడం మీకు ఎంతో సంతృప్తిని కలిగించడం లేదా? అపొస్తలుడైన యోహాను తన ఆధ్యాత్మిక కుటుంబాన్ని గురించి ఇలా చెప్పాడు: “నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుటకంటె నాకు ఎక్కువైన సంతోషము లేదు.” (3 యోహాను 4) మీ బిడ్డ విషయంలో మీకు కూడా అలాంటి భావాలే ఉండవచ్చు.
నిజమే, అందరు పిల్లలూ క్రైస్తవ తర్ఫీదుకు ప్రతిస్పందించకపోవచ్చు. ఎదిగిన మీ బిడ్డ విషయంలో ఇది నిజమైతే, తల్లి/తండ్రిగా మీరు విఫలులైనారని దాని అర్థం కాదు. వాడిని దైవిక మార్గంలో పెంచేందుకు మీ శాయశక్తులా మీరు ప్రయత్నించినట్లయితే, మిమ్మల్ని మీరు అనవసరంగా నిందించుకోకండి. యుక్తవయస్కుడైన మీ బిడ్డ దేవుని ఎదుట తన విషయమై తానే బాధ్యత వహించవలసిన అవసరముందని గ్రహించండి. (గలతీయులు 6:5) కాలక్రమంలో అతడు తన నిర్ణయాలను పునఃపరిశీలించవచ్చు, “బాణము” గురిపెట్టిన చోటికి చివరకు చేరుకుంటుందన్న నిరీక్షణతో ఉండండి.—కీర్తన 127:4.
మీరు ఇప్పటికీ తల్లిదండ్రులే!
మీ బిడ్డ వెళ్ళిపోవడం చాలా పెద్ద మార్పుకు సంకేతమైనప్పటికీ, తల్లిదండ్రులుగా మీ పని అయిపోయిందని అర్థం కాదు. హావార్డ్ హాల్‌పర్న్ అనే మానసిక ఆరోగ్య నిపుణుడు ఇలా చెబుతున్నాడు: “మీరు చనిపోయే రోజటి వరకూ మీరు తల్లి/తండ్రిగానే ఉంటారు, కాకపోతే, ఇవ్వడం, పోషించడం అనేవి మాత్రం పునఃనిర్వచించబడవలసి ఉంది.”
మీ బిడ్డ ఎదిగాడన్న కారణాన తల్లిదండ్రుల బాధ్యత తీరిపోవడం లేదని చాలా కాలం క్రితమే బైబిలు అంగీకరించింది. “నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము” అని సామెతలు 23:22 చెబుతుంది. అవును, తల్లిదండ్రులు “ముదిమియందు” ఉండి, వారి పిల్లలు వయోజనులైనప్పటికీ కూడా, తల్లిదండ్రులు తమ పిల్లల జీవితాల్లో అర్థవంతమైన ప్రభావాన్ని చూపగలరు. నిజమే, కొన్ని సర్దుబాట్లు చేసుకోవలసి ఉంటుంది. ఏ సంబంధాలైనా సరే తాజాగా సంతృప్తికరమైనవిగా ఉండాలంటే, కాలానుగతంగా సవరించవలసిన అవసరం ఉంటుంది. కనుక, ఇప్పుడు పిల్లలు పెద్దవారయ్యారు గనుక, వాళ్ళతోవున్న మీ సంబంధాలను, పెద్దవాళ్ళతోనుండే సంబంధాలుగా ఉండేలా ప్రయత్నించండి. ఆసక్తికరంగా, పిల్లలకూ, తల్లిదండ్రులకూ ఉన్న సంబంధం, పిల్లలు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళాక మెరుగౌతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి! పిల్లలు నిజమైన లోకంలోని ఒత్తిళ్ళను ముఖాముఖిగా ఎదుర్కున్నప్పుడు తరచూ వాళ్ళు తమ తల్లిదండ్రులను క్రొత్త వెలుగులో చూడనారంభిస్తారు. హార్ట్‌మూట్ అనే ఒక జర్మన్ దేశస్థుడు ఇలా చెబుతున్నాడు: “నేను ఇప్పుడు నా తల్లిదండ్రులను ఇంకా చక్కగా అర్థం చేసుకుంటున్నాను, వాళ్ళు అప్పట్లో ఎందుకు అలా వ్యవహరించారో గుర్తించగలుగుతున్నాను.”
అనవసరంగా జోక్యం చేసుకోకండి
అయితే, యుక్తవయస్కుడైన మీ బిడ్డ వ్యక్తిగత జీవితంలో మీరు అనవసరంగా జోక్యం చేసుకుంటే, ఎక్కువగా హానే కలుగవచ్చు. (పోల్చండి 1 తిమోతి 5:13.) “మాకు వాళ్ళంటే ప్రేమే, కానీ మా అంతట మేము జీవించాలని, మేము సొంత నిర్ణయాలను తీసుకోవాలనీ ఇష్టపడతాం” అని తన అత్తమామల నుండి ఒత్తిళ్ళను ఎదుర్కొంటున్న ఒక వివాహిత స్త్రీ వాపోతుంది. నిజమే, ఎదిగిన తమ బిడ్డ వినాశనపు గొయ్యిలోకి పడుతుండగా, ప్రేమించే ఏ తల్లిదండ్రులూ చూస్తూ కూర్చోలేరు. కానీ, సాధారణంగా, తల్లిదండ్రులు అవాంఛిత సలహాలివ్వకుండా ఉండడం మంచిది, ఆ సలహా ఎంత జ్ఞానయుక్తమైనదైనా, లేదా ఎంత సదుద్దేశంతో కూడినదైనా సరే. ముఖ్యంగా బిడ్డ వివాహం జరిగిన తర్వాతి విషయమైతే ఇంక చెప్పనక్కరే లేదు.
లోగడ, అంటే 1983లో తేజరిల్లు! (ఆంగ్లం) ఇచ్చిన సలహా: “మారిన మీ పాత్రను అంగీకరించండి. దాదిగా మీరు నిర్వహించే పాత్రను బిడ్డ నడక ఆరంభించినప్పుడు వదిలిపెడతారు. అలాగే, ఇప్పుడు మీరు సంరక్షకుడనే పాత్ర నుండి సలహాదారుడు అనే పాత్రకు మారడం తప్పనిసరి. జీవితంలో ఈ ఘట్టంలో ఉన్న మీ బిడ్డకు తేన్పు వచ్చేలా తట్టడం లేదా అతనికి తల్లి పాలివ్వడం ఎంత అనుచితమో, అతని కోసం మీరు నిర్ణయాలు తీసుకోవడం కూడా అంతే అనుచితంగా ఉంటుంది. ఒక సలహాదారునిగా మీకు నిర్దిష్ట పరిమితులున్నాయి. తల్లిదండ్రులుగా మీరు ఇక మీదట అధికారాన్ని ప్రభావవంతంగా చూపలేరు. (‘నేను చెప్పాను గనుక నువ్వు చెయ్యాల్సిందే’ అని అనలేరు.) మీరు యుక్తవయస్కుడైన మీ బిడ్డ హోదాను గౌరవించడం తప్పనిసరి.”a
మీ బిడ్డా, మీ కోడలు/అల్లుడు తీసుకునే నిర్ణయాలన్నింటితో మీరు ఏకీభవించకపోవచ్చు. అయితే వివాహ పవిత్రత ఎడల మీకున్న గౌరవం మీరు మీ చింతలను నియంత్రించుకునేందుకూ, అనవసరంగా జోక్యం చేసుకోకుండా ఉండేందుకూ మీకు సహాయపడుతుంది. సత్యమేమిటంటే, యువ దంపతులు తమ మధ్యనున్న సమస్యలను తమకై తామే పరిష్కరించుకోవడానికి అనుమతించడమే సాధారణంగా మంచిది. లేకపోతే, వివాహం విచ్ఛిన్నమవ్వగల విషమ సమయంలో, అల్లుడికి గానీ, కోడలుకి గానీ అవాంఛిత సలహా ఇవ్వడం లేనిపోని పోట్లాటలకు దారితీయవచ్చు, విమర్శలకు వాళ్ళు చాలా నొచ్చుకోవచ్చు. పైన పేర్కొనబడిన తేజరిల్లు! శీర్షిక ఇంకా ఇలా సలహా ఇచ్చింది: “మీ అల్లుడ్ని గానీ, కోడల్నిగానీ శత్రువుగా మార్చగల అవిరామమైన, అవాంఛితమైన సలహాలనివ్వాలన్న ప్రలోభాన్ని అణిచిపెట్టుకోండి.” కుయుక్తిగా ప్రవర్తించక ఆలంబనగా ఉండండి. మీరు మంచి సంబంధాన్ని కాపాడుకుంటే, మీ సలహా నిజంగా అవసరమైనప్పుడు మిమ్మల్ని సమీపించడం మీ బిడ్డకు సులభతరంగా ఉంటుంది.
వైవాహిక అనుబంధాలను పునర్నూతనం చేసుకోండి
చాలా మంది దంపతులకు బోసిపోయిన తమ ఇల్లు తమ వైవాహిక జీవితంలో సంతోషాన్ని అధికం చేసుకునే మార్గాన్ని తెరుస్తుంది కూడా. పిల్లలకు సంరక్షణనివ్వడంలో సఫలీకృతులయ్యేందుకు ఎంతో సమయమూ, ప్రయత్నమూ అవసరమౌతుంది గనుక, దంపతులు తమ అనుబంధాన్ని కూడా నిర్లక్ష్యం చేయవలసివస్తుంది. ఒక భార్య ఇలా అంటోంది: “ఇప్పుడు పిల్లలు పెద్దవారయ్యారు గనుక, నేనూ, కాన్‌రాడ్ మళ్ళీ మరింత సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాం.”
పిల్లల సంరక్షణ బాధ్యత తీరిపోయినందువల్ల మీరిప్పుడు ఒకరికొకరు మరింత సమయం గడిపేందుకు వీలవుతుండవచ్చు. ఒక తల్లి ఇలా అంటోంది: “ఇప్పుడు క్రొత్తగా లభించిన స్వాతంత్ర్యం . . . మేమెవరము అనే విషయంలో మరింత అవధానాన్ని నిలిపేందుకూ, మా అనుబంధాలను గురించి మరింత తెలుసుకోవడంపై శ్రద్ధ నిలిపేందుకూ, మా అవసరాలను తీర్చుకునే పనుల్లో నిమగ్నమయ్యేందుకూ అనుమతిస్తోంది.” ఆమె ఇంకా ఇలా చెబుతోంది: “ఇది క్రొత్తగా నేర్చుకొనగల్గే, నమ్మశక్యం కానంత అభివృద్ధిని సాధించగల్గే సమయం. ఇలాంటి సమయాలు ఎంతో కలత కలిగించేవిగా ఉన్నప్పటికీ, నూతనోత్తేజాన్ని కలిగించేవిగా ఉండగలవు.”
కొందరు దంపతులకు గొప్ప ఆర్థిక స్వాతంత్ర్యం కూడా ఉంటుంది. ఒకప్పుడు ఆగిపోయిన వ్యాపకాలను, కెరీర్లను పునరారంభించవచ్చు. యెహోవాసాక్షుల్లోని అనేకమంది దంపతులు తాము క్రొత్తగా కనుగొన్న స్వాతంత్ర్యాన్ని ఆధ్యాత్మిక లక్ష్యాలను సాధించేందుకు ఉపయోగిస్తారు. హెర్‌మాన్ అనే పేరు గల ఒక తండ్రి తన పిల్లలు ఇల్లు వదిలిపెట్టిన తర్వాత, తనూ తన భార్యా పూర్తికాల పరిచర్యను వెంటనే పునరారంభించేందుకు తమ అవధానాన్ని మళ్ళించారని వివరించాడు.
ఒంటరి తల్లులు/తండ్రులు వెళ్ళనివ్వడం
బోసిపోయిన ఇంట్లో సర్దుకుపోవడమంటే ముఖ్యంగా ఒంటరి తల్లులకు/తండ్రులకు కష్టంగా ఉండవచ్చు. ఇద్దరు పిల్లల తల్లియైన రెబెకా అనే ఒంటరి తల్లి ఇలా వివరిస్తుంది: “మా పిల్లలు వెళ్ళిన తర్వాత, మాకు తోడుగా ఉంటూ, ప్రేమను చూపేందుకు మాలాంటివారికి భర్తలు లేరు.” ఒంటరి తల్లికి తన పిల్లలు భావోద్వేగ ఆలంబనగా ఉండి ఉండవచ్చు. వాళ్ళు ఇంటి ఖర్చులకు డబ్బు ఇస్తూ ఉండినవారైతే, వాళ్ళు వెళ్ళిపోవడంవల్ల ఆర్థికంగా కూడా ఇబ్బందే కలుగుతుంది.
కొందరు జాబ్ ట్రెయినింగ్ ప్రోగ్రామ్‌లలో లేదా స్వల్పకాలిక స్కూల్ కోర్సులు ఇచ్చే పనిలో చేరి తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకుంటారు. అయితే ఒకరు ఒంటరితనం వల్ల కలిగే వెలితిని ఎలా భర్తీచేసుకుంటారు? ఒక ఒంటరి తల్లి ఇలా చెబుతుంది: “నేను ఏదో ఒక పనిని చేస్తూ ఉండడం వల్ల నెట్టుకుపోతున్నాను. బైబిలు చదవడమో, ఇల్లు శుభ్రం చేయడమో, లేదా బ్రిస్క్ వాకింగ్‌కు వెళ్ళడమో, లేదా పరుగెట్టడమో చేస్తుంటాను. అయితే ఒంటరితనాన్ని పారద్రోలేందుకు మంచి మార్గం ఆధ్యాత్మిక నేస్తంతో మాట్లాడడమే.” అవును, క్రొత్తవైన, సంతృప్తికరమైన స్నేహాల కొరకు మీ హృదయాన్ని “విశాలపరచుకొనుడి,” మీ స్నేహాలను వృద్ధిచేసుకోండి. (2 కొరింథీయులు 6:13) మీరు మరీ కృంగిపోయినట్లు భావిస్తే, ‘విజ్ఞాపనలయందూ, ప్రార్థనలయందూ నిలకడగా ఉండండి.’ (1 తిమోతి 5:5) సర్దుబాట్లు చేసుకోవలసిన ఈ కష్ట కాలంలో యెహోవా మిమ్మల్ని బలపరచి, మీకు ఆలంబనగా ఉంటాడనే నిశ్చయతను కలిగి ఉండండి.
వెళ్ళడానికి సంతోషంగా అనుమతించండి
మీ పరిస్థితి ఏదైనప్పటికీ, పిల్లలు ఇల్లు వదిలిపెట్టినంత మాత్రాన జీవితం ముగిసిపోదనీ, కుటుంబ అనుబంధాలూ తెగిపోవనీ గ్రహించండి. బైబిలులో వర్ణించబడిన ఆరోగ్యకరమైన ప్రేమ—దూరంగా ఉన్నా కూడా—మానవులను కలిపి ఉంచేంత దృఢంగా ఉంటుంది. ప్రేమ “అన్నిటిని ఓర్చును. ప్రేమ శాశ్వతకాలముండును” అని అపొస్తలుడైన పౌలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. (1 కొరింథీయులు 13:7, 8) మీ పిల్లలు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళినంత మాత్రాన మీ కుటుంబంలో మీరు వృద్ధిచేసిన నిస్వార్థ ప్రేమ లేకుండా పోదు.
ఆసక్తికరంగా, పిల్లలు ఎడబాటు వేదనను అనుభవించనారంభించినప్పుడు, వారికి ఇంటి బెంగ పట్టుకోనారంభించినప్పుడు, లేదా వాళ్ళు ఆర్థిక ఒత్తిళ్ళ బాధ అనుభవించనారంభించినప్పుడు, తమ అనుబంధాన్ని పునరారంభించేందుకు తరచూ పిల్లలే చొరవ తీసుకుంటారు. హాన్స్ మరియు ఇన్‌గ్రీట్ ఇలా సలహా ఇస్తున్నారు: “మీ ఇంటి ద్వారం ఎల్లప్పుడూ తెరిచే ఉంటుందని మీ పిల్లలకు తెలియనివ్వండి.” క్రమంగా దర్శించడం, ఉత్తరాలు వ్రాయడం లేదా అప్పుడప్పుడు ఫోన్ చేయడం మీ సంబంధం కొనసాగేందుకు మీకు సహాయపడుతుంది. “వాళ్ళ విషయాల్లో జొరబడకుండానే, వాళ్ళు చేస్తున్న పనుల్లో ఆసక్తి గలవారై ఉండండి” అని జాక్ మరియు నోరా చెబుతున్నారు.
పిల్లలు ఇల్లు వదిలి వెళ్ళాక, మీ జీవితం మారిపోతుంది. కానీ బోసిపోయిన ఇంట్లోని జీవితం కూడా బిజీగా, క్రీయాశీలంగా, సంతుష్టిగా ఉండగలదు. అలాగే, మీ పిల్లలతో మీకు గల సంబంధం మారుతుంది. అయినప్పటికీ, మీ అనుబంధం సంతోషకరమైనదిగా, ఆహ్లాదకరమైనదిగా ఉండగలదు. “తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఉండడమంటే, తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమను, వారి ఎడల ఉన్న విశ్వాస్యతను, లేదా వాళ్ళ మీద ఉన్న గౌరవాన్ని కోల్పోవడమని కాదు. . . . నిజానికి దృఢమైన కుటుంబ బంధాలు తరచూ జీవితాంతం కొనసాగుతాయి” అని జెఫ్‌రీ లీ మరియు గారీ పీటర్‌సన్ అనే ప్రొఫెసర్‌లు చెబుతున్నారు. అవును, మీరు మీ పిల్లలను ప్రేమించడం మానరు, మీరు వాళ్ళ తల్లిదండ్రులు కాకామానరు. మీరు మీ పిల్లలను వెళ్ళనిచ్చేంతగా వాళ్ళను ప్రేమించారు గనుక, నిజానికి మీరు వాళ్ళను కోల్పోవడం లేదు.
[అధస్సూచి]
a ఫిబ్రవరి 8, 1983 సంచిక తేజరిల్లు!లో (ఆంగ్లం) “తల్లిదండ్రులుగా మీ బాధ్యత తీరిపోదు” అనే శీర్షికను చూడండి.
[12వ పేజీలోని చిత్రం]
“నా జీవితంలో నేను మొదటిసారిగా . . . . భోరున ఏడ్చాను”
[10వ పేజీలోని బాక్సు/చిత్రం]
ఎదిగిన పిల్లలకు ఒక మాట—వెళ్ళనిచ్చేందుకు తల్లిదండ్రులకు సహాయపడండి
సాధారణంగా వదిలిపెట్టబడడం కన్నా వదిలిపెట్టడం సులభమే. కనుక, మీరు మీ స్వాతంత్ర్యాన్ని బట్టీ, మీ యుక్తవయస్సును బట్టీ ఆనందంగా ఉంటుండగా, మీ తల్లిదండ్రులు సర్దుబాట్లు చేసుకోవడంలో బాధపడుతున్నట్లయితే, వారి ఎడల దయనూ, అవగాహననూ కనబరచండి. మీ ప్రేమానురాగాలు ఎల్లకాలం ఉంటాయని హామీ ఇవ్వండి. ఒక చిన్న ఉత్తరం, ఎదురుచూడని కానుక, లేదా స్నేహపూర్వకమైన ఫోన్ కాల్ నిరాశతోవున్న తల్లిదండ్రులకు ఎంతో ఆనందాన్నిస్తాయి! మీ జీవితంలోని ప్రాముఖ్యమైన సంఘటనలను వాళ్ళకు తెలుపుతూ ఉండండి. మీరలా చేయడం వల్ల కుటుంబ బంధాలు ఇప్పటికీ దృఢంగానే ఉన్నాయని వాళ్ళు తెలుసుకుంటారు.
యుక్తవయస్సులో ఉన్న మీరు జీవితంలోని ఒత్తిళ్ళను ఎదుర్కుంటుండగా, మిమ్మల్ని సంరక్షించడంలో మీ తల్లిదండ్రులు అనుభవించిన విషయాలను మునుపెన్నటికన్నా ఎక్కువగా మీరు గుణగ్రహించవచ్చు. “మీరు నాకోసం చేసిన వాటన్నింటిని బట్టి మీకు కృతజ్ఞతలు!” అని మీ తల్లిదండ్రులకు చెప్పేందుకు ఇది మిమ్మల్ని కదిలించవచ్చు.