వెళ్ళనివ్వడంలోని బాధ
“‘ప్రియతమా, పిల్లలను పెంచడమంటే వీడ్కోలు చెప్పేందుకు సిద్ధమయ్యే దీర్ఘకాల ప్రక్రియ’ అని అంటూ, మొదటి బిడ్డ పుట్టిన రోజే నా భర్త నన్ను హెచ్చరించాడు.”—“మనమూ, మన పిల్లలూ”—తల్లిదండ్రుల కోసం తల్లిదండ్రులు వ్రాసిన పుస్తకం (ఆంగ్లం).
తల్లిదండ్రులు చాలా మంది తమ మొదటి బిడ్డ పుట్టినప్పుడు చాలా సంతోషిస్తారు, ఆనందపరవశులౌతారు కూడా. మాతృత్వం/పితృత్వం సమస్త అసౌకర్యాలకూ, చికాకులకూ, వేదనలకూ, ఆశాభంగాలకూ, ఆతురతలకూ కారణమైనప్పటికీ, పిల్లలు గొప్ప ఆనందానికి నెలవులు కాగలరు. సుమారు మూడు వేల సంవత్సరాల క్రితం, బైబిలు ఇలా వెల్లడిచేసింది: “కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. గర్భఫలము ఆయన యిచ్చు బహుమానమే.”—కీర్తన 127:3.
అయినప్పటికీ, ‘పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచిపెడ్తాడు’ అనే వాస్తవాన్ని కూడా బైబిలు ప్రవచిస్తోంది. (ఆదికాండము 2:24) సాధారణంగా వివిధ కారణాలవల్ల—విద్యను అభ్యసించేందుకు, లేక ఒక కెరీర్ కోసం, తమ క్రైస్తవ పరిచర్యను విస్తృతం చేసేందుకు, లేదా వివాహితులయ్యేందుకు—తరచూ ఎదిగిన పిల్లలు ఇల్లు వదిలి వెళ్తారు. అయితే కొందరు తల్లిదండ్రులకు ఈ వాస్తవం వేదనాభరితంగా ఉంటుందన్నది నిజమే. ఒక రచయిత చెబుతున్నట్లు, స్వాతంత్ర్యం కొరకైన తమ పిల్లల సహజ ప్రయత్నాలను చూసి, పిల్లలు తమను “అవమానించినట్లు, గాయపరచినట్లు, కలవరపరచినట్లు, బెదిరించినట్లు, నిరాకరించినట్లు” వాళ్ళు భావిస్తారు. అలాంటి అనుభూతులను తమలో తాము అణుచుకోడానికి వాళ్ళు ప్రయత్నించరు. తరచూ ఇది కుటుంబంలో సమసిపోని గొడవలకూ, ఉద్రిక్తతలకు దారితీస్తుంది. పిల్లలు తమ ఇల్లు విడిచిపెట్టే రోజును ఎదుర్కోవడాన్ని నిరాకరిస్తూ కొందరు తల్లిదండ్రులు వారిని యుక్తవయస్సుకు సిద్ధం చేయడంలో విఫలులౌతారు. అలాంటి నిర్లక్ష్యం భయానకమైన ఫలితాలను తెస్తుంది: స్వగృహాన్ని సరిగ్గా పరిపాలించుకోలేని, కుటుంబం యొక్క ఆలనాపాలనా చూసుకోలేని, ఒక ఉద్యోగం కూడా సంపాదించుకోలేని యువకులు తయారౌతారు.
తల్లి/తండ్రి మాత్రమే ఉన్న కుటుంబాల్లో ఈ ఎడబాటు వల్ల కలిగే వేదన అనేది మరీ తీవ్రంగా ఉండవచ్చు. కరన్ అనే ఒంటరి తల్లి ఇలా చెబుతుంది: “నా కూతురూ నేను చాలా సన్నిహితులముగా ఉంటాం; మేము నిజమైన స్నేహబంధాన్ని వృద్ధిచేసుకున్నాం. నేను వెళ్ళే ప్రతిచోటికీ ఆమెను తీసుకువెళ్ళేదాన్ని.” ఒంటరి తల్లి/తండ్రి ఉన్న కుటుంబాల్లోని తల్లి/తండ్రికి బిడ్డకు మధ్య సన్నిహిత సంబంధాలు ఉండడం సాధారణమే. అలాంటి సాన్నిహిత్యాన్ని కోల్పోవడమనే తలంపు నిస్సహాయులనుగా చేస్తుందన్నది అర్థం చేసుకోగల విషయమే.
ట్రెయిట్స్ ఆఫ్ ఎ హెల్తీ ఫ్యామిలీ అనే పుస్తకం తల్లిదండ్రులకు ఇలా జ్ఞాపకం చేస్తుంది: “కుటుంబజీవితంలో ఇమిడివున్నదిదే: ఆధారపడే శిశువును సొంతకాళ్ళ మీద నిలబడగల యువకునిగా లేదా యువతిగా తీర్చిదిద్దడమే.” అది ఇంకా ఇలా హెచ్చరిస్తుంది: “వెళ్ళనిచ్చే శక్తి తల్లిదండ్రులకు లేకపోవడమే కుటుంబాల్లో అనేక సమస్యలు తలెత్తడానికి కారణం.”
మీ విషయమేమిటి? మీరు ఒక తల్లి/తండ్రియేనా? అలాగైతే, మీ పిల్లలు వెళ్ళిపోయే రోజు కోసం మీరు సిద్ధపడి ఉన్నారా? మీ పిల్లల విషయమేమిటి? మీ పిల్లలు సొంత కాళ్ళమీద నిలబడేలా వాళ్ళను తీర్చిదిద్దుతున్నారా?