కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g98 1/8 పేజీలు 20-22
  • రేవ్స్‌ హానిరహితమైన సరదానా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • రేవ్స్‌ హానిరహితమైన సరదానా?
  • తేజరిల్లు!—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • రేవ్‌ రంగస్థలాన్ని చూడండి
  • రేవ్‌ల చీకటి కోణం
  • రేవ్స్‌ నిజంగా మీకు తగినవేనా?
  • మా పాఠకుల నుండి
    తేజరిల్లు!—1998
  • యౌవనస్థులారా—లోకాత్మను ఎదిరించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • అసభ్యకరమైన సంగీతం విషయంలో జాగ్రత్తగా ఉండండి
    కావలికోట అధ్యయన ఆర్టికల్‌ల బ్రోషుర్‌
  • నేను ఎలాంటి మ్యూజిక్‌ వింటున్నాననేది అంత ఆలోచించాల్సిన విషయమా?
    యువత అడిగే ప్రశ్నలు
మరిన్ని
తేజరిల్లు!—1998
g98 1/8 పేజీలు 20-22

యౌవనస్థులు ఇట్లడుగుదురు. . .

రేవ్స్‌ హానిరహితమైన సరదానా?

“నేను చేతులు ఊపుతూ నాట్యం చేస్తుండగా, సంగీతం నా శరీరం గుండా అలల్లా ప్రవహిస్తోంది. ఇతరులు నాట్యం చేస్తుండగా నాకు మరింత శక్తి లభించినట్లు అనిపిస్తుంది. ఆనంద పారవశ్యంతో ఎక్కడికో వెళ్ళినట్లు ఉంటుంది.”—జీనా.

రేవ్‌కు వెళ్ళినప్పుడు తనకు కలిగే థ్రిల్‌ను జీనా అలా వర్ణిస్తుంది. దాదాపుగా రాత్రంతా కొనసాగే ఈ నాట్య పార్టీలు 1980లలో మొదట బ్రిటన్‌లో ప్రసిద్ధిగాంచాయి. అవి ఇప్పుడు అకస్మాత్తుగా అమెరికా, ఇండియా, కెనడా, జర్మనీ, బెల్జియం, దక్షిణాఫ్రికా, మరియు న్యూజీలాండ్‌లతో సహా భూగోళంలోని అన్ని ప్రాంతాలలోనూ కనిపిస్తున్నాయి.

క్లబ్‌లలోనూ, ఉపేక్షించబడిన గిడ్డంగుల్లోనూ, ఖాళీగావున్న పొలాల్లోనూ—రాత్రంతా పిచ్చిగా, ఎడతెరపిలేకుండా నాట్యం చేయడానికి ప్రజలు కలుసుకోగల ఏ స్థలంలోనైనా సరే—రేవ్స్‌ జరుపబడతాయి. “రేవ్స్‌ యౌవనస్థులకు ఇష్టమైన వినోదమైన నైట్‌క్లబ్‌ స్థానాన్ని కాలక్రమేణా తీసుకుంటున్నాయి” అని దక్షిణాఫ్రికాలోని జోహన్నస్‌బర్గ్‌లోని సండేటైమ్స్‌ పత్రికలో ఏడమ్‌ లెవన్‌ వ్రాశాడు. “మీ టీనేజర్లు మీతో ఇప్పటివరకు ఆ విషయం చెప్పలేదంటే, మీరు వాళ్ళతో సరిగ్గా సంభాషణ జరపడం లేదన్నమాట” అని కూడా ఆయన వ్రాశాడు.

రేవ్‌ రంగస్థలాన్ని చూడండి

రేవ్స్‌ జరిగే స్థలం ఏదన్నది కొన్నిసార్లు రహస్యంగా దాచబడుతుంది. రేవ్స్‌ జరిగే వరకు అవి జరిగే స్థలం ప్రకటించబడదు. అయినప్పటికీ, రంగురంగుల లైట్లు వెలిగినప్పుడు, టెక్నో సంగీతం వాయించబడినప్పుడు, వెర్రి వస్త్రధారణతోవున్న వేల కొలది యౌవనస్థులు ఎక్కడ నుండైనా వచ్చేయవచ్చు. “అది నాట్యం చేస్తున్న, వాయిద్యాల ప్రకారం హద్దులు మీరి ప్రవర్తిస్తున్న ఏకం చేయబడిన పెద్ద గుంపువంటిది” అని కాలేజీలో రెండవ సంవత్సరం చదువుకుంటున్న కేటీ అంటోంది.

అయితే, రేవ్‌ అనేది నాట్యం కన్నా మించినదే. అది కూడా ఒక సంస్కృతి, లేదా “ఒక రంగస్థలం”—రేవ్‌ను అలా పిలవాలని రేవర్స్‌ ఇష్టపడతారు. ఏ వర్గమూ, ఏ జాతీ, లేదా స్వలింగసంయోగులా, పెళ్ళి కాకుండానే లైంగిక సంబంధం పెట్టుకునేవారా అనే తేడా లేకుండా—శాంతి, ప్రేమ, ఐక్యం, మరియు గౌరవం అన్నవే రేవ్‌ రంగస్థల మౌలిక సూత్రాలు అని విశ్వసించబడుతోంది. “ఈ పార్టీల్లో అన్ని సంస్కృతులనూ కలుపుకోవాలని మేము ప్రయత్నిస్తున్నాం” అని ముఖ్యంగా నాట్య సంగీతం యొక్క క్యాసెట్లనే అమ్మే స్టోర్‌ యజమాని అంటున్నాడు. “కలిసి ఉండాలన్నదే ఆశయం. దానిని సాధ్యం చేయడానికి కలిసి నాట్యం చేయడమే గొప్ప మార్గం” అని కూడా ఆయన అంటున్నాడు.

చాలా ఉన్నత ఆశయాలుగా కనిపిస్తున్న దాని దృష్ట్యా, ‘రేవ్స్‌లో తప్పేమిటి?’ అని మీరడుగవచ్చు. మీరు పరిగణించవలసిన మరో కోణం కూడా రేవ్‌ రంగస్థలానికి ఉంది.

రేవ్‌ల చీకటి కోణం

రేవ్స్‌లో మద్యపానం చాలా అరుదుగా ఉపయోగించబడుతుంది అని కొందరు వాదిస్తారు. అయితే మత్తుమందుల విషయానికొస్తే పరిస్థితి పూర్తి భిన్నం. “రేవ్‌ రంగస్థలంలో మత్తుమందులను అంతగా ఉపయోగించకపోతే, ప్రజలు దానిని మరింత సులభంగా అంగీకరించగల్గే వారేమోనని ఒకరు అనుకుంటారు” అని బ్రైయన్‌ అనే పేరుగల ఒక రేవర్‌ ఒప్పుకుంటున్నాడు. “నిజమే, అవి లేకుండా రేవ్‌లు ఎలా ఉనికిలోకి రాగల్గేవి అని అనేకులు అనుకుంటున్నారు” అని కూడా ఆయనే అంటున్నాడు.

మారివానా మరియు ఎల్‌ఎస్‌డి కొన్ని రేవ్స్‌లో ప్రాచుర్యం పొందినప్పటికీ, రేవర్‌లు ఎక్కువగా ఇష్టపడే మత్తుమందు సాధారణంగా ఎక్‌స్టెసీ అని పిలువబడే ఎమ్‌డిఎమ్‌ఎ అని అనిపిస్తుంది. ఎక్‌స్టెసీ సాపేక్షికంగా చూస్తే చాలా సురక్షితమని కొందరు వినియోగదారులు అంటారు. రాత్రంతా నాట్యం చేసేందుకు అది ఉత్తేజాన్నిస్తుందనీ, హాయిగావున్నటువంటి అనుభూతిని అది పెంచుతుంది అని నొక్కిచెబుతారు. అయితే, ఎక్‌స్టెసీ “ఆకలి మీద, నిద్ర మీద, మూడ్‌ మీద, ప్రచోదనం మీద, మరితర మానసిక ప్రవృత్తుల మీద దీర్ఘకాలికమైన, హానికరమైన ప్రభావాన్ని చూపించవచ్చు” అని ద న్యూయార్క్‌ టైమ్స్‌ “ప్రజామోదం పొందిన మత్తుమందు మెదడును పాడుచేయవచ్చు” అనే శీర్షిక క్రింద పేర్కొనింది. అంతటితో ముగిసిపోలేదు. “ఎక్‌స్టెసీ మూలాన కొన్ని మరణాలు కూడా సంభవించాయి. సాధారణ మోతాదులో డోస్‌లను తీసుకున్నవారిలో అనేకులు గుండెపోటుకు, కాలేయ రోగానికీ, కోమాకు లోనయ్యారు” అని డా. పోవార్డ్‌ మాక్‌కిన్నీ వాదిస్తున్నాడు. “ఎక్‌స్టెసీ తీసుకుని రేవ్‌కు వెళ్ళేవాళ్ళు మరణంతో నాట్యం చేస్తున్నారు” అని డా. సీల్‌వెయిన్‌ డీ మిరాన్‌డా మంచి కారణంతోనే అన్నారు.

హెర్బల్‌ యాసిడ్‌, యాక్సిలరేషన్‌, హెర్బల్‌ ఎక్‌స్టెసీ, లేదా రష్‌ వంటి ఔషధ మత్తుమందులు కూడా హానికరంగా ఉండగలవు. ఉదాహరణకు, కొన్ని పరిస్థితుల్లో, యాక్సిలరేషన్‌ అనే ఔషధ మత్తుమందు గుండెపోటుకూ, మరణానికి కూడా కారణం కావచ్చు అని చెప్పబడుతుంది.

రేవ్స్‌లో ఉపయోగించబడే మత్తుమందులు హానికరమైనవి కావని వాదించే వాళ్ళు పరిగణించవలసిన మరో విషయం ఉంది. కెనడా పోలీస్‌ డిటెక్టివ్‌ ఈయన్‌ బ్రిగ్స్‌ చెప్పేదేమంటే, ఎక్‌స్టెసీ అని అమ్మబడుతున్న మత్తుమందుల్లో 90 శాతం మత్తుమందులు నిజానికి ఎక్‌స్టెసీ కానే కావు. “వాటిలో ఎక్కువ పీసీపీ లేదా మరితర అపాయకరమైన మందులే. ఈ మందులను అమ్మే వ్యక్తులకు నైతికత అనే స్పృహే లేదు. మత్తుమందులు వాటి ప్రభావం చూపించనారంభించేటప్పటికీ వారు ఆ చుట్టుప్రక్కల ఎక్కడా ఉండరు” అని ఆయన అంటున్నాడు.a

కొన్ని రేవ్స్‌లో మత్తుమందులను ఉపయోగించకపోవచ్చన్నది ఒప్పుకోవలసిందే. అయినప్పటికీ, రేవ్‌కు వచ్చినవారిలో ఎవరో ఒకరు, లేదా అనేకులు, లేదా అధిక సంఖ్యాకులు చట్టవిరుద్ధమైన మందు ప్రభావంలో ఉన్నారా అని చెప్పడం తరచూ అసాధ్యమేనని రేవర్స్‌ కూడా ఒప్పుకుంటున్నారు.

రేవ్స్‌ నిజంగా మీకు తగినవేనా?

సంగీతంలోగానీ, నాట్యంలోగానీ సహజసిద్ధంగా తప్పేమీ లేదు. సరదాగా ఉండాలని కోరుకోవడంలోనూ తప్పేమీ లేదు. “నవ్వుటకు,” “నాట్యమాడుటకు,” “సమయము కలదు” అని బైబిలు కూడా చెబుతుంది. (ప్రసంగి 3:1, 4) “నీ యౌవనమందు సంతోషపడుము” అని కూడా అది ఉద్బోధిస్తుంది. (ప్రసంగి 11:9) కనుక మీరు సంతోషంగా ఉండాలనే సృష్టికర్త కోరుకుంటున్నాడు! అయినప్పటికీ, “లోకమంతయు” సాతానూ, అపవాదీ అయిన “దుష్టుని యందున్నదని” మనం గుర్తుంచుకోవడం తప్పనిసరి. (1 యోహాను 5:19) కనుక, ఈ లోకం ఘనపరచిన వినోదాలు అనారోగ్యకరమైన విషయాలతో కళంకితమవ్వడంలో ఆశ్చర్యపడనవసరమే లేదు.

ఉదాహరణకు, రేవ్స్‌కు వెళ్ళేవారిని గురించి ఆలోచించండి. ‘శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి తమను పవిత్రులనుగా చేసుకోవాలనే’ బైబిలు ఉద్బోధను వారు అనుసరిస్తున్నారా? (2 కొరింథీయులు 7:1) నిజమే రేవర్‌లు శాంతిని, ప్రేమను, ఐక్యతను పెంపొందిస్తుండవచ్చు. కానీ “పైనుండివచ్చు జ్ఞానము” అనేది “సమాధానకరమైనది” అనేదాని కన్నా ఎక్కువే; అది “పవిత్రమైనది” కూడా. (యాకోబు 3:15, 17) ‘రేవ్స్‌కు వెళ్ళేవారి నైతికతలు దేవుని వాక్యమైన బైబిలులో కనబడే ప్రమాణాలకు అనుగుణ్యంగా ఉంటాయా? “దేవునికంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించు” వారితో నేను రాత్రంతా గడపాలని అనుకుంటున్నానా?’ అని మీకు మీరే ప్రశ్నించుకోవచ్చు.—2 తిమోతి 3:4; 1 కొరింథీయులు 6:9, 10; యెషయా 5:11, 12 పోల్చండి.

“దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును” అని పౌలు వ్రాశాడు కనుక, ఇవి పరిగణించవలసిన ప్రాముఖ్యమైన ప్రశ్నలే. (1 కొరింథీయులు 15:33) దేవుని నియమాల ఎడల అగౌరవం చూపేవారితో సహవసించడం చివరకు నాశనానికి దారితీస్తుంది. అందుకే బైబిలు ఇలా చెబుతుంది: “జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవాడగును మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును.”—సామెతలు 13:20.

వాస్తవమేమిటంటే, అనేక రేవ్‌లు మత్తుమందు పార్టీల కన్నా కాస్త మించినవే. వాటికి వెళ్ళేవాళ్లు తీవ్రమైన పర్యవసానాలను ఎదుర్కొంటారు. ఉదాహరణకు, కొన్ని రేవ్‌లను పోలీసులు రెయిడ్‌ చేసి, వాటిని సస్పెండ్‌ చేశారు. అవి చట్టవిరుద్ధంగా జరుపబడినందువల్లనో లేదా అక్కడ మత్తుమందులు ఉపయోగించడం వల్లనో అలా జరిగింది. చట్టాన్ని అనుసరించనివారిలో ఒకరిగా గుర్తించబడడం మీకిష్టమేనా? (రోమీయులు 13:1, 2) చట్టాన్ని ఉల్లంఘించిన విషయం వెలుగులోకి రాకపోయినప్పటికీ, మీరు అలాంటి పార్టీలకు వెళ్తూనే, ‘ఇహలోక మాలిన్యము అంటకుండ’ ఉండగలరా? (యాకోబు 1:27) అల్లరితో కూడిన ఆటపాటలు, లేదా “విచ్చలవిడిగా ఉండే పార్టీలు” (బెయింగ్‌టన్‌) బైబిలులో ఖండించబడ్డాయి. మీరు రేవ్‌లో ఉంటే, దేవుని ఎదుటా, మానవుల ఎదుటా మీరు మంచి మనస్సాక్షి కలిగివుండడం సాధ్యమౌతుందా?—గలతీయులు 5:21; 2 కొరింథీయులు 4:1, 2; 1 తిమోతి 1:18, 19.

స్పష్టంగా, రేవ్స్‌ అపాయాన్ని గురించి క్రైస్తవులు తెలుసుకుని ఉండాలి. కానీ నిరాశచెందవద్దు. మీరు ఆస్వాదించగల ఇంకా ఎన్నో వినోదాలున్నాయి. ఉదాహరణకు, యెహోవాసాక్షుల్లోని అనేక కుటుంబాలు ఆరోగ్యకరమైన పార్టీలను ఏర్పాటు చేసుకుంటారు.b జాగ్రత్తతో కూడిన పథకమూ, మరియు పర్యవేక్షణ ఉంటే, వచ్చిన వారందరూ ఆధ్యాత్మికంగానూ, శారీరకంగాను నూతనోత్తేజాన్ని పొందుతారు. మరి ముఖ్యంగా, నిర్మాణాత్మకమైన సహవాసం తన ప్రజలు ఆనందించాలని కోరుకునే “సంతోషవంతుడైన దేవుని”కి ఆహ్లాదం కలుగజేస్తుంది.—1 తిమోతి 1:11, NW; ప్రసంగి 8:15.

[అధస్సూచీలు]

a పీసీపీ (ఫెన్సైక్లిడైన్‌) అనేది ఒక అనేస్తిటిక్‌. మెదడులో కొన్ని ఊహాచిత్రాలు కలిగేలా ప్రచోదించేందుకు దీనిని కొన్నిసార్లు చట్టవిరుద్ధంగా ఉపయోగిస్తున్నారు.

b మరింత సమాచారం కోసం, కావలికోట (ఆంగ్లం) ఆగస్టు 15, 1992, పేజీలు 15-20, మరియు తేజరిల్లు! జూన్‌ 8, 1997 పేజీలు 8-10 చూడండి.

[21వ పేజీలోని బాక్సు]

టక్నో అంటే ఏమిటి?

సరళంగా చెబితే, టెక్నో అనేది ఎలక్ట్రానిక్‌ నాట్య సంగీతాన్ని సూచిస్తుంది. అందులో అనేక రకాలు ఇమిడివున్నాయి. అది లయబద్ధమైనదనీ, నిమిషానికి 115 నుండి 160 వరకూ బీట్స్‌ ఉంటాయనీ చాలా మంది టెక్నోను వర్ణిస్తారు.

“టెక్నో మీకు పరిచయం లేకపోతే, దంతవైద్యుడు డ్రిల్‌ మిషన్‌ను ఉపయోగించేటప్పుడు వచ్చే శబ్దంతోపాటు, సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనమైన రాత్రి మీరూహించేటువంటి శబ్దం వినిపిస్తున్నట్లు మీకనిపిస్తుంది” అని ద యూరోపియన్‌ అంటోంది. అయితే, కొందరు శ్రోతలు టెక్నో ఎడతెగని బీట్స్‌కు ఆకర్షితులయ్యారు. “నా విషయానికొస్తే, అవధుల్లేని స్వేచ్ఛా, స్వాతంత్ర్యమూ ఉన్న అనుభూతిని ఈ సంగీతం ఇస్తుంది” అని 18 ఏండ్ల క్రిస్టీన అంటోంది. జాన్యా కూడా అలాగే భావిస్తుంది. “మొదట్లో, టెక్నో సంగీతం నాకసలు నచ్చలేదు. కానీ దాన్ని వినేకొద్దీ మరింత ఆమోదయోగ్యంగా అనిపిస్తుంది. దాన్ని ఫుల్‌ వాల్యూమ్‌కు పెంచితే, అదే పనిగా వినిపించే ఆ బీట్స్‌ నుండి పారిపోలేరు. మీకు తెలియకుండానే కదిలిపోతారు. జాగ్రత్తపడకపోతే ఆ బీట్స్‌ మీ శరీరాన్నంతటినీ అదుపుచేస్తుంది” అని ఆమె ఒప్పుకుంటోంది. 19 ఏండ్ల షెర్లీ టెక్నోలో మరి కాస్త లోతైనదేదో గమనించింది. “ఇది కేవలం సంగీతం అనేదాని కన్నా ఎక్కువే. అదీ ఒక జీవిత విధానం. అది వస్త్రధారణలోనూ, భాషలోనూ వ్యక్తీకరించబడుతుంది” అని ఆమె అంటోంది.

“ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించు”కుంటూ ఉండాలని క్రైస్తవులు కోరుకుంటారు. (ఎఫెసీయులు 5:10) కనుక, సంగీతంలోని మరే శైలి విషయంలోనైనా వాళ్ళు జాగ్రత్త తీసుకుంటున్నట్లే, టెక్నో విషయంలోను జాగ్రత్త తీసుకోవాలి. మీరు టెక్నోకు ఆకర్షితులయ్యారని కనుగొన్నట్లయితే, ‘ఈ రకమైన సంగీతం నాపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అది నాకు సంతోషాన్ని, ప్రశాంతతను, శాంతిని కలుగజేస్తుందా? లేదా అది నాలో ఉద్రేకం కలిగిస్తుందా, కోపాన్ని రగిలిస్తుందా లేదా అనైతిక తలంపులను తీసుకువస్తుందా? ఈ సంగీతానికి నేను ఆకర్షించబడడం వల్ల దాని జీవిత విధానం వైపుకు నేను ఆకర్షించబడతానా? నేను రేవ్‌కు వెళ్ళేందుకూ, ఈ రకమైన సంగీతం విని నాట్యం చేయాలని ప్రలోభపెట్టబడ్తానా?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.

నిజానికి, చివరి మాట ఏమిటంటే: సంగీతంలో మీ అభిరుచి ఏదైనా, మీకూ, మీ పరలోక తండ్రికీ మధ్యన దానిని రానివ్వకండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి