కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g98 1/8 పేజీలు 10-12
  • మీకు మీ పనంటే విసుగ్గా ఉందా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీకు మీ పనంటే విసుగ్గా ఉందా?
  • తేజరిల్లు!—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఉత్సాహంగా ఉన్నట్లు నటించండి
  • మీకు చేతనైనంత శ్రేష్ఠంగా చేయండి
  • మీ పనిని “అలంకరించండి”
  • నేర్చుకుంటూనే ఉండండి
  • కొన్ని తుది సలహాలు
  • “యెహోవా కోసం కనిపెట్టుకొని ఉండండి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
  • మీ పనిలో ఆనందించండి
    దేవుని ప్రేమలో ఎప్పటికీ నిలిచివుండండి
  • దిద్దుబాటును స్వీకరించిన మాదిరికరమైన వ్యక్తి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • “నా యథార్థతను విడిచిపెట్టను”
    వాళ్లలా విశ్వాసం చూపించండి
మరిన్ని
తేజరిల్లు!—1998
g98 1/8 పేజీలు 10-12

మీకు మీ పనంటే విసుగ్గా ఉందా?

బహుశ మీరు రోజులో దాదాపు ఎనిమిది గంటలు పని చేస్తుండవచ్చు. మీకు ఆ పనంటే విసుగ్గా ఉంటే, మీ జీవితంలో చాలా ఎక్కువ సమయమే కాకుండా చాలా ఎక్కువ భాగం వృథా అవుతోందని దానర్థం! అయినప్పటికీ, ఈ 20వ శతాబ్దంలో పని చాలావరకూ మూస ధోరణిలోనే ఉంటుంది, దాన్లో పనివాడు తన పనితనాన్నిబట్టి గర్వించే అవకాశం ఎక్కువ ఉండదు.

కాబట్టి మీ పనిని ఆసక్తికరంగా చేసుకోవడం ద్వారా మీరు ఎంతో ప్రయోజనం పొందవచ్చు. పని చేయడం నుండి మీకు ఎంతో ఎక్కువ ఆనందం లభిస్తుంది, మీరు ముందు ముందు చేసే ఏ పనైనా మరింత ఆసక్తికరంగా చేసుకోగలిగే రహస్యాన్ని మీరు తెలుసుకుంటారు. కాబట్టి, దీన్ని సాధించగల కొన్ని మార్గాలను ఇప్పుడు మనం పరిశీలిద్దాం.

ఉత్సాహంగా ఉన్నట్లు నటించండి

మీరు మీ పని విషయంలో సంతోషిస్తున్నారు అన్నట్లు మీరు పని చేయాలని కొన్ని అధికారిక మూలాలు సిఫారసు చేస్తున్నాయి. మీరు అలా చేస్తే, తుదకు మీరు ఆ పనినిబట్టి నిజంగానే సంతోషించడం ప్రారంభించవచ్చు.

‘కానీ నేను నా పని విషయంలో ఎప్పుడూ ఉత్సాహంగా ఉండలేను!’ అని మీరనవచ్చు. మీ పనిలో, వస్తువుల విభాగాలను సమకూర్చే పనివంటి పక్కా రొటీన్‌పని చేరివుండవచ్చు. లేదా మీరు మీ పనిలో ఎన్నో సంవత్సరాలుగా ఉన్నారు గనుక ఆ పని ఎడల సరిక్రొత్త ఆసక్తిని కలిగి ఉండటమన్నది అసాధ్యమని మీరు భావిస్తుండవచ్చు. అయితే, చిరునవ్వు నవ్వడం, నిటారుగా నిలబడటం వంటి సరళ ఉపాయాలు మీ పనిని గురించి మీరు మరింత ఉత్సాహంగా ఉండేందుకు మీకు సహాయం చేయవచ్చు.

మీరు చేస్తున్న పనిపై సంపూర్ణ అవధానాన్ని నిలపడం కూడా సహాయం చేయవచ్చు. మీరు యంత్రంలా మీ పనిని చేయకండి, మీరు మీ మధ్యాహ్న భోజన విరామ సమయాన్ని గురించీ లేక వారాంతాన్ని గురించీ లేక చేయవలసి ఉన్న మరొక పనిని గురించీ ఆలోచిస్తూ మీ పనిని చేయకండి. చేతిలో ఉన్న పనిపైనే పూర్తి అవధానాన్ని నిలపడం సాధారణంగా జ్ఞానయుక్తం. దాని ఫలితం? మీరు ఆ పనినిబట్టి సంతోషాన్ని కనుగొనవచ్చు, మరి సమయం త్వరగా గడుస్తున్నట్లు మీకు అనిపించవచ్చు.

మీరు వాస్తవంగా ఇష్టపడే పనిలో మీరు నిమగ్నమై ఉన్నప్పుడు సహజంగా జరిగేది అదే. మీరు సాధారణంగా ఇష్టపడని పని ఎడల మీరు పూర్తి అవధానాన్ని నిలిపేందుకు మిమ్మల్ని మీరు బలవంతం చేసుకున్నప్పుడు కూడా మీరు అదే విధమైన ఫలితాలను పొందగలుగుతారు.

మీకు చేతనైనంత శ్రేష్ఠంగా చేయండి

మీకు చేతనైనంత చక్కగా పని చేయడం మీరు పనిలో సంతృప్తిని పొందేందుకు సహాయం చేయగలదు. ఆ సలహా, మీకు ఫలానా పని ఆసక్తికరంగా అనిపించకపోతే మీరు ఆ పనిని వీలైనంత తక్కువ శ్రమతో ముగించాలనే జనాదరణ పొందిన తలంపుకు విరుద్ధంగా ఉండవచ్చు. అయితే, అలక్ష్యం చేయడం, కాలవిలంబం చేయడం, లేక వీలైనంత తక్కువ ప్రయాసపడటం మీ శక్తిని హరింపజేసి, ఆదుర్దానూ అలసటను కూడా కలిగించవచ్చు. కొన్ని సందర్భాల్లో ఒత్తిడిని అనుభవిస్తూ, చింతను కలిగి ఉండి మరియు అలసిపోయి పని నుండి ఇంటికి వచ్చే వ్యక్తి, కష్టించి పని చేయడంలో విఫలమౌతున్నందు మూలంగా బాధను అనుభవిస్తుండవచ్చు.

బైబిలు ప్రకారం, ఓ పనిలో బాగా కష్టపడడం కూడా, తీరిక సమయాలను మరింత ఆనందదాయకమైన వాటిగా చేస్తుంది. “అన్నపానములు పుచ్చుకొనుటకంటెను, తన కష్టార్జితముచేత సుఖపడుటకంటెను నరునికి మేలుకరమైనదేదియు లేదు.” (ప్రసంగి 2:24) కొందరికి ఇది మరీ పాతబడిపోయిన ఆదర్శంగా అనిపించవచ్చు, అయితే కాలపరిమితి లేని ఈ సూత్రాన్ని ఇతరులు అన్వయించుకుంటున్నారు. వాస్తవంగా, తమ కష్ట ఫలాన్ని ఆనందించడం కంటే “మేలుకరమైనదేదియు” లేదని వారు అంగీకరిస్తారు. పని చేయడంలోని ఆనందం (ఆంగ్లం) అనే పుస్తకం ఇలా అంగీకరిస్తుంది: “చక్కగా సాధించబడిన పని, సంతృప్తి అనే అంతర్గత కాంతినిస్తుంది.”

కాబట్టి, మీకు వీలైనంత చక్కగా ఆ పనిని చేయండి, మీరు బహుశ శక్తిని పొందినట్లు భావిస్తారు. కేవలం అవసరమైనంత మాత్రమే కాక ఎక్కువ చేయండి, బహుశ మీరు ఆనందంగా భావించవచ్చు. మీరు ప్రాముఖ్యమైన పనులను ముందు ముగించండి అప్పుడు కాలవిలంబం చేయడంలో తన సమయాన్ని వృథా చేసి అలసిపోయే వ్యక్తికన్నా మీరు మీ మధ్యాహ్న భోజన విరామ సమయాలను, వారాంతాలను మరింత ఎక్కువగా ఆనందించగలుగుతారు.—ఎస్తేరు 10:2; రోమీయులు 12:11; 2 తిమోతి 2:15 పోల్చండి.

ఇతరులతో పోటీపడే బదులు, మిమ్మల్ని మీరు అధిగమించేందుకు ప్రయత్నించండి. (గలతీయులు 6:4) క్రొత్త ప్రమాణాలనూ సరిక్రొత్త గమ్యాలనూ స్థాపించుకోండి. మీ పనిని మెరుగుపర్చుకుంటూ ఉండేందుకు కృషి చేయండి. విపరీతంగా నిరాసక్తమైన పని అని కొందరు భావించే కుట్టుపని చేసే ఒక స్త్రీ తన పనిని తాను ఎంత సమయంలో ముగిస్తుందో గమనించి చూడాలని అనుకుంది. తాను ఒక గంటలో ఎంత పని చేయగలుగుతుందో ఆమె బాగా గమనించి, అంతకంటే ఎక్కువ పని చేసేందుకు ప్రయత్నించింది. ఆమె తనకు సాధ్యమైనంత ఎక్కువ పని చేయాలని కృషి చేస్తుంది గనుక ఆమె వాస్తవంగా తన పనిని బట్టి ఆనందిస్తోంది.—సామెతలు 31:31.

మీ పనిని “అలంకరించండి”

డెన్నిస్‌ టి. జెఫీ మరియు సింథియా డి. స్కాట్‌ అనే వైద్యులు ఇలా సిఫారసు చేస్తున్నారు: “మీ పని ఒక ఖాళీ ఇల్లని ఊహించుకోండి. మీరు ఆ ఇంట్లో నివసించేందుకు వచ్చి, దాని ఆకారాన్నీ రూపాన్ని చూస్తారు. అప్పుడు మీ స్వంత సృజనాత్మకత ప్రేరేపించబడుతుంది. మీరు మీ ఖాళీ స్థలాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నిర్ణయించుకుంటారు, దాన్ని అలంకరిస్తారు ఆ ఇంటిని మీరు మీ గృహంగా మార్చుకుంటారు. మీరు దానికి మీ స్వంత శైలి ప్రకారం ఒక రూపాన్నిస్తారు.”

పనులలో చాలా మట్టుకు, సూత్రాలను గురించిన మార్గదర్శకాలను గురించిన సాధారణ వివరణతో మీకు ఇవ్వబడినవే. మన నుండి అపేక్షించబడిన దాన్ని మాత్రమే చేయడం ఖాళీ ఇంట్లో కాపురం పెట్టినట్టు ఉంటుంది. దానికి ఓ వ్యక్తిత్వం ఉండదు. అయితే మీరు మీ స్వంత శైలిని దానికి జత చేస్తే, మీ పని మరింత ఎక్కువ ఆసక్తికరంగా మారగలదు. ఏ ఇద్దరు వ్యక్తులూ ఒక పనిని ఒకే విధంగా “అలంకరించరు.” ఒక వెయిటర్‌ క్రమంగా వచ్చే వినియోగదారుల ఆహార అభిరుచులను జ్ఞాపకం ఉంచుకుంటాడు. మరొక వెయిటర్‌ ప్రాముఖ్యంగా స్నేహపూర్వకంగా మరియు మర్యాదపూర్వకంగా ఉంటాడు. వారు ఇరువురూ కూడా తమ పనిలో నిమగ్నమై దాన్ని చేస్తారు గనుక వారు ఇద్దరూ కూడా తమ పనిని ఆనందిస్తారు.

నేర్చుకుంటూనే ఉండండి

పనిలో ఆనందాన్ని కనుగొనగల మరొక మార్గం ఆ పనిని నేర్చుకోవడమే. మనం పెరిగి పెద్దవారమౌతుండగా సమాచారాన్ని ప్రక్రియ చేయగల సామర్థ్యాన్ని మన మెదడు పెంచుకుంటుందని ఒత్తిడి దారి మళ్లించడం (ఆంగ్లం) అనే పుస్తకం వివరిస్తోంది. మనకు గతంలో ఆసక్తిగా అనిపించిన విషయాలు ఇప్పుడు మనకు ఎందుకు విసుగు కల్గిస్తున్నాయనే విషయాన్ని ఇది వివరిస్తుంది. క్రొత్త సంగతులను నేర్చుకోవడం ద్వారా క్రొత్త సమాచారం కొరకైన మన మెదడు యొక్క ఆకలిని సంతృప్తిపర్చడమే పరిష్కారం.

మీ పనిని గురించి ఎక్కువ నేర్చుకోవడం, కొంతకాలానికి మరింత ఆసక్తికరమైన పని మీకు ఇవ్వబడేందుకు దారి తీయవచ్చు. కానీ ఒకవేళ అది జరగక పోయినప్పటికీ, నేర్చుకునే ప్రక్రియే మీ పనిని మరింత ఆసక్తికరమైనదిగా, సంతృప్తికరమైనదిగా చేస్తుంది. చార్లెస్‌ కామరన్‌ మరియు సూజన్‌ ఎల్యుజార్‌ అనే రచయితలు ఇలా సూచిస్తున్నారు: “నేర్చుకోవడం అనేది, మీ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా మీ నమ్మకాన్ని పెంచడం మాత్రమే కాదుగానీ, జీవితం ఎడల మీ సాధారణ దృక్పథాన్ని కూడా ప్రభావితం చేస్తుంది: అంటే సమస్యలను పరిష్కరించవచ్చనే, కష్టాలను అధిగమించవచ్చనే, భయాలను మటుమాయం చేయవచ్చనే మరియు మీరు ఊహించిన దానికంటే మరెన్నో సంగతులను సాధించవచ్చనే దృక్పథాన్ని అలవర్చుకునేందుకు సహాయం చేస్తుంది.”

‘అయితే, నా పనికి సంబంధించిన సంగతులను అన్నిటినీ నేను ఎప్పుడో నేర్చేసుకున్నాను!’ అని మీరు అభ్యంతరం చెప్పవచ్చు. అలాంటి పరిస్థితిలో, మీ పనితో నేరుగా సంబంధం లేని విషయాలను మీరు నేర్చుకోగలరా? ఉదాహరణకు, మీరు మానవ సంబంధాలను గురించి లేక మీ ఉపకరణాలను గురించి మరింత నేర్చుకోవాలని తీర్మానించుకోవచ్చు. కార్యాలయ మెమోను మరింత శ్రేష్ఠమైన విధంగా ఎలా వ్రాయాలనే విషయాన్ని లేక మీటింగును మరింత చక్కగా ఎలా నిర్వహించవచ్చనే విషయాన్ని మీరు నేర్చుకోవచ్చు. మీరు మీ పైఅధికారులతో వ్యవహరించడానికి మరింత ప్రభావవంతమైన మార్గాలను నేర్చుకోవచ్చు.

మీరు ఈ సంగతులను ఎలా నేర్చుకుంటారు? మీరు ప్రయోజనం పొందగల కోర్సులను మీ కంపెనీ అందజేస్తూ ఉండవచ్చు. లేదా మీకు అవసరమైన పుస్తకాలనే ఒక గ్రంథాలయం కలిగి ఉండవచ్చు. అయితే సమాచారం లభిస్తుందని అనిపించని మూలాలను అలక్ష్యం చేయకండి. ప్రజలు పని చేస్తున్నప్పుడు వారిని గమనించడం మరియు వారి సామర్థ్యాలనూ బలహీనతలనూ గమనించడం కూడా మంచి విద్యాభ్యాసమే. మీ తప్పిదాల నుండి మీరు నేర్చుకోవచ్చు, మీరు సరిగ్గా చేసిన వాటిని విశ్లేషించుకోవడం ద్వారా మీ విజయాలనుండి కూడా మీరు నేర్చుకోవచ్చు. మీ స్వంత అనుభవాల నుండీ ఇతరులను గమనించడం నుండీ మీరు నేర్చుకునే విషయాలు మీరు ఏ పుస్తకాల్లోనూ చదవలేని లేక ఏ తరగతిలోనూ వినలేని విషయాలను మీకు బోధించవచ్చు.

కొన్ని తుది సలహాలు

మీ పనిని మీరు పరిగణించగల మరొక మార్గం ఉంది. మీకు శ్రేష్ఠమైనది పొందగల యోగ్యత ఉందనీ మరి ఇతరులందరికీ మంచి పని లభిస్తోందనీ మరి మీరు వాస్తవంగా చేయాలని ఇష్టపడే పని చేయగల అవకాశం మీకు ఎన్నడూ లభించలేదనీ మీరు తీర్మానించి చెప్పవచ్చు. మీతో ఏకీభవించే ప్రజలతో ఈ విషయాన్ని గురించి మీరు అంతం లేకుండా చర్చించగలరు, మరి ఇదంతా కూడా వాస్తవమని మీరు అంగీకరించవచ్చు.

అయితే అది సత్యం కాకపోవచ్చు. తమ పనినిబట్టి సంతోషించే ప్రజలు అనేకమంది అలా ఆనందించడాన్ని నేర్చుకున్నారు. ఇళ్ల రూపకల్పన చేసే వ్యక్తి బస్సు నడపడాన్ని కూడా ఇష్టపడవచ్చు. ఎందుకు? ఆయనకు తన పని ఎడల ఉన్న సృజనాత్మక దృక్పథం ఆయనకు ఆనందాన్నీ సంతృప్తినీ ఇస్తాయి.

కాబట్టి వారంలోని పని దినాలను వారాంతంతో పోల్చితే అంధకారమయమైన వాటిగా చేసే ప్రతికూల ఆలోచనావిధానం నుండి విముక్తి పొందండి. ఇప్పుడు ఎక్కడ తప్పిదం జరుగుతుందో అని ఊహించుకుంటూ మీ గురించి ఇతరులు ఏమని అనుకుంటారో అని చింతిస్తూ పూర్వపు వైఫల్యాలను గురించి పునరాలోచించడంలో సమయాన్ని వృథా చేయకండి. మీ ముందు ఉన్న పని వైపు చూడండి. దానికి మీ పూర్తి అవధానాన్నివ్వండి. మీకు ఎంతో నచ్చే సరదా పనిలో మీరు ఎంతగా నిమగ్నమౌతారో ఇందులో కూడా అలాగే నిమగ్నమయ్యేందుకు ప్రయత్నించండి. చక్కగా చేయడానికి మీ యథాశక్తి ప్రయత్నం చేయండి, చేయబడిన పనిని బట్టి ఆనందించండి.

[11వ పేజీలోని బాక్సు/చిత్రం]

మీ పనిని నిర్లక్ష్యం చేయకండి

“నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలిసికొనుము. నీ మందలయందు మనస్సు ఉంచుము. ధనము శాశ్వతము కాదు కిరీటము తరతరములు ఉండునా?” అని సామెతలు 27:23, 24 నందు బైబిలు చెబుతోంది. దాని అర్థమేమిటి?

సంపద (ధనము) మరియు ప్రముఖ స్థానాలు (కిరీటము) ఒకవేళ లభించినప్పటికీ అవి తరచూ తాత్కాలికమైనవిగానే నిరూపించబడతాయని దాని అర్థం. కాబట్టి, బైబిలు కాలాల్లోని ఒక మందకాపరి తన గొఱ్ఱెల ఎడల శ్రద్ధ వహించేందుకు కష్టించి పని చేస్తే అంటే తన ‘మందలయందు మనస్సు ఉంచితే’ అతను జ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నాడన్న మాట. దాని తర్వాతి మూడు వచనాలు చూపుతున్న విధంగా, దాని ఫలితంగా ఆ పనివానికీ ఆయన కుటుంబానికీ కూడా వస్తుసంబంధ భద్రత చేకూరుతుంది.—సామెతలు 27:25-27.

నేటి సంగతేమిటి? తమ ప్రస్తుత ఉద్యోగాన్ని వదిలేయడానికి వీలుకలిగిస్తుందని వారు నిరీక్షించే సంపదను పొందడంపై లేక ప్రముఖ స్థానంపై ప్రజలు తరచూ తమ మనస్సు ఉంచుతారు. కొందరికి సహేతుకమైన పథకాలు ఉంటాయి; ఇతరులు కేవలం పగటి కలలు కంటుంటారు. ఈ రెండు పరిస్థితుల్లో కూడా తమకున్న ప్రస్తుత ఉద్యోగాలను తృణీకరించడం లేక నిర్లక్ష్యం చేయడం జ్ఞానయుక్తం కాదు. అది మీ రాబడికి అత్యంత ఆధారయోగ్యమైన మూలం మరి అది అలాగే కొనసాగవచ్చు. ఒక వ్యక్తి తన ‘మందలపై’ మనస్సు ఉంచటం, తాను ఆధారపడగల ఉద్యోగంపై పూర్తి అవధానాన్ని నిలపడం ఎంతో జ్ఞానయుక్తమైన విషయం. అతను అలా చేయడం ప్రస్తుత మరియు భవిష్యత్‌ వస్తుపర భద్రతకు దారి తీయవచ్చు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి