కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g98 1/8 పేజీలు 4-9
  • విజయం, విషాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • విజయం, విషాదం
  • తేజరిల్లు!—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఎట్టకేలకు, ఒక విరుగుడు!
  • మరణాంతకమైన పునరాగమనం
  • ఈ మరణాంతకమైన పునరాగమనం ఎందుకు?
  • హెచ్‌ఐవి, టీబీ—రెండింతల సమస్య
  • వివిధ రకాల మందులకు లొంగని టీబీ
  • నివారణ, చికిత్స
  • క్షయ—దానిపై సాగించే పోరాటంలో ఒక క్రొత్త ఆయుధం
    తేజరిల్లు!—1999
  • ప్రాణాంతక మైత్రి
    తేజరిల్లు!—1998
  • యుద్ధ హతుల సంఖ్యతో పోటీపడుతున్న మరణాల సంఖ్య
    తేజరిల్లు!—1998
  • క్షయరోగం తిరిగి వ్యాపిస్తోంది!
    తేజరిల్లు!—1996
మరిన్ని
తేజరిల్లు!—1998
g98 1/8 పేజీలు 4-9

విజయం, విషాదం

“గత 30 సంవత్సరాల్లోని క్షయ వ్యాధి చరిత్ర విజయాలతోనూ విషాదాలతోనూ నిండివుంది—శాస్త్రవేత్తలు ఈ వ్యాధిని అదుపులో పెట్టి చివరికి నిర్మూలించడానికి మార్గాలను చూపించడమన్నది విజయమైతే, వారి ఆవిష్కరణలను ఉపయోగించుకోవడంలో అంతటా ఉన్న వైఫల్యం విషాదకరమైన విషయమైంది.”—జె. ఆర్‌. బిగ్నాల్‌, 1982.

క్షయ (టీబీ) ఎంతో దీర్ఘకాలంగానే ప్రజల్ని బలిగొంటూ వచ్చింది. యూరోపియన్లు సముద్రమార్గాన దక్షిణ అమెరికాకు చేరుకోవడానికి ఎంతోకాలం ముందే అది పెరూలోని ఇన్‌కాలను పీడించింది. ఫరోల వైభవోపేత పరిపాలనా కాలంలో అది ఈజిప్ట్‌ వారిపై దాడిచేసింది. ప్రాచీన బాబిలోన్‌, గ్రీస్‌, చైనాల్లో టీబీ బీదా గొప్పా తారతమ్యం లేకుండా అందర్నీ బలితీసుకుందని పురాతన వ్రాతలు చూపిస్తున్నాయి.

పాశ్చాత్య దేశాల్లో 18వ శతాబ్దం మొదలుకొని 20వ శతాబ్దం తొలిభాగం వరకూ మరణానికి దారితీసే కారకాల్లో టీబీ అన్నింటికీ ముందు ఉంది. చివరికి, 1882లో జర్మన్‌ డాక్టర్‌ అయిన రాబర్ట్‌ కోష్‌ ఈ వ్యాధికి కారణమైన బేసిలస్‌ను తాను కనుగొన్నానని అధికారికంగా ప్రకటించాడు. పదమూడు సంవత్సరాల తర్వాత విల్‌హెల్మ్‌ రాంట్‌జెన్‌ ఎక్స్‌ రేలను కనుగొన్నాడు, ఇది ఊపిరితిత్తుల్లో క్షయ సంబంధిత గాయాలను స్కాన్‌ చేయడాన్ని సాధ్యపరిచింది. తర్వాత, 1921లో టీబీకి విరుద్ధంగా పనిచేసే ఒక టీకామందును ఫ్రెంచి శాస్త్రజ్ఞులు రూపొందించారు. దీన్ని కనుగొన్న శాస్త్రజ్ఞుల పేర్ల ఆధారంగా దీనికి BCG (బేసిలస్‌ కాల్‌మెట్‌-గేరన్‌) అని పేరు పెట్టారు, ప్రస్తుతం ఈ వ్యాధిని నిరోధించడానికి అందుబాటులో ఉన్న టీకా ఇది ఒక్కటే. అయినప్పటికీ, టీబీ గొప్ప సంఖ్యల్లో ప్రజల్ని బలిగొంటూనే ఉంది.

ఎట్టకేలకు, ఒక విరుగుడు!

వైద్యులు టీబీ రోగులను ప్రకృతి చికిత్సాలయాలకు పంపించేవారు. ఈ ఆసుపత్రులు సాధారణంగా పర్వతాలపై ఉండేవి, అక్కడ రోగులు తాజాగాలిని పీలుస్తూ, విశ్రాంతి తీసుకుంటుండేవారు. తర్వాత 1944లో, టీబీకి విరుద్ధంగా ప్రభావవంతంగా ఉన్న మొట్టమొదటి యాంటీబయోటిక్‌ అయిన స్ట్రెప్టోమైసిన్‌ను అమెరికాలోని డాక్టర్లు కనుగొన్నారు. ఇతర యాంటీ-టీబీ మందులు ఒకదాని తర్వాత ఒకటి వెంటవెంటనే వచ్చాయి. చివరికి టీబీ రోగులను వారి గృహాల్లోనే చికిత్స చేసేంత అభివృద్ధి జరిగింది.

ఇన్ఫెక్షన్‌ రేటు అకస్మాత్తుగా పడిపోవడంతో భవిష్యత్తు ఆశాజనకంగా కన్పించింది. ప్రకృతి చికిత్సాలయాలు మూతబడ్డాయి, టీబీ పరిశోధన కొరకైన నిధులు ఆవిరైపోయాయి. నివారణా కార్యక్రమాలను మూలనబెట్టి శాస్త్రజ్ఞులూ డాక్టర్లూ క్రొత్త క్రొత్త వైద్య సవాళ్లను ఎదుర్కోవడానికి ఉద్యుక్తులయ్యారు.

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో టీబీ ఇప్పటికీ చాలామందిని పొట్టనబెట్టుకుంటున్నప్పటికీ, పరిస్థితులు తప్పకుండా మెరుగవుతాయి. టీబీ గతించిపోయిన చరిత్ర మాత్రమే. అలా అనుకున్నారు ప్రజలు, కానీ వారి అంచనాలు తారుమారయ్యాయి.

మరణాంతకమైన పునరాగమనం

1980వ దశకం మధ్యభాగంలో, టీబీ భయంకరంగా పునఃప్రవేశించి, ఎంతో మందిని మృత్యువాతకు గురిచేసింది. తర్వాత, 1993 ఏప్రిల్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) టీబీ “ఒక భౌగోళిక అత్యవసర పరిస్థితి” అని ప్రకటించింది, ఇంకా “ఈ వ్యాధి విస్తృతిని అరికట్టడానికి అత్యవసర చర్య తీసుకోకపోతే రాబోయే దశాబ్దంలో అది మూడు కోట్లకుపైగా జనాభాను బలిగొంటుంది” అని కూడా అన్నది. ఈ రకమైన ప్రకటన వెలువడడం ప్రపంచ ఆరోగ్య సంస్థ చరిత్రలోనే అది మొట్టమొదటిసారి.

అప్పటినుండి ఎటువంటి “అత్యవసర చర్య” కూడా ఈ వ్యాధికి పగ్గాలు వేయలేకపోయింది. నిజానికి పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. ఇటీవలనే, చరిత్రలోని ఇంకే సంవత్సరంలో కన్నా 1995లోనే అత్యధిక సంఖ్యలో ప్రజలు టీబీ మూలంగా మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదించింది. రానున్న 50 సంవత్సరాలలో కనీసం 50 కోట్లమంది ప్రజలు టీబీ వ్యాధిగ్రస్తులవుతారని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. వివిధ రకాల మందులకు లొంగని టీబీకి గురయ్యే ప్రజల సంఖ్య కూడా పెరుగుతుంది.

ఈ మరణాంతకమైన పునరాగమనం ఎందుకు?

ఒక కారణం ఏమిటంటే, గత 20 సంవత్సరాల్లో ప్రపంచంలోని అనేక భాగాల్లోని టీబీ నియంత్రణ కార్యక్రమాలు తగ్గిపోవడమో లేక అసలు ఉనికిలోనే లేకుండాపోవడమో జరిగింది. దీనితో వ్యాధినిర్ధారణ చేయడంలోనూ దానికి చికిత్స చేయడంలోనూ ఆలస్యం జరిగింది. తత్ఫలితంగా, మరిన్ని మరణాలు సంభవించాయి, వ్యాధి మరింత విస్తరించింది.

టీబీ ఉద్ధృతి మళ్లీ పెరగడానికి మరో కారణం ఏమిటంటే, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని జనసమ్మర్థం ఎక్కువగా ఉండే నగరాల్లోనూ ప్రాముఖ్యంగా మెగాసిటీల్లోనూ నివసిస్తూ పోషకాహార లోపంతో బాధపడుతున్న బీద ప్రజల సంఖ్య పెరిగిపోవడమే. టీబీ వ్యాధి కేవలం బీద ప్రజలకే పరిమితం కాకపోయినా—టీబీ ఎవరికైనా రావచ్చు—అపరిశుభ్రమైన పరిసరాలు, ఒకేచోట ఎక్కువమంది నివసించే ప్రాంతాలు ఈ వ్యాధి ఒకరినుండి మరొకరికి వ్యాపించడాన్ని సులభతరం చేస్తాయి. ఇటువంటి అపరిశుభ్రమైన, జనసమ్మర్థంగల పరిసరాల మూలంగా ప్రజల వ్యాధి నిరోధక శక్తి పూర్తిగా బలహీనమయ్యే అవకాశాలు కూడా పెరుగుతాయి.

హెచ్‌ఐవి, టీబీ—రెండింతల సమస్య

ఒక పెద్ద సమస్య ఏమిటంటే ఎయిడ్స్‌ వైరస్‌ అయిన హెచ్‌ఐవితో కలిసి, టీబీ ఒక మరణాంతకమైన జోడీగా ఏర్పడింది. 1995లో ఎయిడ్స్‌ సంబంధిత కారణాలతో పది లక్షలమంది ప్రజలు మరణించివుంటారని అంచనా వేయబడింది. వీరిలో బహుశ మూడవ వంతు టీబీ మూలంగానే మరణించివుంటారు. దీనికి కారణం ఏమిటంటే, శరీరంలో ఉన్న టీబీ నిరోధక సామర్థ్యాన్ని హెచ్‌ఐవి బలహీనపరుస్తుంది.

అత్యధికుల్లో టీబీ ఇన్ఫెక్షన్‌ అనేది అనారోగ్యాన్ని కలుగజేసేంత వరకు అభివృద్ధిచెందదు. ఎందుకు? ఎందుకంటే టీబీ బేసిలస్‌లు మాక్రోఫేజ్‌లనే కణాల్లో బందీలుగా ఉంటాయి. అక్కడ, అవి వ్యక్తి వ్యాధినిరోధక వ్యవస్థలో ప్రాముఖ్యంగా టి లింఫోసైట్‌లు, లేదా టి కణాలు అనేవాటిల్లో బంధించబడివుంటాయి.

టీబీ బేసిలస్‌లు మూత గట్టిగా పెట్టిన బుట్టల్లోని నాగుపాముల్లాంటివి. బుట్టలు మాక్రోఫేజ్‌లు, మూతలు టి కణాలు. అయితే, ఎయిడ్స్‌ వైరస్‌ రంగప్రవేశం చేసినప్పుడు మాత్రం పరిస్థితి మారిపోతుంది, బుట్టలపైనున్న మూతల్ని ఆ వైరస్‌ తన్నేస్తుంది. ఇది జరిగినప్పుడు, ఆ బేసిలస్‌లు తప్పించుకుని శరీరంలోని ఏ భాగాన్నైనా కొల్లగొట్టడానికి సిద్ధంగా ఉంటాయి.

అందుకని, ఆరోగ్యవంతమైన వ్యాధినిరోధక వ్యవస్థ ఉన్న వారికన్నా ఎయిడ్స్‌ రోగులకు తీవ్రమైన టీబీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. “హెచ్‌ఐవి ఉన్న ప్రజలు ఏ వ్యాధికైనా చాలా సుళువుగా లోనౌతారు” అని స్కాట్‌లాండ్‌లోని ఒక టీబీ వైద్య నిపుణుడు అంటున్నాడు. “లండన్‌లోని ఒక ఆసుపత్రిలోని ఇద్దరు హెచ్‌ఐవి రోగులు, ఆసుపత్రి వరండాలో కూర్చుని ఉండగా ఒక టీబీ రోగిని వారి ముందు నుండి చక్రాల కుర్చీలో తీసుకెళ్లినప్పుడు వారిద్దరికీ టీబీ వ్యాధి సోకింది.”

ఆ విధంగా టీబీ మహామారికి ఎయిడ్స్‌ ఆజ్యం పోసింది. ఒక అంచనా ప్రకారం, 2000వ సంవత్సరానికల్లా కేవలం ఎయిడ్స్‌ మహామారి మూలాన 14 లక్షలమంది టీబీ రోగులవుతారు. టీబీ పెరగడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం ఏమిటంటే, ఎయిడ్స్‌ రోగులు వ్యాధికి చాలా సులభంగా లోనౌతారు, అంతేగాక వారు ఎయిడ్స్‌ వ్యాధి లేనివారితో సహా ఇతర ప్రజలకు కూడా టీబీని సంక్రమింపజేయగలరు.

వివిధ రకాల మందులకు లొంగని టీబీ

టీబీకి విరుద్ధంగా చేసే పోరాటాన్ని మరింత కష్టతరం చేసే ఒక చివరి కారణం ఏమిటంటే, మందులను నిరోధించే రకమైన టీబీ వృద్ధిచెందడం. ఈ రకమైన టీబీ, మళ్లీ యాంటీబయోటిక్‌ల కాలానికి ముందున్న పరిస్థితిలాగానే ఈ వ్యాధిని నయం చేయడాన్ని అసాధ్యం చేసే ప్రమాదాన్ని సృష్టిస్తుంది.

శోచనీయమైన విషయం ఏమిటంటే, వివిధ రకాల మందులకు లొంగని టీబీకి కారణం యాంటీ-టీబీ మందుల్ని సరైన రీతిలో వినియోగించకపోవడమే. టీబీకి పూర్తి చికిత్స చేయడానికి కనీసం ఆరు నెలలు పడుతుంది, దీనికి రోగులు ఏమాత్రం క్రమం తప్పకుండా నాలుగు రకాల మందులు తీసుకోవాలి. రోగి రోజుకు దాదాపు డజను టాబ్లెట్‌లను మింగాల్సి రావచ్చు. రోగులు మందుల్ని క్రమంగా తీసుకోకపోయినా లేక ట్రీట్‌మెంటును పూర్తిచేయకపోయినా, చివరికి ఈ వ్యాధిని నయం చేయడాన్ని కష్టతరం చేసే లక్షణాలను పెంపొందించుకుంటారు లేక అసలు నయం చేయడమే సాధ్యం కాని టీబీ లక్షణాలు కూడా ఏర్పడవచ్చు. కొన్ని రకాల టీబీ లక్షణాలు దాదాపు ఏడు ప్రామాణిక టీబీ మందులకు కూడా లొంగడంలేదు.

వివిధ రకాల మందులను నిరోధించే టీబీ ఉన్న రోగులకు చికిత్స చేయడం కష్టమే కాదు, ఖరీదు కూడా. ఈ చికిత్సకు ఇతర రకాల టీబీ ఉన్న రోగుల చికిత్సకయ్యే ఖర్చుకి వందరెట్లు ఎక్కువ కావచ్చు. ఉదాహరణకు, అమెరికాలో ఒక్క రోగికయ్యే వైద్య ఖర్చు 2,50,000 డాలర్లు మించవచ్చు!

మందులకు లొంగని టీబీ ఉన్నవారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10 కోట్లు ఉండవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తుంది. వీటిలో కొన్ని రకాల టీబీలను ఇప్పటివరకు ఉన్న ఏ యాంటీ-టీబీ మందులతోనూ నయం చేయలేము. సాధారణ టీబీ ఎంత సులభంగా సంక్రమిస్తుందో ప్రాణాంతకమైన ఈ టీబీ కూడా అంతే సులభంగా వ్యాపిస్తుంది.

నివారణ, చికిత్స

ఈ భౌగోళిక అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి ఎటువంటి చర్యలు చేపట్టబడుతున్నాయి? ఈ వ్యాధిని నియంత్రించడానికి ఒక శ్రేష్ఠమైన మార్గం ఏమిటంటే, దీన్ని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స చేయడమే. ఇలా చేయడం అప్పటికే రోగులుగా ఉన్నవారికి సహాయం చేయడమే కాక ఇతరులకు సంక్రమించడాన్ని కూడా ఆపుతుంది.

టీబీకి చికిత్స చేయకుండా ఉంటే, దాని బారినపడిన వారిలో సగం మందిని అది హతమారుస్తుంది. అయితే, వివిధ రకాల మందులను నిరోధించే టీబీ కానంత వరకు, సరైన పద్ధతిలో చికిత్స చేస్తే మాత్రం, టీబీ సోకిన దాదాపు ప్రతి ఒక్కరిని నయం చేయవచ్చు.

మనం ఇప్పటివరకు గమనించినట్లుగానే, చికిత్స ప్రభావవంతంగా ఉండాలంటే రోగులు మందుల పూర్తికోర్సును వాడాలి. చాలా తరచుగా జరిగేదేమంటే వారు కోర్సును పూర్తి చేయరు. ఎందుకు? దగ్గు, జ్వరము, మరితర రోగలక్షణాలు చికిత్స ప్రారంభించిన కొన్ని వారాల తర్వాత సాధారణంగా మాయమౌతాయి. అందుకని, చాలామంది రోగులు తమకు స్వస్థత చేకూరిందనుకుని మందులు వాడడం మానేస్తారు.

ఈ సమస్యని ఎదుర్కోవడానికి, ప్రపంచ ఆరోగ్య సంస్థ DOTS అనే కార్యక్రమాన్ని అభివృద్ధి చేస్తుంది. అది “డైరెక్ట్‌లీ అబ్జర్వ్‌డ్‌ ట్రీట్‌మెంట్‌, షార్ట్‌-కోర్స్‌” (“ప్రత్యక్షంగా-గమనించి చేసే చికిత్స, స్వల్పకాలిక-కోర్సు”) అనే దానికి సంక్షిప్తనామం. పేరు సూచిస్తున్నట్లుగానే, తమ రోగులు మందుల ప్రతి డోసును మింగుతున్నారో లేదో ఆరోగ్య కార్యకర్తలు ప్రత్యక్షంగా చూస్తారు. ఇలా కనీసం మొదటి రెండు నెలలు చేస్తారు. అయినా ఇలా చేయడం అన్నివేళలా సాధ్యం కాదు, ఎందుకంటే టీబీ బాధితుల్లో చాలామంది సమాజానికి దూరంగా ఎక్కడో మారుమూలల్లో ఉంటారు. వారి జీవితాలు సాధారణంగా సంక్షోభాలతోనూ, సమస్యలతోనూ నిండివుంటాయి—కొన్ని సందర్భాల్లో నిలువ నీడలేని వారు కూడా ఉంటారు—గనుక వారు మందుల్ని తీసుకుంటున్నారో లేదో క్రమం తప్పకుండా చూడడం ఒక పెద్ద సవాలుగా ఉండగలదు.

కాబట్టి మానవజాతిని పీడిస్తున్న ఈ మహామారిని చివరికి జయించే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా?

[5వ పేజీలోని బాక్సు]

టీబీని గూర్చిన వాస్తవాలు

వివరణ: టీబీ అనేది సాధారణంగా ఊపిరితిత్తులపై దాడిచేసి క్రమంగా వాటిని నాశనం చేసే ఒక వ్యాధి. కానీ అది శరీరంలోని ఇతర భాగాలకు ప్రాముఖ్యంగా మెదడుకు, మూత్రపిండాలకు, ఎముకలకు కూడా వ్యాపించవచ్చు.

రోగలక్షణాలు: ఊపిరితిత్తుల టీబీవల్ల దగ్గు, బరువు కోల్పోవడము, ఆకలి తగ్గిపోవడము, రాత్రుళ్లు అతిగా చెమట పట్టడము, బలహీనత, ఊపిరి అందకపోవడము, ఛాతీ నొప్పులు సంభవించవచ్చు.

రోగనిర్ధారణ చేసే పద్ధతి: ట్యుబర్‌క్యులిన్‌ చర్మ పరీక్ష చేస్తే ఈ బేసిలస్‌ ఉన్నదీ లేనిదీ తెలుస్తుంది. ఊపిరితిత్తులకు సంభవించిన హానిని ఛాతీ ఎక్స్‌రే వెల్లడిస్తుంది, టీబీ ఇన్ఫెక్షన్‌ తీవ్రంగా ఉందని ఇది సూచించవచ్చు. ప్రయోగశాలలో రోగి ఉమ్మిని పరీక్ష చేయడమే టీబీ బేసిలస్‌ను గుర్తించడానికి అత్యంత నమ్మదగిన పద్ధతి.

ఎవరిని పరీక్ష చేయాలి: టీబీ లక్షణాలు ఉన్నవారిని, లేదా టీబీ రోగికి దగ్గరగా మసిలే వారిని, ప్రాముఖ్యంగా గాలిప్రసరణ అంతగా లేని గదుల్లో రోగితో ఉండేవారిని పరీక్షించవచ్చు.

టీకా: ఒకే ఒక్క టీకా ఉంది—దాని పేరు BCG. పిల్లల్లో ప్రాణాంతకమైన టీబీని అది నివారిస్తుంది, కానీ పెద్దపిల్లలకు, వయోజనులకు అది ఏమాత్రం ప్రభావం చూపదు. ఈ టీకా మహా అయితే దాదాపు 15 సంవత్సరాల వరకు రక్షణనివ్వగలదు. BCG కేవలం ఇన్ఫెక్ట్‌ కానివారికే రక్షణనిస్తుంది; అప్పటికే దానిబారిన పడ్డవారికి అది ఏమాత్రం మేలు చేయలేదు.

[6వ పేజీలోని బాక్సు]

టీబీ, ఫ్యాషన్‌

ఇది విడ్డూరంగానే కన్పించవచ్చు, కానీ 19వ శతాబ్దంలో టీబీ శృంగారంతో ముడిపెట్టబడింది. ఎందుకంటే ఈ రోగలక్షణాలు భావాత్మక వైఖరులను, కళాత్మక వైఖరులను పెంపొందిస్తాయని ప్రజలు భావించేవారు.

ఫ్రెంచి నాటకకర్తా నవలా రచయితా అయిన అలెగ్జాండర్‌ డూమస్‌ మేమ్వార్‌ అనే తన పుస్తకంలో 1820ల తొలిభాగంలో ఇలా వ్రాశాడు: “ఛాతీ సంబంధిత వ్యాధులతో బాధపడడం ఒక ఫ్యాషన్‌గా ఎంచబడేది; అందరూ క్షయ పీడితులే, ప్రాముఖ్యంగా కవులు; ముప్ఫై ఏళ్లకు ముందే మరణించడం ఒక ఫ్యాషన్‌గా పరిగణించబడేది.”

“నేను కన్‌సంప్షన్‌ [టీబీ] మూలంగానే చనిపోవాలని కోరుకుంటాను . . . ఎందుకంటే ఆడవాళ్లు, ‘పాపం ఆ బైరన్‌ని చూడండి, చనిపోతున్నా కూడా ఎంత బాగా కనిపిస్తున్నాడో!’ అంటారు” అని ఇంగ్లీష్‌ కవి అయిన లార్డ్‌ బైరన్‌ చెప్పినట్లు నివేదించబడింది.

టీబీ మూలంగా చనిపోయినట్లున్న అమెరికా రచయిత హెన్రీ డేవిడ్‌ థోరియో ఇలా వ్రాశాడు: “క్షీణత, వ్యాధి తరచూ . . . టీబీలాగానే మనోహరంగా ఉంటాయి.”

టీబీపట్ల ఉన్న ఈ పిచ్చి గురించి, ద జర్నల్‌ ఆఫ్‌ ది అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌లోని ఒక శీర్షిక ఇలా చెప్పింది: “ఈ వ్యాధిపట్ల ఇలాంటి అర్థరహితమైన ఆకర్షణ ఫ్యాషన్ల అభిరుచుల్లోనికి చొచ్చుకుపోయింది; స్త్రీలు తెల్లని మేకప్‌ వేసుకుని పాలిపోయివున్నట్లు కనబడడానికి, సుకుమారంగా ఉన్నట్లు కనబడడానికి విఫలయత్నం చేశారు, సన్నని మస్లిన్‌ దుస్తులంటే మక్కువ చూపించారు—ఇదంతా ఆకలి లేమితో బాధపడుతున్నట్లు కన్పించే వారిలా ఉండాలని తాపత్రయపడే నేటి మోడల్స్‌లాగానే ఉంది.”

[7వ పేజీలోని బాక్సు]

టీబీకి గురికావడం సులభమా?

“ట్యుబర్‌క్యులోసిస్‌ సూక్ష్మక్రిముల బారిన పడకుండా తప్పించుకోవడం సాధ్యం కాదు” అని ప్రపంచ ఆరోగ్య సంస్థ భూవ్యాప్త టీబీ కార్యక్రమ డైరెక్టర్‌ డా. అరాటా కోచి చెబుతున్నాడు. “దగ్గడం వల్లనో లేక తుమ్మడం వల్లనో గాలిలోకి ప్రవేశించిన టీబీ క్రిమిని కేవలం ఊపిరి పీల్చుకోవడం ద్వారానే, ఎవరికైనా టీబీ వచ్చే అవకాశం ఉంది. ఈ క్రిములు గాలిలోనే అలా గంటల తరబడి, చివరికి సంవత్సరాల తరబడి ఉండగలవు. మనలో ప్రతి ఒక్కరము ప్రమాదంలో ఉన్నాము.”

అయితే, ఒక వ్యక్తికి టీబీ వ్యాధి సోకకముందు రెండు చర్యలు సంభవించాలి. మొదటిగా, ఆయన లేక ఆమెకు టీబీ సూక్ష్మక్రిమి సోకాలి. రెండవదిగా ఈ ఇన్ఫెక్షన్‌, వ్యాధిగా ముదరాలి.

ఈ వ్యాధిని సులభంగా వ్యాపింపజేసే వ్యక్తితో కొద్ది సమయం గడిపినా టీబీ సోకవచ్చు, కానీ చాలా ఇరుకైన ఇండ్లలో నివసిస్తున్న కుటుంబ సభ్యులమధ్య ఉన్నట్లుగా, దగ్గరగా సహవసిస్తూ ఉన్నప్పుడు టీబీ సోకే అవకాశం ఎక్కువ ఉంది.

టీబీ బేసిలస్‌ను లోపలికి పీల్చుకున్న వ్యక్తికి ఛాతీలో అవి అభివృద్ధి చెందుతాయి. అయితే, 10 మందిలో 9 మంది విషయంలో ఈ ఇన్ఫెక్షన్‌ వ్యాపించడాన్ని వారి రోగనిరోధక వ్యవస్థ అడ్డుకుంటుంది, దీనితో ఆ వ్యక్తులు అస్వస్థులు కారు. అయితే, కొన్నిసార్లు హెచ్‌ఐవి మూలాన, మధుమేహవ్యాధి మూలాన, లేకపోతే క్యాన్సర్‌ చికిత్స కొరకు మందులు వాడడం లేక మరితర కారణాల మూలాన వ్యాధి నిరోధక వ్యవస్థ బాగా బలహీనమైతే నిద్రాణమై ఉన్న బేసిలస్‌లు క్రియాత్మకం కావచ్చు.

[4వ పేజీలోని చిత్రసౌజన్యం]

New Jersey Medical School—National Tuberculosis Center

[7వ పేజీలోని చిత్రం]

ఎయిడ్స్‌ వైరస్‌చే విడుదల చేయబడిన టీబీ బేసిలస్‌లు, బుట్టల్లోనుండి బయటికొచ్చిన నాగుపాముల వంటివి

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి