యుద్ధ హతుల సంఖ్యతో పోటీపడుతున్న మరణాల సంఖ్య
బరువు తగ్గిపోయి బాగా నీరసంగా ఉన్నట్లు అనిపించినప్పుడు తాను ఇటీవలనే గర్భం దాల్చడమే కారణం అనుకుంది 23 ఏళ్ల మెర్లిన్. దగ్గు కూడా ఎడతెరిపి లేకుండా వస్తుంది, ఆ విషయం ఆమె తన డాక్టరుకి చెప్పింది. శ్వాసకోశ వ్యవస్థ పైభాగంలో ఇన్ఫెక్షన్ అవ్వడం మూలంగా ఆ విధంగా అనిపిస్తుందని చెప్పి, ఆయన కొన్ని యాంటిబయాటిక్ మందులు వ్రాసి ఇచ్చాడు. తర్వాత, రాత్రిపూట బాగా చెమటలు పోయడం ప్రారంభం కావడంతో మెర్లిన్ బాగా ఆందోళనపడింది. ఆమె మళ్లీ డాక్టరు దగ్గరికి వెళ్లింది, ఛాతీ ఎక్స్‌రే తీయడానికి ఆయన ఏర్పాటు చేశాడు.
ఎక్స్‌రేలో నీడలాంటిది కన్పించింది, దీనితో అత్యవసరంగా చర్య తీసుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది, కానీ మెర్లిన్‌కు ఫోను ద్వారా ఈ విషయం తెలిపే అవకాశం లేదు. “డాక్టరు మా అమ్మతో ఫోనులో మాట్లాడి నాకు ప్రమాదకరమైన వ్యాధి ఉందని చెప్పాడు” అని చెబుతుంది మెర్లిన్. “మా అమ్మ నన్ను వెదుక్కుంటూ వచ్చి వెంటనే [డాక్టరు] దగ్గరికి వెళ్లమని చెప్పింది. ఆయన నన్ను మళ్లీ ఇంకొక ఎక్స్‌రే తీయించుకోమని చెప్పి నన్ను హాస్పిటల్లో చేర్పించాడు.”
తనకు క్షయ (టీబీ) ఉందని తెలుసుకుని మెర్లిన్ నిర్ఘాంతపోయింది. తాను చనిపోతానని ఆమె అనుకుంది, కానీ యాంటీ-టీబీ మందులు తీసుకున్న తర్వాత ఆమె త్వరలోనే కోలుకుంది.
తనకు టీబీ ఉందని తెలుసుకుని మెర్లిన్ ఆశ్చర్యపోవడం అర్థం చేసుకోదగిందే. ఇటీవలి కాలం వరకు, అభివృద్ధిచెందిన దేశాల్లో టీబీపై విజయం సాధించబడిందని చివరికి చాలామంది ఆరోగ్య నిపుణులు కూడా నమ్ముతూ వచ్చారు. “అది ప్లేగులాగానే అంతమైపోయిందని నేను అనుకున్నాను” అని లండన్‌లోని ఒక చికిత్సాలయంలో పనిచేసే ఆరోగ్య కార్యకర్త అంటుంది. “కానీ నేనిక్కడ పనిచేయడానికి వచ్చినప్పుడే అదింకా సజీవంగానే ఉందనీ, ఈ నగరంలో వ్యాపిస్తుందనీ తెలిసింది.”
టీబీ నిర్మూలించబడిన ప్రాంతాల్లోకే అది మళ్లీ ప్రవేశించింది; అది సజీవంగా ఉన్న ప్రాంతాల్లో, పరిస్థితి ఇంకా ఘోరంగా తయారైంది. దానిపై విజయం సాధించడం మాట అలావుంచితే, ఇప్పుడు టీబీ వల్ల మరణించేవారి సంఖ్య యుద్ధంవల్ల కరవువల్ల చనిపోయేవారి సంఖ్యకు సమానంగా ఉంటోంది. వీటిని పరిశీలించండి:
▪ ఆధునిక వైద్య రంగం అద్భుతాలు సాధించినప్పటికీ, గత వంద సంవత్సరాలలో టీబీ, దాదాపు 20 కోట్ల మందిని స్మశానానికి పంపించింది.
▪ ఇప్పటికే దాదాపు 200 కోట్లమంది ప్రజలు—ప్రపంచ జనాభాలో మూడవ వంతుమంది—టీబీ బేసిల్లస్ అనే ఒక రకమైన సూక్ష్మక్రిమికి గురైవున్నారు. దానికి తోడు, క్షణానికి ఒకరికి చొప్పున టీబీ సోకుతుంది!
▪ 1995లో టీబీ వ్యాధి బాగా ముదిరిపోయి ఉన్న వ్యక్తుల సంఖ్య 2.2 కోట్లు. దాదాపు 30 లక్షలమంది చనిపోయారు, వారిలో చాలామంది అభివృద్ధిచెందుతున్న దేశాల్లోనివారే.
టీబీని ఎదుర్కోవడానికి శక్తివంతమైన మందులు ఉన్నా, ఈ వ్యాధి మానవజాతిని ఎందుకిలా పట్టి పీడిస్తుంది? ఎన్నటికైనా దానిపై విజయం లభిస్తుందా? ఆ వ్యాధి సోకకుండా మిమ్మల్ని మీరు కాపాడుకునే మార్గమేదైనా ఉందా? తర్వాతి శీర్షికలు ఈ ప్రశ్నలకు సమాధానమిస్తాయి.
[3వ పేజీలోని చిత్రసౌజన్యం]
New Jersey Medical School—National Tuberculosis Center