ప్రపంచ పరిశీలన
అపాయకరమైన అపార్థాలు
1977లో ఒక చిన్న మాటను అపార్థం చేసుకోవడం వల్ల ప్రపంచంలో ఇంతవరకు జరిగినవాటన్నింటిలోకెల్లా అతి పెద్ద వైమానిక దుర్ఘటన జరిగిందని ద యూరోపియన్ వార్తాపత్రిక నివేదించింది. 747 విమానం డచ్ పైలట్ తను “అట్ టేక్ ఆఫ్”లో ఉన్నాడని (విమానం బయలుదేరిందని) రేడియో సమాచారాన్ని తెలపగా, విమానం నిలబడి ఉందని కానరీ దీవుల్లోని టెనరీఫ్‌లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అర్థం చేసుకున్నాడు. అయితే, బాగా మబ్బుపట్టిన రన్‌వేలో ఉన్న విమానం వేగం పుంజుకుని పైకి ఎగరబోతోందన్నదే పైలట్ చెప్పిన దాని అర్థం. అలా, ఆ విమానం మరో 747కి ఢీకొనగా 583 మంది చనిపోయారు. అలాగే, 1996లో ఇండియాలో ఢిల్లీ దగ్గర గగనతలంలో విమానాలు ఢీకొని 349 మంది చనిపోవడానికి దోహదపడిన ఒక కారకం కావలసినంత భాషా నైపుణ్యం లేకపోవడమే. పెద్ద పొరపాట్లు అరుదే అయినప్పటికీ, ఫ్లైట్ సిబ్బందులు ప్రామాణిక వైమానిక సంబంధంగా ఇంగ్లీష్‌లో మంచి తర్ఫీదు పొందుతున్నప్పటికీ, కొన్ని వైమానిక సిబ్బందులకు కేవలం కొన్ని వైమానిక పదాలు మాత్రమే తెలుసు. ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు, వారు తమ భాషా నైపుణ్యాలను ఉపయోగించడంలో తడబడతారు. సరైన సమాచార వినిమయం జరిగేందుకు కాక్‌పిట్ కంప్యూటర్ టెక్నాలజీని ఇన్‌కార్పరేట్ చేయాలని నిపుణులు సిఫారసు చేస్తున్నారు.
ప్రపంచవ్యాప్త చట్టవిరుద్ధ మత్తుమందు ఉపయోగం
ప్రతి సంవత్సరం, దాదాపు 40,000 కోట్ల అమెరికా డాలర్ల మొత్తం అంతర్జాతీయ వాణిజ్య వ్యవసాయ ఆదాయంలో 8 శాతం చట్ట విరుద్ధ మత్తుమందుల వ్యాపారమేనని ఐక్య రాజ్య సమితి నివేదిక చెబుతోంది. చట్టవిరుద్ధ మత్తుమందుల ప్రపంచవ్యాప్త ప్రభావాన్ని గూర్చిన మొదటి సమగ్ర అధ్యయనాన్ని గూర్చినదే 332 పేజీల ఈ నివేదిక. ప్రపంచ జనాభాలోని దాదాపు 2.5 శాతం—దాదాపు 14 కోట్ల మంది ప్రజలు—మారివానాను లేదా దాని నుండి తయారు చేసిన హషిస్‌ను సేవిస్తున్నారని అది చూపుతోంది. మూడు కోట్ల మంది ఆమ్‌ఫటమైన్ రకపు ఉత్తేజకాలను, 1.3 కోట్ల మంది ఏదో ఒక రకమైన కొకైన్‌ను, 80 లక్షల మంది హెరాయిన్‌ను ఉపయోగిస్తున్నారు. చట్టాన్ని అమలుచేసే ఏజెన్సీలు వేల కొలది టన్నుల మరిజ్వానాను, కొకైన్‌ను, మార్ఫిన్‌ను పట్టుకున్నారు. అయితే మరెన్నో పరిశోధనలో దొరక్కుండా పోయాయి. దాదాపు 30 శాతం కొకైన్, కేవలం 10 నుండి 15 శాతం హెరాయిన్ మాత్రమే పట్టబడ్డాయని నివేదిక చెబుతుంది. అంతర్జాతీయ మత్తుమందు వ్యవహారాలు చాలా సంకీర్ణంగా మారాయి. “సమస్య భూగోళవ్యాప్తమైనది కనుక, ఒక్కో దేశం విడిగా ప్రయత్నించడం వల్ల సమస్య పరిష్కరించబడదు” అని ఐక్యరాజ్య సమితి మత్తుమందు నియంత్రణ కార్యక్రమ డైరెక్టర్ జనరల్ అయిన జోర్జో జాకోమెల్లీ అంటున్నారు.
రిమోట్ కంట్రోల్ ఎవరి చేతిలో ఉంటోంది?
టీవీ వీక్షించే అలవాట్లను అధ్యయనం చేయగా తేలిన ఫలితాలను ఇటలీలోని యూరిస్పెస్ (ఇన్‌స్టిట్యూట్ ఫర్ పొలిటికల్, ఎకనామిక్ అండ్ సోష్యల్ స్టడీస్)లోని పరిశోధకులు ఇటీవలే ప్రచురించారు. ఇటలీలోని దాదాపు 2,000 కుటుంబాలను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. కుటుంబంలో ఆధునిక దిన అధికార దండముగా టీవీ రిమోట్ కంట్రోల్‌ను వర్ణించిన వార్తాపత్రిక శీర్షికలో వాళ్ళను అడిగిన ప్రశ్నలతో పాటు, రిమోట్ కంట్రోల్‌ను ఎక్కువగా ఎవరు పట్టుకుని ఆపరేట్ చేస్తారు అనే ప్రశ్న కూడా వేయడం జరిగింది. చాలా వరకు తండ్రే అధికారం చెలాయిస్తున్నట్లు పేర్కొనబడింది. చానల్‌లను మార్చే విషయానికొస్తే నిర్ణయం తీసుకోవడంలో పిల్లలు రెండవ స్థానంలో ఉంటున్నారు. కుటుంబంలో రిమోట్ కంట్రోల్‌ను పట్టుకోవడంలో తల్లి చివరి స్థానంలో ఉంటోంది.
అంటువ్యాధులు విజృంభిస్తున్నాయి
“గత 20 సంవత్సరాల్లో, పూర్తిగా క్రొత్తవైన మరియు విపరీతంగా వ్యాపించేవైన 30 రుగ్మతలు తలెత్తాయి” అని నాషావూషే నోయీ ప్రెస్ నివేదిస్తుంది. ఈ రుగ్మతల్లో అనేకానికి—ఈబోలా, ఎయిడ్స్, హెపటైటిస్ సి వంటివాటికి—చికిత్స లేదు. అంతేగాక, మలేరియా, కలరా, క్షయవ్యాధి వంటి అంటు వ్యాధులు కూడా విజృంభిస్తున్నాయి. ఎందుకని? ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయం ప్రకారం, “అనేక యాంటిబయోటిక్‌లను ఎదుర్కొని నిలబడే వైరస్‌లు అధికమౌతున్నందువల్లే అనేక రుగ్మతలు మళ్ళీ ప్రత్యక్షమౌతున్నాయి. ఈ ప్రక్రియకు చాలా ఖర్చవుతుంది కనుక, క్రొత్త యాంటిబయోటిక్‌లు చాలా తక్కువగా ఉత్పత్తి చేయబడుతున్నాయి.” ఈ ధోరణిని మార్చే ప్రయత్నంలో, “క్రొత్త యాంటిబయోటిక్‌ల వికాసానికి, అంటువ్యాధుల నిర్ధారణా పద్ధతులను మెరుగుపరచేందుకు మరింత పెట్టుబడి పెట్టమని” ప్రభుత్వాలనూ, మందుల కంపెనీలను ప్రపంచ ఆరోగ్య సంస్థ వేడుకుంది. 1996లో భూగోళవ్యాప్తంగా అంటురోగాల వల్ల మరణించిన వారి సంఖ్య 5.5 కోట్లు.
“పరిశుద్ధ నగరం” ఎడల క్షీణించిపోతున్న భక్తి
పరిశుద్ధ నగరం అని పిలువబడుతున్నప్పటికీ, కాథలిక్ చర్చి అధ్యక్షుడే దాని బిషప్ అయినప్పటికీ, రోమ్ నగరం కొందరు అనుకునేంత మతనిష్ఠగలదేమీ కాదు. థర్డ్ యూనివర్సిటీ ఆఫ్ రోమ్ నిర్వహించిన జాతీయ సర్వే ప్రకారం, ఇటలీ దేశంలోని దాదాపు 10 శాతం మందికి క్రైస్తవత్వంలో “ఏ మాత్రం” ఆసక్తి “లేదు,” అయితే రోమ్‌లో అలా ఆసక్తిలేనివారి సంఖ్య 19 శాతానికి పెరిగింది. మరో అదనపు 21 శాతం మంది రోమన్‌లకు కాథలిక్ చర్చిలో “ఏదో కాస్త” ఆసక్తి ఉంది అని లా రేపబ్లీకా అనే వార్తాపత్రిక చెబుతుంది. మరో వైపు, వారిలో కేవలం 10 శాతం మందికి మాత్రమే మతం విషయంలో మంచి ఆసక్తి ఉంది. రోబర్టో చీప్రీఆనీ అనే సామాజికవేత్త అభిప్రాయం ప్రకారం, ప్రతి నలుగురు రోమన్‌లలో కేవలం ఒక్కరు మాత్రమే దృక్పథమూ మరియు ప్రవర్తనను గూర్చి చర్చి చెబుతున్నవాటిని కచ్చితంగా అనుసరిస్తున్నారు.
టీబీ ఇండియాను పీడిస్తోంది
క్షయవ్యాధికి (టీబీ) కారణమయ్యే బ్యాక్టీరియాను అదుపులో పెట్టే విస్తృత ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, ఇండియాలోని ప్రతి ఇద్దరిలో ఒకరికి ఇది ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఇండియాలోని 90 కోట్ల కన్నా అధికంగా ఉన్న జనాభాలో, ప్రతి సంవత్సరం 20 లక్షలకన్నా ఎక్కువ మందిలో టీబీ చురుగ్గా వృద్ధి చెందుతోంది, దాదాపు 5,00,000 మంది చనిపోతున్నారు అని ది ఏషియన్ ఏజ్ వార్తాపత్రిక నివేదిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ఈ వ్యాధి చాలా ఎక్కువగా సోకుతుంది, అలా సోకినవారి సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉంది. టీబీ సోకినవారు ఆ వ్యాధిని తట్టుకోవడంలోనే కాక, ఈ వ్యాధితో వచ్చే మచ్చను భరించేటప్పుడు కూడా సమస్యను ఎదుర్కొంటారు. పొరుగువాళ్ళూ, ఉద్యోగస్థులు, తోటి పనివారు వారిని తిరస్కరించడానికి ఇది కారణం కాగలదు. టీబీ ఉన్నట్లు కనుగొనబడిన క్రొత్త పెళ్ళి కూతుళ్ళు పిల్లలను కనలేనివారంటూ పుట్టింటికి పంపివేయబడుతున్నారు.
జననాంగం ఛేదించబడిన బాలికలూ, టీనేజ్ ప్రసవాలూ
“ప్రతి సంవత్సరం సుమారు 20 లక్షల మంది బాలికల జననాంగం ఛేదించబడుతోంది” అని ఆరోగ్యం, పోషకాహారం, మరియు పిల్లల విద్యాభ్యాసం అనే అంశాలను చర్చించే ఐక్యరాజ్య పిల్లల నిధి ప్రచురణయైన ద ప్రోగ్రెస్ ఆఫ్ నేషన్స్ 1996 సంపుటి పేర్కొంది. “ఈజిప్టు, ఇథియోపియా, కెన్యా, నైజీరియా, సొమాలియా, సూడాన్ 75% కేసులకు బాధ్యులు. జబూటీ మరియు సొమాలియాలో 98% మంది బాలికల జననాంగ ఛేదం జరిగింది.” ఆ ప్రక్రియల వలన నొప్పే కాకుండా, ఇన్‌ఫెక్షన్, దీర్ఘకాల బ్లీడింగ్, సంతానం కలగకపోవడం, మరణం కూడా సంభవించవచ్చు. “జననాంగఛేదాన్ని ఏ మతమూ కోరడం లేదు. కన్యాత్వాన్నీ, వివాహయోగ్యతా నిశ్చయతనూ, లైంగిక నివారణను కాపాడేందుకు రూపొందించబడిన సాంప్రదాయమిది” అని నివేదిక పేర్కొంది. స్త్రీల హక్కులు, బిడ్డ క్షేమము గురించి శ్రద్ధ తీసుకుంటున్న గుంపులూ, సంస్థలూ ఈ ఆచారాన్ని నిషేధించాలని ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నాయి.
అనేక దేశాల్లో టీనేజ్ ప్రసవాలు ఎడతెగని సమస్యగా ఉన్నాయని రెండవ నివేదిక చూపిస్తుంది. ఉదాహరణకు, పారిశ్రామిక ప్రపంచంలో చూస్తే అమెరికాలోనే అత్యధిక రేటు ఉంది: ప్రతి సంవత్సరం, 15 నుండి 19 లోపు వయస్సుగల ప్రతి 1,000 మంది బాలికల్లో 64 మంది ప్రసవిస్తున్నారు. జపాన్‌లో రేటు అతి తక్కువ—సంవత్సరానికి నాలుగు ప్రసవాలు. టీనేజ్ ప్రసవాలు యువతుల వికాసాన్నీ, విద్యాభ్యాసాన్నీ, అవకాశాలను బాధించడమే కాక, శిశువుకు సరైన ఆలనా పాలనా లేకపోవడం, దారిద్ర్యమూ, సుస్థిరతలేని వాతావరణం వంటి సమస్యలను కూడా తెచ్చిపెడ్తాయి.
కాలుష్యమూ, బాల్యంలోని క్యాన్సరూ
22,400 మంది బ్రిటీష్ పిల్లలపై 27 సంవత్సరాలపాటు చేసిన అధ్యయనాన్ని విశ్లేషించిన తర్వాత, మిగతా పిల్లల కన్నా, కలుషితమౌతున్న స్థలానికి ఐదు కిలోమీటర్ల దూరంలోపు పుట్టిన పిల్లలు లుకేమియా, మరితర బాల్యకాల క్యాన్సర్‌ల వల్ల మరణించే ప్రమాదం 20 శాతం ఎక్కువగా ఉందని ఎపిడెమియోలజిస్టులు కనుగొన్నారు. బాల్యకాల క్యాన్సర్ కేసులను అధికం చేసిన “అమిత సంభావ్య ప్రక్రియ” గాలిలోని కలుషితం చేసే పదార్థాలకు గురవ్వడమేనని లండన్‌లోని ద టైమ్స్ నివేదిస్తుంది. ఆయిల్ రిఫైనరీలు, ఆటోమొబైల్ ఫ్యాక్టరీలు, నాన్‌న్యూక్లియర్ పవర్ స్టేషన్‌లు, స్టీల్‌వర్క్స్, సిమెంట్ వర్క్స్‌వంటి పారిశ్రామిక ప్లాంట్‌లు గ్యాసొలిన్ పొగలను, లేదా త్వరగా ఆవిరైపోయే సేంద్రీయ రసాయనాలను వెదజల్లడమే కాలుష్యానికి కారణమనిపిస్తుంది. రోడ్లకు, రైల్వేలకు నాలుగు కిలోమీటర్ల దూరంలోపు జన్మించిన పిల్లల్లో క్యాన్సర్ మూలాన అధిక మరణాలు సంభవిస్తున్నాయని కూడా అధ్యయనం నివేదిస్తుంది. గ్యాసొలిన్ మరియు డీసెల్ ఇంధనాలు ఇందుకు కారణమౌతుండవచ్చని ఈ నివేదికను తయారుచేసినవారు చెబుతున్నారు.
రక్తము, హెచ్‌ఐవి సోకడమూ
ప్రపంచవ్యాప్తంగా హెచ్‌ఐవి /ఎయిడ్స్ సోకిన దాదాపు 2.2 కోట్ల మంది ప్రజల్లో 90 కన్నా ఎక్కువ శాతం మంది అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నివసిస్తున్నవారే. “అభివృద్ధిచెందుతున్న దేశాల్లో క్రొత్తగా హెచ్‌ఐవి సోకిన కేసుల్లో 10 శాతం మేరకు కారణం రక్త మార్పిడియే”నని లండన్‌లోవున్న సమాచార సంస్థయైన పానాస్ నివేదిస్తుంది. అనేక దేశాల్లోని హెచ్‌ఐవి లాబోరేటరీ పరిశోధనలు పూర్తిగా నమ్మదగినవి కానందున లభ్యమయ్యే రక్త సరఫరా సురక్షితమైనది కాదు. ఉదాహరణకు, పాకిస్తాన్‌లో సగం కన్నా తక్కువ రక్త బ్యాంకుల్లో మాత్రమే హెచ్‌ఐవి స్క్రీనింగ్ ఉపకరణం ఉంది. అలా, 12 శాతం క్రొత్త హెచ్‌ఐవి ఇన్‌ఫెక్షన్‌లకు రక్త మార్పిడులే కారణమయ్యాయి. 15 కన్నా ఎక్కువ సంవత్సరాల క్రితం, ఎయిడ్స్ మొదటి కేసులు నివేదించబడినది మొదలుకొని, ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా దాదాపు మూడు కోట్ల మంది ప్రజలకు ఈ వ్యాధిని కలుగజేసే వైరస్ అయిన హెచ్‌ఐవి సోకింది.
టీన్ సెక్స్
నైజీరియా వార్తాపత్రికయైన వీకెండ్ కాన్‌కార్డ్ ప్రకారం, “ప్రపంచంలో లైంగిక విషయంలో అత్యధికంగా చురుగ్గా ఉన్నది నైజీరియాలోని యౌవనులు” అని ఇటీవలి అధ్యయనం కనుగొంది. 14 నుండి 19 ఏండ్ల వయస్సుగల దాదాపు 68 శాతం మంది అబ్బాయిలు, 43 శాతం మంది అమ్మాయిలు తాము “యౌవనంలోకి అడుగుపెట్టిన కొద్దికాలానికే” లైంగికతలో పాల్గొన్నట్లు ఒప్పుకున్నారు. ఇది అనేక అవాంఛిత గర్భధారణలకు నడిపింది. “నైజీరియాలో 19 ఏండ్లలోపు వయస్సులోని అమ్మాయిల మరణాల్లో 71 శాతం అబార్షన్ కాంప్లికేషన్స్ వల్లేనని” ఒక ప్రత్యేక అధ్యయనం చూపిస్తుందని కాన్‌కార్డ్ చెబుతుంది.
చేతులు కడుక్కోకపోవడం వల్ల కలిగే గడ్డు పరిస్థితి
భోజనం చేసే ముందు, లేక టాయిలెట్‌కు వెళ్ళిన తర్వాత చేతులు కడుక్కోకపోవడమనే ఆందోళన కలిగించే ధోరణిని ల కోటీడ్యాన్ డ్యూ మేడసాన్ అనే ఫ్రెంచ్ మెడికల్ వార్తాపత్రికలోని ఇటీవలి శీర్షిక నొక్కి చెప్పింది. ఫ్రేడేరీక్ సాల్డ్‌మ్యాన్ ప్రకారం, వ్యక్తిగత పారిశుద్ధ్యమనే ఈ చిన్న విషయం లోపించడమే మలినమైన ఆహార సంబంధ అనారోగ్యాలకు కారణమౌతుంది, ఇది విస్తృతంగా ప్రబలివున్న సమస్యగా అనిపిస్తుంది. ఇంగ్లండ్‌లోని బార్‌లలో బఠాణీల గిన్నెల్లో 12 మంది వేర్వేరు వ్యక్తుల మూత్ర జాడ కనిపించినట్లు ఒక శీర్షిక చెప్పింది. క్రమంగా చేతులు కడుక్కునేలా స్కూల్లో టీచర్లు పర్యవేక్షణ చేసినప్పుడు అజీర్తి సమస్యలతో గైరు హాజరవ్వడం 51 శాతం వరకు తగ్గిందనీ, శ్వాస సంబంధ సమస్యల వల్ల గైరుహాజరవ్వడం 23 శాతం వరకు తగ్గిందనీ అమెరికాలో జరిపిన మరో అధ్యయనం తెలియజేసింది. పారిశుద్ధ్యాన్ని గూర్చిన అలాంటి మౌలిక సూత్రాలను శైశవం నుండే పిల్లలకు నేర్పవలసిన అవసరాన్ని నొక్కి చెబుతూ ఆ శీర్షిక ముగిసింది.
ఏనుగులు సమాచారాన్ని తెలియజేసుకోవడం
ఏనుగు స్వర తంత్రులు చాలా పెద్దగా ఉంటాయి కనుక, అవి చేసే శబ్దాల యొక్క ప్రాథమిక పౌనఃపున్యం ఒక సెకండుకు 20 లేదా అంత కన్నా తక్కువ వృత్తాలు. అది మానవుల వినికిడి శక్తి కన్నా చాలా తక్కువే. అలాంటి తక్కువ స్థాయిలోని శబ్దాలు బహుదూరం వరకు కొనిపోబడతాయి, ఏనుగులు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్నా ఆ శబ్దాలను గుర్తుపడ్తాయి. అవి ఇతర 150 వేర్వేరు ఏనుగుల స్వరాలను కూడా వేర్వేరుగా గుర్తుపడ్తాయి. అలా గుర్తుపట్టి, తమ కుటుంబ సభ్యులకూ, తమ గుంపుకు సన్నిహితులైన ఏనుగులకూ అనుకూలంగా ప్రతిస్పందిస్తాయి. సాధారణంగా ఏనుగులు అపరిచితుల పిలుపులను అలక్ష్యం చేస్తాయి లేదా ఆ పిలుపులను విన్నప్పుడు ఉద్రేకపడతాయి. కెన్యాలోని ఆమ్‌బోసలీ నేషనల్ పార్క్‌లో పరిశోధనాత్మక అధ్యయనాలు జరిగిన తర్వాత, “అలాంటి విస్తృతమైన స్వర సమాచార అల్లికలు మరే క్షీరదంలోను కనిపించలేదు” అని బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సస్సెక్స్‌లో పని చేస్తున్న జంతు ప్రవర్తనా శాస్త్రజ్ఞురాలైన డా. కరన్ మ్యాక్కోమ్ వివరించారని లండన్‌లోని ద టైమ్స్ నివేదిస్తుంది.