మా పాఠకుల నుండి
పాముకాట్లు ప్రొఫెషనల్ సరీసృప శాస్త్రజ్ఞుడుగా, పాముల సంరక్షణలోను, వాటితో వ్యవహరించే విషయంలోనూ, అలాగే, వాటి విషాన్ని తీసివేయడంలోనూ నేను బాధ్యతగల వ్యక్తిని. “ఓ త్రాచు పామును కలిసేందుకు మీరు ఇష్టపడతారా?” (ఏప్రిల్ 8, 1996), “హాబు—దూరంగా ఉంచవలసిన పాము” (జూలై 8, 1996, ఆంగ్లం), “అపాయం! నేను విషపూరితమైనదాన్ని” (ఆగస్టు 22, 1996, ఆంగ్లం) అనే శీర్షికలన్నీ యెహోవా సృష్టి ఎడల అనుకూలమైన దృక్పథాన్ని చూపించాయి. అయితే, పాముకాట్లకు టూర్నికట్‌లు సిఫారసు చేయబడడం లేదని తెలియజేయాలనుకుంటున్నాను. అనేక మంది వాటిని సరిగ్గా ఉపయోగించలేకపోతున్నారు. కొందరు దాని వల్ల తమ అవయవాల్ని పోగొట్టుకున్నారు. బెణికిన చీలమండపై లేదా మణికట్టుపై చుట్టేందుకు ఉపయోగించే శక్తితో మొత్తం అవయవాన్ని బిగుతుగా కట్టేందుకు ప్రెషర్ బాండేజ్‌ను ఉపయోగించాలని నేను గట్టిగా సలహా ఇస్తున్నాను. కాటువేయబడిన అవయవములోనే విషాన్ని ఆపివేసి, ఆ అవయవాన్ని “చేతనంగా” ఉంచుతూ రక్త సరఫరాను అనుమతించవచ్చు.
పి. ఆర్., ఇంగ్లండ్
ఇటీవలి అనేక మెడికల్ పాఠ్యపుస్తకాలు ఈ విషయంతో ఏకీభవించాయి, ఈ విషయాన్ని స్పష్టం చేసినందుకు మా పాఠకునికి కృతజ్ఞతలు చెబుతున్నాం.—ఎడిటర్.
మాల కాకి “మాలకాకి—దాన్ని వ్యత్యస్తమైనదిగా చేసేదేమిటి?” అనే శీర్షిక వచ్చినప్పుడు నేను అనారోగ్యంతో ఉన్నాను. (జనవరి 8, 1997, ఆంగ్లం) అప్పట్లో నన్ను ఏదీ నవ్వించలేకపోయేది. కాని మాలకాకి చాతుర్యం నన్ను నవ్వించేసింది. తర్వాత, నేను స్కూల్లో పక్షులను గురించి వ్యాసం వ్రాసినప్పుడు, తేజరిల్లు!లోని శీర్షికల్లోని సమాచారాన్ని ఉపయోగించాను. అందులో నాకు హైగ్రేడ్ లభించింది!
జె. బి., స్లోవాకియా
నేర్చుకోలేని అశక్తతలు “నేర్చుకోవడానికి సంబంధించిన అశక్తతలు ఉన్న పిల్లలకు సహాయం” అనే పరంపరకు కృతజ్ఞతలు. (మార్చి 8, 1997) నేను ఒక ప్రైవెట్ స్కూల్‌ను నడుపుతున్నాను. మా స్కూల్లోని ఉపాధ్యాయుల కోసం నేను ఈ శీర్షికల ఫోటోస్టాట్‌కాపీలను తీశాను. మీ పత్రికలోని సమాచారం ఆధారంగా నేను వార్తాలేఖలను కూడా వ్రాశాను. మీరు ఈ అంశాలను సంతులితమైన విధంగా చర్చించినందుకు కృతజ్ఞతలు.
ఇ. జి., హొండురాస్
నేను పెద్ద నేషనల్ నాన్‌ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరును. ADD ఉన్న పిల్లల కోసం, వయోజనుల కోసం చురుగ్గా పనిచేస్తున్నాను. అటెన్షన్ డెఫిసిట్ హైపర్‌యాక్టివిటీ డిజార్డర్ (ADHD) అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్ (ADD) అంశాలను గూర్చిన మీ శీర్షికను అభినందించవలసిందే. ఇవి అశక్తులను చేసేటువంటి, తరచూ అపార్థం చేసుకోబడేటువంటి రుగ్మతలు. సహాయాన్ని వెదికే అనేకులకు సరైన రోగనిర్ణయ పరీక్షల ద్వారా, క్రొత్తగా కనుగొన్న చికిత్సల ద్వారా ఇప్పుడు ప్రయోజనం లభిస్తుందని తెలియజేసినందుకు మేము మిమ్మల్ని ప్రశంసిస్తున్నాం. మీరు తల్లిదండ్రుల ప్రేమను మరియు వారి అవగాహనను నొక్కిచెప్పడం ఒక ప్రాముఖ్యమైన సందేశాన్ని పంపిస్తుంది.
ఎల్. ఆర్., అమెరికా
ADHD ఉన్న కుమారుడు నాకున్నాడు. వాడు ఇబ్బందిపెట్టే బిడ్డ మాత్రమే కాదన్న విషయాన్ని అంగీకరించడం నాకు చాలా కష్టంగా ఉండేది. “ఆ అబ్బాయికి వాళ్ళు మంచి క్రమశిక్షణను ఎందుకివ్వరు?” వంటి దయలేని అనేక ప్రస్తావనలు జరిగాయి. వాడికి క్రమశిక్షణనిచ్చే ప్రయత్నంలో నేను చాలా సమయాన్ని గడిపానన్న వాస్తవం దృష్ట్యా ఈ ప్రస్తావనలు నన్ను బాగా బాధపెట్టాయి. నిజంగా సమస్య ఉందనీ, తాము మరింత ప్రోత్సాహకరంగా ఉండగలరనీ ఇతరులు గ్రహించేందుకు ఈ రుగ్మతను గురించి మీరిచ్చిన వివరణ సహాయపడుతుందని ఆశిస్తున్నాను.
ఎమ్. టి., అమెరికా
నేర్చుకునే సామర్థ్యం లేని బిడ్డ తల్లిదండ్రులమైన మేము ఈ సంచికను చదివి ఎంత ఆనందించామో మీరు ఊహించగలరు. ఇది తల్లిదండ్రులను ఎలా బాధిస్తుందన్న విషయాన్నీ, ఇతరులనుండి వచ్చే గాయపరచే వ్యాఖ్యనాలే కాక మాకు బోలడంత బరువు ఉందని మీరు పేర్కొనడాన్ని మరింత అమూల్యంగా ఎంచుతాం.
జె. సి. మరియు బి. సి., కెనడా
దేవుని స్నేహితుడు “యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . . నేను దేవుని స్నేహితునిగా ఎలా అవ్వగలను?” అనే శీర్షికకు చాలా కృతజ్ఞతలు. (మార్చి 8, 1997) అది నాకు చాలా సహాయపడింది. నాకు ఇప్పుడు తృప్తిగా ఉంది. ఎందుకంటే, యెహోవా నా స్నేహితుడని నేను ఇప్పుడు గ్రహిస్తున్నాను! ఈ స్నేహాన్ని ఎలా కాపాడుకోవచ్చనే అంశంపై శీర్షిక వచ్చే వరకు నేను వేచి ఉండలేను.a
టి. ఇ., ఇటలీ
పువ్వులు నాకు పదేండ్లు. “పువ్వులు ఒకరు శ్రద్ధ తీసుకుంటున్నారని తెలియజేస్తున్నాయి” (ఏప్రిల్ 8, 1997) అనే శీర్షికకు కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాను. పువ్వులు ఎక్కువ సేపు తాజాగా ఉండేందుకు ఎలా శ్రద్ధ తీసుకోవాలో అది నాకు నేర్పింది.
ఎల్. సి., ఇటలీ
నాకు పువ్వులంటే చాలా ఇష్టం కనుక, పువ్వులు తాజాగా ఉండేందుకు ఏమి చేయాలో తెలుసుకోవాలని కొన్ని సంవత్సరాలుగా అనుకున్నాను. అయితే, అవి ఎప్పుడు అతి త్వరగా వాడిపోతుంటాయి. తేజరిల్లు!లోని సలహాలు నాకు నిజంగా సహాయపడ్డాయి. మీరు చేస్తున్న పనికి నేను చాలా కృతజ్ఞుడను.
జె. పి., మెక్సికో
[అధస్సూచి]
a జూన్ 8, 1997 తేజరిల్లు! చూడండి.