కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g98 1/8 పేజీలు 16-18
  • స్వలింగ సంయోగులను క్రైస్తవులు ద్వేషించాలా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • స్వలింగ సంయోగులను క్రైస్తవులు ద్వేషించాలా?
  • తేజరిల్లు!—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవుని దృక్కోణం
  • “చెడుతనమును అసహ్యించుకొనుడి”
  • ‘దేవుడు పక్షపాతి కాడు’
  • మారుమనస్సు పొందినవారికి క్రైస్తవులు స్వాగతం పలుకుతారు
  • సలింగసంయోగం—నిజంగా అదంత చెడ్డదా?
    తేజరిల్లు!—1995
  • హోమోసెక్సువాలిటీ తప్పా?
    యువత అడిగే ప్రశ్నలు
  • హోమోసెక్సువల్స్‌ గురించి బైబిలు ఏమి చెప్తుంది?
    తేజరిల్లు!—2016
తేజరిల్లు!—1998
g98 1/8 పేజీలు 16-18

బైబిలు ఉద్దేశము

స్వలింగ సంయోగులను క్రైస్తవులు ద్వేషించాలా?

స్వలింగ సంయోగులను గూర్చిన తర్కరహితమైన భయాన్ని, లేదా విరక్తిని వర్ణించే ఒక పదం 1969లో ఇంగ్లీష్‌ భాషలో సృష్టించబడింది. ఆ పదమే “హోమోఫోబియా.” అనేక భాషల్లో అలాంటి నిర్దిష్టమైన పదం లేదు. అయితే వేల కొలది సంవత్సరాలుగా, అనేక జాతుల్లోని, భాషల్లోని ప్రజలు స్వలింగ సంయోగుల ఎడల అయిష్టాన్ని కనబరచారు.

అయితే, ఇటీవలి కాలాల్లోనే, స్వలింగ సంయోగమనేది ప్రత్యామ్నాయ సంయోగంగా అంతటా ప్రాచుర్యం పొందింది. “స్వలింగ సంయోగాన్ని సహజమైనదిగా ప్రజలు గుర్తించాలి, దానికి తగిన గౌరవం చూపించాలి అన్న డిమాండ్‌ అధికమౌతోంది” అని చరిత్రకారుడైన జెర్రీ జెడ్‌. ముల్లర్‌ అంటున్నాడు. స్వలింగ సంయోగులు “తాము చేస్తున్నది స్తుత్యర్హమని ప్రకటించేందుకూ, మిగతా వాళ్ళు కూడా అలాగే చెయ్యాలని డిమాండ్‌ చేసేందుకూ చాలా ఎక్కువగా సంఘటితమౌతున్నారు” అని ఆయన వివరిస్తున్నాడు. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో ఇది కనిపిస్తుంది. అయితే, లోకంలోని అనేక ప్రాంతాల్లో, మరి ఎంతో స్వేచ్ఛ ఉన్న దేశాల్లో కూడా, ఇప్పటికీ అనేకులు స్వలింగ సంయోగాన్ని ఖండిస్తారు, తిరస్కరిస్తారు.

స్వలింగ సంయోగులూ, స్వలింగ సంయోగం చేస్తున్నట్లు అనుమానించబడుతున్నవారూ తరచూ ఎగతాళి మాటలకు, వేధింపుకు, హింసకూ గురవుతూ సమాజంలో ఒంటరివారౌతున్నారు. మత నాయకులు కూడా అలాంటి ద్వేషాన్ని కనబరచారు. స్వలింగ సంయోగులకు వ్యతిరేకంగా కొందరు తమకు వ్యక్తిగతంగా తోచిన విధంగా పోరాటాలు చేయడం మొదలుపెట్టారు. ఉదాహరణకు, ఇటీవల గ్రీక్‌ నేషనల్‌ రేడియో ప్రసారం చేసిన గ్రీక్‌ ఆర్థడాక్స్‌ చర్చి బిషప్‌ చేసిన వ్యాఖ్యానాలనే తీసుకోండి. ఆయనిలా ప్రస్తావించాడు: “స్వలింగ సంయోగులను దేవుడు నరకంలోని అగ్ని గుండంలో నిరంతరం కాల్చుతాడు. వారి అపవిత్రమైన నోటి నుండి వచ్చే కేకలు శాశ్వతంగా ప్రతిధ్వనిస్తాయి. ఎడతెగక తప్పు చేస్తున్న వారి శరీరాలు అసహనీయమైన పీడను అనుభవిస్తాయి.” ఇది నిజంగా సత్యమేనా? స్వలింగ సంయోగులను గూర్చి దేవుడు ఎలా భావిస్తాడు?

దేవుని దృక్కోణం

క్రైస్తవులు బహిష్కరించవలసిన, ద్వేషించవలసిన ఒక గుంపుగా, స్వలింగసంయోగులను గురించి బైబిలు ప్రత్యేకంగా ఏమీ చెప్పడం లేదు. అంతే కాక, దేవుడు స్వలింగ సంయోగులను కానీ, మరే ప్రాణులను గానీ నరకాగ్నిలో నిరంతరమూ కాల్చుతూ శిక్షిస్తాడని ఇది బోధించడం లేదు.—రోమీయులు 6:23 పోల్చండి.

అయినప్పటికీ, మన సృష్టికర్త యొక్క నైతిక ప్రమాణాలను లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఆ ప్రమాణాలు తరచూ ఆధునిక నైతికతలకు భిన్నంగా ఉంటాయి. స్వలింగ సంయోగ చర్యలూ, అవివాహితుల మధ్య లైంగిక సంబంధమూ, జంతువులతో సంయోగమూ, ఇవన్నీ బైబిలులో ఖండించబడ్డాయి. (నిర్గమకాండము 22:19; ఎఫెసీయులు 5:3-5) ఇలాంటి లైంగిక ప్రవృత్తులనుబట్టే దేవుడు సొదొమను గొమొర్రాను నాశనం చేశాడు.—ఆదికాండము 13:13; 18:20; 19:4, 5, 24, 25.

స్వలింగ సంయోగ చర్యలను గురించి దేవుని వాక్యం ఇలా ఎత్తి చూపుతోంది: “అది హేయము.” (లేవీయకాండము 18:22) ఇశ్రాయేలు జనాంగానికివ్వబడిన దేవుని ధర్మశాస్త్రం ఈ కట్టడను విధించింది: “ఒకడు స్త్రీతో శయనించినట్టు పురుషునితో శయనించిన యెడల వారిద్దరు హేయక్రియనుచేసిరి గనుక వారికి మరణశిక్ష విధింపవలెను.” (లేవీయకాండము 20:13) జంతువులతో, రక్తసంబంధులతో సంయోగం చేసేవారికి, వ్యభిచారులకు కూడా అదే శిక్ష విధించబడింది.—లేవీయకాండము 20:10-12, 14-17.

స్వలింగ సంయోగ చర్యలను “తుచ్ఛమైన” లైంగిక “అభిలాష”లనీ, “స్వాభావిక విరుద్ధమైన”వనీ చెప్పేందుకు పౌలు ప్రేరేపించబడ్డాడు. ఆయనిలా వ్రాస్తున్నాడు: “అందువలన దేవుడు తుచ్ఛమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సయితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలె పురుషులు కూడ స్త్రీయొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి, పురుషులతో పురుషులు అవాచ్యమైనదిచేయుచు, తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరియెడల ఒకరు కామతప్తులైరి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారినప్పగించెను.”—రోమీయులు 1:26-28.

లేఖనాలు ఈ విషయంలో మినహాయింపునివ్వడంగానీ, నేర తీవ్రతను తగ్గించడం గానీ, సందేహాలకు తావివ్వడం గానీ చేయడం లేదు; దేవుని దృష్టిలో స్వలింగ సంయోగ అలవాట్లూ, వ్యభిచారమూ, జారత్వమూ అన్నీ అసహ్యకరమైన విషయాలే. కాబట్టి, మరింత ప్రసిద్ధిగాంచేందుకు లేదా ఆధునిక సంస్కృతికి అంగీకారయోగ్యంగా ఉండేందుకు “తుచ్ఛమైన” లైంగిక “వాంఛలను” గూర్చిన బైబిలు దృక్పథాన్ని నిజ క్రైస్తవులు పలుచన చేయరు. స్వలింగ సంయోగాన్ని సాధారణ జీవనశైలిగా ప్రాచుర్యానికి తెచ్చేందుకు సమర్పించుకున్న ఏ ఉద్యమంతోనూ వాళ్ళు ఏకీభవించరు.

“చెడుతనమును అసహ్యించుకొనుడి”

“యెహోవాను ప్రేమించువారలారా, చెడుతనమును అసహ్యించుకొనుడి” అని బైబిలు ఉద్బోధిస్తుంది. (కీర్తన 97:10) అలా, యెహోవా చట్టాలను ఉల్లంఘించే ప్రతి అభ్యాసాన్నీ క్రైస్తవులు అసహ్యించుకోవాలని ఎదురుచూడబడుతుంది. స్వలింగసంయోగాన్ని స్వాభావిక విరుద్ధ లైంగిక వికృత చర్యగా దృష్టిస్తూ, మరే రకమైన అనైతికత కన్నా స్వలింగ సంయోగుల విషయంలో కొందరు ఏవగింపు భావాలతో లేదా అసహ్య భావంతో ప్రతిఘటిస్తారు. అయితే, అలాంటి పనులను చేసే వ్యక్తులను క్రైస్తవులు అసహ్యించుకోవాలా?

కీర్తన 139:21, 22లో కీర్తన రచయిత ఈ వివాదంపై కాస్త వెలుగును ప్రసరింపజేస్తున్నాడు: “యెహోవా, నిన్ను ద్వేషించువారిని నేనును ద్వేషించుచున్నాను గదా? నీ మీద లేచువారిని నేను అసహ్యించుకొనుచున్నాను గదా? వారియందు నాకు పూర్ణద్వేషము కలదు వారిని నాకు శత్రువులనుగా భావించుకొనుచున్నాను.” యెహోవా ఎడలా ఆయన సూత్రాల ఎడలా మనకుగల యథార్థత యెహోవాకు వ్యతిరేకంగా మనఃపూర్వకంగా తిరుగుబాటు చేసేవారి ఎడలా తమను తాము దేవుని శత్రువులుగా చేసుకునేవారి ఎడలా మనకు ఎంతో అయిష్టాన్ని కలిగించాలి. సాతానూ, దయ్యములూ అలా రూఢియైన దేవుని శత్రువులే. కొందరు మానవులు కూడా ఈ కోవలోకి వచ్చే అవకాశముంది. అయితే అలాంటి వ్యక్తులను వాళ్ళ బాహ్య వ్యక్తిత్వం ఆధారంగా గుర్తుపట్టడం క్రైస్తవులకు చాలా కష్టంగా ఉండవచ్చు. మనం హృదయాలను చదవలేం. (యిర్మీయా 17:9, 10) అతడో ఆమో తప్పు చేస్తూ ఉండడం వల్ల ఆ వ్యక్తి మార్చలేని దేవుని శత్రువు అని ఊహించడం పొరపాటవుతుంది. తప్పిదస్థుల్లో అనేకమందికి దేవుని ప్రమాణాలు తెలియవు.

కనుక, క్రైస్తవులు తమ తోటిమానవులను ద్వేషించేందుకు సాధారణంగా తొందరపడరు. కొన్ని జీవన విధానాలంటే వారికి తీవ్రమైన అసహ్య భావం కలిగినా కూడా ఇతరులను గాయపరచడానికి వారు ప్రయత్నించరు. లేదా వారి ఎడల అసహ్య భావాన్నీ ద్వేషాన్నీ పెంచుకోరు. బదులుగా, “సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి” అని బైబిలు క్రైస్తవులకు సలహా ఇస్తుంది.—రోమీయులు 12:9, 17-19.

‘దేవుడు పక్షపాతి కాడు’

ఒక వ్యక్తి ఏ అనైతికానికి పాల్పడుతూ వచ్చినప్పటికీ, అతడు నిజంగా పశ్చాత్తాపపడితే, యెహోవా ఆయనను క్షమిస్తాడు. ఏదైనా ఒక అనైతిక చర్యను మిగిలిన అనైతిక చర్యల కన్నా నీచమైనదిగా యెహోవా దృష్టిస్తాడనేందుకు ఏ రుజువూ లేదు. ‘దేవుడు పక్షపాతి కాడు.’ (అపొస్తలుల కార్యములు 10:34, 35) ఉదాహరణకు, కొరింథులోని మొదటి శతాబ్దపు సంఘాన్నే తీసుకుందాం. అపొస్తలుడైన పౌలు వారికి ఇలా వ్రాశాడు: “జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనముగలవారైనను పురుషసంయోగులైనను దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు.” మునుపు వ్యభిచారులును, జారులును, స్వలింగ సంయోగులును, దొంగలునైన కొందరు కొరింథులోని క్రైస్తవ సంఘంలోనికి చేర్చుకోబడ్డారని పౌలు అంగీకరిస్తున్నాడు. ఆయన ఇలా వివరించాడు: “మీలో కొందరు అట్టివారై యుంటిరి గాని, ప్రభువైన యేసు క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి, పరిశుద్ధపరచబడినవారై నీతిమంతులుగా తీర్చబడితిరి.” (ఇటాలిక్కులు మావి.)—1 కొరింథీయులు 6:9-11.

నిజమే, తన పరిపూర్ణ నైతిక ప్రమాణాలను ఎడతెగక ఉల్లంఘిస్తున్నవారిని యెహోవా భరించడు. తన సూత్రాలను మొండిగా నిర్లక్ష్యం చేయడాన్ని ఆయన కచ్చితంగా ద్వేషిస్తాడు. అయినప్పటికీ, సమాధానపడేందుకు ఆయన తలుపులను తెరిచేవుంచుతాడు. (కీర్తన 86:5; యెషయా 55:7) దీనికి అనుగుణ్యంగా, క్రైస్తవులు స్వలింగ సంయోగులను లేదా మరెవ్వరినైనా సరే దురుద్దేశానికి, హేళనకు, లేదా వేధింపుకు ఎరలుగా చేయరు. నిజ క్రైస్తవులు తమ తోటి మానవులను క్రీస్తు శిష్యులవ్వగలవారిగా దృష్టిస్తారు, వారితో గౌరవపూర్వకంగా, మర్యాదతో మెలుగుతారు. బైబిలు ఇలా చెబుతుంది: “ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై యున్నది. ఆయన, మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని యిచ్ఛయించుచున్నాడు.”—1 తిమోతి 2:3, 4.

మారుమనస్సు పొందినవారికి క్రైస్తవులు స్వాగతం పలుకుతారు

దేవుడు క్షమిస్తాడని బైబిలు మరలా మరలా ప్రకటిస్తోంది. బైబిలు దేవుడ్ని ‘క్షమించుటకు సిద్ధమైన దేవుడు, దయావాత్సల్యతలు గలవాడు, దీర్ఘశాంతమును బహు కృపయు గలవాడు’ అని వర్ణిస్తుంది. (నెహెమ్యా 9:17; యెహెజ్కేలు 33:11; 2 పేతురు 3:9) యేసుక్రీస్తు చెప్పిన, తనకు లభించిన పిత్రార్జితాన్ని దూర దేశంలో దుర్వ్యవహారాలకు దుర్వ్యయం చేసిన తప్పిపోయిన కుమారుని ఉపమానంలోని తండ్రితో బైబిలు దేవుడ్ని పోల్చుతుంది కూడా. కుమారునికి బుద్ధి వచ్చి, మారుమనస్సు పొంది, ఇంటికి వచ్చినప్పుడు, అతనికి స్వాగతం పలికేందుకు అతని తండ్రి వేచి నిలబడి చేతులు చాచాడు.—లూకా 15:11-24.

అవును, తప్పిదస్థుడు మారడం సాధ్యమే. పాత వ్యక్తిత్వాన్ని విడిచిపెట్టి, “చిత్తవృత్తియందు నూతనపరచబడినవారై” ఉండేందుకు క్రొత్త వ్యక్తిత్వాన్ని ధరించమని ప్రోత్సహిస్తూ లేఖనాలు దీనిని తెలియజేస్తున్నాయి. (ఎఫెసీయులు 4:22-24) స్వలింగ సంయోగులతో సహా చెడు కార్యాలను జరిగిస్తున్న వారందరూ తమ ఆలోచనా సరళిలోనూ, ప్రవర్తనలోనూ మౌలిక మార్పులు చేసుకోగలుగుతారు, ఈ మార్పును సాధించడంలో అనేకులు నిజంగా సఫలీకృతులయ్యారు.a అలాంటి వాళ్ళకు యేసు స్వయంగా బోధించాడు; వాళ్ళు పశ్చాత్తాపాన్ని కనబరచినప్పుడు ఆయనకు అంగీకారయోగ్యులయ్యారు.—మత్తయి 21:31, 32.

జీవితంలో వివిధ హోదాల్లోవున్న మారుమనస్సు పొందిన వ్యక్తులకు క్రైస్తవులు స్వాగతం పలుకుతారు. అనైతిక అలవాట్లను విడిచి పెట్టిన తర్వాత, వారు ఇంత వరకు ఎలాంటివారైనప్పటికీ, “యెహోవా అందరికి ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యములమీదనున్నవి” కనుక దేవుని క్షమా గుణం నుండి అందరూ పూర్తి ప్రయోజనం పొందవచ్చు.—కీర్తన 145:9.

ఇప్పటికీ స్వలింగ సంయోగం చేయాలని బలవంతంగా వచ్చే కోరికలతో పోరాడుతున్నవారికి కూడా అవసరమైన ఆధ్యాత్మిక సహాయాన్ని ఇచ్చేందుకు క్రైస్తవులు సిద్ధంగా ఉన్నారు. యెహోవా తానే స్వయంగా ప్రేమను కనబరచినదానికి ఇది అనుగుణ్యంగా ఉంటుంది. “దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను” అని బైబిలు చెబుతోంది.—రోమీయులు 5:8.

[అధస్సూచి]

a ఏప్రిల్‌ 8, 1995 తేజరిల్లు! సంచికలో “ఈ భావాలు పోయేలా నేనెలా చేయగలను?” అనే శీర్షికను చూడండి.

[17వ పేజీలోని చిత్రం]

స్వలింగసంయోగాన్ని గూర్చిన బైబిలు దృక్పథాన్ని క్రైస్తవులు పలుచన చేయరు

[16వ పేజీలోని చిత్రసౌజన్యం]

Punch

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి