కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g97 12/8 పేజీలు 16-18
  • రోడ్డు రౌద్రం—మీరెలా తట్టుకోగలరు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • రోడ్డు రౌద్రం—మీరెలా తట్టుకోగలరు?
  • తేజరిల్లు!—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • కారణం మరియు ప్రభావం
  • రోడ్డు రౌద్రాన్ని ప్రేరేపించడాన్ని నివారించండి
  • మీరు బాధితులా?
  • నీవు చాలా అపాయకరమైన డ్రైవరువా?
    తేజరిల్లు!—1992
  • అలసట ట్రక్‌ డ్రైవర్లకు కానరాని ఒక ఉచ్చు
    తేజరిల్లు!—1997
  • మోటారు వాహనాల దుర్ఘటనలు మీరు సురక్షితంగా ఉన్నారా?
    తేజరిల్లు!—2002
  • మీరు సురక్షితంగా డ్రైవ్‌ చేస్తారా?
    తేజరిల్లు!—1995
మరిన్ని
తేజరిల్లు!—1997
g97 12/8 పేజీలు 16-18

రోడ్డు రౌద్రం—మీరెలా తట్టుకోగలరు?

బ్రిటన్‌నందలి తేజరిల్లు! విలేఖరి ద్వారా

కోపం తెచ్చుకోవడం, దాని మూలంగా దౌర్జన్యానికి పాల్పడటం గురించి ప్రపంచ వార్తా పత్రికల్లో మరింత ఎక్కువగా కానవస్తుంది. (వినియోగదారులు ట్రాలీలనూ లేక ఆహార కార్ట్‌లనూ ఉపయోగిస్తూ సూపర్‌మార్కెట్‌లలో ఒకరిపై మరొకరు తమ కోపాన్ని ప్రదర్శించే) ట్రాలీ రౌద్రం మరియు (మీరు ఎవరికి ఫోన్‌ చేస్తారో ఆ వ్యక్తి మీ ఫోన్‌కాల్‌ను డిస్‌కనెక్ట్‌ చేయకుండానే ఇతరులతో ఫోన్‌ ద్వారా మాట్లాడగలగటాన్నీ సాధ్యపర్చిన సాంకేతికత ద్వారా ప్రేరేపించబడిన) ఫోన్‌ రౌద్రానికీ తోడు రోడ్డు రౌద్రం బ్రిటన్‌నందలి ప్రజల అవధానాన్ని పొందింది.

రోడ్డు రౌద్రం ఎంత సర్వవ్యాప్తం అయ్యిందంటే, బండి నడిపే లక్షణాలపై వచ్చిన 1996 నివేదిక, “డ్రైవర్లందరిలో దాదాపు సగంమంది గత సంవత్సరంలో ఏదొక విధమైన దాడికి లేక దురాచారానికి గురయ్యారు, మరి బ్రిటన్‌లో అది అంటువ్యాధిలా పాకిపోతోంది” అని పేర్కొన్నది. ఒక ఆటోమొబైల్‌ అసోసియేషన్‌ సర్వే ఆ సమస్య ఇంకా సర్వవ్యాప్తమైందని చూపిస్తూ, “పదిమంది మోటరిస్టుల్లో తొమ్మిది మంది రోడ్డురౌద్రపు బాధితులమని పేర్కొన్నారని” నివేదించింది. ఆసక్తికరంగా, “పదిమంది [మోటరిస్టుల్లో] కేవలం ఆరుగురు మాత్రమే బండి నడుపుతున్నప్పుడు తమకు కోపం వచ్చిందని అంగీకరించారని” అదే సర్వే గమనించింది.

రోడ్డు రౌద్రాన్ని ఏది ప్రేరేపిస్తుంది? మీరు బాధితులైతే, మిమ్మల్ని మీరు కాపాడుకునేందుకు మీరేమి చేయగలరు? వేరే వ్యక్తులు బండి నడిపే విధానం మీకు కోపాన్ని తెస్తే, మీరేమి చేయాలి? వాస్తవానికి, ప్రపంచవ్యాప్తంగా రోడ్డు రౌద్రం పెచ్చుపెరిగిపోతుండగా, మీరెలా తట్టుకోగలరు?

కారణం మరియు ప్రభావం

కోపంగా ఉండే డ్రైవర్లు ఉండటం కొత్తేమీ కాదు. అలా చట్టాన్ని ఉల్లంఘించిన మొదటివ్యక్తి ఆంగ్ల కవి లార్డ్‌ బైరన్‌. రోడ్డులో తనకు కలిగిన వివాదాన్ని వివరిస్తూ ఆయన 1817లో ఒక ఉత్తరాన్ని వ్రాశాడు. రోడ్డుపై ప్రయాణిస్తున్న వ్యక్తి బైరన్‌ గుర్రాన్ని “అవమానించా”డని అందులో నివేదించబడింది. దాని ఫలితంగా కవిగారు ఆ వ్యక్తి గూబ అదరగొట్టాడు.

అనేక దేశాల్లో, రోడ్‌ ట్రాఫిక్‌ ఎక్కువౌతుండగా, డ్రైవర్ల చికాకూ అధికమౌతుంది. మరి 1980లోనే అమెరికా వార్తాపత్రికలు దౌర్జన్యపూరితమైన డ్రైవింగ్‌ సంఘటనలను “రోడ్డురౌద్రం”గా వర్ణించాయి. అయితే ఇది న్యాయ సంబంధమైన వివరణ కాకపోయినప్పటికీ, ఇతర డ్రైవర్లు తమ వాహనాలను నడిపించే విధానాన్ని బట్టి విసుగుచెందిన మోటరిస్టులు చేసిన దౌర్జన్యపూరితమైన చర్యలకు మూలమైన భావోద్రేకాలను ఈ రోడ్డురౌద్రం తగిన రీతిలో వివరిస్తుంది.

నేనే ముందు అనే దృక్పథం నేడు మన రోడ్లను ముంచెత్తుతోంది. “దౌర్జన్యాన్ని లేక దాడిని కొనసాగించే వారు, తాము ఇతరుల సంఘవ్యతిరేక ప్రవర్తన మూలంగా బలౌతున్న అమాయకులైన బాధితులమని దాదాపు ఎల్లవేళలా విశ్వసిస్తారని” డ్రైవింగ్‌ అలవాట్లను అధ్యయనం చేస్తున్న పరిశోధకులు ముగించి చెబుతున్నారని లండన్‌కు చెందిన ది టైమ్స్‌ పేర్కొంటుంది. ఒక డ్రైవరు తన వాహనాన్ని ఎంత మొరటుగా నడిపించినా సరే తనదే న్యాయమని అతను భావిస్తాడు. అయితే ఇతర డ్రైవరు రోడ్డు మర్యాదలను కాస్త అతిక్రమిస్తే చాలు, ఇక రోడ్డు రౌద్రం పెల్లుబుకుతుంది.

యౌవనస్థుల్లో ఎంతో సర్వవ్యాప్తమైన మాదక ద్రవ్యాల అపరిమిత దుర్వినియోగం కూడా రోడ్డు రౌద్రానికి కారణమౌతోంది. ఒక ఆసుపత్రి సలహాదారు చెప్పిన విధంగా, కొకైన్‌ దుర్వినియోగం “మత్తు పానీయాలను పుచ్చుకుని వాహనాన్ని నడపడంతో సమానంగా ఉంటుంది.” తరచుగా మాదక ద్రవ్యాలను తీసుకునే డ్రైవర్లు తమ సామర్థ్యాలను మరీ ఎక్కువగా అంచనావేస్తారు. దాని ఫలితంగా, కొందరు డ్రైవర్లు తమ వాహనాలను ప్రమాదకరమైన వేగంతో నడిపిస్తారు. మాదక ద్రవ్యాలను ఉపయోగించే ఇతర డ్రైవర్లు అస్థిరంగా నడిపిస్తారు, వారి వివేచన అసలే పని చేయదు.

ఒత్తిడి ఒక డ్రైవరుపై ఎలాంటి ప్రభావాన్ని కలిగి ఉండగలదో కూడా పరిగణించండి. మాంచెస్టర్‌ విశ్వవిద్యాలయానికి చెందిన కేరీ కూపర్‌ అనే ప్రొఫెసర్‌, 1990లలోని అనుదిన జీవితపు ఒత్తిళ్లూ, అనిశ్చయతలు రోడ్డు రౌద్రానికి చాలా వరకు కారణమని వాటిని నిందిస్తున్నాడు. “డ్రైవర్లు మరింత ఎక్కువ ఒత్తిడికి గురౌతున్నారు మరియు దౌర్జన్యపూరితమైన దాడుల సంఖ్య మరింత ఎక్కువౌతుంది” అని రాయల్‌ ఆటోమొబైల్‌ క్లబ్‌కు చెందిన ప్రతినిధి ఒకరు చెబుతున్నారు. తన పని స్థలానికి వాహనంలో ప్రయాణించి వెళ్లి వచ్చే, ఎంతో పని రద్దీ కలిగి ఉండే ఒక ప్రజా సంబంధ అధికారిణి, తాను మునుపున్నంత సహనంతో ఇప్పుడు ఉండలేక పోతున్నానని అంగీకరిస్తోంది. “నాకు మునుపెన్నడూ కోపం తెప్పించని చిన్న చిన్న విషయాలకు నేనిప్పుడు చికాకు పడుతున్నాను, మరి త్వరగా కటువుగా మాట్లాడుతున్నానని” ఆమె చెప్పినట్లు ది సండే టైమ్స్‌ నివేదిస్తుంది. బహుశా మీరు కూడా అదే విధంగా భావిస్తుండవచ్చు. ఒకవేళ అదే నిజమైతే మీరేమి చేయగలరు?

రోడ్డు రౌద్రాన్ని ప్రేరేపించడాన్ని నివారించండి

ఇతర డ్రైవర్లు పరిపూర్ణులు కాదనే విషయాన్ని గుర్తించండి. వారు కూడా అప్పుడప్పుడూ నియమాలను అతిక్రమించవచ్చు. మీరు బండి నడిపేటప్పుడు ఈ విషయాన్ని మదిలో ఉంచుకోండి. ముందే ఆలోచించుకోండి. ఉదాహరణకు, అనేక దారులుగల రహదారిలోని నియర్‌సైడ్‌ లేక స్లోలేన్‌లో మీరు బండి నడుపుతుండవచ్చు. అయితే కొంతసేపటికి ట్రాఫిక్‌ను అంతటినీ రహదారిలోకి తీసుకెళ్లే రోడ్డు చీలిక దగ్గరికి లేక ఏటవాలు ప్రవేశ మార్గం దగ్గరి కూడలికి మీరు సమీపిస్తారు. మీకు ఎదురుగా చీలిక రోడ్డు దగ్గరనుండి రహదారిని వెళ్లే మార్గంగుండా వస్తున్న ఒక కారును మీరు చూస్తారు. అక్కడికి మీరే ముందు వచ్చారు గనుక మీ సందులో బండి నడిపే హక్కు మీకే ఉంది, వస్తున్న ట్రాఫిక్‌కు మీరు ఎందుకు దారినివ్వాలి? ఇతర డ్రైవర్లను రహదారిలోకి వెళ్లనిచ్చేందుకు నేను ఒకవేళ వీలుంటే మరొక దారిలోకి ఎందుకు వెళ్లాలని మీరు వాదిస్తారా? అయితే, మీరు మీ దారిలో ఉండాలనీ మరియు మీరు అంతే వేగంతో బండి నడపాలని మంకుపట్టు పట్టుకుకూర్చుంటే ఏమౌతుందో ఆలోచించండి. రహదారిలోకి వెళ్తున్న డ్రైవరు కూడా బహుశ అలాగే ఆలోచిస్తుండవచ్చు. ఎవరైనా ఒకరు దారినివ్వాలన్నది స్పష్టమైన విషయం; లేకపోతే ప్రమాదం ముంచుకొస్తుంది.

రోడ్డు రౌద్రాన్ని ప్రేరేపించడాన్ని నివారించాలనుకునే డ్రైవరు జ్ఞానవంతంగా తనకంటే ముందు చూస్తూ అవగాహనతో బండి నడుపుతాడు. తనకు సాధ్యమైనప్పుడు ఆయన మార్గాన్నిస్తాడు, అంతేకాదు ఇతర డ్రైవరుకు తాను చూపిన మర్యాదను ఆయన గుణగ్రహించకపోయినా కూడా తాను కోపం తెచ్చుకోడు. బ్రిటన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ మోటరిస్టుల ఒక ప్రతినిధి, ప్రతి ముగ్గురు డ్రైవర్లలో ఒకరికి ప్రమాదకరమైన దృక్పథ సమస్యలు ఉన్నాయని అంచనావేస్తున్నాడు. ఈ డ్రైవర్లు తమ వాహనాన్ని నైపుణ్యవంతంగా నడపగలిగినప్పటికీ వారిలో మర్యాద లోపిస్తుంది. ఆయన వారిని “మంచి డ్రైవర్లే కానీ చెడ్డ మోటరిస్టులు” అని పిలుస్తున్నాడు.

అనేకమంది డ్రైవర్లు కొన్నిసార్లు రోడ్డుపై వెళ్తున్న ఇతరులను అలక్ష్యం చేస్తారు. అయితే మీరు అలా చేయడం న్యాయం కాదు. సంభవించగల పరిణామాలను పరిగణించండి. మీ మొండితనం మూలంగా ట్రాఫిక్‌లో గందరగోళం ఏర్పడాలనీ మీరు ఎన్నడూ కోరుకోరు. మీ భావోద్రేకాలు మిమ్మల్ని అదుపుచేయనివ్వకండి. బండి నడపడంలో నిపుణతగల ఒకవ్యక్తి ఇలా సలహా ఇస్తున్నాడు: “రోడ్డులో జరిగే దాడికి మీరు ఎన్నడూ ప్రతిస్పందించ కూడదు లేక చర్య తీసుకోకూడదు.” రోడ్డు రౌద్రాన్ని ప్రదర్శించే వారిలో మీరు ఒకరు కాకండి!

మీరు బాధితులా?

దాదాపు ప్రతి డ్రైవరు కూడా ఏదొక సమయంలో రోడ్డు రౌద్రానికి బాధితుడై ఉంటాడు. కోపంతో పైకెత్తిన పిడికిలి, ఒక తిట్టు మాట మరియు దాడి చేసే ప్రవర్తన, ఇవన్నీ కూడా భయపెట్టగలవు, భయపెడతాయి కూడా. శ్రేష్ఠమైన కాపుదల ఏమంటే గొడవను నివారించడమే. తన తోటి డ్రైవరు తనకంటే ముందు వెళ్లాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఒక బాధితునికి భయం వేసింది. తుదకు, కోపచిత్తుడైన ఆ డ్రైవరు అతడ్ని దాటి, ముందుకు వెళ్లి వేగాన్ని తగ్గించాడు, దానితో బాధితుడు తమ కార్లు ఢీకొంటాయేమోనని భయపడ్డాడు. అది అలా కొంత దూరం వరకూ కొనసాగింది మరి చివరకు బాధితుడు మరొక దారిలోకి వెళ్లిపోయినప్పుడు ఆ గొడవ ముగిసింది.

ఇతర డ్రైవర్లు మీకంటే ముందు వెళ్లాలని ఇష్టపడుతున్నారని మీరు గమనిస్తే వారిని ముందు వెళ్లనివ్వండి. మీరు రోడ్డుపై ఉన్న స్థలంలోనే ఉండాలని మొండిపట్టు పట్టకండి. ఇతరులను తెలిసే మీరు విసిగిస్తే క్షమాపణ చెప్పండి. తెలియకుండా చేసిన తప్పుల విషయమై కూడా మీరు క్షమాపణ కోరుతున్నట్లు సైగ చేయండి. మృదువైన మాట రౌద్రాన్ని తుడిచిపెట్టగలదని జ్ఞాపకం ఉంచుకోండి.

అయితే ఏ కారణం చేతనైనా మీరు రోడ్డు రౌద్రానికి బాధితులైతే ప్రతీకార చర్య తీసుకోకండి. “మీ ఎడల వాళ్లు ప్రవర్తించిన విధంగా మీరు వాళ్ల ఎడల ప్రవర్తించకండి. ప్రమాదకరమైన ఆయుధాలుగా ఉపయోగించగల వస్తువులను మీ కారులో ఉంచుకోకండి” అని ఫోకస్‌ పత్రిక సలహా ఇస్తోంది. ఇతర సలహాలు: మీ కారు తలుపులకు తాళం వేసుకుని మీ కిటికీలను పూర్తిగా మూసుకుని ఉంచుకోండి. దాడి చేసే వ్యక్తితో కళ్లు కలపకండి.

రోడ్డు రౌద్రంతో వ్యవహరించే విషయాన్ని గురించి ఇవ్వబడిన పై సలహాలు క్రొత్తవేమీ కాదు. ఇశ్రాయేలీయుల రాజైన దావీదు అనేక సంవత్సరాల క్రితం ఇచ్చిన సలహాతో అవి పొందిక కలిగి ఉన్నాయి: “చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకుము దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకుము. కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసనపడకుము” అని ఆయన సలహా ఇచ్చాడు.—కీర్తన 37:1, 8.

రోడ్డు రౌద్రం పెరిగిపోతున్నా అది మీలో పెరిగేందుకు అనుమతించకండి!

[18వ పేజీలోని బాక్సు/చిత్రం]

రోడ్డు రౌద్రాన్ని నియంత్రించడం

రోడ్డు రౌద్రాన్ని అణగార్చే విషయానికొస్తే, “దృక్పథాన్ని మార్చుకోవడం ఎదురు ఉపాయాలను ఆలోచించడమంత ప్రాముఖ్యమేనని” ఆటోమొబైల్‌ అసోసియేషన్‌ పేర్కొంటుంది. మీ డ్రైవింగ్‌ నిపుణతలను గురించి, రోడ్డులో వెళ్తున్న ఇతరుల నిపుణతలను గురించీ కూడా వాస్తవికమైన దృక్పథాన్ని కలిగి ఉండటం రోడ్డు రౌద్రాన్ని తట్టుకునేందుకు ఎంతో ప్రాముఖ్యం. ఇతరుల తప్పిదాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ మీ తప్పిదాలను అలక్ష్యం చేసేందుకు ప్రయత్నించకండి. రోడ్డు నియమాలను ఉల్లంఘించే డ్రైవర్లు ఉంటారన్న వాస్తవాన్ని అంగీకరించండి. మీరు బండి నడుపుతున్నప్పుడు, ఎప్పుడూ కూడా మీరు అప్రమత్తంగా ఉండేలా చూసుకోండి. అలసట ఒత్తిడికి కారణం కాగలదు. క్షణం ఏకాగ్రత కోల్పోతే అది ప్రమాదకరమైన పర్యవసానాలను కలుగజేయగలదు.

ఈ క్రింది సలహాలను కూడా పరిగణించండి, జ్ఞానియైన రాజైన సొలొమోను చెప్పిన సామెతలతో ఇది ఎలా సంబంధాన్ని కలిగి ఉందో గమనించండి.

• మీతో పాటూ ప్రయాణించేవారు మీ కోపాన్ని గమనిస్తున్నారా? మీరు చల్లబడాలని బహుశ వారు సలహా ఇవ్వవచ్చు. వారు వెనకసీట్లో కూర్చునే డ్రైవర్లని అంటూ వారి సలహాను పక్కకు నెట్టకండి. ఒక ప్రశాంతమైన దృక్పథం ఎంతో ఆరోగ్యకరమైనది మరి మీరు దీర్ఘకాలం జీవించేందుకు అది మీకు అక్షరార్థంగా సహాయం చేయవచ్చు! “సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము.”—సామెతలు 14:30.

• ఇతర డ్రైవరు గురించి ఆలోచించి సమస్యలను నివారించండి. “జ్ఞానముగలవాడు భయపడి కీడునుండి తొలగును బుద్ధిహీనుడు విఱ్ఱవీగి నిర్భయముగా తిరుగును.”—సామెతలు 14:16.

• క్షమాపణను సూచించే క్రియ లేక మాట ద్వారా కోపాన్ని మటుమాయం చేయండి. “మృదువైన మాట క్రోధమును చల్లార్చును.”—సామెతలు 15:1.

• ఇతరులు రోడ్డు రౌద్రాన్ని చూపుతుండవచ్చు కానీ మీరు వారిని అనుకరించాల్సిన అవసరం లేదు. “కోపచిత్తునితో సహవాసము చేయకుము.”—సామెతలు 22:24.

• ఇతరుల గొడవల్లో తల దూర్చడాన్ని నివారించండి. “వివాదము అధికము కాకమునుపే దాని విడిచిపెట్టుము.”—సామెతలు 17:14.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి