మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే ఆరు మార్గాలు
నైజీరియాలోని తేజరిల్లు! విలేఖరి ద్వారా
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారంగా, వర్ధమాన దేశాల్లో జీవిస్తున్న ప్రజల్లో దాదాపు 25 శాతం మందికి రక్షితనీరు లభ్యమవ్వడం లేదు. 66 శాతం కన్నా ఎక్కువ మంది ప్రజలకు అంటే కనీసం 250 కోట్లమంది ప్రజలకు తగినంత పారిశుద్ధ్య సౌకర్యాల్లేవు. తత్ఫలితంగా అనేకులు రోగ మరణాలకు గురౌతున్నారు.
అలాంటి పరిస్థితుల్లో, మంచి పారిశుద్ధ్యతను కాపాడుకోవడం ఒక సవాలే. అయితే, మీ వ్యక్తిగత పారిశుద్ధ్యాన్ని ఓ జీవిత ధ్యేయంగా చేసుకుంటే, అనేక రోగాలనుండి మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు. మీ శరీరంలోకి ప్రవేశించి తద్వారా మిమ్మల్ని వ్యాధిగ్రస్తుల్నిచేసే సూక్ష్మజీవుల నుండి మిమ్మల్నీ, మీ కుటుంబ సభ్యుల్నీ కాపాడుకోవడానికి మీరు తీసుకోవాల్సిన ఆరు చర్యలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
1. మల విసర్జన తర్వాతా, అన్నం తినడానికి ముందూ మీ చేతుల్ని సబ్బుతోనూ నీటితోనూ కడుక్కోండి.
రోగానికి గురికాకుండా అరికట్టడంలో ఒక ప్రాముఖ్యమైన మార్గమేంటంటే మీ కుటుంబంలో ఉండే ప్రతీ ఒక్కరూ తమ చేతుల్ని కడుక్కోవడానికి సబ్బూ నీరు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చేయడమే. మీ చేతుల్ని అంటిపెట్టుకొని ఉన్న సూక్ష్మజీవుల్ని సబ్బూ, నీరూ తొలగిస్తాయి. అలా కడుక్కోకపోతే సూక్ష్మజీవులు మీరు తినే ఆహారంలోకో లేక నోటిలోకో జొరబడతాయి. చిన్నపిల్లలు తమ వ్రేళ్లను తరచుగా నోటిలో పెట్టుకుంటారు గనుక వాళ్ల చేతుల్ని తరచూ కడగడం, మరి ముఖ్యంగా వాళ్లకి అన్నం పెట్టడానికి ముందు కడగడం ఎంతో ప్రాముఖ్యం.
మల విసర్జన తర్వాతా, అన్నం తినడానికి ముందూ అలాగే అప్పుడే మల విసర్జన చేసిన మీ బిడ్డ గుదాన్ని కడిగిన తర్వాతా మీరు మీ చేతుల్ని కడుక్కోవడం ఎంతో ప్రాముఖ్యం.
2. మరుగు దొడ్లను ఉపయోగించండి.
సూక్ష్మజీవులు వ్యాపించకుండా అరికట్టేందుకు, మల విసర్జనల్ని సరైన విధంగా తొలగించడం ప్రాముఖ్యం. అనేక రోగాలు, ముఖ్యంగా అతిసార వ్యాధి వంటివి మానవ మలవిసర్జకాల్లో ఉన్న సూక్ష్మజీవుల నుండే వస్తాయి. ఈ సూక్ష్మజీవులు త్రాగే నీటిలోకో లేదా ఆహారంలోకో, చేతులమీదకో లేదా గిన్నెలపైకో, ఆహారాన్ని సిద్ధపర్చే లేక వడ్డించే ప్రదేశాల్లోకో చేరతాయి. అదే గనుక జరిగితే, సూక్ష్మజీవులు ప్రజల శరీరాల్లోకి ప్రవేశించి, వారిని వ్యాధిగ్రస్తుల్ని చేయగలవు.
దీన్ని అరికట్టేందుకు, మరుగుదొడ్లను ఉపయోగించండి. జంతు మల మూత్రాల్ని ఇళ్లకూ, మంచినీటి వనరులకూ దూరంగా ఉండేలా చూడండి. చంటిపిల్లల మలాలు పెద్దవారి మలాలతో పోల్చితే మరీ ప్రమాదకరమైనవని తెల్సుకోవడం, బహుశా మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచెయ్యొచ్చు. కాబట్టి మరుగుదొడ్లను ఎలా ఉపయోగించాలో పిల్లలకు కూడా నేర్పించండి. పిల్లలు ఎక్కడైనా మల విసర్జన చేస్తే, అక్కడ వెంటనే శుభ్రపర్చి వాటిని మరుగుదొడ్లలో పడవేయండి లేక కప్పివేయండి.
మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచి, మూతవేసి ఉంచాలి.
3. పరిశుభ్రమైన నీటినే వాడండి.
నీటి గొట్టంద్వారా వచ్చే పరిశుభ్రమైన నీటి సరఫరాగల కుటుంబాలకు చెందిన సభ్యులకన్నా అలాంటి సౌకర్యంలేని కుటుంబాలకు చెందిన సభ్యులు తరచూ రోగగ్రస్థులౌతారు. పరిశుభ్రమైన నీటి సరఫరా సౌకర్యాల్లేని వాళ్లు నూతులపై మూతలు వేసి ఉంచడం ద్వారా, త్రాగడానికీ స్నానం చేయడానికీ లేక బట్టలు ఉతుక్కోవడానికీ ఉపయోగించే నీటిని మురికి నీటికి దూరంగా ఉంచడం ద్వారా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోగలరు. జంతువుల్ని ఇళ్లకూ, త్రాగే నీటికీ దూరంగా ఉంచడం కూడా ప్రాముఖ్యం.
రోగాలు రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకునే మరో మార్గమేంటంటే, నీటిని పట్టుకొని నిల్వచేయడానికి ఉపయోగించే బకెట్లనూ త్రాళ్లనూ కుండలనూ వీలైనంతమట్టుకు పరిశుభ్రంగా ఉంచుకోవడమే. ఉదాహరణకు, నీళ్లను చేదుకునే బకెట్టును నేలపై వదిలివేయడం కన్నా దాన్ని పైన వ్రేలాడదీయడం మంచిది.
ఇంట్లో వాడుకునే త్రాగే నీటిని శుభ్రంగా ఉన్న పాత్రలో మూతపెట్టి ఉంచాలి. ఆ పాత్రనుండి త్రాగడానికి నీటిని పరిశుభ్రమైన చెంబుతోనో లేక గ్లాసుతోనో తీసుకోవాలి. త్రాగే నీటిలో చేతులు పెట్టడానికిగానీ లేక నిల్వచేసిన పాత్రనుండే నేరుగా త్రాగడానికిగానీ ఎవ్వరినీ అనుమతించకండి.
4. సురక్షితమైన గొట్టాల్లో నుండి వస్తే తప్ప త్రాగేనీటిని మరిగించి త్రాగండి.
సాధారణంగా సురక్షితమైన త్రాగేనీరు గొట్టాల ద్వారా వస్తుంది. ఇతరత్రా లభ్యమయ్యే నీరు చూడడానికి పరిశుభ్రంగా కనబడినా అందులో సూక్ష్మజీవులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
నీటిని మరగబెట్టడం సూక్ష్మజీవుల్ని చంపుతుంది. కాబట్టి మీరు చెరువుల్లో నుండో, కాలువల్లో నుండో లేక టాంకుల్లో నుండో నీటిని తెచ్చుకుంటే, ఆ నీటిని కాచి చల్లార్చిన తర్వాత త్రాగడం జ్ఞానయుక్తమైన పని. చిన్నపిల్లలకు పెద్దలకన్నా రోగనిరోధకశక్తి తక్కువగా ఉంటుంది గనుక వాళ్లకు సూక్ష్మజీవుల్లేని త్రాగెడు నీరు ముఖ్యంగా అవసరం.
త్రాగే నీటిని మరగబెట్టడానికి వీలుకాని పరిస్థితులుంటే, ఆ నీటిని మూతవేసివున్న పరిశుభ్రమైన ప్లాస్టిక్ లేక గ్లాస్ పాత్రలో నిల్వచేయండి. తర్వాత ఆ నీటిని ఉపయోగించడానికి ముందు రెండు రోజులు ఆ పాత్రపై సూర్యరశ్మిపడేలా ఉంచండి.
5. మీ ఆహారాన్ని పరిశుభ్రంగా ఉంచుకోండి.
వండకుండా తినే పచ్చి ఆహారపదార్థాల్ని బాగా శుభ్రపర్చాలి. ఇతర ఆహారపదార్థాల్ని ముఖ్యంగా మాంసాన్నీ, పెంపుడు పక్షుల మాంసాన్నీ బాగా ఉడికించాలి.
ఆహారాన్ని వండిన తర్వాత చల్లారిపోక ముందే దాన్ని తినడం మంచిది; అలా చేయడం వల్ల అది పాడైపోయే అవకాశం ఉండదు. ఐదు గంటలకన్నా ఎక్కువసేపు వండిన ఆహారాన్ని నిల్వ ఉంచాల్సి వస్తే, మీరు దాన్ని మరల వేడైనా చేయాలి లేకపోతే రిఫ్రిజిరేటర్లోనైనా ఉంచాలి. దాన్ని తినడానికి ముందు, మీరు దాన్ని బాగా వేడిచేయాలి.
పచ్చి మాంసంలో సాధారణంగా సూక్ష్మజీవులు ఉంటాయి గనుక దాన్ని వండిన ఆహారానికి తగలకుండా ఉండేలా చూసుకోవాలి. పచ్చి మాంసాన్ని వండడానికి సిద్ధంచేసిన తర్వాత, దాన్ని సిద్ధపర్చడానికి ఉపయోగించిన పాత్రల్నీ, స్థలాన్ని శుభ్రంగా కడగాలి.
ఆహారాన్ని సిద్ధపర్చే చోటు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచండి. ఈగలు ముసరకుండా, ఎలుకలూ చుంచెలకలూ మరితర జంతువులూ దగ్గరకు రాకుండా ఆహారాన్ని మూతవేసి ఉంచండి.
6. ఇంటి చెత్తను కాల్చివేయండి లేక పూడ్చిపెట్టండి.
సూక్ష్మజీవులు వ్యాపించేలా చేసే ఈగలు, ఆహార వ్యర్థపదార్థాల్లో గ్రుడ్లను పెడతాయి. కాబట్టి వృథాయైన ఆహారపదార్థాల్ని నేలపై పడవేయకూడదు. దాన్ని ప్రతీ రోజూ కాల్చివేయాలి, పూడ్చివేయాలి లేదా ఏదొక విధంగా దాన్ని లేకుండా చెయ్యాలి.
ఈ నిర్దేశకసూత్రాల్ని అనుసరించడం ద్వారా, అతిసార వ్యాధి నుండీ, కలరా, టైఫాయిడ్‌ల నుండీ, నులిపురుగుల మూలంగా కలిగే అంటువ్యాధులూ, ఆహారపదార్థాలు విషపూరితమవ్వడమూ వంటి వాటినుండీ మరి అనేక ఇతర వ్యాధులనుండీ మిమ్మల్ని మీరూ, మీ కుటుంబాన్నీ కాపాడుకోవడానికి సహాయాన్ని పొందగలరు.
[క్రెడిట్ లైను]
మూలం: ఐక్యరాజ్య సమితి పిల్లల నిధి, ఐక్యరాజ్య సమితి విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ కలిసి సంయుక్తంగా ప్రచురించిన జీవిత వాస్తవాలు (ఆంగ్లం) నుండి తీసుకొనబడింది.