బైబిలు ఉద్దేశము
బీదరికం దొంగతనాన్ని సమర్థిస్తుందా?
“మానవ సంతోషానికి ఆగర్భ శత్రువు బీదరికమే; అది స్వేచ్ఛాహక్కును ఖచ్చితంగా హరించివేస్తుంది. అది కొన్ని సద్గుణాల్ని ఆచరణీయంకానివిగానూ, మరితర సద్గుణాల్ని చూపించడం మరీ కష్టమన్నట్టుగానూ చేస్తుంది.”—పద్దెనిమిదవ శతాబ్దపు గ్రంథకర్త, సామ్యూల్ జాన్సన్.
“బీదరికం నేర ప్రవృత్తికి తల్లిలాంటిది” అని రోమా ప్రభుత్వ రాజనీతిజ్ఞుడు మాగ్నస్ ఔరేలీయుస్ అన్నాడు. కొన్ని నేరాలు బీదరికపు సహజ ఫలితాలేననే విషయాన్ని పై అభిప్రాయాలు సూచిస్తున్నట్లు కనబడుతుంది. నేడు అనేకమంది దానితో ఏకీభవిస్తున్నట్టు, మరి ముఖ్యంగా చేసిన నేరం దొంగతనమైనప్పుడు అలా ఏకీభవిస్తున్నట్టు కనబడుతుంది.
అణచివేతా, బీదరికమూ దొంగతనాన్ని సమర్థిస్తాయనే నమ్మకం ప్రజల్లో బాగా పాతుకుపోయింది. ధనికవర్గాన్ని దోచుకొని బీదలకు పంచిపెట్టే రాబిన్ హుడ్ అనే చట్టానికతీతుడైన కల్పితవ్యక్తిని గూర్చి 14వ శతాబ్దంలో ప్రసిద్ధిగాంచిన ఆంగ్లేయ జానపద వీరగాథల్ని పరిశీలించండి. అనేక శతాబ్దాలుగా ఇతడు హీరోగా కొనియాడబడ్డాడు.
నేడు అనేకమంది తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు గురౌతున్నారని ఒప్పుకోక తప్పదు. రోజుకొక్క డాలరు కన్నా తక్కువ వేతనంపై ఆధారపడి 131 కోట్లమంది ప్రజలు తమ బ్రదుకును ఈడుస్తున్నారని ప్రపంచ బ్యాంకు ఇటీవల నివేదించింది. ఫిలిప్ఫీన్ దేశపు జనాభాలో డెబ్భై శాతం మంది తమను తాము బీదవారిగా పరిగణించుకుంటున్నారు. బ్రెజిల్ జనాభాలో 20 శాతం ఉన్న ధనవంతులు అంతే శాతంవున్న కడుబీదలు సంపాదించే సంపాదనకన్నా 32 రెట్లు ఎక్కువగా సంపాదిస్తున్నారు. తమ ప్రాణాల్ని నిలుపుకోవడానికి కావాల్సిన అనుదినావసరాల్ని తీర్చుకునేందుకు ఏ దారి త్రొక్కడానికైనా, దొంగతనం చేయడానికైనా సరే వెనుకాడని స్థాయికి చేరుకునేలా కొంతమంది ప్రజల్ని అలాంటి పరిస్థితులు నడిపించగలవు.
దొంగతనాన్ని బైబిలు గర్హిస్తోందనే విషయం సుస్పష్టం. పది ఆజ్ఞల్లో ఎనిమిదవ ఆజ్ఞ ఇలా తెలియజేస్తోంది: “దొంగిలకూడదు.” (నిర్గమకాండము 20:15) అయితే, బైబిల్ని విశ్వసిస్తున్న అనేకమంది వ్యక్తులు, దుర్భరమైన ఆర్థిక ఇబ్బందుల్నిబట్టి ఒకడు దొంగతనం చేస్తే, ఆ చర్యను సమర్థించడానికే మ్రొగ్గుచూపించారు.
గంభీరమైన ప్రశ్నలను ఇది లేవనెత్తుంది: బీదరికం దొంగతనాన్ని నిజంగా సమర్థిస్తుందా? దుర్భరమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఒకడు ఉన్నట్లైతే అప్పుడతడు ఏమి చెయ్యాలి? ఒకవేళ అతనికి తాను పోషించాల్సిన రోగగ్రస్థులైన లేదా ఆకలితో అలమటించే పిల్లలుంటే అప్పుడేం చెయ్యాలి? అలాంటి పరిస్థితుల్లో దొంగిలించడాన్ని, ముఖ్యంగా దొంగిలించిన వస్తువులు వాటిని పోగొట్టుకున్న వారికి అవసరంలేనివైతే దొంగిలించడాన్ని యెహోవా అనుమతిస్తాడా?
దేవుడేమి చెబుతున్నాడు?
యేసు తన తండ్రి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించాడు గనుక ఈ విషయంలో దేవుని ఉద్దేశాన్ని అర్థంచేసుకోవడానికి ఆయన మాదిరి మనకు సహాయపడగలదు. (యోహాను 12:49) యేసు భూమిపై ఉన్నప్పుడు, అవసరతలో ఉన్నవారితో ఆయన దయాపూర్వకంగా వ్యవహరించాడు. ‘జన సమూహాల్ని చూచి . . . వారిమీద కనికరపడ్డాడని’ బైబిలు చెబుతోంది. (మత్తయి 9:36) అయినప్పటికీ, ఆయన దొంగతనాన్ని ఎప్పుడూ, ఎలాంటి పరిస్థితుల్లో కూడా సమర్థించలేదు. అదే విధంగా, దేవుడు పేదవారి ఎడల శ్రద్ధ కల్గివున్నా, బీదరికాన్ని దొంగతనం చేయడాన్ని సమర్థించేదిగా ఆయన పరిగణించలేదు. “దోచుకోవడం చెడుగు చేయడం అంటే నాకు అసహ్యం” అని యెషయా 61:8లో (పవిత్ర గ్రంథం) బైబిలు చెబుతోంది. దొంగలు దేవుని రాజ్యానికి వారసులుకారని అపొస్తలుడైన పౌలు స్పష్టంగా తెలియజేశాడు. కాబట్టి ఈ విషయంలో దేవుని ఉద్దేశానికి సంబంధించి మనం సందిగ్ధావస్థలో విడిచిపెట్టబడలేదు.—1 కొరింథీయులు 6:10.
అయితే, “దొంగ ఆకలిగొని ప్రాణరక్షణకొరకు దొంగిలిన యెడల యెవరును వాని తిరస్కరింపరు గదా” అని సామెతలు 6:30వ వచనం చెబుతోంది. ఈ వ్యాఖ్యానం దొంగతనాన్ని మన్నిస్తుందా? కానేకాదు. తాను చేసిన నేరాన్నిబట్టి దేవుడు ఆ దొంగను శిక్షిస్తాడని సందర్భం చూపిస్తోంది. దాని తర్వాతి వచనం ఇలా తెలియజేస్తోంది: “వాడు దొరికినయెడల ఏడంతలు చెల్లింపవలెను తన యింటి ఆస్తి అంతయు అప్పగింపవలెను.”—సామెతలు 6:31.
అత్యాశను బట్టో, హానిని కల్గించాలనే ఉద్దేశంతోనో దొంగతనంచేసే వ్యక్తిని అభిశంసించినంతగా ఆకలికి తాళుకోలేక దొంగిలించేవాన్ని అభిశంసించకపోయినా, దేవుని అనుగ్రహాన్ని పొందాలనుకొనే వాళ్లు చౌర్యానికి సంబంధించిన వేటిలోనూ అపరాధులు కాకూడదు. బీదరికం విలయతాండవం చేసే పరిస్థితుల్లో కూడా, దొంగతనం చేయడం దేవున్ని అగౌరవపరుస్తుంది. సామెతలు 30:8, 9 వచనాలు ఇలా తెలియజేస్తున్నాయి: “తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. . . . బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో.” అవును, దొంగ దేవుని నామానికి దూషణ తీసుకువస్తాడు. దొంగతనమనేది ప్రేమలేనిచర్య గనుక ధనవంతుల్ని దోచుకున్నా లేదా బీదల్ని దోచుకున్నా అది పాపమే. దేవున్నీ తమ పొరుగువారినీ ప్రేమించేవాళ్లు దొంగతనాన్ని ఎన్నడూ సమర్థించరు.—మత్తయి 22:39; రోమీయులు 13:9, 10.
కనీసావసరాలు తీర్చుకోలేని స్థితిలో ఉన్న వ్యక్తి దొంగతనం చేసే హక్కును కల్గివున్నాడనే వాదన సహేతుకమైంది కాదు. తగిన శారీరక దారుఢ్యంలేని అథ్లెట్ తాను ఆటలో గెలిచేలా నిషేధిత మాదకద్రవ్యాల్ని తీసుకునే హక్కును కల్గివున్నాడని చెప్పడాన్ని ఈ అభిప్రాయం పోలి ఉంటుంది. ఒకవేళ అతడు గెలిచినప్పటికీ, అతడు అడ్డదారులు త్రొక్కినట్లే. చట్టవిరుద్ధమైన పద్దతుల్లో తమకు రావాల్సిన విజయాన్ని అతడు హస్తగతం చేసుకున్నాడని ఇతరులు సరైన విధంగానే భావిస్తారు. దొంగతనం విషయమూ అంతే. అతడు ఇతరుల సొత్తును అక్రమమార్గంలో తీసుకుంటున్నాడు. కనీసావసరాలు పొందలేని అతని పరిస్థితి దొంగతనం చేయడాన్ని సమర్థించదు.
దేవుని అనుగ్రహాన్ని పొందాలనుకునే దొంగ ఎవరైనా తన ప్రవర్తన విషయంలో పశ్చాత్తాపపడాలి. బైబిలు ఇలా ఉద్బోధిస్తుంది: “దొంగిలువాడు ఇకమీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలుకలుగు నిమిత్తము తన చేతులతో మంచి పనిచేయుచు కష్టపడవలెను.” (ఎఫెసీయులు 4:27, 28) నిజంగా పశ్చాత్తాపపడిన మునుపటి దొంగలు తమను యెహోవా క్షమిస్తాడనే నమ్మకాన్ని కల్గివుండొచ్చు.—యెహెజ్కేలు 33:14-16.
బీదలు ఏమి చెయ్యగలరు?
బైబిలు ఇలా వాగ్దానం చేస్తోంది: “యెహోవా నీతిమంతుని ఆకలిగొననియ్యడు భక్తిహీనుని ఆశను భంగముచేయును.” (సామెతలు 10:3) తమ కోరికల్ని తీర్చుకోవడానికి దేవుని చట్టాన్ని కావాలని అతిక్రమించే వారికి ఆయన సహాయం చేయడు. కానీ తనకు విధేయత చూపించడానికి యథార్థంగా ప్రయత్నించే వారి ఎడల ఆయనకు కనికరం ఉంది. తమకు అవసరమైన వాటిని పొందేందుకైన వారి ప్రయత్నాల్ని ఆయన ఆశీర్వదిస్తాడు.—కీర్తన 37:25.
దైవిక సూత్రాల్ని వెంబడించినందున తమ జీవితాలు మెరుగుపర్చబడ్డాయని లక్షలాదిమంది ప్రజలు ఇప్పటికే కనుగొన్నారు. ఉదాహరణకు, కష్టపడి పనిచేయాలనే, దుర్గుణాల్ని అంటే జూదమాడడం, త్రాగుబోతుతనం, ధూమపానం, మాదకద్రవ్యాల దుర్వినియోగం వంటి వాటిని విడనాడాలనే బైబిలు సలహాను అన్వయించుకోవడమనేది తమ కనీసావసరాల్లో అనేకమైన వాటిని కల్గివుండేలా చేసింది. (గలతీయులు 5:19-21) ఇందుకు వారికి విశ్వాసం అవసరం. అలా విశ్వాసముంచే వారందరూ “యెహోవా ఉత్తముడని,” తనయందు నమ్మకముంచు వారికి ఆయన నిజంగా సహాయపడతాడని గ్రహిస్తారు.—కీర్తన 34:8.
[12వ పేజీలోని చిత్రసౌజన్యం]
రాబిన్ హుడ్: General Research Division/The New York Public Library/Astor, Lenox and Tilden Foundations