ప్రశాంతత మరియు నిశ్శబ్దత—ఎప్పటికైనా వస్తాయా?
తాము సెలవులకు విదేశాలకు వెళ్లినప్పుడు ఏమి కోరుకుంటారని అడిగిన ప్రతి నలుగురు బ్రిటీష్ పర్యాటకుల్లో ముగ్గురు తాము “ప్రశాంతతను నిశ్శబ్దతను” కోరుకుంటామని సమాధానమిచ్చారు. శబ్దకాలుష్యం ఒక ప్రపంచవ్యాప్త సమస్య కావడంతో, అనేకులు నిజమైన ప్రశాంతతను నిశ్శబ్దతను అసలు ఎన్నడూ కనుగొనలేమని నమ్ముతున్నారు.
శబ్దకాలుష్యాన్ని తగ్గించేందుకు ఎంతో గట్టి చర్యలు తీసుకోబడుతున్నప్పటికీ, ఆ విషయంలో పూర్తి విజయం లభిస్తుందని నమ్మడం వాస్తవికంగా ఉంటుందా అని మీరు అనుకుంటుండవచ్చు. మీకున్న శ్రద్ధ ఇతరులకు లేనప్పుడు ఏమిటి?
అధిగమించవలసిన అడ్డంకులు
వ్యతిరిక్తతగల ప్రజలతో మాట్లాడటం సులభం కాదు, మరి మీ అభిప్రాయాన్ని వారికి అర్థం చేయించడం మరింత కష్టతరం. రాన్ నివసించే ఇంటి బయట బాగా గోల చేసే యౌవనస్థులు గుమికూడి వున్నప్పుడు, ఆయన వారితో స్నేహం చేసుకునేందుకు తానే చొరవ తీసుకున్నాడు. ఆయన వాళ్ల పేర్లు తెలుసుకున్నాడు. ఆయన వారిలో ఒకరి సైకిలు రిపేరు చేయడంలో కూడా సహాయం చేశాడు. అప్పటినుండి ఆయనకు వాళ్ల నుండి ఎలాంటి కష్టమూ కలుగలేదు.
మర్జరీ విషయాన్నే తీసుకోండి, ఆమె ఒక ఒంటరి తల్లి మరియు ఆమెకు ఒక యౌవన కుమార్తె ఉంది. ఆమె బాగా శబ్దం చేసే ఇరుగుపొరుగు మధ్యన ఉన్న అపార్టుమెంటులో నివసిస్తుంది. తన పైఅంతస్థులోని వాళ్లకు గచ్చుపై తివాచీ లేదు. దాని మూలంగా, పిల్లలు స్కేటింగ్ బూట్లు వేసుకుని స్కేటింగ్ చేసినా, బంతిని నేలకేసి కొడుతూ ఆడినా, లేక చివరకు మంచంపైనుండి క్రిందకు దూకినా కూడా తనకు ఆ శబ్దం వినిపించి చికాకు కలిగిస్తుందని మర్జరీ చెబుతోంది. దానికి తోడు, వాళ్ల అమ్మ ఇంట్లో ఎత్తు మడమగల చెప్పులు వేసుకుని తిరుగుతుంది. తన పొరుగువారిని కాస్త నిశ్శబ్దంగా ఉండమని అడిగేందుకు ఆమె మర్యాదపూర్వకంగా సమీపించింది, అయితే వారిమధ్యగల భాషా సమస్య ఆశాభంగాన్ని కలిగించింది. స్థానిక పురపాలక సంఘం, సమస్యను పరిష్కరించేందుకు గానూ అనువాదకులను పంపిస్తామని అన్నారు, కాబట్టి మర్జరీ సమస్య పరిష్కరించబడుతుందని ఎదురుచూస్తుంది.
ఆమె ఉండే అంతస్థుకు క్రింద నివసించే వ్యక్తి ఉదయం ఏడు ఎనిమిది గంటల మధ్య పెద్ద శబ్దంతో సంగీతాన్ని పెడతాడు, మరి బాస్ బీట్ ఎడతెగక మోగుతుంటుంది. ఆమె ఆ వ్యక్తిని యుక్తిగా సమీపించడం వల్ల ఆయన ఆమెతో ‘నా పని నిమిత్తం నన్ను మంచి మూడ్‌లో ఉంచేందుకే’ నాకు సంగీతం అవసరమని అన్నాడు. మరి మర్జరీ ఎలా సహిస్తోంది?
“నేను నిగ్రహాన్నీ సహనాన్నీ అలవర్చుకునేందుకు కృషి చేస్తున్నాను” అని ఆమె చెబుతుంది. నేను నా కార్యక్రమాలను మార్చుకున్నాను, శబ్దం వస్తున్నప్పటికీ నేను కూర్చుని చదువుకుంటాను. నేను కొంత సమయానికే నా పుస్తకంలో పూర్తిగా మునిగిపోయానని నేను గమనించాను. అప్పుడు నాకు ఆ శబ్దం అంత ఎక్కువగా వినిపిస్తున్నట్లు అనిపించదు.”
మరో వైపు, హెథర్, రాత్రి క్లబ్బుకు ఎదురుగా ఉండే అపార్టుమెంటులో నివసిస్తుంది, ఆ క్లబ్బు రాత్రంతా అల్లరి చేసిన తర్వాత ఉదయం ఆరు గంటలకు మూయబడుతుంది. ఆమె తుదకు స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ, వాళ్ల గోలను ఆపేందుకు చర్యలేమీ తీసుకోలేదు.
శబ్దం అంతం అవుతుందా?
“పూర్తి నిశ్శబ్దత అంటే అనేకమందికి చికాకుగా, వింతగా ఉంటుంది” అని బ్రిటీష్ వైద్య పరిశోధన కౌన్సిల్ యొక్క వినికిడి పరిశోధనా సంస్థలోని డా. రోస్ కోల్స్ చెబుతున్నాడు. పక్షుల కిలకిల రావాలు, ఇసుక తీరంలోని అలల పరవళ్ల మెల్లని శబ్దాలు, పిల్లల ఆనందపూరిత కేరింతలు—ఇవన్నీ కూడా ఎంతో సంతోషాన్ని కలిగించే శబ్దాలు. శబ్దం నుండి మనకు విముక్తి లభించాలని మనం ప్రస్తుతానికి కోరుకుంటున్నప్పటికీ, మనతో సంభాషించే సహవాసులతో కలిసి ఉండేందుకు మనం ఇష్టపడతాము. దేవుడు తన నమ్మకమైన సేవకుల కొరకు ప్రశాంతతను నిశ్శబ్దతను వాగ్దానం చేశాడు.
బైబిలులో కీర్తనల గ్రంథకర్త ఇలా ప్రకటిస్తున్నాడు: “దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు క్షేమము కలిగి సుఖించెదరు.” (కీర్తన 37:11) దేవుని పరలోక రాజ్య ప్రభుత్వం త్వరలోనే మానవుల విషయాల్లో జోక్యం చేసుకుంటుంది. (దానియేలు 2:44) తర్వాత, క్రీస్తుయేసు పరిపాలనలో, “చంద్రుడు లేకపోవువరకు క్షేమాభివృద్ధి” ఉంటుంది.—కీర్తన 72:7; యెషయా 9:6, 7.
“నీతి సమాధానము కలుగజేయును నీతివలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు . . . సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు” అని దేవుని ప్రవక్త యెషయా ప్రవచించిన విధంగానే, మనందరం ఇష్టపడే ప్రశాంతత, నిశ్శబ్దత కూడా దేవుని మూలంగా వస్తాయని మనం నిశ్చయతను కలిగి ఉండవచ్చు.—యెషయా 32:17, 18.
మీ ప్రాంతంలోని యెహోవాసాక్షుల సమావేశాల్లో ఇప్పుడు కూడా మీరు ఆధ్యాత్మిక ప్రశాంతతను, నిశ్శబ్దతను కనుగొనగలరు. పెద్ద సమావేశాల్లో కొన్నిసార్లు వేలకొలది మంది సమకూడినప్పటికీ—మరి ఈ సమావేశాల్లో ‘పురుషులు, స్త్రీలు పిల్లల మూలంగా గొప్ప ధ్వని పుట్టినప్పటికీ’—ఆ శబ్దం చికాకు కలిగించేదిగా ఉండదు కానీ ఆహ్లాదకరంగా ఉంటుంది. (మీకా 2:12) స్థానిక సాక్షులతో సహవసించడం ద్వారా లేదా వాళ్లను కలుసుకునేందుకు ఈ పత్రిక 5వ పేజీలోని మీకు అనుకూలమైన చిరునామాకు వ్రాయడం ద్వారా మీకై మీరే దాన్ని అనుభవించండి. ఇప్పుడు మరియు బహుశ నిత్యం వారి సహవాసంలో వాస్తవమైన ప్రశాంతతను, నిశ్శబ్దతను అనుభవించండి.